Site icon NTV Telugu

Tollywood: క్యాషియర్లుగా నిర్మాతలు.. చేజేతులా సంక్షోభం

Khel Khatam

Khel Khatam

తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్టవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజార్టీ సినిమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణవ్యయం, అధిక రెమ్యూనరేషన్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టైంది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్.. చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయాలున్నాయి.

సినిమా కళాత్మక వ్యాపారం. లాభం సంగతి చూసుకుంటూనే.. కళకు ఎక్కడా అన్యాయం జరగకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. కానీ కొంతకాలంగా టాలీవుడ్ లో పెడ ధోరణులు ప్రవేశించాయి. వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తేనే సినిమా అనే ఆర్భాటపు లెక్కలతో.. చిన్న నిర్మాతలు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా పంటి బిగువున కష్టాలు భరిస్తూ సినిమాలు తీయాల్సిన దుస్థితి. పరువు కోసం కొందరు.. సినిమాలపై ఇష్టంతో మరికొందరు.. నష్టాలు వస్తున్నా సినిమాలు తీస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో లాభాలు కళ్లజూస్తున్న నిర్మాతల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

టాలీవుడ్ సినిమాలు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. మన సినిమా స్థాయి పెరిగిందని చంకలు గుద్దుకుంటున్నారు. కొత్త మార్కెట్లు ఓపెన్ అయ్యాయని సంబరపడుతున్నారు. కానీ నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఏటా వందల సినిమాలు రిలీజయ్యే టాలీవుడ్ లో విజయాలు మాత్రం ఐదు శాతం లోపే. కానీ అడపాదడపా హిట్టవుతున్న సినిమాల గురించి ఎక్కువగా డిస్కషన్లు పెడుతున్నారు. బాహుబలి గురించి రెండేళ్లు, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల గురించి ఏడాది పాటు చెప్పుకున్నారు. అదే సమయంలో వందల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాని గురించి మాత్రం ఎవరూ మాట్లాడలేదు. ఎప్పుడో ఒక్కసారి ఓ సినిమా వెయ్యికోట్ల రూపాయలు వసూలు చేసినా.. వందల సినిమాలు అంతకు రెండు, మూడు రెట్ల మేర నష్టాలు తీసుకొస్తున్నాయి. దీంతో ఓవరాల్ గా టాలీవుడ్ నష్టాల్లోనే ఉంటోంది. తెలుగు సినిమా పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. అడపాదడపా హిట్టయ్యే సినిమాలకు మార్కెట్ పెరుగుతోందే కానీ.. సగటు తెలుగు సినిమా మార్కెట్ మాత్రం బాగా తగ్గిపోయింది. బాహుబలిని ప్రామాణికంగా తీసుకుని తెలుగు సినిమా మార్కెట్ ను అంచనా వేయడమే ప్రాథమిక తప్పిదం. అదే సగటు సినిమా మార్కెట్ చూస్తే.. అసలు విషయం తెలుస్తుంది.

Also Read:Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్

అసలు ఇన్ని మాటలెందుకు.. ఒక్కసారి సినిమా థియేటర్ల పరిస్థితి చూస్తే.. టాలీవుడ్ ఎంత దివ్యంగా వెలిగిపోతుందా తేలికగా అర్థమవుతుంది. ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఐదారు వారాలు థియేటర్లలో ఆడేవి. దీంతో మరీ లాభాలు రాకపోయినా.. పెట్టిన పెట్టుబడి అయినా తిరిగొచ్చేది. అసలిప్పుడు లాంగ్ రన్ అనే మాటే లేదు. ఎంత కొత్త సినిమా అయినా పట్టుమని పది రోజులు కాదు కదా.. ఫస్ట్ వీకెండ్ అయినా హౌస్ ఫుల్స్ తో రన్ అవడం గగనంగా మారింది. చివరకు స్టార్ హీరోల సినిమాలు కూడా హౌస్ ఫుల్ అవుతాయనే గ్యారెంటీ లేదు. ఇటీవల అడ్వాన్సుడ్ బుకింగ్స్ కూడా తీసికట్టుగా ఉన్న స్టార్ల సినిమాలు ఎక్కువగానే ఉంటున్నాయనేది బహిరంగ రహస్యమే. కానీ వాస్తవాలు ఒప్పుకోవటానికి తెలుగు సినీ పరిశ్రమకు మనసు రావడం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాల ప్రాతిపదికనే అంచనాలు వేసుకోవడం.. కొత్త సినిమా హిట్టయ్యేదాకా.. పాత హిట్ సినిమా కబుర్లు చెప్పుకోవడంతోనే సమయం గడిచిపోతోంది. అంతేకానీ చిత్తశుద్ధిగా టాలీవుడ్ బాగు కోసం ఏం చేయాలనే దిశగా ఎవరూ ఆలోచించడం లేదు.

