తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని సీనియర్లు వాపోతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత రాకుండా.. పార్టీకి పూర్వవైభవం ఎలా సాధ్యమౌతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వస్తున్నారు. రాహుల్ టూర్ తో అయినా కాంగ్రెస్ కు ఉత్తేజం రావాలని నేతలు కోరుకుంటున్నారు.
తెలంగాణ లో రాహుల్ గాంధీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ టూర్ ఉండనుంది. 6వ తేదీన రాహుల్ నేరుగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాహుల్ గాంధీ వరంగల్చేరుకొంటారు. వరంగల్ లో పార్టీ నిర్వహిస్తున్న సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ ఈ సభలోనే పరామర్శిస్తారు. ఈ సభలోనే తమ ప్రభుత్వ హయంలో రైతులకు ఏం చేసిందనే విషయాలను రాహుల్ గాంధీ వివరించనున్నారు. మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయనున్నారనే విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రకటించనున్నారు. వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీ వరంగల్ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్లో బస చేస్తారు. ఈ నెల 7వ తేదీన ఉదయం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుండి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. ఇదే సమావేశ మందిరంలో పలువురు మేధావులతో కూడా రాహుల్ గాంధీ భేటీ అవుతారు.ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ భవన్ కు చేరుకొంటారు. టీపీసీసీ కార్యవర్గంతో రాహుల్ గాంధీ భేటీ అవుతారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో రాహుల్ గాంధీ ఫోటో సెషన్ లో పాల్గొంటారు. ఈ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న రోజుల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నారు.గాంధీభవన్ నుండి రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుండి ఢిల్లీకి వెళ్తారు.
గత రెండు టర్మ్ లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజకీయంగా నష్టం వాటిల్లింది. అయితే ఈ దఫా మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకున్న సునీల్ వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టనున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా తయరైంది కాంగ్రెస్ పరిస్థితి. కావాల్సినంత ఓటుబ్యాంకు, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల బలం ఉన్నా కూడా.. సరైన దిశానిర్దేశం కరువౌతోంది. కాంగ్రెస్ కి ఓటేస్తే.. టీఆర్ఎస్ కు వేసినట్టే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. 2014లో, 2018లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ కావడం ఇందుకు బలం చేకూర్చింది. 2018లో మరీ దారుణంగా గెలిచిన 18 మందిలో 12 మంది పార్టీ ఫిరాయించారు. వీరిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఎందుకు గెలిపించాలనే ప్రశ్నకు.. రాహుల్ టూర్ సమాధానం చెప్పాల్సి ఉంది.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఆ నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత రాహుల్ పై ఉంది. అంతర్గత సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు.. నేతలు ఒక్కతాటిపై నడిచేలా దిశానిర్దేశం చేయాల్సి ఉంది. ఎనిమిదేళ్లలో పార్టీ వైఫల్యాలపై రాహుల్ గాంధీభవన్లో సమీక్ష చేస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయినదగ్గర్నుంచీ జరుగుతున్న పరిణామాలు రాహుల్ కు ఐడియా ఉన్నాయని.. ఆయన అన్నింటినీ సరిచేస్తారని కొందరు నేతలు చెబుతున్నారు. ఏదేమైనా నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న రాహుల్ టూర్ పై టీకాంగ్రెస్ శ్రేణుల్లో భారీ అంచనాలున్నాయి. టీఆర్ఎస్ ను గద్దె దించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్సేనని ప్రజల్లోకి బలంగా సందేశం వెళ్లడానికి.. రాహుల్ టూర్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. రాహుల్ టూర్లో భాగంగా.. ఓయూ విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసినా.. దానికి వర్సిటీ అనుమతి ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసినా.. కోర్టు కూడా సానుకూలంగా స్పందించలేదు. మరి దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఓయూ ఎపిసోడ్ తో పొలిటికల్ మైలేజ్ వచ్చిందని టీకాంగ్రెస్ భావిస్తోంది. ఓయూలో రాహుల్ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోవడానికి నిరసనగా.. యువజన కాంగ్రెస్ నేతలు అరెస్ట్ కావడం.. వారిని సీనియర్ నేతలు పరామర్శించడంతో.. పొలిటికల్ హైడ్రామాకు అవకాశం ఏర్పడింది.
