JioTag 2 Launched: జియో (Jio) నుండి కొత్తగా JioTag 2ను అధికారికంగా విడుదల చేసింది. ఇదివరకు వచ్చిన JioTagకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ కొత్త ట్రాకర్‌లో కొత్త మార్పులు చేసింది. ముఖ్యంగా ఈసారి ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్ట్ ఇవ్వడం దీని ప్రత్యేకత. అంతేకాదు.. కొత్త డిజైన్, IP64 రేటింగ్‌తో JioTag 2 వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారింది.
JioTag 2ను బ్లాక్, రెడ్, గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకొచ్చింది. గత మోడల్‌తో పోలిస్తే కొత్త ఆకారంలో రూపొందించారు. ఇందులో వచ్చిన అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే.. ఇది Android, iOS రెండింటితోనూ పనిచేస్తుంది. ఇదివరకు వచ్చే JioTag ఒకే ఎకోసిస్టమ్‌కు పరిమితమై ఉండగా.. కొత్త మోడల్‌లో ఈ పరిమితిని తొలగించారు. ఈ డివైస్ గూగుల్ ఫైండ్ హబ్ (Google Find Hub)తో పాటు Apple Find My నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారైనా, ఐఫోన్ వినియోగదారులైనా తమ వస్తువులను సులభంగా ట్రాక్ చేయవచ్చు.
JioTag 2లో 120dB బిల్ట్-ఇన్ స్పీకర్ అందించారు. బ్లూటూత్ పరిధిలో వస్తువు కనిపించకపోతే స్పీకర్ ద్వారా పెద్ద శబ్దం చేసి దాన్ని గుర్తించవచ్చు. బ్లూటూత్ రేంజ్ దాటిన తర్వాత మ్యాప్ ద్వారా ఆ వస్తువు చివరిగా ఉన్న లొకేషన్‌ను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది పాలీకార్బొనేట్ బాడీతో రూపొందించబడింది. అలాగే IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉండటంతో సాధారణ దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది.
తాళాలు, వాలెట్, బ్యాగ్, లగేజ్ వంటి వస్తువులు తరచూ మరిచిపోయే వారికి JioTag 2 ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ ధరలో ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సపోర్ట్ ఇవ్వడం వల్ల Apple AirTag వంటి ఖరీదైన ట్రాకర్లకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. భారత మార్కెట్లో JioTag 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లతో రూ.50 వరకు తగ్గింపు లభిస్తే, దీన్ని రూ.1,199కే కొనుగోలు చేయవచ్చు. ఈ ట్రాకర్ ప్రస్తుతం Amazon Indiaలో విక్రయానికి అందుబాటులో ఉంది.

