NTV Telugu Site icon

Microsoft: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్

Internet

Internet

ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ బ్రౌజ‌ర్‌కు రిటైర్మెంట్ ప్రక‌టించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొంది. దాదాపు 27 ఏళ్ల క్రితం ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజ‌ర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు నెట్ యూజ‌ర్లు అంతా గూగుల్ క్రోమ్‌, యాపిల్ స‌ఫారీకి అల‌వాటు ప‌డ‌డంతో.. ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు మార్కెట్ త‌గ్గింది. ఇక విండోస్ 10 నుంచి ఎక్స్‌ప్లోర‌ర్‌కు బ‌దులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్ ఉంటుంద‌ని ఆ కంపెనీ ప్రక‌టించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుంద‌ని, భ‌ద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువ‌ని, ఐఈతో పోలిస్తే అత్యాధునిక బ్రౌజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉంటుంద‌ని ఆ సంస్థ వెల్లడించింది. ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో చాలా మంది యూజ‌ర్లు కామెంట్లతో ముంచెత్తారు. రిప్ సందేశాల‌ను పోస్టు చేశారు. ఇది మొదటిసారిగా 1995లో విండోస్ 95 కోసం యాడ్-ఆన్ ప్యాకేజీగా విడుదల చేయబడింది. తర్వాత, కంపెనీ ప్యాకేజీలో భాగంగా బ్రౌజర్‌ను ఉచితంగా అందించడం ప్రారంభించింది.

ఈ బ్రౌజర్ 2003లో 95 శాతం వినియోగానికి గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ అది తన స్థానాన్ని అలాగే కొనసాగించలేకపోయింది. చాలా మంది పోటీదారులు బ్రౌజర్ మార్కెట్లోకి ప్రవేశించారు. మెరుగైన ఇంటర్‌ఫేస్‌లు, వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగం, మంచి పనితీరును అందించడంతో.. ఈ బ్రౌజర్‌ పోటీని కొనసాగించలేకపోయింది. ఇది క్రమంగా ఇతర బ్రౌజర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే డిఫాల్ట్ ఎక్స్‌ప్లోరర్‌గా మారింది.

జూన్ 15, 2022 నుంచి ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ బ్రౌజ‌ర్ రిటైర్ అవుతుంద‌ని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఆ త‌ర్వాత కంపెనీ నుంచి ఆ బ్రౌజ‌ర్‌కు ఎటువంటి స‌పోర్ట్ ఉండ‌ద‌న్నది. కానీ ఎక్స్‌ప్లోర‌ర్ ఆధారంగా ప‌నిచేస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేష‌న్లు మాత్రం.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్‌తో 2029 వ‌ర‌కు ప‌నిచేయ‌నున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజ‌ర్‌ను 65 శాతం వినియోగిస్తున్నారు. ఇక మార్కెట్ షేర్‌లో 19 శాతం యాపిల్‌ కంపెనీకి చెందిన స‌ఫారీ బ్రౌజ‌ర్ ఉన్నది. 3.59 శాతంతో ఫైర్‌ఫాక్స్‌, 3.39 శాతంతో ఎడ్జ్ బ్రౌజ‌ర్‌లు ఉన్నాయి.