తెలుగు సినీ పరిశ్రమలో మొదట్నుంచీ విజయాల శాతం తక్కువే. ఎన్నో లెక్కలు వేసుకుని.. ఎంతో జాగ్రత్తగా తీసే సినిమాలే ఆడతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాంటిది అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. గాల్లో లెక్కలు వేసుకుని తీసే సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదట్లో కథల ఎంపిక కోసం ఏళ్ల తరబడి చర్చలు జరిగేవి. ఒకసారి కథ తయారయ్యాక కూడా 24 విభాగాల వారి సలహాలు తీసుకునేవారు. అలా బాగా నలిగిన, మార్పులు చేర్పులు చేసిన కథనే తెరకెక్కించేవారు. అలాగే కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక ఉండేది. కాంబినేషన్ల కోసం ఆరాటం, క్రేజ్ ఉన్న నటులే ఉండాలనే జంఝాటం ఏమీ ఉండేవి కాదు. పెద్ద హీరోలు అడిగినా కూడా.. ఈ కథ మీకు సరిపడదని నిర్మాతలు, దర్శకులు నిర్మొహమాటంగా చెప్పేసేవారు. ఎందుకంటే అప్పుడు కథే హీరో. సినిమాకే సింహాసనం. నటీనటులు, మిగతా వారికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ రోజుల్లో ఓ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కితే.. దాన్ని మిగతా భాషల్లోనూ డబ్ చేసేవారు. అప్పుడు డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ డబ్బులొచ్చేవి. కొన్ని సినిమాలు నేరుగా పెట్టుబడి తేలేకపోయినా.. డబ్బింగ్ రైట్స్ తో నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. కాంబినేషన్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సినిమాపై కనీస అవగాహన లేని వారు వచ్చి నిర్మాతలైపోతున్నారు. ఇతర రంగాల్లో బాగా డబ్బు సంపాదించినవారు.. తమ సరదా తీర్చుకోవటానికో.. సినీ నిర్మాతలనిపించుకోవాలనే తాపత్రయంతోనో ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయడానికీ వెనుకాడటం లేదు. ఇక్కడే టాలీవుడ్ కు దెబ్బ పడుతోంది.

ఏ వ్యాపారం చేయాలన్నా.. మొదట ఆ వ్యాపారం గురించి ప్రాథమిక సూత్రాలు తెలియాలి. ఆ తర్వాతే అడుగు ముందుకేయాలి. అప్పుడే లాభాలు రాకున్నా.. నష్టాలు పలకరించకుండా ఉంటాయి. కాస్త అనుభవం వచ్చాక.. వ్యాపారంలో నలిగాక విస్తరణ గురించి.. కొత్త తరహా వ్యాపార సూత్రాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఏ వ్యాపారమైనా వృద్ధిలోకి వస్తుంది. అంతేకానీ అన్నప్రాసన రోజే ఆవకాయ తింటానంటే కుదరదు. వివిధ రంగాల్లో బడా పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్న వారంతా దశాబ్దాలపాటు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చినవారే. టాలీవుడ్ లో కూడా పాత తరం నిర్మాతలు ఈ సూత్రాల్ని నమ్ముకునే సినిమాలు తీసేవారు. నేల విడిచి సాము చేయకుండా.. వాస్తవ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. అందుకే అతిగా లాభాలు కళ్లజూడకపోయినా.. నష్టాలు భరించాల్సిన దుస్థితి లేకుండా గౌరవప్రదంగా నిర్మాతలుగా సుదీర్ఘకాలం కొనసాగారు. సినిమా నిర్మాతగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మూవీ మొఘల్ రామానాయుడు ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు. మరి అలా ఇప్పుడు ఎందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారనేది కీలకమైన ప్రశ్న.

