పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.