Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!

Jio

Jio

Jio Recharge: టెలికాం రంగంలో పోటీ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్ వినియోగదారులకు మరోసారి అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన కస్టమర్లకు Buy 1 Get 1 Free ప్రమోషనల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులు రూ.299 లేదా రూ.349 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అదే విలువ కలిగిన మరో రీఛార్జ్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు.

జియో అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు అదనంగా డబ్బులు చెల్లించకుండానే మరో నెల రోజుల పాటు సేవలను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు కాగా, ఉచిత వోచర్‌ను కూడా వినియోగించుకుంటే మొత్తం 56 రోజుల వరకు ప్రయోజనం పొందవచ్చు. జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. అంటే 28 రోజుల వ్యాలిడిటీకి మొత్తం 42GB డేటాను వినియోగించుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అర్హత కలిగిన వినియోగదారులకు మరో రూ.299 రీఛార్జ్ వోచర్ ఉచితంగా లభిస్తుంది.

మరోవైపు రూ.349 ప్లాన్‌లో రోజుకు 2GB డేటాతో పాటు అర్హత నిబంధనలకు లోబడి అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం లభిస్తుంది. అదేవిధంగా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తారు. ఈ ప్లాన్‌పై ఆఫర్ వర్తించే వినియోగదారులకు మరో రూ.349 రీఛార్జ్ వోచర్ ఉచితంగా లభిస్తుంది. దీంతో రెండు రీఛార్జ్‌ల ద్వారా మొత్తం 56 రోజుల వరకు సేవలను పొందవచ్చు. అయితే ఈ Buy 1 Get 1 Free ఆఫర్ అందరికీ వర్తించదు. జియో ఎంపిక చేసిన మొబైల్ నంబర్లకు మాత్రమే అందిస్తోంది. కాబట్టి మీ నంబర్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందుగా MyJio యాప్‌ను ఓపెన్ చేసి మీ జియో నంబర్‌తో లాగిన్ కావాలి. హోమ్‌పేజీలో కనిపించే ప్రమోషనల్ బ్యానర్‌లో Buy One Get One Free ఆఫర్ ఉందో లేదో చూడాలి. లేదంటే Recommended Plans for You విభాగంలో రూ.299, రూ.349 ప్లాన్ల పక్కన ఈ ఆఫర్‌కు సంబంధించిన బ్యాడ్జ్ కనిపిస్తుందేమో చెక్ చేయాలి.

ఆఫర్ అందుబాటులో ఉంటే సంబంధిత ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ పూర్తయిన తర్వాత ఏడు రోజుల్లోపు ఉచిత వోచర్ MyJio యాప్‌లోని Vouchers విభాగంలో క్రెడిట్ అవుతుంది. అక్కడికి వెళ్లి వోచర్‌ను పరిశీలించి వినియోగించుకోవచ్చు. ప్రధాన నంబర్‌పై ఈ ఆఫర్ కనిపించకపోతే, మీ వద్ద ఉన్న మరో జియో సిమ్‌తో MyJio యాప్‌లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొంతకాలంగా వినియోగంలో లేని సెకండరీ సిమ్‌లకు టెలికాం సంస్థలు తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు అందించే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి నంబర్లకు ఈ ఆఫర్ తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. మొత్తంగా జియో అందిస్తున్న ఈ Buy 1 Get 1 Free ఆఫర్‌కు అర్హత ఉన్న వినియోగదారులు ఒకే రీఛార్జ్‌తో మరో నెల రోజుల ప్రయోజనాన్ని పొందవచ్చు.