ఇన్నాళ్లూ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి పెట్టడం లేదని కొందరు నేతలు కంప్లైంట్ చేసేవాళ్లు. మరిప్పుడు రాహుల్ టూర్ ని వాళ్లు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. కొంతకాలంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్న పాలిటిక్స్.. రాహుల్ టూర్ తో మళ్లీ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారినట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓయూ ఎపిసోడ్ తో రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రాహుల్ సభను విజయవంతం చేసి.. రాబోయే అధికారానికి బాటలు వేయాలని కాంగ్రెస్ నేతలంతా పట్టుదలగా ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్ని ఉత్తేజితుల్ని చేసి.. ఎన్నికల దాకా వరుస కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించాలని పీసీసీకి ఇప్పటికే అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. నౌ ఆర్ నెవర్ అనే సంకల్పంతో పనిచేయాలని, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలున్నాయని ఏఐసీసీ చెబుతోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో చూడాలి.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన లో.. కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ తెరపైకి తెచ్చింది. సెంటిమెంట్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న టీఆర్ఎస్ ను.. అదే సెంటిమెంట్ తో ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఓయూ ఎపిసోడ్ లో సెంటిమెంట్ రేపే ప్రయత్నం.. ఏమేరకు వర్కవుట్ అయింది అనేది చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఉపయోగించిన పాలిటిక్స్ వేరు ఇప్పుడు ఉపయోగిస్తున్న పాలిటిక్స్ వేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా దూకుడుగా వెళ్తుంది. ఇలాగే వెళ్తూ సెంటిమెంట్ తెరమీదకు తీసుకువస్తే మైలేజ్ అదే వస్తుందనే భావన పార్టీ నేతల్లో ఉంది. దీంతో సెంటిమెంట్ రాజకీయాల్లో చేసే అధికార టీఆరెస్ పార్టీని అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలని కసిగా ముందుకు వెళ్తుంది. ఓయూ కేంద్రంగా ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులతో అదే ఓయూ కేంద్రంగా రాష్ట్రం ఇచ్చిన పార్టీకి అగ్రనేత ద్వారా విద్యార్థులతో రాష్ట్ర ఆకాంక్ష లు ఎంత వరకు నెరవేరాయని ముచ్చటించడానికి సిద్ధమైంది. అనుమతి ఇవ్వకున్నా రాహుల్ గాంధీ ని ఓయూ కు తీసుకెళ్లి తీరుతామని రాష్ట్ర నేతలు తెగేసి చెబుతున్నారు. దీని వెనుక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ ఓయూ కి పోతే తప్పేంటనే భావనను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం కనిపిస్తోంది.
రాహుల్ గాంధీ ఓయూ పర్యటన అనుమతి కోరుతూ నిరసన తెలిపిన nsui విద్యార్థులను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిపై అక్రమ కేసులు బనాయించారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి లాంటి నేతలు చంచల్ గూడ జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు.అక్కడితో ఆగకుండా జైలు సుపెరిండెంట్ ని కలిసి వతేదీన అరెస్ట్ అయిన 18 మందితో మే 7 వ తేదీన రాహుల్ గాంధీ ములాఖత్ కావడానికి అనుమతి కోరారు. ఇక్కడ కూడా సెంటిమెంట్ ప్లే చేసే అవకాశం దక్కించుకున్నారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో 7 వతేదీన గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ తో లంచ్ మీటింగ్ ని ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిందని రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తాము అండగా ఉంటామని చెప్తూ ఉద్యమకారులను కాంగ్రెస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారిని ప్రభుత్వం విస్మరించడంతో రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు కుటుంబాలతో ముచ్చటించడతో పాటు రైతు డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. దీంతో రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెబుతూ రైతులను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ ద్వారా జరుగుతుంది.
