నిన్న సోనమ్-రఘువంశీ…నేడు ఐశ్వర్య-తేజేశ్వర్…ఒకటా రెండా…దొరికిపోతామనే భయం లేదు. చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. చంపటమే పరిష్కారం అనుకుంటున్నారు. కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ…పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు…భర్తే హతుడు.
అందంగా తయారై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కల్యాణమండపంలో…తలవంచి భర్తతో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ముందు…మహానటిలా నటిస్తూ…ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు. పెళ్లి తతంగం కాస్తా ముగిశాక…తమలోని రాక్షసత్వాన్ని బయటికి తీస్తున్నారు. పెళ్లిలో ఎంత అమాయకంగా ఉంటున్నారో…ఆ తర్వాత భర్తలకు అసలు సినిమా చూపిస్తున్నారు. తమ ప్రేమ వ్యవహారాలను దాచిపెట్టి….కట్టుకున్న భర్తలను కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. నమ్మించి కట్టుకున్నోడి గొంతు కోస్తున్నారు. హత్య చేశాక…మాయ మాటలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీన్ కట్ చేస్తే…పోలీసుల విచారణలో అసలు బాగోతం బయటపడుతోంది.
కొందరు ప్రేమించిన వాడిని కాదని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు పెళ్లయ్యాక…వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. వివాహమై నెలయిందా ? రెండు నెలలైందా అన్నది చూడటం లేదు. పెళ్లయితే ఏంటి ? వివాహేతర సంబంధమే తమకు ముఖ్యమనుకుంటున్నారు. అదే తమ జీవితమని నమ్మేస్తున్నారు. ముందుకు వెనుక ఆలోచించడం లేదు. భార్యల్లో అసహనం పెరుగుతోంది. ఎలాగైనా అనుకున్నది దక్కించుకోవాలనే ఆరాటం అంతులేకుండా పోతోంది. దానికోసం ఏం చేయటానికైనా వెనుకాడటం లేదు. ఇవన్నీ కలిసి జనాన్ని నేరాలవైపు నెడుతున్నాయి. హత్యలకు పురికొల్పుతున్నాయి. నేరం చేయటం ఒక తప్పైతే..అది చేసి కూడా తప్పించుకోవచ్చని భ్రమపడటం మరోకోణం..ఇదే ఇప్పుడు అనేక నేరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికోసం అనేక కథలల్లి, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని చేసినా…చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే…దేశంలోనూ అనేక మహిళలు…కట్టుకున్న భర్తలను లేపేస్తున్నారు. భర్త ముందు ఏం తెలియనట్లు నటిస్తున్నారు. ప్రియుడి మోజులో…కంటుకున్నోడిని కనికరం లేకుండా చంపేస్తున్నారు. కొందరు సుపారీ ఇచ్చి హత్య చేయిస్తున్నారు. మరికొందరు తామే స్వయంగా హత్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంకొందరైతే…భర్తను చంపేసిన తర్వాత తమ ప్రియుళ్లకు వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ…మహిళల్లో పైశాచికత్వం పెరిగిపోతూనే ఉంది. పిల్లలున్నా…అమితంగా ప్రేమించే భర్త ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రియుడే సర్వం అనుకుంటున్నారు. భర్తనే రాక్షసుడని భావిస్తున్నారు. దీంతో వివాహ బంధాలు బీటలు వారుతున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 21న నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. సరిగ్గా నెల రోజుల క్రితమే వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తేజేశ్వర్‌ను దుండగులు పొలం సర్వే చేయాలనే నెపంతో పిలిచారు. ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివాహం జరిగి కేవలం నెల రోజులు కూడా గడవకముందే హత్యకు గురయ్యాడు. తేజేశ్వర్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి భార్య, అత్త ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు కుట్ర బయటపడింది.
పోలీసుల విచారణలో…తేజేశ్వర్ హత్య కేసులో సంచలవ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు తేజేశ్వర్. పెళ్లిలోనూ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తేజేశ్వర్, ఐశ్వర్యలకు పెళ్లి చేయాలని .. ఫిబ్రవరి 13న పెద్దలు నిశ్చయించారు. ఫిబ్రవరి 8న బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో ఐశ్వర్య వెళ్లిపోయింది. 15న ఇంటికి తిరిగివచ్చింది. విషయం తెలుసుకున్న తేజేశ్వర్ కుటుంబసభ్యులు…పెళ్లిని రద్దు చేసుకుంటామని చెప్పారు. తేజేశ్వర్‌తో మాటలు కలిపిన ఐశ్వర్య… కట్నం కోసం బంధువుల ఇంటికి వెళ్లామంటూ నమ్మించింది. ప్రేమలోకి దించి తేజేశ్వర్‌ను పెళ్లికి ఒప్పించింది. దీంతో కుటుంబసభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా తేజేశ్వర్…ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజేశ్వర్ కిడ్నాప్.. హత్య జరిగాయి.
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. హోమ్‌స్టేలోని సూట్‌కేస్‌లో దొరికిన మంగళసూత్రమే సోనమ్‌కు పట్టించింది. హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చిన సోనమ్, రఘువంశీ మే 22న సోహ్రాలో ఓ హోమ్‌స్టేకు వెళ్లారు. అయితే అక్కడ గది అందుబాటులో లేకపోవడంతో తమ సూట్‌కేస్‌ను అక్కడే ఉంచారు. నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఆ రాత్రి నాంగ్రియాట్‌లోని మరో హోమ్‌స్టేలో బస చేశారు. మే 23న ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరారు. అనంతరం సోహ్రాకు తిరిగివచ్చి, తమ స్కూటర్‌ను తీసుకుని వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు. అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు ఉన్న హోటల్ రూమ్‌లో పోలీసులు సోదా చేయడంతో…అక్కడ సూట్‌కేస్ దొరికింది. అందులో మంగళసూత్రం, ఒక ఉంగరం ఉన్నాయి. అయితే కొత్తగా పెళ్లి అయిన మహిళ రూమ్‌లోనే తాళిని, సూట్‌కేస్‌లో ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలను కలిగించింది. హిందూ సంప్రదాయంలో మంగళసూత్రాన్ని స్త్రీ వైవాహిక జీవితానికి పవిత్ర చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు దానిని దాదాపుగా తీయరు. ఈ కోణంలోనే దర్యాప్తును మముర్మం చేశారు. అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఆమె సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా సమక్షంలో సోనమ్‌ను ప్రశ్నించారు. తన భర్త హత్యకు చేసిన కుట్రలో తన ప్రమేయం ఉన్నట్లు ఆమె అంగీకరించింది.
