How Google Maps Traffic Works: మీరు ఎప్పుడో ఒకప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) వాడే ఉంటారు. ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, నగరంలో కొత్త ప్రాంతానికి చేరుకోవాలన్నా మ్యాప్స్ ఓపెన్ చేసి రూట్ సెర్చ్ చేయడం మనకు అలవాటే. అలా సెర్చ్ చేసినప్పుడు రోడ్ల మీద రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్ని రోడ్లు పచ్చగా, కొన్ని నారింజ లేదా పసుపు రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఆ రంగులను చూసి ఎక్కడ ట్రాఫిక్ జాం (Traffic Jam) ఎక్కడ ఉంది? ఎక్కడ వాహనాలు నిలిచిపోయాయో మనం సులభంగా అర్థం చేసుకుంటాం. అయితే ప్రతి వీధిలోనూ గూగుల్ ఉద్యోగులెవరూ నిలబడరు, కెమెరాలు పెట్టరు. అయినా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల నుంచి చిన్న ఊళ్ల వరకు ఎక్కడ ట్రాఫిక్ ఉందో గూగుల్ మ్యాప్స్ ఎలా పసిగడుతుంది? కొన్నిసార్లు అక్కడ ట్రాఫిక్ ఇప్పుడే పెరుగుతోందని కూడా ముందే ఎలా చెప్తుంది? దీని వెనుక ఉన్న అసలు సాంకేతికత (Technology) ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ట్రాఫిక్ సమాచారాన్ని సేకరించడంలో మన స్మార్ట్‌ఫోన్లు (Smartphones) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరైనా తమ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి, లొకేషన్ పర్మిషన్ (Location Permission) ఆన్ చేసినప్పుడు, వారి ప్రయాణ వేగం, లొకేషన్ వివరాలు గూగుల్ సర్వర్లకు చేరుతాయి. ఉదాహరణకు ఒకే రోడ్డుపై వందలాది మంది కార్లు లేదా బైకులపై ప్రయాణిస్తున్నారనుకుందాం. వారి స్మార్ట్‌ఫోన్ల జీపీఎస్ (GPS Data) ఆధారంగా ఆ వాహనాలన్నీ ఎంత వేగంతో వెళ్తున్నాయో గూగుల్ ట్రాక్ చేస్తుంది. సాధారణం కంటే చాలా నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయని లొకేషన్ డేటా చెప్తే, ఆ రోడ్డుపై ట్రాఫిక్ ఉందని గూగుల్ సులభంగా గ్రహిస్తుంది. కేవలం ఒకరిద్దరి ఫోన్ల డేటా కాకుండా, వాహనాల వేగం (Vehicle Speed) ఎంత ఉందో కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఒక రోడ్డుపై సాధారణంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు, ఉన్నట్లుండి గంటకు 5 నుంచి 10 కిలోమీటర్ల వేగానికి పడిపోతే అక్కడ ట్రాఫిక్ నెమ్మదించిందని అర్థం. వెంటనే గూగుల్ మ్యాప్స్ ఆ రోడ్డును నారింజ లేదా ఎరుపు రంగులోకి మారుస్తుంది.
గూగుల్ మ్యాప్స్ కేవలం ఆ క్షణంలో వచ్చే డేటాపై మాత్రమే ఆధారపడదు. దాని వద్ద పాత ట్రాఫిక్ హిస్టరీ (Traffic History Data) కూడా ఉంటుంది. ఉదాహరణకు ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒక నిర్దిష్ట రోడ్డుపై ట్రాఫిక్ పెరుగుతుందని గూగుల్ వద్ద రికార్డు ఉంటుంది. అలాగే ఆఫీసులు ప్రారంభమయ్యే వేళలు, పాఠశాలల వేళల్లో ఉండే రద్దీని ముందుగానే అంచనా వేస్తుంది. ఈ పాస్ట్ రికార్డ్స్ ఆధారంగా మీరు ప్రయాణం ప్రారంభించే ముందే ముందున్న దారిలో ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందో లేదో ముందే చూపిస్తుంది. అంతేకాకుండా, రోడ్డుపై ప్రయాణించే ప్రజలు ఇచ్చే సమాచారం (User Reports) కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా రోడ్డుపై అకస్మాత్తుగా ప్రమాదం జరిగినా లేదా వాహనం చెడిపోయినా, ఆ దారిలో వెళ్లేవారు మ్యాప్స్‌లో రిపోర్ట్ చేయవచ్చు. యాక్సిడెంట్లు (Accidents), రోడ్డు పనులు (Road Work), దారి మూసివేత (Road Closure) వంటి వివరాలను యూజర్లు నేరుగా యాప్‌లో అప్‌డేట్ చేయవచ్చు. వీటితో పాటు స్థానిక ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని కూడా గూగుల్ పరిగణనలోకి తీసుకుంటుంది.
గూగుల్ మ్యాప్స్ కేవలం ట్రాఫిక్ చూపించడమే కాకుండా, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేర్చే వేగవంతమైన రూట్ (Fastest Route) ను కూడా సూచిస్తుంది. ఒక దారి తక్కువ దూరం ఉన్నప్పటికీ అక్కడ భారీగా జాం ఉంటే, కాస్త ఎక్కువ దూరమైనా ట్రాఫిక్ లేని ప్రత్యామ్నాయ దారిని సూచిస్తుంది. దీని కోసం దూరంతో పాటు ప్రస్తుత ట్రాఫిక్, పాత రికార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), మెషిన్ లెర్నింగ్ (Machine Learning) సహాయంతో విశ్లేషించి సరైన దారిని లెక్కిస్తుంది. అయితే మ్యాప్స్ చెప్పే సమాచారం ఎప్పుడూ 100 శాతం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా వర్షం పడినా, కొత్తగా ప్రమాదాలు జరిగినా ఆ డేటా అప్‌డేట్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతుంది. అలాగే తక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వాడే ప్రాంతాల్లో ట్రాఫిక్ అంచనా వేయడం కాస్త కష్టం కావచ్చు. మొత్తానికి గూగుల్ మ్యాప్స్ పనిచేయడానికి రహదారుల వద్ద ప్రత్యేక కెమెరా వ్యవస్థలు అవసరం లేదు. మన ఫోన్ల నుంచి వచ్చే లొకేషన్ డేటా, వాహనాల వేగం, పాత రికార్డులు, ప్రజలు ఇచ్చే రిపోర్టులు ఇవన్నీ కలిసి మిమ్మల్ని సురక్షితంగా, త్వరగా గమ్యస్థానానికి చేర్చడానికి నిరంతరం పనిచేస్తుంటాయి.

