iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!

Iphone Duo Screen

Iphone Duo Screen

iPhone Duo: యాపిల్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ మార్కెట్‌లోకి రాగానే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడై స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫోన్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లు చూసి టెక్ ప్రియులు ఫిదా అవుతున్నారు కానీ.. కంపెనీ చెప్పిన దీని రిపేరింగ్ ఖర్చులు చూసి మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతోంది. చేతిలోంచి ఫోన్ జారిపడి పొరపాటున లోపలి స్క్రీన్ పగిలితే.. ఆ రిపేర్ ఖర్చుతోనే హాయిగా మరో బ్రాండ్ న్యూ ఐఫోన్ కొనేయొచ్చు.

కంపెనీ అధికారిక లెక్కల ప్రకారం.. ఐఫోన్ డ్యుయో లోపలి మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే డ్యామేజ్ అయితే దాన్ని మార్చడానికి కంపెనీ ఏకంగా రూ. 1,49,900 ఛార్జ్ చేస్తోంది. బయట మార్కెట్లో దొరికే చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధర కంటే కేవలం ఈ ఒక్క స్క్రీన్ మార్చే ఖర్చే ఎక్కువ. బయటి స్క్రీన్‌కు ఏదైనా జరిగితే రూ. 42,900, ఒకవేళ ఔటర్ స్క్రీన్‌తో పాటు బ్యాక్ గ్లాస్ కూడా పగిలితే రూ. 55,900 సమర్పించుకోవాల్సిందే. ఇక బ్యాక్ గ్లాస్ మార్చడానికి
రూ.20,900, బ్యాటరీ చేంజ్‌కి రూ.24,900, కెమెరా రిపేర్ అయితే రూ.26,900 వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ మరీ దారుణంగా డ్యామేజ్ అయితే ఇతర రిపేర్ల ఖర్చు ఏకంగా రూ. 2,24,900 వరకు ఉంటుంది.

రిపేరింగ్ బిల్లులు భయపెడుతున్నా.. ఫోన్‌లో పెట్టిన ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయని చెబుతున్నారు. బయట 5.4 అంగుళాల కవర్ డిస్‌ప్లే, ఫోన్ తెరిస్తే 7.6 అంగుళాల భారీ స్క్రీన్ కనిపిస్తాయి. రెండింటిలోనూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే OLED ప్యానెల్స్ వాడారు. అత్యాధునిక 2nm ప్రాసెస్‌తో వచ్చిన Apple A20 Pro చిప్‌సెట్, యాపిల్ జీపీయూతో ఈ ఫోన్ రాకెట్‌లా దూసుకుపోతుంది. సరికొత్త iOS 27తో నడిచే ఈ డివైజ్.. రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వెనుక 48MP + 48MP డ్యుయల్ కెమెరాలు, సెల్ఫీ కోసం 12MP కెమెరా ఇచ్చారు. ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఎంత తోపుగా ఉన్నా.. ఒక్కసారి చేయి జారితే మాత్రం జేబు గుల్ల కావడం పక్కా అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోన్ వాడాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.