టెక్ ప్రియులు ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్26’ సిరీస్ ఒకటి. లీక్‌ల ప్రకారం.. ఈ సిరీస్‌లో Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra మోడళ్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఈ సిరీస్ లాంచ్ కావచ్చు. డిజైన్, మోడళ్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ధరలపై మాత్రం మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది లీక్స్టర్లు ర్యామ్, ఇతర హార్డ్‌వేర్ భాగాల ధరలు పెరగడంతో ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతుండగా..మరికొందరు మాత్రం శాంసంగ్ ధరలను పెంచదని అంటున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
తాజా నివేదిక ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధరను గెలాక్సీ ఎస్25 అల్ట్రా స్థాయిలోనే ఉంచాలని కంపెనీ ప్రయత్నిస్తోంది. గత ఏడాది విడుదలైన ఎస్25 అల్ట్రా ధర 1,300 డాలర్లుగా (రూ.1,18,276) ఉంది. అయితే ర్యామ్ ధరలు గణనీయంగా పెరగడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ర్యామ్ కోసం మూడింతలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం సరఫరా కొరత. అమెరికా మార్కెట్లో ఎస్26 అల్ట్రా ధర $1,399 వరకు ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే శాంసంగ్ మాత్రం దక్షిణ కొరియాలో ఈ ఫోన్ ధరను KRW 2 మిలియన్లకు లోపే ఉండేలా చూస్తోంది. ఇదే నిజమైతే అమెరికాలో ధర $1,299గా ఉండే అవకాశం ఉంటుంది.
ధరలను తగ్గించడానికి శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అదేంటంటే, ఇప్పటివరకు ప్రీ-ఆర్డర్ల సమయంలో ఇచ్చే ఫ్రీ స్టోరేజ్ అప్గ్రేడ్లు, ఇతర ఆఫర్లు తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం కూడా చేయొచ్చు. గెలాక్సీ ఎస్26 సిరీస్‌కు ఈ బెనిఫిట్స్ ఉండకపోవచ్చని సమాచారం. భారత మార్కెట్ విషయానికొస్తే.. ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్లలో ధరలు, హార్డ్‌వేర్ ఖర్చులు పెరగడం వంటి అంశాలు భారత వినియోగదారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
గెలాక్సీ ఎస్26 అల్ట్రా గత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 6.9-ఇంచ్ డైనమిక్ ఎల్టీపీఓ అమోలెడ్ 2X డిస్ప్లే, QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డివైస్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 గెలాక్సీ ప్రాసెసర్, 16GB LPDDR5X ర్యామ్ ఉండే అవకాశం ఉంది. 5,400mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వవచ్చని సమాచారం. కెమెరా విభాగంలో కూడా శాంసంగ్ భారీ మార్పులు చేయనుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, అలాగే 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది.