Grok AI: ప్రస్తుతం ఏఐ మన జీవన విధానంలో ఓ భాగమై పోయింది. ఏఐ కల్చర్ సిటీ నుంచి పల్లెలకు సైతం పాకింది. పుట్టుక నుంచి చావు వరకు అనేక విషయాలను, కొత్త కొత్త అంశాలను ఏఐ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఎలోన్ మాస్క్ సంస్థ ‘గ్రోక్’ (Grok) చాట్‌బాట్‌కు ఓ ప్రశ్న అడిగాడు. గ్రోక్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “మీరు భారత పౌరులైతే ఎవరికి ఓటు వేస్తారు?” అని ఓ వ్యక్తి గ్రోక్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా గ్రోక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించింది. ఇందుకు అది ప్రధానంగా ‘డేటా’ను ప్రాతిపదికగా తీసుకున్నట్లు పేర్కొంది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన (Infrastructure), డిజిటల్ ఇండియా విస్తరణ, యూపీఐ (UPI) విప్లవం, భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వంటి అంశాలను మోడీ పాలనలోని ప్రధాన విజయాలుగా గ్రోక్ అభివర్ణించింది.
అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంశంపై స్పందించింది. సంక్షేమ పథకాలు (Welfare concerns) వంటివి ముఖ్యమైనవే అయినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు, సాంకేతికత, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట వంటి అంశాలకు తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని గ్రోక్ స్పష్టం చేసింది. అంటే పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటు వేయను అని తేల్చి చెప్పేసింది. అంతే కాదు గ్రోక్ చివరిగా తన విశ్లేషణను ముగిస్తూ “డేటా ఓవర్ డైనస్టీస్” (వంశపారంపర్య పాలన కంటే గణాంకాలకే మొగ్గు) అనే పదబంధాన్ని వాడటం విశేషంగా మారింది. గ్రోక్ ఇచ్చిన ఈ సమాధానానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేగంగా వ్యాపించాయి. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీన్ని “పనితీరు ఆధారిత పాలన”కు నిదర్శనంగా చూస్తుండగా, మరికొందరు ఏఐ (AI) సమాధానాల్లో పక్షపాతం (Bias) ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాల్లో ఏఐ ఇచ్చే తీర్పులు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయని కొందరు వాదిస్తున్నారు.
