Site icon NTV Telugu

Storyboard: సోషల్ మీడియా వెట్టింగ్ విధానంతో హెచ్-1బీ వీసాల జారీ వాయిదా..

Visa

Visa

Storyboard: భారతీయుల అమెరికా కలల్ని కల్లలు చేసే ప్రక్రియలో మరో అంకానికి ట్రంప్ తెరలేపారు. హెచ్‌వన్‌బీ వీసా అపాయింట్‌మెంట్లు అకస్మాత్తుగా వాయిదా పడ్డాయి. సోషల్ మీడియా వెట్టింగ్ రూల్ రాబోతుండడంతో.. గందరగోళం నెలకొంది. హెచ్ 1 బీ వీసా కావాలనుకునే వారికి జనవరి 15 తర్వాత చూద్దామనుకుంటున్నారు అమెరికా అధికారులు. ప్రస్తుతం అపాయింట్‌మెంట్ ఇచ్చిన వారికి.. మార్చి తర్వాత ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వలసదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

Read Also: HBD Rajinikanth: ‘రజనీ’ రొమాన్స్ సూపర్ హిట్.. తన కంటే 37 ఏళ్ల చిన్న హీరోయిన్‌తో..!

అమెరికా.. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా నిత్యం అందరి తలపుల్లో మెదులుతూనే ఉంటుంది. ఇందుకు కారణం.. లక్షలాది భారతీయులు ఆ దేశంలో ఉద్యోగం చేస్తుండటమే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అక్కడ కొలువుల్లో ఉన్నారు. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అమెరికాలో 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా పుట్టుకొచ్చాయి. ఆ దేశ ఆర్థికవ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతున్న కాలం అది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఆ సమయంలో అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వం సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో హెచ్-1బీ వీసాలను ప్రారంభించారు.

Read Also: Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై ఛార్జిషీట్ దాఖలు.. ఏముందంటే..!

అమెరికా ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో మాత్రమే హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. ఇవి మూడు విభాగాలుగా ఉంటాయి. సాధారణ కోటాలో ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటిని జనరల్ కోటా అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, మాస్టర్స్‌ కోటాలో అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు. ఇవి రెండూ కాకుండా రిజర్వుడ్‌ కోటా ఉంటుంది. ఈ విభాగం కింద స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేసి ఉంచారు. హెచ్-1బీ వీసాలకు డిమాండు బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్‌గా వీటిని ఎంపిక చేస్తుంది. తమ ఉద్యోగుల కోసం సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటాయి. అలాగే మరి కొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి.

Read Also: Garlic and Honey Benefits: వెల్లుల్లి, తేనె కలిపి తినడంతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే..

అమెరికా వెళ్లాలనుకునే భారతీయ హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు ఊహించని అడ్డంకి ఎదురైంది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ విధానం కారణంగా, భారత్‌లో అనేక వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మార్పులపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు కీలక సూచనలు జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్ తేదీ మార్చినట్లు ఈమెయిల్ వచ్చి ఉంటే, కొత్త తేదీలో మాత్రమే ఇంటర్వ్యూకి హాజరు కావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పాత తేదీలో ఇంటర్వ్యూ కోసం వస్తే, వారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని హెచ్చరించింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు జరగాల్సిన అనేక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చి నెలకు మార్చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రైవసీ సెట్టింగులను పబ్లిక్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెల‌ 15 నుంచి అధికారులు వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తిస్తారు. ప్రతి వీసా మంజూరు ప్రక్రియ ఒక జాతీయ భద్రతా నిర్ణయం అని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే పేర్కొంది. సోషల్ వెట్టింగ్ ప్రక్రియ కఠినంగా ఉందని, ఈ సాకుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చినా యూఎస్ పట్టించుకోవడం లేదు.

ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై నిఘా పెరిగింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు ప్రాథమిక మార్గమైన ఈ వీసాపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించారు. గతంలో హెచ్-1బీ వీసాలపై 100,000 డాల‌ర్ల రుసుము విధించడం, 19 దేశాల నుంచి గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నారు. అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత హెచ్‌-1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది.

నిజానికి ట్రంప్ వచ్చిన దగ్గర్నుంచి వేల సంఖ్యలో వీసాలు రద్దవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా వేల వీసాలు రద్దయ్యాయి. ఈ వీసాల రద్దు కారణంగా 8 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ .. వలసేతర వీసాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినవారి వీసాలను రద్దు చేస్తున్నారు. అలాగే, హెచ్‌-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమెలను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది.

సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే.. ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే.. సోషల్ వెట్టింగ్‌కు సహకరించాల్సిందేనని తేల్చిచెబుతోంది. సోషల్ వెట్టింగ్ లో వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి వారి ఆన్‌లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన తర్వాత తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు.. వీసాల కోసం ఎదురుచూస్తున్నవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పటికే ట్రంప్ వచ్చాక అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇది చాలదన్నట్టుగా హెచ్‌వన్‌బీ వీసా కోసం అప్లై చేసుకున్నవారికి కూడా యూఎస్ చుక్కలు చూపిస్తోంది. రోజుకో కొత్త నిబంధనతో ఇరుకున పెడుతోంది. ఇప్పుడు ఇంటర్వ్యూల వాయిదా మాత్రం వాటన్నింటికీ మించిన గుదిబండేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా.. చివరకు వీసాలు దొరకటం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తినిపుణులు అందునా భారతీయుల ఎక్కువ సంఖ్యలో వలస రావటానికి హెచ్‌వన్‌బీ వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి.. తలా తోకా లేని రూల్స్‌తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్నవారికీ కష్టాలు తప్పటం లేదు. గతంలో ఉద్యోగం వస్తే.. వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే.. వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.

హెచ్‌వన్‌బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు తీరు చూస్తుంటే.. పరుగు పందెంలో పోటీదారుడి కాళ్లు కట్టేసి పరిగెత్తమన్నట్టుగా ఉందనే వాదన వినిపిస్తోంది. అమెరికా పౌరులతో పోటీపడి అధిక నైపుణ్యంతో వలసదారులు అమెరికాలో కొలువులు సంపాదించుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం వారి ప్రతిభను గుర్తిచకుండా.. మా ఉద్యోగాలు మీరు లాక్కుంటున్నారనే అర్ధం పర్ధం లేని లాజిక్ తెరపైకి తెచ్చారు. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యూఎస్‌ యూత్‌కు ట్రంప్ ధోరణి బాగా నచ్చింది. దీంతో ట్రంప్ ఇంకా బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలపై టాప్ కంపెనీలతో ట్రంప్ వైట్‌హౌస్‌లో మీటింగ్ పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే అర్హతలు అమెరికన్లకు లేవని అవి తేల్చేశాయి. దీంతో కొన్నాళ్లు సైలంట్‌గా ఉన్న ట్రంప్.. మధ్యలో మనవారికి శిక్షణ ఇవ్వటానికి కొందరు అధిక నైపుణ్యం గలవారికి రెడ్ కార్పెట్ వేయాలన్నట్టుగా మాట్లాడారు. కానీ తన అసలు బుద్ధి మారలేదని నిరూపిస్తూ.. ఆఖరి క్షణంలో కూడా వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవారిని వేధించటమే పనిగా పెట్టుకున్నారు. ట్రంప్ పోకడలు చూస్తుంటే.. రేపొద్దున వీసా వచ్చాక కూడా.. అమెరికాలో ప్రశాంతంగా ఉండనిస్తారనే గ్యారెంటీ లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎవరేమనుకున్నా.. వలసదారులకు ఏదోలా అడ్డుకట్ట వస్తే.. అమెరికా కంపెనీలు చచ్చినట్టు అమెరికన్లకే ఉద్యోగాలిస్తాయని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ ఎక్కడ నుంచైనా పనిచేసే వెసులుబాటు ఉన్న ఈరోజుల్లో.. ట్రంప్ ఉద్దేశాలు నెరవేరటం అంత తేలిక కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ వెట్టింగ్ ఈ పేరు చెబితేనే టెకీలు ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే ఈ రూల్ ఫస్ట్ టైమ్ వీసా దరఖాస్తుదారుల్ని ఒకలా టెన్షన్ పెడుతుంటే.. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు. కాస్త ఉన్నత హోదాల్లో ఉన్నవారిని మరోలా భయపెడుతోంది. కొత్తవారికి వ్యక్తిగత జీవితంలో ప్రమాదంలో పడుతుంది. కానీ ఇప్పటికే వృత్తి నిపుణులుగా ఉన్నవారికి వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు రిస్క్‌లో పడతాయి. ఏదైనా కీలక సమాచారం లీకైతే.. వీసా వచ్చినా ఉద్యోగం పోవచ్చు. ఇలాంటి సున్నితాంశాల్ని పరిగణనలోకి తీసుకోకుండా ట్రంప్ యంత్రాంగం గుడ్డిగా వ్యవహరిస్తోందనే విమర్శలు చెబుతున్నారు. చివరకు కోర్టు కేసుల్ని కూడా లెక్కచేయకుండా మొండిగా ముందుకెళ్తున్నారు ట్రంప్.

