Mobile Charging Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరు రోజంతా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. కొందరి దగ్గర అయితే 2-3 స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉంటున్నాయి. ప్రతి పనికి ఫోన్ తప్పనిసరి కాబట్టి చేతిలో ఉండాల్సిందే. పగలంతా ఫోన్ వాడిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టడం చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. ఉదయం లేచి చూసేసరికి బ్యాటరీ 100 శాతం ఉండడంతో తెగ సంతోషపడిపోతుంటారు. అయితే ఈ అలవాటు దీర్ఘకాలంలో మీ ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్నాయి. బ్యాటరీ 100 శాతం పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ను ఆపేస్తాయి. అయినప్పటికీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. బ్యాటరీ పూర్తిగా నిండినా కూడా.. చాలా సేపు ఛార్జర్‌కు కనెక్ట్ అయి ఉండటం వల్ల లిథియం అయాన్ బ్యాటరీలపై అధిక వోల్టేజ్ స్ట్రెస్ పడుతుంది. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం ఉండాలంటే 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్‌ను మెయింటేన్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ 0 శాతం వరకు ఖాళీ అయ్యేలా చేయడం లేదా ప్రతిసారీ 100 శాతం వరకు ఛార్జ్ చేయడం బ్యాటరీకి మంచిది కాదు. మధ్యస్థ ఛార్జింగ్ అలవాటు బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇక మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు దిండ్లు, దుప్పట్లు లేదా మృదువైన ఉపరితలాలపై పెట్టడం మానుకోవాలి. ఇలా ఉంచితే ఫోన్‌లో ఏర్పడే వేడి బయటకు వెళ్లలేదు. ఫలితంగా బ్యాటరీ సెల్స్ వేడెక్కి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కు గాలి తగిలేలా ఉండడం మంచిది. చివరగా చెప్పేదేదంటే.. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టడం ఒక్కరోజులోనే నష్టం చేయకపోయినా, దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుంది. ఛార్జింగ్ చిట్కాలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది.
