CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!

Cnap India

Cnap India

CNAP Service: ఇకపై ఫోన్‌కి ఎలాంటి అన్ నౌన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి కాలర్ పేరు ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తోంది. వినియోగదారులందరికీ కాలర్ ఐడీ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ టెలికాం శాఖ (DoT) అన్ని టెలికాం సేవా సంస్థలను ఆదేశించింది. దీనికోసం ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ (CNAP) అనే వెరిఫైడ్ కాలర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా కాల్ చేసిన వ్యక్తి నంబర్‌తో పాటు వారి పేరు కూడా స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. టెలికాం శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, 4G, 5G లాంటి హై-జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ ఈ సీనాప్ (CNAP) సేవలు బై డిఫాల్ట్‌గా ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి నంబర్, పేరు ఆటోమేటిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం 2G, 3G నెట్‌వర్క్‌లు, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్‌వర్క్‌లలో ఈ సేవలను అమలు చేయడంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

అసలు ఈ కాలర్ ఐడీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం.. మీకు ఏదైనా కొత్త కాల్ వచ్చినప్పుడు, ఫోన్ స్క్రీన్‌పై ఉన్న మొదటి ఫీల్డ్‌లో కాల్ చేస్తున్న వ్యక్తి నంబర్ కనిపిస్తుంది. రెండవ ఫీల్డ్‌లో ఒకవేళ ఆ నంబర్ ఇప్పటికే మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ అయి ఉంటే మీరు సేవ్ చేసుకున్న పేరు కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ మీ ఫోన్‌లో సేవ్ చేయబడి లేకపోతే, అవతలి వ్యక్తి ఏ టెలికాం ఆపరేటర్ నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారో వారి సబ్‌స్క్రైబర్ డేటాబేస్‌లో నమోదైన అసలు పేరు ప్రత్యక్షమవుతుంది. ఇది కేవలం దేశీయ (డొమెస్టిక్) కాల్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. అదే ఇంటర్నేషనల్ కాల్స్ విషయానికొస్తే, స్క్రీన్‌పై పేరుకు బదులుగా ‘ఇంటర్నేషనల్ కాల్’ అని మాత్రమే కనిపిస్తుంది.

ఈ వ్యవస్థ కోసం ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తమ సబ్‌స్క్రైబర్ల పేర్లు, నంబర్లను మ్యాప్ చేస్తూ ప్రత్యేక డేటాబేస్‌ను ఏర్పాటు చేసి, నిర్వహించాల్సి ఉంటుంది. మీకు కాల్ వచ్చినప్పుడు, కాల్ అందుకునే నెట్‌వర్క్ ఆపరేటర్ సదరు డేటాబేస్ నుంచి అవతలి వ్యక్తి పేరును సేకరించి మీ స్క్రీన్‌పై చూపిస్తారు. ఇక్కడ భద్రతకు పెద్దపీట వేస్తూ ‘సెక్యూరిటీ-బై-డిజైన్’ పద్ధతిని పాటిస్తున్నారు. దీని ప్రకారం, కాల్ ముగిసిన వెంటనే ఆ క్వెరీ-రెస్పాన్స్ ద్వారా వచ్చిన కాలర్ పేరు నెట్‌వర్క్ సిస్టమ్‌లో ఎలాంటి రూపంలోనూ స్టోర్ కాకుండా కట్ అయిపోతుంది. అలాగే ఇప్పటికే ‘కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్’ (CLIR) సదుపాయాన్ని పొందిన వినియోగదారుల పేర్లు మాత్రం స్క్రీన్‌పై ప్రదర్శించబడవు.

వ్యాపార సంస్థలు, బల్క్ కనెక్షన్లు తీసుకునే యూజర్ల కోసం టెలికాం ఆపరేటర్లు ఓ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. సబ్‌స్క్రైబర్ రికార్డుల్లో ఉన్న అసలు పేరుకి బదులుగా, వారు కోరుకునే వ్యాపార పేరును (ప్రెఫర్డ్ నేమ్) ప్రదర్శించే అవకాశం ఇస్తారు. అయితే దీనికోసం ఆ పేరు ట్రేడ్‌మార్క్స్ రిజిస్ట్రీలో వారి పేరు మీద రిజిస్టర్ అయిన ట్రేడ్‌మార్క్ అయినా అయి ఉండాలి లేదా జీఎస్టీ (GST) పోర్టల్‌లో నమోదైన బిజినెస్ నేమ్ అయినా అయి ఉండాలి. ఆపరేటర్లు ఈ పేర్లను, దానికి సంబంధించిన ఆధారాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఆమోదిస్తారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార సబ్‌స్క్రైబర్లు కూడా తమ ప్రాధాన్య పేరును అప్‌డేట్ చేసుకోవడానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత కొన్ని నెలలుగా 4G, 5G నెట్‌వర్క్‌లలో విజయవంతంగా నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ప్రభుత్వం ఈ ఆదేశాలను విడుదల చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఫిబ్రవరి 2024లో ఇచ్చిన సిఫార్సులను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. నిజానికి మొదట్లో యూజర్లు కోరితేనే ఈ సేవలను యాక్టివేట్ చేయాలని ట్రాయ్ ప్రతిపాదించినప్పటికీ, అక్టోబర్ 2025లో టెలికాం శాఖ ప్రతిపాదనతో ఏకీభవించి, వినియోగదారులందరికీ బై డిఫాల్ట్‌గా ఈ CNAP సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అంగీకరించింది.