మంచి సినిమా తీయాలనే కాన్సెప్ట్ పోయి.. భారీ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. మంచి సినిమా తీస్తే అదే భారీ సినిమా అవుతుందనే లాజిక్ వదిలేస్తున్నారు. ముందే భారీ సినిమా తీస్తున్నామనే భ్రాంతిలో పడిపోతున్నారు. తీరా అది రిలీజయ్యేసరికి చెత్త సినిమాగా ప్రేక్షకుడు ముద్ర వేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి అనుభవాలు ఎన్ని అయినా.. నిర్మాతల తీరు మార్చుకోవడం లేదు. హీరోల స్థాయితో సంబంధం లేకుండా అడిగినంత రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. సినిమా ఎలా తీస్తున్నారో పట్టించుకోకుండా.. డైరక్టర్ అడిగినంత ఖర్చు పెడుతున్నారు. అసలు ఫైనల్ కాపీ కూడని చూడని నిర్మాతలే కాదు.. దర్శకులూ ఉన్నారంటే నమ్మాల్సిందే. ఇలాంటి స్థితిలో సినీ పరిశ్రమకు లాభాలు ఎలా వస్తాయనేది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం.

ఇక్కడ సినీ పరిశ్రమకు ఎవరో పని గట్టుకుని నష్టాలు తేవడం లేదు. స్వయంగా చిత్ర పరిశ్రమే చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోంది. ఇప్పటికే సగం మునిగింది. కనీసం ఇప్పటికైనా మేలుకోకపోతే.. నిండా మునిగే ప్రమాదం లేకపోలేదు. అనారోగ్యకర పోకడల్ని మొదట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు. కానీ పెడ ధోరణుల్ని ట్రెండ్ గా, కొత్త తరహా మార్కెటింగ్ సూత్రాలుగా చెప్పుకుని అదే ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ఎవరైనా సీనియర్లు సలహాలివ్వబోయినా.. వినిపించుకోవడం లేదు. అదేమంటే కాలం మారిందని చెబుతూ.. తెలుగు సినిమాని చేజేతులా చంపేయటానికి కంకణం కట్టుకున్నారు. కనీసం తెలుగు సినిమాల్ని ఓటీటీలు కూడా ఎందుకు కొనడం లేదని ఎవరూ ఆలోచించడం లేదు. ఇప్పటికైనా టాలీవుడ్ ఆత్మావలోకనం చేసుకోకపోతే.. రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఒకటుండేది అని చెప్పుకోవాల్సి వస్తుందేమో.

సినిమాకు నిర్మాణ వ్యయం చాలా కీలకం. ఒకప్పుడు ఏదోలా పెట్టుబడి వెనక్కివచ్చేలా ప్లాన్ చేసుకునేవారు. మొదట బడ్జెట్ ఓ పరిమితి దాటకుండా చూసుకునేవారు. కానీ ఇప్పుడు మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకునే సంస్కృతి పెరిగింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఎప్పుడోసారి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన సినిమాల్ని చూసి.. అందరూ పాన్ ఇండియా పేరుతో భారీగా బడ్జెట్లు పెంచేసి.. నిర్మాతలపై భారం పెంచేస్తున్నారు. అసలు సినిమాల మార్కెట్ గురించి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పెట్టుబడులు పెట్టేసి.. తర్వాత నష్టం వచ్చిందని మొత్తుకోవడం పరిపాటిగా మారింది.

