NTV Telugu Site icon

Sri Lanka : శ్రీలంకలో కల్లోలం, శృతిమించిన ఆందోళనలు…!

Sri Lanka

Sri Lanka

శ్రీలంక సంక్షోభం మ‌రింత‌గా ముదురుతోంది. ఒక్కొక్కరుగా నాయ‌కులు రాజీనామాలు చేస్తున్నప్పటికీ.. ప్రజ‌ల ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు ఏమాత్రం త‌గ్గడం లేదు. నిర‌స‌న‌కారులు నేత‌ల ఇళ్లను, వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఆందోళ‌న‌లు చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే అనేక మంది నాయ‌కులు అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు విదేశాల‌కు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని ముందుగానే గుర్తించిన విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు ఆయ‌న‌ను అడ్డుకున్నారు.

ఈ నెల 13న అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారనీ.. ఆ తర్వాత అన్ని పార్టీల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పీకర్ చెప్పారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈనెల 18న నామినేషన్లు స్వీకరిస్తామని 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పారు. ఇవ్వన్ని ఈనెల 15న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తున్నట్లు చెప్పారు స్పీకర్.

శ్రీలంక అధ్యక్షుడి సోద‌రుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే సంక్షోభంలో ఉన్న దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ విమానాశ్రయ అధికారులు, ప్రయాణీకులు అతన్ని గుర్తించి వెళ్లకుండా అడ్డుకున్నారు. కొలంబోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయల్దేరుతున్న విమానంలో ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ప్రయాణికులు అతనిపై నిరసన వ్యక్తం చేయడంతో దుబాయ్ వెళ్లే ఆయ‌న ప్రయ‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. విమానాశ్రయంలో బసిల్ రాజపక్సే ఉండటం పట్ల ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించవద్దని డిమాండ్ చేశారు.

VIP డిపార్చర్ లాంజ్‌లో మాజీ మంత్రికి సేవ చేయడానికి తమ సభ్యులు నిరాకరించారని శ్రీలంక ఇమ్మిగ్రేషన్-ఎమిగ్రేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ పోస్ట్‌లను విడిచిపెట్టి, నిష్క్రమణ కోసం అతన్ని క్లియర్ చేయడానికి నిరాకరించిన తర్వాత బాసిల్ రాజపక్స లాంజ్‌లో వేచి ఉన్నట్లు ట్విట్టర్‌లో విస్తృతంగా పంచుకున్న చిత్రాలు చూపించాయి. రాజపక్సే అమెరికా పాస్‌పోర్ట్‌ను కూడా కలిగి ఉన్నందున యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి.

శ్రీలంకలో ఇంధనం, ఆహారం, ఇతర నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతుండ‌టంతో.. ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో 71 ఏళ్ల బాసిల్ రాజపక్సే ఏప్రిల్ ప్రారంభంలో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్‌లో ఆయన పార్లమెంటులో తన స్థానాన్ని వదులుకున్నారు. అయితే, నేటి శ్రీలంక ప‌రిస్థితికి శక్తివంతమైన పాలక కుటుంబం పేలవమైన ఆర్థిక నిర్వహణ కారణమ‌ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర‌స‌న‌లకు దిగారు. మాజీ ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయ‌గా, అధ్య‌క్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్య‌క్ష భ‌వ‌నాన్ని నిర‌స‌న‌కారులు స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడు అజ్ఙాతంలోకి వెళ్లారు. రోజురోజుకూ శ్రీలంక ఆర్థిక ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయి.

ప్రజల ఆగ్రహాన్ని గమనించిన ఆ దేశ అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయారు. ప్రధాన మంత్రి ఇంటికి సైతం ఆందోళనకారులు నిప్పుు పెట్టారు. ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గత నెలలోనే ప్రధాన మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రకటించారు. రుణాలకు వడ్డీలు సైతం కట్టలేని పరిస్థితి. ఆహారం, ఇంధన కొనుగోలుకు సైతం డబ్బులు లేని పరిస్థితికి ఆ దేశం చేరుకుంది. భారత్‌, చైనా, ఐఎంఎఫ్‌ను సహాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రి కోరారు. ప్రధాన మంత్రిగా మే నెలలో బాధ్యతలు స్వీకరించిన రణిల్ విక్రమ సింఘే, అధ్యక్షుడు గొటబాయి రాజపక్సే పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. ప్రజాఆగ్రహంతో పదవుల నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు.

శ్రీలంకకు 51 బిలియన్‌ డాలర్ల రుణాలు ఉన్నాయి. వాటిపై వడ్డీ సైతం చెల్లించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు టూరిజం. టెర్రర్‌ దాడులు, కోవిడ్‌ మూలంగా ఈ రంగం పూర్తిగా కుదేలైంది. దేశ కరెన్సీ విలువ 80 శాతం తగ్గిపోయింది. దీంతో ఎగుమతుల కోసం ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం 57 శాతానికి చేరుకుంది. సామాన్యులు ఏదీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో వాటి ధరలు పెరిగాయి. కనీసం గ్యాసోలిన్‌, పాలు, వంట గ్యాస్‌ వంటి నిత్యావసరాల దిగుమతికి కూడా డబ్బులు చెల్లించని స్థితి ఏర్పడింది.

శ్రీలంకలో రాజకీయ అవినీతి అంతులేకుండా పెరిగిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. దేశ సంపద అవినీతి మూలంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఆ దేశ ఆర్థిక మంత్రి ఇలా అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అధికారాలన్నీ వీరి చేతుల్లోనే ఉన్నాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరులన్నీ వీరి శాఖల కిందే ఉన్నాయి. ఈ కుటుంబ అంతులేని అవినీతి మూలంగానే దేశం ఇలాంటి దారుణ పరిస్థితికి చేరిందని ఇప్పుడు ఆర్థిక వేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. వీరు తీసుకున్న పలు అనాలోచిత నిర్ణయాలు లంక కొంప ముంచాయి.

శ్రీలంకలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆ దేశ ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల నేడు కనీసం తిండికి కూడాఇబ్బంది పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ప్రోగ్రాం ప్రకారం శ్రీలంకలో 10 కుటుంబాల్లో 9 ఒక పూట భోజనాన్ని చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 30 లక్షల మంది అత్యవసర మానవతా సాయం కింద ఆహారం సరఫరా పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాలని భావిస్తున్నారు. పాస్‌ పోర్టుల కోసం పెరుగుతున్న దరఖాస్తులే ఇందుకు నిదర్శనమని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు అధనంగా మూడు నెలలు సెలవు ఇచ్చారు. వీరంతా గ్రామాలకు వెళ్లి ఆహారధాన్యాలు పండించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అధ్యక్షుడు గొటబయ రాజపక్స బుధవారం అధికారికంగా రాజీనామా చేయనుండటంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ప్రతిపక్ష నాయకుడు, ఎస్‌జేబీ పార్టీకి చెందిన సుజిత్ ప్రేమదాస కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక ప్రజాగ్రహంతో రగులుతోంది. మహీంద రాజపక్స పలాయనం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసిఘే సైతం రాజీనామా చేయడం, గత వారం అధ్యక్షుడు గొటబయ కూడా దేశం విడిచి పారిపోవడంతో వారి అధికారిక భవనాలను నిరసనకారులు స్వాధీనం చేసుకున్నారు. దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకునే అవకాశాలున్నా అందుకు సైన్యం నిరాకరిస్తుండటంతో.. రాజకీయ పరిష్కారమే ఏకైక ఆప్షన్ గా మిగిలింది. దీంతో అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రతిపక్ష నేత సుజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు.

సుజిత్ ప్రేమదాసను అధ్యక్ష పదవికి బరిలో దింపాలని ఎస్‌జేబీ ఇప్పటికే తీర్మానించింది. అయితే, ఆయన పార్టీకి కేవలం 54 ఎంపీ సీట్లే ఉన్నాయి. మొత్తం 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంటులో మెజార్టీ మార్కు 113 కావడంతో ప్రేమదాసకు ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి. మద్దతుపై మిత్రపక్షాలతో చర్చించామని ఎస్‌జేబీ నేత తెలిపారు. తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని.. శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను ముక్కుసూటిగా అమలు చేస్తామని సుజిత్ ప్రేమదాస చెప్పారు. ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇప్పటికే రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం సుజిత్‌కు కలిసి వచ్చే అంశం. జులై 20న పార్లమెంటులో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు స్పీకర్‌ మహీంద యాపా అబేవర్ధన ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అంతకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలు కలిసి తీసుకున్నారు.

