WhatsApp New Button Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్లను ముందుగానే ఉపయోగించే అవకాశం కల్పించడంతో పాటు, నచ్చకపోతే వాటిని నిలిపివేసే సౌలభ్యాన్ని కల్పించేలా కొత్త టోగుల్ బటన్‌ను జోడించింది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్డేట్స్ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్సైట్ WABetaInfo ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్లో పరీక్ష దశలో ఉంది. WABetaInfo ప్రకారం, తాజా బీటా వెర్షన్లో వినియోగదారులు ఆన్ / ఆఫ్ చేయగల కొత్త టోగుల్ను గుర్తించారు. దీని ద్వారా వినియోగదారులు బీటా ఫీచర్లను ఉపయోగించాలా వద్దా అన్న నిర్ణయాన్ని స్వయంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఫీచర్లు నచ్చకపోతే, ఒక్క క్లిక్‌తోనే బీటా అనుభవాన్ని నిలిపివేయవచ్చు.
ఎందుకు ఈ ఫీచర్ అవసరం?
ఇప్పటి వరకు బీటా ప్రోగ్రామ్‌లో చేరాలంటే ప్లే స్టోర్ ద్వారా ప్రత్యేకంగా నమోదు కావాల్సి వచ్చేది. అంతేకాదు, పరిమిత సంఖ్యలో వినియోగదారులకే బీటా వెర్షన్ యాక్సెస్ ఇచ్చేది. బీటా సభ్యులైనప్పటికీ, చాలామందికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకపోవడం సాధారణంగా జరుగుతోంది. ఈ కొత్త టోగుల్ ఫీచర్‌తో అటువంటి సమస్యలకు చెక్ పెట్టినట్లు వాట్సాప్ తెలుస్తోంది.
సెట్టింగ్స్‌లోనే సులభంగా నియంత్రణ..!
కొత్త బటన్‌ను వాట్సాప్ సెట్టింగ్స్‌లో చూడొచ్చు.. బీటా వెర్షన్ వాడుతున్న సమయంలో యాప్ క్రాష్ అవడం లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైతే, వినియోగదారులు సెట్టింగ్స్‌కు వెళ్లి బీటా ఫీచర్లను వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు. WABetaInfo దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. అందులో బీటా టెస్టర్లు యాప్‌లోనే WhatsApp Beta Programను యాక్సెస్ చేయగలరని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది ఎవరికెప్పుడు అందుబాటులోకి వస్తుంది?
మొదట ఈ ఫీచర్ బీటా ప్రోగ్రామ్‌లో భాగం కాని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజా పరిణామాల ప్రకారం, ఇప్పటికే ఉన్న బీటా టెస్టర్లకూ ఈ ఫీచర్‌ను విస్తరించేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. ఇక, వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లినప్పుడు “ఫీచర్లకు ముందస్తు యాక్సెస్” (Early Access to Features) అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు బీటా ప్రోగ్రామ్‌లో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. బీటా వెర్షన్ అనేది వాట్సాప్ కొత్త ఫీచర్లను పరీక్షించే వేదిక. ఈ కొత్త టోగుల్‌తో వినియోగదారులకు మరింత నియంత్రణ, సులభమైన అనుభవం లభించనుంది.