భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) , ప్రైవేట్ రంగంలోని వొడాఫోన్ ఐడియా (Vi) చేతులు కలపనున్నాయి. తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ రెండు సంస్థలు.. మార్కెట్‌లో తమ ఉనికిని చాటుకోవడానికి ఒకరి వనరులను మరొకరు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థలు తమ వద్ద ఉన్న టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ , స్పెక్ట్రమ్‌ను పంచుకోనున్నాయి. దీనివల్ల కొత్తగా మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసే ఖర్చు భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ‘కాస్ట్ సేవింగ్’ పద్ధతి రెండు కంపెనీలకు ఊపిరి పోయనుంది. ముఖ్యంగా నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన మూలధన వ్యయం తగ్గడం వల్ల, ఆ నిధులను సేవల నాణ్యత పెంచడానికి కేటాయించే అవకాశం ఉంటుంది.
Also Read:TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన కోటా టికెట్లు విడుదల..
బీఎస్ఎన్ఎల్‌కు కుగ్రామాల్లో ఉన్న పటిష్టమైన నెట్‌వర్క్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా పట్టణాల్లో Vi టెక్నాలజీ బీఎస్ఎన్ఎల్ కు తోడ్పడుతుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే 5జీ సేవల్లో దూసుకుపోతుండగా.. వెనుకబడిన Vi , బీఎస్ఎన్ఎల్ లు ఈ భాగస్వామ్యంతో 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా నిర్మించే అవకాశం ఉంది. దీని వల్ల టెలికాం రంగం కేవలం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పోటీ పెరగడం వల్ల కాల్ రేట్లు, డేటా ప్యాక్‌ల ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వొడాఫోన్ ఐడియాలో 49 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ఒక రకంగా Vi కూడా ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలోనే నడుస్తోంది. అటు పూర్తి ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కు, ఇటు ప్రభుత్వం వాటా ఉన్న Vi కి మధ్య సమన్వయం కుదరడం వల్ల టెలికాం రంగంలో ప్రభుత్వ ప్రాబల్యం పెరగనుంది. ప్రస్తుతం రెండు సంస్థలు 4జీ సైట్ల అప్‌గ్రేడేషన్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈ కీలక సమయంలో ఇరు సంస్థలు ఏకమవ్వడం వల్ల టెక్నికల్ లోపాలు తగ్గి, కాల్ డ్రాప్స్ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.