మొదట అన్ని పార్టీలు కలిసి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒక ప్రణాళికను ఆమోదించాలి. ఆ తర్వాత దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలిగే పక్కా ప్రణాళిక లేకపోతే, సాయం చేసేందుకు ఐఎంఎఫ్ ముందుకు రాకపోవచ్చు. శ్రీలంకలో రాజకీయ పరిస్థితులు మెరుగుపడితే గానీ, ఐఎంఎఫ్ కూడా ఏమీ చేయలేదు. అందుకే ఇక్కడి అన్ని పార్టీలు ముందు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించి, ఆ తర్వాత ఆర్థిక ప్రణాళికతో ముందుకు రావాలి.

శ్రీలంకలో ప్రజలు రోజూ పొద్దున మేల్కొనేసరికే అలిసిపోతున్నారు. దేశంలో ఇంధనం కరువు తీవ్రంగా ఉండడంతో కరెంట్ కోతలు అర్థరాత్రుల వరకూ కొనసాగుతున్నాయి. ఉక్కపోత, వేడికి నిద్ర కరువైపోతోంది. నెలలు దాటినా ఇదే పరిస్థితి. ఇంట్లో పిల్లా పాపలు సహా అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఏది ఎలా ఉన్నా కాలం ఆగిపోదు. రోజు గడవాల్సిందే. నిత్యావసర వస్తువుల ధరలు గత నెల కన్నా రెట్టింపు అయ్యాయి. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతోందే తప్ప ఆశ చిగురించట్లేదు. ఉదయం లేచి ఏదో తిన్నామన్నట్టు తిని లేదా అసలు తినకుండా బయటకు పరుగులు పెట్టడం.. అసలు యుద్ధం ఇక్కడ మొదలవుతుంది. రవాణా దొరకదు.నగరాల్లో ఇంధనం కోసం క్యూలు కట్టడం ఆగలేదు. క్యూల పొడవు పెరుగుతూనే ఉంది. ఊరి చివర్ల వరకు విస్తరిస్తోంది. రోడ్లన్నీ గందరగోళంగా ఉన్నాయి. జీవితాలు నలిగిపోతున్నాయి. ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ఎనిమిది లీటర్లు పెట్రోలు పోయించుకోడానికి రోజుల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు. ఎనిమిది లీటర్లతో బహుశా ఓ రెండు రోజులు గడుస్తుంది. మళ్లీ క్యూ కట్టాల్సిందే. బట్టలు, తలగడలు, నీళ్లు తెచ్చుకుని క్యూలలోనే జీవితం గడుపుతున్నారు. శ్రీలంకలో ప్రజలే ప్రజలకు సాయం అందిస్తున్నారు. కొన్ని రోజులు మధ్య, ఎగువ తరగతి ప్రజలు తమ ఇళ్ల పక్కనే క్యూలలో నిల్చున్నవారికి భోజనం పొట్లాలు, కూల్ డ్రింకులు అందించేవారు.వకానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం, వంట గ్యాస్, బట్టలు, రవాణా, విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శ్రీలంక రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో, డబ్బున్నవారికి కూడా కష్టాలు మొదలయ్యాయి.

శ్రామిక వర్గాల్లో ప్రజలు కట్టెల పొయ్యి వాడడం మొదలుపెట్టారు. కడుపు నింపుకోడానికి రోజూ ఇంత అన్నం, కొబ్బరి పచ్చడి వండుకోగలిగితే చాలన్నట్టు ఉంది వాళ్ల పరిస్థితి. పప్పు వండుకోవడానికి లేదు. పప్పుధాన్యాల ధరలు సాధారణ ప్రజలు అందుకునేలా లేవు. మాంసం సంగతి మరచిపోవచ్చు. ధర గతం కన్నా మూడు రెట్లు పెరిగింది. ఒకప్పుడు తాజా చేపలు చౌకగా దొరికేవి. కానీ, ఇప్పుడు డీజిల్ కొరత కారణంగా పడవలు సముద్రంలోకి వెళ్లట్లేదు. సముద్రంలోకి వెళ్లగలిగే మత్స్యకారులు తమ చేపలను హొటళ్లు, రెస్టారెంట్లకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. సాధారణ ప్రజలకు ఆ ధరలు అందుకోవడం గగనం. శ్రీలంకలో ఇప్పుడు చాలామంది పిల్లలకు పౌష్టికాహారం అందట్లేదు. చంటిపిల్లలకు పాల పొడి కూడా దొరకట్లేదు.

దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ నుంచి కింది స్థాయి వరకు ప్రతి స్థాయిలోనూ తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. అన్ని వర్గాల ప్రజలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం నెలల తరబడి కొనసాగుతోంది. ఇదిలాగే ఉంటే, దేశంలో పోషకాహార లోపం, మానవతా సంక్షోభం తలెత్తే పరిస్థితులు రావచ్చని ఐక్యరాక్య సమితి హెచ్చరించింది. లంకలో బస్సులు, లోకల్ ట్రైన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఫుట్‌బోర్డులు మీద ఒంటి కాలిపై నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. లోపల కూర్చున్నవారికి గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దశాబ్దాలుగా శ్రీలంక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో తగినన్ని పెట్టుబడులు పెట్టడంలో విఫలమైంది. మరోపక్క బస్సు, ఆటో డ్రైవర్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి సంపన్నులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రాజకీయ, ఆర్థిక సంపన్నులకు సాధారణ ప్రజల పట్ల ఉన్న ఈ చిన్నచూపే దేశాన్ని మోకాళ్లపైకి ఈడ్చుకొచ్చిందనే అభిప్రాయం బలపడుతోంది.

దిగువ మధ్య తరగతి ప్రజలు, శ్రామికులే వర్గాలే ఈ సంక్షోభం పెను భారాన్ని మోస్తున్నాయి. దీనివల్ల ఎక్కువ అతలాకుతలం అయింది వాళ్ల జీవితాలే. ప్రయివేటు ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్నంత బాగా కాదుగానీ నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము కాటుకు మందు దొరకలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలను రక్షించే మందుల కొరత తీవ్రంగా ఉంది. మే నెలలో రెండురోజుల పసికందు పచ్చకామెర్లతో చనిపోయింది. పాపను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పాప తల్లిడండ్రులకు ఆటో దొరకలేదు. దాంతో, పాప చనిపోయింది. 2019లో శ్రీలంక అవలంబించిన ఆర్థిక విధానమే ఈ పరిస్థితికి కారణమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ ఏడాది భారీగా పన్నులు తగ్గించింది. కార్పొరేట్, ప్రొఫెషనల్స్ లాబీయింగ్ చేశారు. పన్ను తగ్గింపులను ప్రోత్సహించారు. దాంతో, శ్రీలంక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిది. దేశాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చింది.

బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఇంధనం దొరుకుతోంది. పెద్ద పెద్ద ప్రయివేటు వాహనాదరులు, ఇంట్లో విద్యుత్ జనరేటర్లు ఉన్నవాళ్లు బ్లాక్ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. దిగువ తరగతుల వారు సైకిళ్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మారకపు విలువ పడిపోవడంతో అదీ అసాధ్యమైంది. శ్రీలంకలో చమురు నిల్వలు దాదాపు పూర్తిగా అడుగంటాయి.

భారీ విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తిరగబడ్డారు. మార్చి నెలలో భారీ నిరసనలు చేపట్టారు. మండు వేసవిలో రోజుకు 13 గంటలు కరెంటు కోతతో ప్రజలు బాగా అలిసిపోయారు. ఆ అలసట కోపాన్ని రేకెత్తించింది. దాంతో, కొలొంబోలో దేశాధ్యక్షుడి ఇంటి ముందు వేలాదిమంది నిరసనలకు దిగారు. దేశంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, పోలీసులు నదీశ్‌ను చావబాదారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎంతోమంది పోలీసుల చేతుల్లో హింసకు గురయ్యారు. మిలటరీలోని అత్యున్నత స్థాయి వర్గాలకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స అత్యంత సన్నిహితుడు. ఆయన మాజీ డిఫెన్స్ సెక్రటరీ కావడంతో రక్షణ రంగంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో, అసమ్మతి తెలిపినవారంతా రాజ్య హింసకు బలవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. శాంతియుతంగా నిరసనలు జరిపినవారిని కూడా తుపాకీ కాల్పులతో భయపెట్టారు.
చిన్నపిల్లలు ఉన్న చోట విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిత్యావసర సరుకుల కోసం క్యూలలో నిల్చున్నవారు ఏ మాత్రం అసహనం ప్రదర్శించినా పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నారు. పౌరులు నిరసనల్లో భాగంగా రాళ్లు విసిరినప్పుడు తమకు దెబ్బలు తగిలాయని పోలీసులు చెబుతున్నారు. కానీ, అక్కడ పౌరులు ప్రాణాలే కోల్పోతున్నారు. దెబ్బలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నేతలు దేశ ప్రజల ఇక్కట్ల పట్ల సానుభూతి తెలుపుతూ, వారి అగచాట్లను ఫొటోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. మార్పు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
శ్రీలంక పౌరులను మిడిల్ ఈస్ట్ దేశాలకు పనిమనుషులుగా, డ్రైవర్లు, మెకానిక్కులుగా పంపాలనే విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. వీళ్లు అక్కడ పనిచేసి సంపాదించిన డబ్బులను స్వదేశానికి పంపిస్తారని ఆశ. ఇది పౌరుల జీవితాలను మరింత దుర్భరం చేస్తుంది. స్థానికంగా పని దొరకక విదేశాలకు వలస వెళ్లేవారు మరింత గందరగోళంలో పడతారు. కుటుంబాలను విడిచిపెట్టి, సరైన రక్షణ, బాగోగులు చూసుకునే ఏజెన్సీ లేకుండా విదేశాలకు వెళ్లడం, వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. శ్రీలంక తీసుకొచ్చిన ఈ విధానాన్ని పిశాచ అవస్థగా పిలుస్తున్నారు నిపుణులు.

ప్రస్తుత పరిస్థితుల్లో సాయంత్రం అయ్యేసరికి ప్రజలు పూర్తిగా అలిసిపోతున్నారు. పొద్దున్న లేచి నిత్యావసరాలకు ఒక యుద్ధం, ఆఫీసులకు వెళ్లడానికి మరో పోరాటం, సరుకుల కోసం క్యూలలో రోజుల తరబడి నిల్చోవాల్సి రావడం. దాంతో, పూర్తిగా నిస్సత్తువ ఆవహిస్తోంది. పోనీ, రాత్రి కంటి నిండా నిద్రపోదామంటే కరెంట్ కోతలు, ఉక్కపోత. చాలీచాలని తిండి. కుటుంబానికి సరిపడా ఆహారం వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో పెద్దవాళ్లకు మందులు లేవు. పిల్లలకు సరైన చదువుల్లేవు.
ప్రస్తుతం స్కూళ్లు మూతబడ్డాయి. పిల్లలను స్కూలు తీసుకెళ్లాడానికి రవాణా సదుపాయాలు లేవు. ఆన్‌లైన్‌లో క్లాసులు జరుగుతున్నాయి. కరోనాతో మొదలై మూడేళ్లుగా ఆన్‌లైన్ పాఠాలే గతి.

శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఫోన్ చేసి డబ్బులు సర్దమని అడుగుతారు. పోలీసులు, మిలటరీ ఉన్న కాస్త ఆశలనూ తుడిచిపెట్టేస్తారు. కానీ, ఇంకా ఊపిరి పీల్చుకోగలుగుతున్నందుకు సంతోషిస్తున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ల పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది.