ఓ సినిమా తీయాలంటే కచ్చితమైన ప్లానింగ్ ఉండేది. మొదట కథ.. ఆ తర్వాత బడ్జెట్ పై ఓ నిర్ణయానికి వచ్చి.. తర్వాత షూటింగ్ కు వెళ్లాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్ డేట్లు దొరికితే అంతేచాలనుకుంటున్నారు. దీంతో డైరక్టర్లు కూడా మొదట స్టోరీ లైన్ మాత్రమే చెప్పి.. తర్వాత తీరిగ్గా షూటింగ్ సెట్లో స్టోరీ రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అయితే అప్పటికప్పుడు ఏది తోస్తే అదే. దీంతో క్వాలిటీ అనేది ముందుగానే గంగలో కలిసిపోతోంది. సరే కనీసం షూటింగ్ అయినా సరిగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అదేదో సినిమాల్లో రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అన్నట్టుగా ఉంది.. షూటింగ్ చేసే తీరు. ఏ షెడ్యూల్ అయినా అనుకున్న ప్రకారం పూర్తైతే.. నిర్మాత హమ్మయ్య అనుకోవాల్సిన దుస్థితి. భారీ రెమ్యూనరేషన్లు తీసుకునే హీరోల దగ్గర్నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ ఎవరికీ టైమింగ్ సెన్స్ ఉండటం లేదు. ఇప్పుడు ప్రతి సినిమా సెట్ కూ నిర్మాతే ముందు రావాల్సిన పరిస్థితి. మిగతా వారంతా తీరిగ్గా వస్తున్నారు. ఎందుకు లేటైందన అని అడిగే సీన్ కూడా నిర్మాతకు లేదు. అడిగినన్ని డబ్బులివ్వాలి.. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి.. నిర్మాత పని అంతే అన్నట్టుగా ఉంది టాలీవుడ్ తీరు.

నిర్మాతలకు సినిమాపై ప్రాథమిక అవగాహన ఉండటం లేదు కాబట్టి.. వారికి ఏ కథకు ఎంత బడ్జెట్ పెట్టాలనే విషయంపై అవగాహన ఉండదు. చాలా మంది గుడ్డిగా డైరక్టర్‌ని నమ్ముకుంటున్నారు. ముంచినా తేల్చినా నీదే భారమని సరెండర్ అవుతున్నారు. ఇంకొందరు గతంలో హిట్ అయిన సినిమా ఫార్ములాలు.. ఓటీటీలో కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ ల టేకింగ్ ప్రామాణికం అనుకుని.. అలా వస్తే అదే పదివేలు అనుకునే బాపతు. ఇలాంటి నిర్మాతల చేతిలో టాలీవుడ్ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనేది కాలమే నిర్ణయించాలి. సీరియస్ గా సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య తగ్గడం ఆందోళనకర పరిణామం. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతల్లో చాలా మంది గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. రావడం.. రెండు, మూడు సినిమాలు తీయడం.. మళ్లీ బ్యాక్ టు ది పెవిలియన్ అనేది కొత్త ట్రెండ్ గా మారిపోయింది. కొందరు నిర్మాతలు వరుసగా సినిమాలు తీస్తున్నా.. వారు కూడా ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటారనేది వారే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ అనేది జూదంగా మారిపోయింది. సినిమా కథ విని హిట్టా.. ఫట్టా అని చెప్పేవారు బాగా తగ్గిపోయారు. యూట్యూూబ్ లో రీల్స్, సోషల్ మీడియాలో లైకుల ఆధారంగా లెక్కలేసుకుంటున్నారు. ఎన్ని చూసుకున్నా.. అల్టిమేట్ గా థియేటర్ బుకింగ్స్ చూశాకే ఓ నిర్ణయానికి వస్తున్నారు. కొన్ని సినిమాలు అనూహ్యంగా ఆడుతున్నాయి కానీ.. అవి ఆడతాయనే సంగతి సదరు నిర్మాతలకే కాదు.. డైరక్టర్లూ, నటీనటులకు కూడా తెలియదంటే నమ్మాల్సిందే. కళగా సినిమా మీద గౌరవం ఎలాగో లేదు. కనీసం వ్యాపారంగా అయినా అవగాహన పెంచుకుందామని అనుకోవడం లేదు. ఎడాపెడా తీసిపారేస్తాం.. చూడటం ప్రేక్షకుల కర్తవ్యం అనే పోకడ పెరిగింది. దీంతో ప్రేక్షకులు కూడా నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. కరోనా తర్వాత కంటెంట్ కు ప్రాధాన్యత పెరిగిందని తెలుస్తున్నా.. ఏ ధైర్యంతో నాసిరకం కథలతో సినిమాలు తీస్తున్నారు.. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పట్టుకుని వేలాడుతున్నారనేది అర్థం కావడం లేదు.