గాంధీ భవన్ కి రాహుల్ గాంధీ వస్తుండడంతో అక్కడే కీలక సమావేశాలు నిర్వహిస్తుండడం తో తెలంగాణ నేతలకు ఇక నుండి ఎప్పటికి గాంధీల కుటుంబం తోడుంటుందని చెప్పాడనికి రాహుల్ గాంధీ గాంధీ భవన్ కేంద్రంగా సమీక్షలు జరపబోతున్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి మెంబర్షిప్ లో కష్టపడ్డ ఎన్ రోలర్స్ తో రాహుల్ ముచ్చటించనున్నారు.
మొత్తం మీద గతంలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుండడంతో తాజాగా వస్తున్న మైలేజ్ బాగానే ఉన్నా.. భవిష్యత్ లో ఈ సెంటిమెంట్ టీఆరెస్ ను ఢీ కొట్టేంత ఉంటుందో లేదో చూడాలి.
మొత్తానికి రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానుండటంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. వరంగల్ లో భారీ సభ తరుణంలో క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీలో ఐక్యత మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందన్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.రాహుల్ గాంధీ అంతలా గట్టి వార్నింగ్ ఇచ్చినా నేతలు మాత్రం తలో రూటు అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు. నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు ఉన్న పరువు కూడా పోతోందని వాపోతున్నారు. బాధ్యతగా మెలగాల్సిన నేతలే ఇలా విభేదాలు రచ్చకెక్కేలా వాదులాడుకుంటే ప్రజలకు విశ్వాసం కలిగేదెలా అని అంటున్నారు. .ఏప్రిల్ నెలారంభంలో తనతో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు రాహుల్ గాంధీ సీరియస్ వార్నింగే ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా..విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ భేటీ అనంతరమే రాహుల్ పర్యటన ఖరారైంది. అధిష్ఠానం ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కొందరు నేతలు పద్ధతి మార్చుకోవడం లేదన్న సంగతి.. ఇప్పటికే ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దృష్టికి కూడా వచ్చింది. మరి ఆయన హైకమాండ్ కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు.. తెలంగాణ టూర్లో నేతలకు రాహుల్ క్లాస్ పీకుతారా అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.
రాహుల్ గాంధీపై ప్రతిపక్షాలు కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేసి.. వందల మంది ప్రాణాలు బలి తీసుకున్నారని బీజేపీ విమర్శిస్తుంటే.. రాహుల్ ఎక్కడ అడుగుపెడితే.. అక్కడ మిగిలేది ఓటమే అంటూ టీఆర్ఎస్ కవ్విస్తోంది. రాహుల్ టూర్ మాట విన్నప్పట్నుంచీ ప్రత్యర్థి పార్టీలు ఉలిక్కిపడుతున్నాయని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. రాహుల్ రాక సందర్భంగా ఇప్పటివరకు ఇనాక్టివ్ గా నేతలంతా యాక్టివ్ అయిన మాట నిజం. ఈ యాక్టివ్ నెస్ కేవలం రాహుల్ టూర్ వరకే పరిమితమౌతుందా.. తర్వాత కూడా కొనసాగుతుందా అనేది కూడా కీలకమే. నేతలంతా ఇంతే యాక్టివ్ గా పనిచేస్తే.. పార్టీ పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుందనే ఆశలు కూడా కార్యకర్తల్లో కూడా ఉన్నాయి. మరి నేతలు పట్టుదల కంటిన్యూ చేస్తారా.. మూడ్నాళ్ల ముచ్చట చేస్తారా అనే అనుమానాలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీ టూర్ నుంచి వీలైనంత మైలేజ్ పొందాలనేది టీకాంగ్రెస్ లక్ష్యంగా ఉంది. గత రెండు ఎన్నికల్లో పార్టీకి దూరమైన కొన్ని వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవడానికి.. రాహుల్ పర్యటన కీలకమని భావిస్తోంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోవాలంటే.. రాహుల్ సభ నుంచి కచ్చితమైన సందేశం వెళ్లాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారనేది కూడా కీలకమే. ఇప్పటికే సునీల్ టీమ్ నుంచి కూడా రాహుల్ కు కొంత ఫీడ్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి రాహుల్ గాంధీ వ్యూహకర్త ఆలోచనల మేరకు నడుస్తారా.. లోకల్ లీడర్ల అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా లాంటి ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. రెండు రోజుల టూర్లో రాహుల్ వ్యవహారశైలి ఎలా ఉంటుందనేది.. తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్దేశించనుంది.