గత వారం, ఓ తల్లి తన పిల్లలిద్దరితో పాటు నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది. రోజూ మనసు ముక్కలైపోయే వార్త వినిపిస్తూనే ఉంటుంది. బతుకు దిన దిన గండంగా మారింది. ఆర్థికంగా కుదేలై తీవ్ర చమురు కొరత ఎదుర్కొంటున్న శ్రీలంక (Sri lanka Crisis).. దక్షిణ భారతంలో ఉన్న విమానాశ్రయాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారి సంక్షోభం వీరికి అవకాశంగా మారింది. శ్రీలంకలో చమురు కొరత ఎదుర్కొంటున్న విమానాలు దక్షిణాదిలో ఉన్న తిరువనంతపురం, కోచి, చెన్నై విమానాశ్రయాలపై ఆధారపడుతుండడమే దీనికి కారణం.

శ్రీలంకను తీవ్రమైన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దక్షిణ ఆసియాలోని మరికొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు ఇలానే కనిపిస్తోంది. ఈ సంక్షోభాలు మరింత ముదరకుండా అడ్డుకునే సామర్థ్యం ఆయా దేశాల్లోని రాజకీయ నాయకులకు ఉందా?

వరుసగా భారత్ పొరుగున ఉన్న దేశాల్లో రాజకీయ సంక్షోభాలతోపాటు ఆర్థిక పరిస్థితులు కూడా ఇంతలా దిగజారడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. శ్రీలంకను విఫలమైన దేశంగా మనం ముందెన్నడూ ఊహించుకోలేదు. కొన్ని సంవత్సరాల ముందువరకు శ్రీలంక ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉండేది. సామాజిక అంశాల్లోనూ శ్రీలంక మరీ అంత వెనుకబడి లేదు. మూడేళ్ల క్రితం శ్రీలంకను వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు అభివర్ణించాయి. కానీ పరిస్థితులు చాలా వేగంగా తారుమారయ్యాయి. దీనికి కారణం దేశ రాజకీయ నాయకుల వైఫల్యమనే చెప్పుకోవాలి. సంక్షోభం ముదరకుండా చూడటంలో అక్కడి నాయకులు దారుణంగా విఫలమయ్యారు.

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు దక్షిణాసియాలోని చాలా దేశాల్లో ఒకటి తర్వాత ఒకటిగా బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌లోని ఆర్థిక సంక్షోభం కావొచ్చు.. నేపాల్‌లోని రాజ్యాంగ సంక్షోభం కావొచ్చు.. ఇలాంటి సంక్షోభాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ప్రస్తుతం శ్రీలంకలో కనిపిస్తున్న ప్రజా ఆగ్రహం నేడో రేపో పాకిస్తాన్ లేదా నేపాల్‌లోనూ కనిపించవచ్చు. ఇలాంటి వాటి వల్ల దక్షిణాసియా భద్రతకే పెను ముప్పు పొంచి వుంది.

ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో పరిస్థితులు ఇంతలా దిగజారే సూచనలు కనిపించడం లేదు. కానీ, నేపాల్‌లో మాత్రం కాస్త అనుమానమే. అక్కడి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను అడ్డుకోగలదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంక తరహాలో ఆర్థిక పరిస్థితులు చేజారితే నేపాల్ నాయకత్వం అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా రాజకీయ నాయకుల మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు కలిసివస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయి. వీటివల్ల దక్షిణాసియాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్.. ఈ మూడు దేశాలకూ చైనాతో దృఢమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. శ్రీలంక విషయంలో చైనా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. శ్రీలంకకు చైనా భారీగా రుణాలను ఇచ్చింది. మరోవైపు పెట్టుబడులు కూడా పెద్దయెత్తున పెట్టింది. ఇటీవల కాలంలో శ్రీలంకలో చైనా ప్రాబల్యం బాగానే పెరిగింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి పూర్తిగా చైనానే కారణమని చెప్పలేం. అయితే, దీనిలో చైనాకు కూడా ప్రధాన పాత్ర ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చైనా ముందుంటుంది. రాజపక్స కుటుంబానికి చైనా చాలా రుణాలు ఇచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందుకు వెళ్లింది. రాజపక్స కుటుంబంపైనే ప్రధానంగా దృష్టిపెట్టింది. సామాన్యులను అసలు పట్టించుకోలేదు. ఒకవైపు రాజపక్ష కుటుంబ ఆస్తులు విపరీతంగా పెరుగుతుంటే… సామాన్యుల ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తూ వచ్చింది.

