AP’s 3 capitals issue : ఏపీ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లైంది. ఇంతవరకూ రాజధానిపై స్పష్టత లేదు. టీడీపీ హయాంలో అమరావతి హైలైట్ అయితే.. ఇప్పుడు మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. అసలు రాజధాని ఎక్కడ వస్తుందో తెలియక.. ప్రజలు అయోమయంలో ఉన్నారు. పాలిటిక్స్ కు ముడిపెట్టి రాజధానిపై నిర్ణయాలు మార్చుకుంటున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
ఏపీ రాజధానిపై రాజకీయం కొనసాగుతోంది. ఒక రాజధానా.. మూడు రాజధానులా అనే చర్చ సీరియల్ లా సాగుతూనే ఉంది. పాలక, ప్రతిపక్షాల వాదోపవాదాలు, ఉద్యమాలు, న్యాయపరమైన అంశాలు.. ఇలా రాజధాని అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోంది.
ఏపీకి దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానులు రావాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వ వాదనగా ఉంది. ఏపీ రాజధాని వ్యవహారంపై 2019 డిసెంబర్ 17 న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండొచ్చు. యంత్రాంగం అక్కడి నుంచే పని చేయవచ్చు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగించవచ్చు. కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్నారు సీఎం.
అమరావతిలోనే రాజధాని కట్టాలంటే.. అయ్యే పని కాదని, లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో రాష్ట్రం లేదనేది సర్కారు మరో పాయింట్. అమరావతిలో మౌలిక సదుపాయాలకే ఎకరాకి రూ. 2 కోట్లు చొప్పున లెక్కిస్తే రూ. 1.06 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. అదే విశాఖలో అయితే అలాంటి అవసరమే ఉండదు. ఐదు నుంచి 10 వేల కోట్ల రూపాయలతో విశాఖను అభివృద్ధఇ చేసే అవకాశం ఉందనేది ప్రభుత్వ వాదన. కేంద్రీకృత రాజధాని సిద్ధాంతం నుంచి వికేంద్రీకరణతో కూడిన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభివృద్ధి వైపు, మార్పుదిశగా ప్రస్తుత ప్రభుత్వం తొలి అడుగని భావించవచ్చు. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ ప్రక్రియ ఆధారంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళేందుకు ఉపకరిస్తాయని మేధావి వర్గం అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా వికేంద్రీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కాపాడుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం ఏపీలో భౌగోళిక పరంగా, సహజంగానే మూడు ప్రాంతాలుగా కనిపిస్తున్న ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విభిన్న సాంఘిక, సాంస్కృతిక, ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నిర్మూలన, కోస్తాంధ్ర ప్రాంతంలో వరద నివారణ, వ్యవసాయాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకై సాగునీటి సమగ్రాభివృద్ధి ముఖ్యాంశాలుగా గుర్తించి పరిపాలన పరంగా అభివృద్ధి చేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధించేం దుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో జరిగిన కేంద్రీకృత అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటు తనం వల్ల జరిగిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పట్టణాలు,కొన్ని జిల్లాలు మాత్రమే మిగతా ప్రాంతాలకంటే ఎక్కువ ఆర్థికాభివృద్ధి సాధించాయి. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అధికార వికేంద్రీకరణ దిశగా ఉంటుంది. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ, తద్వారా సమతుల్య అభివృద్ధి జరుగుతుందని మేధావుల అభిప్రాయం. అమరావతి ఒక్కచోటే అభివృద్ధి జరగడం వలన అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ తద్వారా ఒక ప్రాంతానికి కొంతమందికే ప్రయోజనంగా ఉంటుందని చెప్పక తప్పదు. అయితే ఈ వాదన అన్నివేళలా కరెక్ట్ కాదని.. ప్రభుత్వం చెబుతున్నంత తక్కువ ఖర్చుతో ఎక్కడా రాజధాని తరహా సౌకర్యాలు రావని ప్రతిపక్షం వాదిస్తోంది. అసలు అమరావతి పనులే మొదలుపెట్టకుండా.. చాలా ఖర్చౌతుందనే ప్రచారంతో.. సర్కారు తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తోంది.
తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ప్రయోజనం పొందటం ఆర్థికశాస్త్రంలో ముఖ్య సిద్ధాంతం. స్వల్ప కాలంలోనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరముందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికల రచన అంత ప్రయోజనం కాదనే అభిప్రాయం కూడా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. అమరావతి అభివృద్ధి సాధించడానికి కనీసం 40 నుంచి యాభై ఏళ్లు పడుతుందని మేధావుల అంచనా. ఆ కాల వ్యవధిలో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మార్పులు విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఆర్థికశాస్త్రం చెప్పినట్టుగా ఛాయిస్ ఆఫ్ సైన్స్ అనే సిద్ధాంతానికి కేంద్రబిందువుగా ఉన్న అభిప్రాయానికి ప్రతిరూపంగా.. మూడు రాజధానుల సిద్ధాంతం అధిక ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. అయితే రాజధాని లాంటి అంశాన్ని ఆర్థిక అంశాల ఆధారంగా నిర్ణయించలేమని, అభివృద్ది వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణకు తేడా ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగ స్వామ్యం చేయవచ్చు. రాజధాని వికేంద్రీకరణ వలన అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. వాణిజ్యాభివృద్ధిలో వేగం పెరుగుతుంది. ఆర్థిక శాస్త్రం ప్రకారం కొనుగోలు శక్తి పెరగాలంటే ఆర్థికాభివృద్ధి పెరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అన్నిప్రాంతాల ఆర్థికాభివృద్ధి వలన అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి పెరు గుతుంది. దాని వలన వాణిజ్యం పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సత్వర ఆదాయ వనరుల అభివృద్ధి ఎంతైనా అవసరం. మూడు రాజధాని నగరాలను సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా, వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా అనుకూలం ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తాయి. మూడు రాజధాని నగరాలకు సమాన నిధులిచ్చి, సాంస్కృతిక, సామాజిక అంశాలకు అనుగుణంగా వివిధ ప్రణాళికలను రచించి, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మహానగరాల కాలం అంతరిస్తోందని.. ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టిపుల్ సిటీస్ మోడల్ అనుసరిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎక్కాడ మహానగరాల నిర్మాణం గురించి ఆలోచించడం లేదు. ఎక్కడికక్కడ పారిశ్రామిక హబ్ లు, వాటి చుట్టూ నగరాలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే పని చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకే ఒకే ప్రాంతంలో కాకుండా.. అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామికీకరణ, అభివృద్ధికి అవకాశం ఉండేలా మూడు రాజధానుల నినాదం ఎత్తుకుంది. రాజధాని కాబట్టి.. మూడు నగరాలపైనా సర్కారు దృష్టి ఉంటుంది. అప్పడు పెట్టబడులు కూడా తరలి వస్తాయనే ఆలోచన చేస్తున్నారు. ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు, ఉపాధి పొందితే.. ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగితే.. అప్పుడు అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పోటీపడతాయనే కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే ఇప్పటికీ దేశంలో మెట్రో నగరాల నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందనే విషయం మర్చిపోవడానికి లేదు. అమరావతి మరో మెట్రో సిటీగా మారితేనే ఏపీకి ఉపయోగకరమని ప్రతిపక్షాల వాదన.
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పుడు.. ప్రభుత్వం సౌతాఫ్రికా మోడల్ ముందుకు తెచ్చింది. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఏపీకి ఉన్న ఆర్థిక పరిమితుల్లో ఇంతకు మించిన బెస్ట్ ఆప్షన్ లేదనేది సర్కారు చెబుతున్న మాట. వీలైనంత త్వరగా తోటి రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదగాలంటే ఇదే మార్గమని వాదిస్తోంది.
సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సౌతాఫ్రికా ఏర్పడక ముందు.. రెండు బలమైన ప్రావిన్సులకు రాజధానులుగా ప్రిటోరియా, కేప్‌టౌన్ ఉండేవి. ఈ రెండింటితోపాటు దేశానికి మధ్య భాగంలో ఉన్న బ్లూమ్ ఫౌంటేన్ ను మరో రాజధానిగా ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అనే భౌగోళిక విభజన ఏపీలో ఉన్న మాట వాస్తవమే. ఈ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ అంటున్నారు. అమరావతి మోడల్ డెవలప్‌మెంట్ కూడా సరైంది కాదనేది సర్కారు వాదన. అది ఊహాజనితం. నగరాన్ని నిర్మించడం వేరు.. ఆర్థిక వ్యవస్థ నిర్మించడం వేరు. ఎకానమీ వేరు, రాజధాని వేరు. హైదరాబాద్ ఎకానమీని అమరావతికి ట్రాన్స్‌ప్లాంట్ చేయలేం. హైదరాబాద్ ఆర్థికవ్యవస్థకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అది అమరావతిలో రాత్రికి రాత్రి తేలేమని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది.
ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఏపీకి రాజకీయ అవసరాలను తీర్చేందుకు పరిమిత స్థాయిలో రాజధానిని నిర్మించాలి. ఆర్థిక వికేంద్రీకరణ కోసం నాలుగైదు నగరాలను నిర్మించాలి. ఇప్పటికే విశాఖ, రాజమండ్రి, తిరుపతి లాంటి నగరాలు డెవలప్ అయ్యాయి. స్థానిక పరిస్థితులు, అవకాశాలు, అనుకూలతలను బట్టి ప్రాంతాల వారీగా హార్టిక్చర్ హబ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ తదితరాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏపీకి 974 కి.మీ. పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను వికేంద్రీకరించి 6 నుంచి 7 బలమైన నగరాలను నిర్మించొచ్చు. తెలంగాణకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే విమానయాన సౌకర్యం ఉంది. ఏపీలో చాలా నగరాలకు విమానయాన సౌకర్యం ఉంది. తెలంగాణకు లేని రీతిలో ఏపీకి నగరాలను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గుర్తొచ్చేది వరంగల్, కరీంనగర్ నగరాలు మాత్రమే. కానీ ఏపీలో ఇప్పటికే చాలా నగరాలు డెవలప్ అయ్యాయి. ఏపీలో పది నగరాలను గుర్తించి మరింతగా డెవలప్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ప్రాంతాల వారీగా మూడు రాజధానులు అంటున్నా.. కొంతకాలం తర్వాత సర్కారు మదిలోనూ ఇదే ఆలోచన రావచ్చు. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి చెందిన గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఒకే నగరంపై ఆధారపడి ఆర్థిక వ్యవస్థ లేదు. అక్కడ నాలుగైదు నగరాలు రాజధానులకు దీటుగా అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఏపీకి కూడా ఆ పొటెన్షియల్ ఉన్నా.. ఇప్పటివరకూ సరైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు పాలనా వికేంద్రీకరణ చేస్తే.. అంతో ఇంతో అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అభివృద్ధ ఊహించని విధంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.
మూడు రాజధానులపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలుండొచ్చు కానీ.. ఆర్థిక వేత్తల అభిప్రాయాలను పరిశీలిస్తే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయడం ఎప్పుడూ మంచిదే అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మహానగరాల్లోనే బాగుంటుందనే రూలేం లేదు. ఎక్కడికక్కడ మధ్యస్త నగరాల్లోనూ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయొచ్చు. అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. కాలం చెల్లిన మహానగరాల వ్యవస్థ కంటే.. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన గ్రోత్ సెంటర్ల ఏర్పాటు కీలకం. ఏపీలో రాజధాని ఏర్పాటును అందుకు ఉపయోగించుకోవడమే ప్రభుత్వం చేస్తున్న పని. మనకు ఇప్పటివరకూ ప్రాంతాల వారీగా సమాన నిధుల పంపిణీ అలవాటు కాలేదు. సహజంగా రాజధానికి ఎక్కువ నిధులు ఖర్చుచేస్తారు. ఇప్పుడు మూడు రాజధానులు వస్తే.. అప్పడు ఖర్చులోనూ వికేంద్రీకరణ వస్తుంది. రాష్ట్రంలో ఉన్న కొత్త అవకాశాలు, పొటెన్షియాలిటీ కూడా పూర్తిస్థాయిలో వాడుకునే వీలుంటుందని ఆర్థిక వేత్తల అభిప్రాయం.
అమరావతిలో రాజధాని వద్దనడం లేదు. ఉన్న రాజధానికి మరో రెండు యాడ్ చేస్తున్నామంతే.. ఇదీ ఏపీ సర్కారు క్లియర్ కట్ గా చెబుతున్న విషయం. ప్రజల సెంటిమెంట్లు, అవసరాలు, ఆర్థిక పరిమితుల్ని దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. అమరావతి అనే కలను సాకారం చేయగలమా.. లేదా అనే విషయం అన్ని వర్గాలూ ఆలోచించాలంటున్నారు జగన్. ఏదో జరిగిపోతుందనే భ్రమలో బతకడం కంటే.. వాస్తవాలు గ్రహించి చేయదగిన పనులపై దృష్టి పెట్టడం మంచిదంటున్నారు సీఎం.