సినిమా బడ్జెట్ సంగతి పక్కనపెడితే.. సినిమా నిర్మాణానికి తీసుకునే సమయం కూడా నిర్మాతల పుట్టి ముంచుతోంది. కొంతకాలం క్రితం వరకు సగటు సినిమాలు 90 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకునేవి. కానీ ఇప్పుడు గ్రాఫిక్స్, విజువల్ గ్రాండియర్, పాన్ ఇండియా లాంటి కథలు చెప్పి.. ఏడాది, రెండేళ్లేం ఖర్మ.. ఆరేళ్ల పాటు సాగదీస్తున్న సినిమాలు కూడా ఉంటున్నాయి. దీంతో నిర్మాతలకు వడ్డీలు పెరిగిపోయి.. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నిర్మాతల నష్టాలు కవర్ చేయడానికి గతంలో ఆచార్య సినిమాకు హీరో చిరంజీవి, డైరక్టర్ కొరటాల శివ కొంత రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. లేటెస్ట్ గా హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కూడా 11 కోట్ల రూపాయలు వెనక్కిచ్చారు. చివరకు సిద్ధు జొన్నలగడ్డ కూడా జాక్ సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు రిటర్న్‌ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇలా ఎంతమంది ఇస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం. మెజార్టీ సినిమాలకు నిర్మాత మౌనంగా నష్టాలు భరించాల్సి వస్తోంది. నిర్మాత మునిగిపోతున్నాడని తెలిసినా.. చాలా మంది హీరోలు, డైరక్టర్లు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. నిర్మాత చితికిపోతే.. సినిమాకు మనుగడ ఉండదనే విషయం తెలిసి కూడా విస్మరిస్తున్నారు.

2, 3 దశాబ్దాల క్రితం వరకు సినిమాని నమ్ముకుని వేల కుటుంబాలు బతికేవి. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదో టాలీవుడ్ కచ్చితంగా ఆలోచించుకోవాలి. నిర్మాణవ్యయం కాలక్రమంలో ఎలా పెరిగిందో.. ఎందుకు పెరిగిందో అందరికీ అవగాహన ఉంది. అయినా సరే ఎవరూ పిల్లి మెడలో గంట కట్టడానికి ముందుకు రావడం లేదు. సినిమా బడ్జెట్ లో అవసరమైన ఖర్చు కంటే.. అనవసరమైన వ్యయం పెరిగిపోతోంది. దీంతో నిర్మాతకు చేతి చమురు వదలడమే కానీ .. అందుకు తగ్గ కంటెంట్ మాత్రం వెలుగుచూడటం లేదు. చెప్పే బడ్జెట్ కు, చూసే సినిమాకు పొంతన లేకపోవడం ప్రేక్షకులకూ చిరాకు తెప్పిస్తోంది. అసలు ఇటీవల కంటెంట్ బాగాలేక పోతున్న సినిమాల కంటే.. అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అవుతున్న సినిమాలే ఎక్కువ అనడంలో సందేహం లేదు. అయినా సరే నిర్మాతలంతా ఓ మాటనుకుని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదు. అసలు నిర్మాతలంతా ఓ మాట మీద లేకపోవడం, గ్రూపులుగా విడిపోవడం కూడా సినిమాకు చేటు చేస్తోంది.

నిర్మాతల్లో యాక్టివ్ ప్రొడ్యూసర్లు, గిల్డ్, అడపాదడపా సినిమాలు చేస్ ప్రొడ్యూసర్లు అని రకరకాల గ్రూపులున్నాయి. అల్టిమేట్ గా నిర్మాత కష్టాలు అందరికీ కామనే అనే విషయం ఎవరూ గుర్తించడం లేదు. ప్రొడ్యూసర్లందరికీ షూటింగుల ఆలస్యంతో వడ్డీల భారం పెరుగుతుందనే బాధ ఉంది. అయినా సరే ఎవరూ ముందుకొచ్చి సినిమా షూటింగ్ అనుకున్న టైమ్ కు అయిపోవాలని గట్టిగా డైరక్టర్లకు చెప్పలేరు. త్వరగా డేట్లివ్వాలని స్టార్లను అడగలేరు. దీంతో అంతిమంగా నిర్మాణవ్యయం గోరంతలు కొండంతలు అవుతోంది. ఇలా ఒకటో, రెండో సినిమాలకు మాత్రమే అయితే.. కాస్త పెద్ద నిర్మాతలు తట్టుకోవచ్చు. కానీ వరుసగా ప్రతి సినిమాకు సేమ్ సీన్ అంటే.. ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా.. మునిగిపోక తప్పదు. ఈ సంగతి టాలీవుడ్ నిర్మాతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అవసరం లేకున్నా అవుట్ డోర్ సెట్లు.. విదేశాల్లో షూటింగులు కామనైపోయాయి. దర్శకుల, నటీనటుల కోరికలు తీర్చుకోవడానికి వివిధ దేశాల్లో షూటింగులు పెట్టిస్తున్నారని నిర్మాతకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొదట నిర్మాతలు సినిమాపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా దర్శకులు తోకాడించటానికి జంకుతారు. సబ్జెక్ట్ ఉన్న నిర్మాత దగ్గర నటీనటులు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందరూ క్రమశిక్షణ పాటిస్తే.. ఆటోమేటిగ్గా టైమ్ కు షూటింగ్ అయిపోతుంది. అనుకున్న బడ్జెట్ సరిపోతుంది. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మాత్రం.. పది కోట్ల రూపాయల బడ్జెట్.. వంద కోట్ల రూపాయలే కాదు.. ఫైనల్ కాపీ చేతికొచ్చేసరికి వెయ్యి కోట్ల రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇకనైనా నిర్మాతలు కళ్లు తెరవాలి. తాము ధైర్యం చేస్తేనే.. చిత్ర పరిశ్రమ బతికి బట్టకడుతుందని గుర్తించాలి. కళ్లెం లేని గుర్రంలా దూసుకుపోతున్న నిర్మాణవ్యయానికి పగ్గాలు వేయాలి. భారీ బడ్జెట్ కాకుండా.. మంచి సినిమా తీయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.

సినీ నటుల రెమ్యూనరేషన్ మరో పెద్ద సమస్యగా మారింది. సినిమా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పెరుగుతున్న రెమ్యూనరేషన్లు.. తెలుగు సినిమాని ముంచేస్తున్నాయి. హీరోలు, డైరక్టర్ల రెమ్యూనరేషన్లకే సినిమా బడ్జెట్లో సగం ఖర్చుపెట్టాల్సిరావాడన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేని పరిస్థితి. ఇదేదో సినిమా కంటెంట్ కోసం ఖర్చు పెడితే.. కనీసం బెటర్ క్వాలిటీ అయినా వస్తుందని సీనియర్లు మొత్తుకుంటున్నా.. పట్టించుకునే వారెవరూ లేరు. గతంలో స్టార్ హీరోలు కూడా మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. కానీ ఇప్పుడు మూడేళ్లకో సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతోంది.

సినిమా బడ్జెట్లో రెమ్యూనరేషన్ కు ఎంతివ్వాలి.. షూటింగ్ కు ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో సినీ పెద్దలు ఎప్పుడో ఓ స్టాండర్డ్ ఫార్ములా తయారుచేసిపెట్టారు. దశాబ్దాల అనుభవాన్ని రంగరించిన ఆ ఫార్ములా ప్రకారం సినిమాలు తీస్తే.. లాభాలు వచ్చినా రాకపోయినా.. నష్టం వచ్చే పరిస్థితులు బాగా తగ్గిపోతాయనే అభిప్రాయాలున్నాయి. ఆ స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం రెమ్యూనరేషన్లకు సినిమా బడ్జెట్లో 30 శాతం మాత్రమే కేటాయించాలి. ఆ బడ్జెట్ కు తగ్గట్టే నటీనటుల్ని ఎంపిక చేయాలి. కానీ ఇప్పుడు హీరో, డైరక్టర్ల రెమ్యూనరేషన్లే బడ్జెట్లో 50 శాతం మించిపోతున్నాయి. దీంతో సినిమాలకు నష్టాలు వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈరోజుల్లో సినిమా రిలీజ్ చేయడమంటే.. పెద్ద రిస్కే అనడంలో సందేహం లేదు. ప్రతి సినిమా రిలీజ్ తర్వాతా నిర్మాత చచ్చి బతికినట్టుగా ఫీలౌతున్నారు.

తెలుగు సినిమా దుస్థితికి హీరోలే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సినిమా హీరో చుట్టూనే తిరుగుతోంది. అలాంటి హీరోలు బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ.. టాలీవుడ్ మనుగడతో ఆడుకుంటున్నారు. ఠంచనుగా ఏడాదికి మూడు సినిమాలు తీసేది ఎలాగో లేదు. కనీసం ఏటా ఒక్క సినిమా అయినా రిలీజ్ చేద్దామనే లక్ష్యం పెట్టుకోవడం లేదు. కథ ఓకే కాలేదని ఏడాది కాలక్షేపం చేసి.. షూటింగ్ పేరుతో రెండు, మూడేళ్లు సాగదీసి.. పోస్ట్ ప్రొడక్షన్ పేరుతో మరో ఏడాది లాగించాక కానీ సినిమా రిలీజ్ కానీయడం లేదు. అంటే నాలుగైదేళ్లుగా ఒక్క సినిమాకే వెచ్చిస్తున్నారు. ఈ సమయంలో హీరోగారి ఖర్చే కాదు.. వారి స్టాఫ్ ఖర్చు కూడా నిర్మాతే భరించాలి. క్యారవాన్, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ అద్దెలు.. ఇలా బిల్లు తడిసిమోపెడవుతోంది. కొంతమంది హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే.. వారి మెయింటినెన్స్ కు అంతకు రెండు, మూడింతలౌతోంది. కొంతకాలం క్రితం హీరోల స్టాఫ్ ఖర్చు తగ్గించాలని కొందరు నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టినా.. అవి కొన్ని రోజులు కూడా అమలుకు నోచుకోలేదు. హీరో మెయింటినెన్స్ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలనే రూలేం లేదు. హీరో గారి మూడ్ మారినప్పుడల్లా.. మెయింటినెన్స్ మారిపోతుంది. అలా నిర్మాతకు ఖర్చు కూడా పెరిగిపోతోంది. అయినా సరే కిమ్మనకుండా అడిగినవన్నీ సమకూర్చాల్సిందే. ఓ షెడ్యూల్ ను వంద కోట్ల రూపాయలతో ప్లాన్ చేసుకున్నాక.. లొకేషన్ బాగాలేదనే, స్పాట్లో సరిగా చూసుకోలేదనో.. ఆఖరికి కాస్ట్యూమ్స్ కలర్ నచ్చలేదని కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయడం హీరోల దర్జాగా చలామణీ అవుతోంది.

గతంలో హీరోలు ఆచితూచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు. సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు బాధ్యత తీసుకునేవారు. తాము సమయానికి రావడమే కాకుండా.. ఇతర నటీనటులు కూడా సమయానికి వచ్చేలా జాగ్రత్తపడేవారు. నిర్మాతకు డబ్బు వృథా కాకూడదనే తాపత్రయంతో పనిచేసేవారు. నిర్మాతలు సెట్లో ఉన్నా.. లేకున్నా క్రమశిక్షణతో నడుచుకునేవారు. అలాంటి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన హీరోలతో ఇప్పటి హీరోలను పోల్చడం కూడా పాపమే. అసలు ఇప్పుడు పేరుకే హీరోలు కానీ.. హీరోకి ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉంటోందా అనేది ఆలోచించాల్సిందే. సినీ వేదికల మీద అభిమానులకు నీతులు చెప్పే హీరోలు.. షూటింగ్ స్పాట్లో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే.. అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా షూటింగ్ నిర్మాత చెప్పిన టైమ్ కో, డైరక్టర్ రెడీ అన్నప్పుడో మొదలుకావడం లేదు. క్యారవాన్ నుంచి హీరోగారు బయటకు వచ్చినప్పుడే షూటింగ్.. లేకపోతే ప్యాకప్.. ఇదీ ప్రస్తుతం తెలుగు సినిమా వర్థిల్లుతున్న తీరు.

హీరో అంటే కేవలం తెరపై నాయకుడిగా ఉండటమే కాదు.. సెట్లోనూ నాయకత్వ లక్షణాలు చూపించాలి. నిర్మాతకు ఖర్చు తగ్గించకపోయినా పర్లేదు కానీ.. కనీసం నిర్మాణ వ్యయం పెరగకుండా తన వంతు సహకారం అందించాలి. హీరోలు అదుపు తప్పకుండా ఉంటే.. మిగతా ఆర్టిస్టులు కూడా లక్ష్మణరేఖను దాటడానికి సందేహిస్తారు. కానీ హీరోలే బరితెగిస్తే.. కంచే చేను మేసినట్టవుతుంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఇదే జరుగుతోంది. హీరోలు తమ స్వార్థం చూసుకుంటున్నారు. నిర్మాతలు సూసైడ్ చేసుకున్నా.. కనుమరుగైపోతున్నా పట్టించుకోవడం లేదు. నిర్మాతలు బాగుంటేనే.. సినీ పరిశ్రమ.. తామూ బాగుంటామనే సంగతి కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. నిర్మాతలు సినిమా తీయకపోతే ఏం జరుగుతుందనే ఆలోచన లేకపోగా.. తమ వల్లే సినిమాలు ఉన్నాయని.. లేకపోతే లేదని ఫీలైపోతున్నారు. అనవసర పంతాలు, పట్టింపులు పెంచుకుని.. నిర్మాతలు తాము చెప్పినట్టుగా ఆడాలని శాసిస్తున్నారు. ప్రస్తుతం డైరక్టర్లకు కాళ్లు రావడానికి, హీరోయిన్లకు రెమ్యూనరేషన్లు పెరగటానికి కూడా హీరోలే కారణం అని చెప్పడానికి సందేహించాల్సిన పనేం లేదు.

ఈరోజుకీ మలయాళ సినిమా పరిమిత బడ్జెట్లో అద్భుతమైన కథల్ని తెరకెక్కిస్తోంది. అక్కడ మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇష్టారాజ్యంగా పారితోషికాలు తీసుకోవడం లేదు. కానీ మన దగ్గర పట్టుమని పది సినిమాలు చేయని వారు, రెండు, మూడు హిట్లు కూడా కళ్ల చూడనివారు కూడా హీరోలుగా చలామణీ అవుతూ.. కోట్ల రూపాయలు నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గకపోవడం వింతల్లో వింత. వాళ్లు అడుగుతున్నారు సరే.. నిర్మాతలు కూడా జీ హుజూర్ అని అడిగినంత సమర్పించేసుకుంటున్నారు. ఇలా కాకుండా పరిమిత స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని.. తర్వాత వచ్చే వసూళ్లలో వాటా తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినా.. చాలా మంది హీరోలు ఈ ప్రపోజల్ కు ఆదిలోనే గండికొట్టారు. సినిమా హిట్టుఫ్లాపులతో తమకు సంబంధం లేదని, తమ రెమ్యూనరేషన్ తమకు ఠంచనుగా ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. దీంతో నిర్మాతలు కూడా తప్పనిసరి తద్దినమనుకుని సైలంట్ గా అడిగినంత ఇచ్చేసి నిండా మునగటానికి రెడీ అయిపోతున్నారు.

ఇప్పటికైనా టాలీవుడ్ బాగుపడాలంటే కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదు. త్మొదట మన సినిమాల వాస్తవ మార్కెట్ ఎంతో నిర్థారించుకోవాలి. అడపాదడపా హిట్టయ్యే సినిమాల్ని కాకుండా సగటు సినిమా కలెక్షన్లను ప్రామాణికంగా తీసుకోవాలి. నిర్మాణవ్యయాన్ని అర్జెంటుగా తగ్గించాలి. హీరోల రెమ్యూనరేషన్లు కూడా భారీగా తగ్గాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ కొన్నాళ్ల పాటు మనుగడ సాగిస్తుంది. లేకపోతే మాత్రం అనగనగా కథగా మిగిలిపోతుందని సగటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version