NTV Telugu Site icon

James Webb Telescope: విశ్వంలోనే లోతైన ఫోటో.. జూలై 12 రిలీజ్

James Webb

James Webb

విశ్వాంతరాలను తెలుసుకోవాలనే ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. మనం ఎవరం, ఈ విశ్వమేంటి.. అసలు మనం ఎక్కడ ఉన్నాం.. భూమి లాంటి గ్రహాలు మరెక్కడైనా ఉన్నాయా..? అనే సందేహాలు నిత్యం తొలుస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మన పాలపుంత గెలాక్సీకి చెందిన వివరాలనే మనిషి పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అలాంటి కొన్ని బిలియన్ల గెలాక్సీలు అందులో కోటానుకోట్ల నక్షత్రాలు, మన ఊహకు కూడా అందని అంత విశ్వ రహస్యాలను కనుకునేందుకు మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

అందులో భాగంగానే గతేడాది డిసెంబర్ లో జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా ప్రయోగించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో నిర్మితమైన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ దాదాపుగా రూ. 78,900 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇన్నాళ్లు విశ్వాంతరాలను జల్లెడ పడుతున్న హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే కొన్ని వేల రేట్లు ఆధునాతనమైంది ఈ జెమ్స్ వెబ్ టెలిస్కోప్. హబుల్ తీసిన ‘ ది హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్’ విశ్వంలో కేవలం ఒక ప్రాంతంలోనే కొన్ని వేల గెలాక్సీల ఫోటోను తీసింది. అలాంటి జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వం ఏర్పడటం, బిగ్ బ్యాంగ్, విశ్వం పుట్టిన తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలు, నక్షత్రాలకు సంబంధించి ఫోటోలు తీయనుంది. ప్రస్తుతం భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో లాగ్రేంజ్ పాయింట్ 2(ఎల్ 2) కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది.

దాదాపు ప్రయోగించిన ఆరు  నెలల తరువాత జెమ్స్ వెబ్ లోని అన్ని వ్యవస్థలు చల్లబడిన తర్వాత తన పనిని మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ బుధవారం జెమ్స్ వెబ్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. జూలై 12న ‘‘మన విశ్వంలోని లోతైన చిత్రాన్ని’’ జెమ్స్ వెబ్ రిలీజ్ చేస్తుందని వెల్లడించారు. గతంలో హబుల్ తీసిన డీప్ ఫీల్డ్ ఇమేజ్ కన్నా లోతైన ఫోటోలను ఈ టెలిస్కోప్ తీయనుంది.

జెమ్స్ వెబ్ ను ఇంజనీరింగ్ అద్భుతంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన బిగ్ బ్యాంగ్ కు సంబంధించిన చిత్రాలను కూడా చూసేందుకు అంటే దాదాపు కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాలకు పూర్వ జరిగిన విశ్వాన్ని చూసేందుకు వెబ్ లోని ఇన్‌ఫ్రారెడ్ పరికరాలు సహాయపడనున్నాయి. దీంతో పాటు ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న ఎక్సో ప్లానెట్స్.. వాటిలో భూమి లాంటి పోలికలు, వాతావరణం ఉన్న గ్రహాలను కూడా జెమ్స్ వెబ్ గుర్తించే వీలుంది.