వరంగల్ సభలో రాహుల్ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తారని కాంగ్రెస్ చెబుతోంది. రైతు డిక్లరేషన్ లో ఏముంటుందనేది చర్చనీయాంశంగా మారింది. రైతులకు సంబంధించిన అంశాలు.. రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి.. రాహుల్ ఏం చెబుతారోనని అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రైతు రుణమాఫీతో కాంగ్రెస్ అన్నదాతల్ని విశేషంగా ఆకట్టుకుంది. అప్పట్నుంచి అన్నదాతల్లో మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. కానీ 2014 ఎన్నికల సమయంలో సీన్ రివర్సైంది. అప్పట్నుంచీ మిగతా వర్గాలతో పాటు రైతుల్లో కూడా మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ కు దూరం జరిగారు. ఇప్పుడు రైతుల్ని పెద్దఎత్తున తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు.. రాహుల్ నోట రైతు డిక్లరేషన్ మాట వినిపించాలని ఫిక్సయ్యారు. తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా అమలౌతున్నా.. అన్నదాతల్లో అసంతృప్తి ఉందని, ప్రాథమిక సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర వంటి అంశాలపై వరంగల్ సభలో కీలక ప్రకటనలు ఉండొచ్చనే ఊహాగానాలున్నాయి. రుణమాఫీ విషయంలో కూడా టీఆర్ఎస్ లేట్ చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. ఈ విషయంలో కూడా రాహుల్ తో కీలక ప్రకటన చేయిస్తుందేమో చూడాల్సి ఉంది.
వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ సభలో రైతు అంశాలే ఎజెండాగా తీసుకుని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలను డిక్లరేషన్ ద్వారా వెల్లడించనున్నారని సమాచారం. రాహుల్ ద్వారానే ఈ అంశాన్ని ప్రకటించబోతున్నట్లు తెలిసింది. రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఏ పంటలు వేసినా వాటికి అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటల ఆధారంగా కొనుగోళ్ల ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను ఈ డిక్లరేషన్‌లో స్పష్టంగా వెల్లడించబోతున్నట్లు తెలిసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమ్ వరంగల్ డిక్లరేషన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
అసైన్డ్ భూముల వ్యవహారాన్ని కూడా ఈ డిక్లరేషన్‌లో చేర్చనున్నారు. కాంగ్రెస్ పేదలకు వేలాది ఎకరాల అసైన్డ్ భూములు పంచితే.. టీఆర్ఎస్ వాటిని లాక్కొంటోందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద రైతులకు ఏం చేస్తారో వివరించనున్నారని తెలిసింది. అంతేకాకుండా కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి అంశాలపై ఈ డిక్లరేషన్‌లో వెల్లడించనున్నారు. మొత్తానికి రైతుల ఓట్లే టార్గెట్‌గా ఈ డిక్లరేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ డిక్లరేషన్ కీలకమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల వరకు వరంగల్ డిక్లరేషన్‌ను రైతు వర్గాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వరంగల్ సభ సందర్భంగా రాష్ట్రంలో చనిపోయిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. వాళ్లతో కలిసి భోజనాలు చేయనున్నారు. ఇప్పటికే వరంగల్ సభకు భారీ ఎత్తున రైతులను సమీకరించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలున్నా.. వాటిని క్యాష్ చేసుకోవడంలో ఇప్పటివరకు అనుకున్నంత సక్సెస్ కాలేదని టీకాంగ్రెస్ నేతలు అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా.. అధికార పార్టీని డిఫెన్స్ లో పడేసేలా కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారు. దీనికి రాహుల్ టూర్ తోనే నాంది పలకాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే గాంధీ భవన్లో వారం వారం పొలిటికల్ అఫైర్స్ మీటింగులు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టడం పార్టీకి ఇబ్బందికరంగా ఉంది. పైగా గైర్హాజరౌతున్న నేతల పట్ల సరైన చర్యలు కూడా ఉండటం లేదనేది క్యాడర్ నుంచి వస్తున్న కంప్లైంట్. దీనిపై గట్టి నిర్ణయం తీసుకోకపోతే.. భవిష్యత్తులో మిగతా నేతలు కూడా ఇదే బాటన నడుస్తారనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటికే మీటింగులు సీరియస్ గా తీసుకోవాలని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. మరి రాహుల్ కూడా మీటింగులకు గైర్హాజరయ్యే నేతలకు క్లాస్ పీకుతారా.. ఈ విషయంలో ఎలాంటి డైరక్షన్ ఇస్తారనేది చూడాల్సి ఉంది.