మొన్నటివరకు విద్యార్థి వీసాలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్.. ఇప్పుడు ఉద్యోగ వీసాలపై పడ్డారు. ఏతావాతా వీసా అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. మాకొద్దీ అమెరికా అనుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఏం చేసైనా సరే అమెరికన్లకు ఉద్యోగాలిప్పించాలని ట్రంప్ కంకణం కట్టుకుంటున్నారు. అందుకోసం అమెరికా కంపెనీలు రిస్క్‌లో పడ్డా.. దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సిందేనని దబాయిస్తున్నారు. దీంతో ట్రంప్ ఉన్నంతకాలం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తప్పవని మరోసారి తేలిపోయింది.

వీసాల విషయంలో ట్రంప్ తీరును అమెరికా కాంగ్రెస్ సైతం తప్పుబడుతోంది. విదేశీవ్యవహారాలు చూసే సభ్యులు ఇప్పటికే సెనేట్‌లో తమ అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ పనిగట్టుకుని శాడిజం ప్రదర్శిస్తున్నారని, అది అంతిమంగా అమెరికాకే నష్టం చేస్తుందని వారు మొత్తుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఎవరి మాటా వినటానికి సిద్ధంగా లేరు. పైగా ఈ ప్రక్రియకు ఎక్కడా ఆటంకం కలగకుండా అవసరమైతే కొత్త చట్టాలు చేయాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. చివరకు మొన్నటివరకు ట్రంప్ కు క్లోజ్‌ ఫ్రెండ్‌గా ఉన్న ఎలన్ మస్క్‌ కూడా వీసాలపై ట్రంప్ నిర్ణయాల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం అసలు ఇదో ఇష్యూనే కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

విద్యార్థి వీసాలపై కాఠిన్యంతో.. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులు తగ్గారు. అదే బాటలో హెచ్‌వన్‌బీ వీసాలపై ఉక్కుపాదం మోపితే.. అమెరికా వెళ్లే భారతీయ నిపుణులు కూడా తగ్గుతారనేది ట్రంప్ అంచనా. ఇందుకోసమో లేనిపోని రూల్స్ పెడుతున్నారనేది బహిరంగ రహస్యం. ట్రంప్ పైకి చెప్పడం లేదు కానీ.. ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం.. ముఖ్యంగా వీసాల విషయంలో కచ్చితంగా టార్గెట్ భారత్ అని వైట్ హౌస్ వర్గాలు కూడా హింటిస్తున్నాయి. ఇటు భారత్ సర్కారు కూడా ట్రంప్ ధోరణిని గమనిస్తోంది. వీలైనంత వరకు ప్రత్యామ్నాయాలు కూడా చూసుకోవాలని, ఎప్పటికైనా అమెరికాకు భారతీయ నిపుణులే దిక్కవుతారని భావిస్తోంది. సరిగ్గా హెచ్‌వన్‌బీ వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన రోజే.. గోల్డ్ కార్డ్ అమ్మకాలు ప్రారంభించారు ట్రంప్. ఓ మిలియన్ డాలర్లు చెల్లిస్తే.. అమెరికాలో శాశ్వత నివాసం ఉండొచ్చని ఊరిస్తున్నారు. ఈ ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే గోల్డ్‌ కార్డు ప్రకటించారు. ఇప్పుడు ఈ కార్డుల విక్రయాలను ప్రారంభించారు. ఈ విధానంలో 1 మిలియన్‌ డాలర్లు చెల్లించి అగ్రరాజ్యంలో నివాసం పొందే అవకాశం పొందవచ్చు. ఈ గోల్డ్‌ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశారు. నిజానికి 1990లోనే విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చారు. అయితే, ఈ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్‌ చెప్పారు. దీని స్థానంలోనే గోల్డ్‌ కార్డును ప్రకటించారు. ఈ గోల్డ్‌ కార్డు కోసం వ్యక్తులు 1 మిలియన్‌ డాలర్లు చెల్లించాలి. అలాగే కంపెనీలు తమ ప్రతిభావంతులను ఇక్కడ ఉంచేందుకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలి.

మన దేశంలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయం. భారత్‌, చైనా, యూరప్‌ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు అగ్రరాజ్యంలోనే ఉండొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాజా కార్యక్రమంతో అమెరికా ఖజానాకు బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చి పడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ గోల్డ్ కార్డు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీనికి త్వరలో ఉన్నతస్థాయి ప్లాటినం కార్డ్ హామీ ఇస్తామని కూడా ప్రకటించారు

ప్రాథమికంగా చూస్తే గోల్డ్ కార్డ్‌ గ్రీన్ కార్డ్ లాంటిదే, కానీ దానికంటే చాలా మెరుగైనదని ట్రంప్ చెబుతున్నారు. ఈ కొత్త వీసా విధానం వల్ల కంపెనీలు నైపుణ్యం గల మానవ వనరులను తీసుకోవడం వల్ల వాటికి స్థిరత్వం వస్తుందని అంటున్నారు. . ఈ విధానం ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆదాయం రావడంతోపాటు.. అర్హత కలిగిన ఉద్యోగులు 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని ట్రంప్ యంత్రాంగం చెబుతోంది.

ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని.. అలా వచ్చిన డబ్బును దేశ అభివృద్ధికి ఉపయోగిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా కంపెనీలు ఉద్యోగిని నియమించుకున్న తర్వాత.. ప్రభుత్వం నిర్వహించే పూర్తి స్థాయి తనిఖీ ప్రక్రియకు 15 వేల డాలర్లు ఖర్చవుతుంది. ఈ తనిఖీ ద్వారా ఆ ఉద్యోగి కచ్చితంగా అమెరికాలో ఉండేందుకు అర్హులేనా అని నిర్ధారిస్తాయని తెలిపారు. ఈ గోల్డ్ కార్డ్ పొందిన ఉద్యోగికి 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆ తర్వాత.. కంపెనీలు అదే కార్డుపై మరో విదేశీ ఉద్యోగిని నియమించుకునే అవకాశం కల్పించారు.

ఈ గోల్డ్ కార్డ్.. అమెరికాలో శాశ్వత నివాసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కంటే ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. సాధారణ గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు అమెరికన్ కంటే తక్కువ సంపాదిస్తున్నారని.. అంతేకాకుండా ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఆధారపడే అవకాశం ఉంది. అయితే ట్రంప్ గోల్డ్ కార్డ్ ద్వారా పాత వీసా కోటాల్లో కేవలం ఉత్తమ వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. ఈ విధానం అమెరికాను తిరిగి గొప్పగా మార్చడంలో సహాయపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ వ్యక్తుల రాకతో.. అమెరికా ఖజానాపై భారం తగ్గి.. మిగులు నిధుల్ని అమెరికా పౌరుల కోసం ఖర్చుపెట్టే వెసులుబాటు వస్తుందనే ఆలోచన కూడా ఉంది.

