Site icon NTV Telugu

OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!

Sam

Sam

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ‘వన్‌ప్లస్’ మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 15 లైనప్‌లో ‘వన్‌ప్లస్ 15టీ’ (OnePlus 15T) రానుందని టెక్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే OnePlus 15, OnePlus 15R లైనప్‌లో ఉండగా.. అదనంగా OnePlus 15T (చైనాలో OnePlus 15R) మోడల్ కూడా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన వివరాలు ఈ ఫోన్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ ఫోన్ వచ్చే మార్చిలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

OnePlus 13T ఏప్రిల్ 2025లో విడుదల అయింది. ఈసారి వన్‌ప్లస్ నెల ముందుగానే కొత్త మోడల్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో అయితే ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ 15ఎస్ (OnePlus 15s) పేరుతో విడుదల చేసే అవకాశముందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ ఒక కాంపాక్ట్ ‘స్మాల్-స్క్రీన్’ ఫ్లాగ్‌షిప్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో కూడా టాప్ మోడల్ OnePlus 15లో ఉన్నట్లే క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్‌తో రానుంది. హై-ఎండ్ పనితీరు, గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో ఎలాంటి రాజీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

లీక్‌ల ప్రకారం వన్‌ప్లస్ 15టీలో 6.31 అంగుళాల ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీనికి 1.5K రిజల్యూషన్ సహా నాలుగు వైపులా ఒకేలా స్లిమ్ బెజెల్స్ ఉండేలా డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఆకర్షణీయమైన నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చు. వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను ఐదు రామ్–స్టోరేజ్ వేరియంట్లలో (12GB + 256GB, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB) తీసుకురానుంది. ఇందులో టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశం ఉంది. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కు IP69 రేటింగ్ ఉన్న బిల్డ్ ఉండే అవకాశం ఉండగా.. బరువు సుమారు 194 గ్రాములుగా ఉండవచ్చని అంచనా.

బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ మరోసారి సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. ఈ ఫోన్‌లో 7,000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇది ఇప్పటికే వచ్చిన OnePlus 15R, OnePlus Turbo 6, Turbo 6V మోడళ్లకు ధీటుగా రానుంది. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, ప్రీమియం డిజైన్‌తో వన్‌ప్లస్ అభిమానులకు ఇది మరో ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది. అధికారిక ప్రకటన కోసం ఇంకా కొద్ది నెలలు వేచి చూడాల్సిందే.

Exit mobile version