పార్టీ ఫిరాయింపుల్ని వీలైనంత తగ్గించాలంటే.. తరతరాలుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న నేతలకే టికెట్లివ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో హెలికాప్టర్ నేతలకు టికెట్లు దక్కాయని, అందుకే వాళ్లు గెలవగానే పార్టీకి హ్యాండిచ్చారనే కామెంట్లు గట్టిగానే వచ్చాయి. ఈసారి గతంలో మాదిరిగా హడావుడిగా కాకుండా.. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందే అభ్యర్థుల్ని ప్రకటించాలని, అభ్యర్థుల ప్రకటనకు ముందు స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా సీనియర్లు కోరుతున్నారు. వీటన్నింటిపైనా రాహుల్ నుంచి హామీ లభిస్తుందా.. లేదా అనేది కూడా చూడాలి. వరంగల్ లో జరిగే సభ.. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెంచడానికి ఉద్దేశించినది. గాంధీభవన్లో జరిగే సమావేశం దీనికి పూర్తి భిన్నమైనది. పార్టీలో సమస్యలపై ఫోకస్ పెట్టి.. పరిష్కారాలు సూచించాల్సి ఉంటుంది. ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశమైనా.. వన్ టూ వన్ మాట్లాడలేదనే అసంతృప్తి చాలామందిలో ఉంది. వ్యక్తిగత భేటీలు లేకుండా వాస్తవాలు బయటకు రావనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు గాంధీభవన్లో అయినా క్షేత్రస్థాయి కార్యకర్తలతో మాటామంతీ ఉంటుందా.. ఎప్పటిలాగే అగ్రనేతలతో భేటీలకే పరిమితమౌతారా అనేది కూడా చూడాలి.
కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన యంత్రాంగం ఉంది. అనుబంధ సంఘాల బలం కూడా ఉంది. అయితే కొన్నాళ్లుగా సరైన కార్యాచరణ లేక, నేతల పర్యవేక్షణ కొరవడి.. క్యాడర్ నిస్తేజంగా ఉంది. ఇప్పుడు రాహుల్ టూర్ తో కాస్త ఉత్సాహం వచ్చినా.. ఈ జోష్ కొనసాగాలంటే.. కార్యకర్తల్ని ఎప్పుడూ బిజీగా ఉంచే షెడ్యూల్ అవసరం. ఈ షెడ్యూల్ విషయంలో రాహుల్ ఎలాంటి సూచనలు ఇస్తారనేది కూడా తేలాలి. ఢిల్లీలో ఇప్పటికే నేతలకు ఓ విడత క్లాస్ పీకిన రాహుల్.. ఇప్పుడు ఆ డోస్ పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంతసేపూ ఢిల్లీ వైపు చూడటం కూడా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకుని.. అధికార పార్టీపై నిరంతర యుద్ధం చేయాలని కూడా రాహుల్ గాంధీ స్పష్టంగానే చెప్పారు. అయితే టీకాంగ్రెస్ నేతలు మాత్రం ఎప్పటిలాగే విభేదాలకు పెద్దపీట వేస్తూ.. అసలు యుద్ధం గాలికి వదిలేశారనేది కార్యకర్తల ఫిర్యాదు. అగ్రనేతలు వచ్చినప్పుడు హడావుడి చేస్తే ఓట్లు పడవని.. ఎప్పటికప్పుడు జనం సమస్యలపై స్పందించాలనే మాట సర్వత్రా వినిపిస్తోంది.