గతంలో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా మాదిరిగా కాకుండా.. ఈ గోల్డ్ కార్డ్ పొందేవారికి అమెరికాలో తప్పనిసరిగా ఉద్యోగాలను సృష్టించాలనే నిబంధన లేదు. ఇది పెట్టుబడిదారులకు అతిపెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. దరఖాస్తుదారులు గోల్డ్ కార్డ్ కోసం గిఫ్ట్ రూపంలో చెల్లించే మెుత్తం తిరిగి వెనక్కి రాదు. దరఖాస్తు తిరస్కరించినా లేదా తర్వాత వీసా రద్దైపోయినా ఈ సొమ్ము చిల్లిగవ్వ కూడా వెనక్కి ఇవ్వదు అమెరికా. ఈ కార్యక్రమం కేవలం ధనవంతులు లేదా అత్యధిక నైపుణ్యం కలిగిన నిపుణులకే పరిమితం, ఎందుకంటే దరఖాస్తుదారులు EB-1 లేదా EB-2 వంటి ఇప్పటికే ఉన్న మెరిట్ ఆధారిత వీసా ప్రమాణాలను కూడా పాటించాల్సి ఉంది. అయితే ఇంత ఖర్చు చేసి అమెరికా వెళ్లేవారు ఎంతమందో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

అఇప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈబీ-5 వీసాల రుసుము కట్టడానికి కాస్త అప్పు చేయటానికైనా సిద్ధపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గోల్డ్ కార్డ్ వీసాల పేరుతో తెచ్చిన వాటికి ఫిక్స్ చేసిన రుసుము.. చాలా మందికి అందని మానిపండు అనడంలో సందేహం లేదు. బాగా స్థిరపడటానికి అమెరికా రావడం కాదు.. అమెరికా వచ్చేవారు అన్నిరకాలుగా సెటిలై ఉండాలనేది ట్రంప్ లక్ష్యంగా ఉంది.

గోల్డ్‌ కార్డుతో అమెరికాకు వచ్చినవారు మరింత సంపన్నులవుతారు. వ్యాపారాల్లో విజయవంతమవుతారు. బాగా డబ్బు ఖర్చు చేస్తారు. భారీగా పన్నులు చెల్లిస్తారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని కోటికి చేర్చాలనేది ప్లాన్. గోల్డ్‌ కార్డు వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్‌ వెల్లడించలేదు. దీనిని రష్యాకు చెందిన కుబేరులకూ విక్రయించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో మాత్రం దేశ భద్రత గురించి ట్రంప్ కు పట్టింపు లేకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి.

ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాలు ప్రధానంగా ఇండియా, చైనా, గల్ఫ్ దేశాల బిలియనీర్లను లక్ష్యంగా చేసుకుంటాయనే విశ్లేషణలున్నాయి. అమెరికా మోజున్నవారు కాస్త ఎక్కువ ఖర్చు చేసైనా వీసాలు కొనే ప్రయత్నం చేస్తారని ట్రంప్ అంచనా వేస్తున్నారు. మరి ట్రంప్ ప్లాన్లు ఎంతవరకు వర్కవుట్ అవుతాయనేది చూడాల్సిఉంది. ట్రంప్ తాజా నిర్ణయం కారణంగా గ్రీన్ కార్డ్ వెయిట్‌లిస్ట్‌లో చిక్కుకున్న లక్షలాది మంది ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. సంపన్న విదేశీయులకు గోల్డెన్ కార్డ్ ద్వారా పౌరసత్వాన్ని అందించేందుకు కొత్త మార్గాన్ని తీసుకురావడం అంత మంచి నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. కొత్త వీసా స్కీమ్ అమెరికా శ్రామికశక్తికి, సమాజానికి వెన్నెముకగా నిలిచిన వ్యక్తులను ఇది పక్కన పెట్టే ప్రమాదం ఉంది. చాలా మంది ఇప్పటికే 50 ఏళ్లకు పైగా సాగే వెయిట్‌లిస్ట్‌లో గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నారు. ఇప్పటికే వీరు తమ విలువను నిరూపించుకుని, పన్నులు చెల్లిస్తూ, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ అమెరికా గడ్డపై జీవిస్తున్నారు. ట్రంప్ చర్యలు డబ్బు ముసుగులో దురహంకారంగా విమర్శలు వస్తున్నాయి.

Exit mobile version