శ్రీలంకకు నిజంగా సాయం అవసరమైనప్పుడు.. చైనా ఎక్కడా కనిపించలేదు. గత ఆరు నెలలుగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనం కావడం మొదలైంది. కోవిడ్-19తో మొదలైన సంక్షోభం నుంచి శ్రీలంక ఆర్థిక పరిస్థితి కోలుకోవడం కష్టమైంది. దీని ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా కనిపించింది. అయితే, ఈ సమయంలో శ్రీలంకను ఆదుకోవడానికి చైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. శ్రీలంక సంక్షోభానికి చైనా ఎలా దూరం జరిగిందో మిగతా దేశాలు చూసి పాఠాలు నేర్చుకోవాలి.
వ్యాపారాలు చేయడం, లాభాలు అర్జించడంలో చైనా ముందుంటుంది. కానీ, సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో మాత్రం చివరన ఉంటోంది. ప్రస్తుతం శ్రీలంకను గట్టెక్కించేందుకు ఐఎంఎఫ్తోపాటు భారత్ కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, చైనా మాత్రం ముందుకు రావడం లేదు.

ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సహాయసహకారాలు అందిస్తోంది. శ్రీలంకకు రుణ సౌకర్యం కింద భారత్ 44 వేల టన్నులకు పైగా యూరియాను అందించింది. శ్రీలంక రైతులకు మద్దతు, ఆహార భద్రత కోసం ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సహాయం అందించినట్లు భారత హైకమిషన్ తెలిపింది. భారతదేశం నుండి వచ్చే సహాయం శ్రీలంక రైతులతో సహా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి, దేశ పౌరుల ఆహార భద్రత కోసం ప్రయత్నాలను ప్రోత్సహించడానికి నిరంతర నిబద్ధతకు సంకేతమని హైకమిషనర్ చెప్పారు. విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా, శ్రీలంక తనకు అవసరమైన వస్తువులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నదని తెలిపారు. శ్రీలంకకు భారత్ అనేక విధాలుగా సాయం చేసింది. అయితే, ఇంధన కొనుగోలు కోసం క్రెడిట్ లైన్‌ను పెంచడానికి భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా, ఎరువుల దిగుమతి కోసం శ్రీలంకకు 55 మిలియన్ డాలర్ల రుణ కాలాన్ని భారత్ పొడిగించింది. శ్రీలంక ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో యూరియాను కొనుగోలు చేసేందుకు 55 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వాలని శ్రీలంక భారత్‌కు విజ్ఞప్తి చేసింది. శ్రీలంక ఈ విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని భారత్ సుమారు రూ. 425 కోట్లు క్రెడిట్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.

శ్రీలంకలో రాజుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది.దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యంపై నిరసనలు శ్రీలంకలో తీవ్రరూపం దాల్చిన కొన్ని గంటల తర్వాత, ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. భారత సముద్రంలో అదనపు హోవర్‌క్రాఫ్ట్‌లు, పెట్రోలింగ్ బోట్‌లను మోహరించారు.అక్రమ వలసదారులను నిరోధించేందుకు నిఘా పెంచామని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు.నిరసనకారులు నివాసాన్ని ముట్టడించడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. ఈ పరిణామాల తరుణంలో కోస్టల్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది.భారతదేశంలోని ఇతర ఏజెన్సీలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.రామేశ్వరం సమీపంలోని మండపం ప్రాంతంలోని కోస్ట్‌గార్డ్ హోవర్‌పోర్ట్ నిఘా కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. శ్రీలంకకు భారత్ నుంచి బలగాలు వెళ్తున్నాయనే వార్తలను రాయబార కార్యాలయం తప్పుబట్టింది. సంక్షోభం సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని చెప్పింది. కానీ ఆ దేశంలో కొనసాగుతోన్న నిరసనలను కట్టడిచేసేందుకు భారత్ బలగాలను పంపడం లేదని క్లారిటీ ఇచ్చింది. రాబోయే కొన్ని నెలల్లో భారత్ కూడా భారీగా విదేశీ రుణానికి చెల్లింపులు చేయాల్సి ఉందని, దీని కారణంగా 44 శాతం విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.