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయిస్తే.. దాన్ని ప్రజలు స్వాగతించడం వేరు.. పాలనా వ్యవస్థ వేరు. నగరానికి ఓ శాఖ చొప్పున ఏర్పాటు చేసినా.. ప్రజలు స్వాగతిస్తారు.. కానీ ఆ పని చేయడం ప్రాక్టికల్ గా పాజిబులేనా అనేది అసలు ప్రశ్న. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు.. పరిపాలన వికేంద్రీకరణ వేరనే సంగతి సర్కారుకు తెలియదనుకోలేం. కానీ ఉద్దేశపూర్వకంగా రెండింటినీ కలిపి చెబుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం చెబుతున్నట్టుగా విశాఖలో సెక్రటేరయట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు ఉంటే.. అప్పుడూ ఆర్థికంగా భారం అయ్యే అవకాశాలు లేకపోలేదనే వాదన ఉంది. ఏడాదిలో 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రెండు నెలలు సెక్రటేరియట్ మొత్తం అమరావతిలో ఉండాల్సిందే కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని కింది స్థాయి అధికారి వరకు అందరూ వైజాగ్ నుంచి అమరావతికి రావాల్సి వస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంపై ఇది మరింత భారం మోపుతుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించి చాలా కేసులు ఉంటాయి. కోర్టులో ఎంత మంది సచివాలయ అధికారులు ఉంటారో చూడండి. కేసులు వాయిదా పడినప్పుడల్లా.. ఉద్యోగులు ఫైళ్లను మోసుకొని వైజాగ్ నుంచి కర్నూలుకు వెళ్లాలి. ఇవన్నీ ప్రతిపక్షాలు చూపిస్తున్న ప్రాక్టికల్ ఇబ్బందులు. ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందదు. పరిశ్రమలు వస్తేనే డెవలప్ అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
రెండు పార్టీల వాదన సరే.. మరి ప్రజల సంగతేంటి..? ఏ వాదనని నమ్మాలి..?ఏ నిర్ణయం సరైనదనుకోవాలి..? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రాక్టికల్ గా అన్వేషించాలి.
కేవలం మూడు రాజధానులకే సర్కారు పరిమితం కాలేదు. ఇప్పటికే ప్రతి రెండు వేల మంది జనాభాకు ఓ సెక్రటేరియట్ ఏర్పాటైంది. ప్రతిచోటా పది మంది ఉద్యోగులున్నారు. ప్రజలు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. వలంటీర్ వ్యవస్థ ఉంది. ఈ బాటలోనే రాజధానుల విషయంలో పనిచేస్తామంటోంది సర్కారు. మొదట మూడు నగరాలను గ్రోత్ ట్రాక్ ఎక్కిస్తే.. ఆ తర్వాత వాటికి అనుబంధంగా మరో ఆరేడు నగరాల్ని తయారు చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో జిల్లాల వారీగా వనరులు, పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేయించిన ప్రభుత్వం.. ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలనే బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే సంక్షేమంలో తమ ముద్రేంటో చూపించామని.. ఇక అసలైన అభివృద్ధి అంటే ఏంటో కూడా చూపించాలనే సంకల్పంతో ఉంది ప్రభుత్వం.
మొత్తానికి అటు అమరావతి, ఇటు మూడు రాజధానుల నినాదాలతో అటు పాలక పక్షం.. ఇటు ప్రతిపక్షం పొలిటికల్ గేమ్ ఆడుతూ.. ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నాయి. అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తును ప్రజలే నిర్ణయించాలి.
రాజధానిపై అవసరానికి మించిన పొలిటికల్ గేమ్ జరగడమే సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేంద్రం కూడా ఎటూ తేల్చకుండా సమయానుకూలంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. నిజానికి ఏపీలో ప్రజలు రాజధాని కోరుకుంటున్నారు. ఇక్కడ అక్కడా అని పట్టింపు లేదు. అమరావతి రైతులు కూడా భూములు ఇచ్చి నష్టపోయారు కాబట్టి.. రాజధాని కోసం పట్టబడుతున్నారు. అంతకుముందు ఏ ప్రాంతం నుంచీ రాజధాని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి లేదు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయం తీసుకుని అమరావతి నిర్ణయించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయంతో మూడు రాజధానుల నినాదం ఎత్తుకోలేదు. అంటే ప్రజల్లో లేని భావాల్ని రాజకీయ పార్టీలే కలిగిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఏపీ లాంటి ప్రగతిశీల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకూడదు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండి గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేశారనేది వైసీపీ ఆరోపణ. జగన్ మూడేళ్లుగా అమరావతిని అటకెక్కించారనేది టీడీపీ ఫిర్యాదు. ఇలా గురువింద సామెతను గుర్తుచేస్తున్నాయి పార్టీలు. ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తే.. త్వరగా ట్రాక్ ఎక్కుతామని ఆలోచించాలి. ఇటు ప్రజలు కూడా ప్రాక్టికల్ గా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో బలం ఉన్న ప్రభుత్వం తతాను అనుకున్నట్టుగా చేసే అవకాశం ఉంది కాబట్టి.. లేనపోని పంతాలకు పోయి భవిష్యత్తు పాడు చేసుకోవటం ఎవరికీ మంచిది కాదు.