11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!

Redmi Turbo 6 Max

Redmi Turbo 6 Max

Redmi Turbo 6 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యంతో మరో కొత్త ఫోన్ సందడి చేసేందుకు షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి Turbo 6 Max పేరుతో రానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి పలు లీకులు వెలువడగా.. తాజాగా కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7 అంగుళాల భారీ డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

లీక్ వివరాల ప్రకారం.. ఈ రెడ్‌మీ టర్బో 6 మాక్స్ లో 7 అంగుళాల 2K LTPS OLED ఫ్లాట్ డిస్‌ప్లే ఉండనుంది. దీనికి అల్ట్రా స్లిమ్ బెజెల్స్ కూడా ఉండనున్నాయి. దీంతో స్క్రీన్‌పై ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటుంది. వీడియోలు చూడటం, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ భారీ డిస్‌ప్లే ఉపయోగపడనుంది. ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన మరో ఫీచర్ 11,000mAh బ్యాటరీ. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నట్లు సమాచారం.

పనితీరు విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇందులో Dimensity 9500 లేదా 9600M ప్రాసెసర్లలో ఒకటి ఉండే అవకాశం ఉంది. దీనికి LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని జత చేయనున్నట్లు సమాచారం. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండనుంది. అలాగే అల్ట్రా వైడ్ కెమెరాను కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రధానంగా పనితీరు, గేమింగ్‌పై దృష్టి పెట్టి రూపొందిస్తున్నందున కెమెరా ఫీచర్లు సాధారణ స్థాయిలో ఉండవచ్చని అంచనా.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండనున్నట్లు లీకులు వెల్లడిస్తున్నాయి. Redmi Turbo 6 Max పేరులోని ‘Max’కు తగ్గట్టుగానే భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రెడ్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ధృవీకరించలేదు. లాంచ్ తేదీ, ధర, ఇతర స్పెసిఫికేషన్లపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం ఇవన్నీ లీకుల ఆధారంగా వచ్చిన వివరాలే. కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.