Neuralink: ఎలాన్ మస్క్‌కి చెందిన ‘న్యూరాలింక్’ మనుషులపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. 2016లో మస్క్ స్థాపింపించిన న్యూరాలింక్ తాజాగా హ్యుమన్ ట్రయిల్స్ కోసం అనుమతి పొందింది. పక్షవాతం రోగులపై అధ్యయనం చేసేందుకు అనుమతి వచ్చిందని న్యూరో టెక్నాలజీ సంస్థ మంగళవారం తెలిపింది. మెడ గాయాలు లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్ల్కెరోసిన్(ఏఎల్ఎస్) వల్ల పక్షవాతానికి గురైన రోగులకు బ్రెయిన్ ఇంప్లాంట్ పరీక్షలు జరగనున్నట్లు తెలుస్తోంది. మనిషి తన మెదడుతో కంప్యూటర్ కర్సర్, కీబోర్డుని కంట్రోల్ చేసే పరీక్షలను నిర్వహించనున్నారు. దీని కోసం ఓ ఇంప్లాంట్ ని రోబోటిక్ సర్జరీ ద్వారా మనిషి మెదడులో అమరుస్తారు.
Read Also: Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.. వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు ఎవరంటే?
ఈ అధ్యయనం పూర్తి చేయడానికి దాదాపుగా ఆరు ఏళ్లు పడుతుందని, అయితే ఈ పరీక్షల్లో ఎంతమందిపై అధ్యయనం చేస్తారనే విషయాన్ని పరిశోధకులు తెలియజేయలేదు. అయితే న్యూరాలింక్ 10 రోగుల్లో తన పరికరాన్ని పెట్టేందుకు అనుమతి పొందాలని గతంలో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ), న్యూరాలింక్ మధ్య చర్చల ప్రకారం.. ఎఫ్‌డీఏ భద్రతాపరమైన సమస్యలను లెవనెత్తిన కారణంగా రోగుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఎఫ్‌డీఏ ఎంత మందిని అనుమతించిందనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అంతకుముందు మే నెలలో జంతువుల్లో పరిశోధనకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఈ పరికరం మానవ వినియోగానికి సురక్షితమైందని నిరూపించబడినప్పటికీ.. ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి కనీసం ఒక దశాబ్ధం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
న్యూరాలింక్ సంస్థను ఎలాన్ మస్క్ 2016లో స్థాపించారు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్(BCI) పరికరాన్ని డెవలప్ చేసింది. ఆలోచలను అనుగుణంగా ప్రతిస్పందించేలా చేయడానికి ఈ పరికరం పనిచేస్తుంది. పక్షవాత సమయంలో మెదడు పనితీరును పునరుద్ధరించడానికి ఈ బీసీఐ అనే పరికరాన్ని న్యూరాలింక్ డెవలప్ చేసింది. ఊబకాయం, ఆటిజం, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ పరికరం పనిచేస్తుందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు.