Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్

Sir

Sir

Story Board : తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. సర్ మొదలైన దగ్గర్నుంచీ తీవ్ర గందరగోళం, సమస్యలు తప్పలేదు. పలుచోట్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా జరిగింది. అయితే సర్‌పై ఏపీలో పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా.. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడంపై చర్చ జరుగుతోంది. అన్నింటికీ మించి ఈ సర్ ప్రభావం.. నియోజకవర్గాల పునర్విభజనపై ఏ స్థాయిలో పడుతుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ.. సర్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకువచ్చింది. అసలు ఎస్‌ఐఆర్‌ ఫారం నింపడమే సమస్యగా మారింది. ఎన్యూమరేషన్‌ పారాలను ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం భర్తీ చేసి బీఎల్వోలకు ఇస్తే ఫారాలను డిజిటలైజేషన్‌ చేస్తారు. కానీ ఓటర్లు ఈ పారాలను నింపేందుకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడ్డారు. పోనీ బీఎల్వోల సాయం తీసుకుందామంటే.. వారు ముందే చేతులెత్తేశారు.

భారత ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికల ప్రక్రియ. దీన్ని ప్రాధాన్యతను గుర్తించిన భారత రాజ్యాంగ రూపకర్తలు ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లలో అర్హులెవరో.. అనర్హులెవరో తేల్చే కీలక బాధ్యతను అప్పగించారు. ఇప్పటిదాకా ఈసీ విశ్వసనీయతపై ఎప్పుడూ సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈసీ అధికార పార్టీ ఒత్తిడి మేరకు పనిచేస్తోందనే నిందను మోయాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో కీలకమైన సర్ ప్రక్రియలో ముందే మొదలైన అనుమానాలకు.. అది జరుగుతున్న ప్రక్రియలో లోపాలు మరింత ఆజ్యం పోశాయి. సర్ ప్రక్రియకు పునాది అయిన మ్యాపింగ్ ప్రక్రియలోనే తీవ్ర లోపాలు జరిగాయనే వాదన అసలు మొత్తం ప్రక్రియనే ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్ ముగియడంతో.. ఇంత గందరగోళం గతంలో ఎప్పుడూ లేదనేది సర్వత్రా వినిపిస్తున్న మాట.ఆంధ్రప్రదేశ్‌లో సర్ ప్రక్రియ ఈ నెల 24తో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 ఓట్లు తొలగింపు జాబితాలో చేరాయి. ఇవి మొత్తం ఓట్లలో 10.75 శాతంగా ఉన్నాయి. దీనికి భిన్నంగా తెలంగాణలో దాదాపు 22 శాతం ఓటర్ల వివరాలు డిజిటైజేషన్ కాలేదు. అంటే 73.95 లక్షల ఓటర్లు వారి ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వలేదు.

దేశంలో ఇంతకుముందు 1951-52, 1960, 1980, 1993, 1995, 2002 సంవత్సరాల్లో సర్ ప్రక్రియ నిర్వహించారు. 1993-95లో ఎన్నికల గుర్తింపు కార్డు జారీచేసే సమయంలోనూ దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాను సవరించారు. ఈ అన్ని సందర్భాల్లోనూ పారదర్శకంగా సర్ ప్రక్రియ చేపట్టిన చరిత్ర ఎన్నికల సంఘానికి ఉంది. ప్యూరిఫికేషన్ కోసం ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్టు చెబుతున్న ఎన్నికల సంఘం ప్రజలకు సందేహాలు లేకుండా క్లారిఫికేషన్ ఇవ్వాలి. అందరికీ టెక్నాలజీలో అనుభవం ఉండదు కాబట్టి సర్ పై ఓటర్లలో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ ఈసారి సర్‌లో ఈసీ ఇచ్చిన వివరణ సరిపోలేదని, మరీ ముఖ్యంగా ఓటర్లకు చాలా అనుమానాలు అలాగే ఉన్నాయని తేలింది.

ప్రస్తుతానికి సర్ తంతు ముగిసిందనిపించింది ఈసీ. ప్రస్తుత సర్ నుంచి కచ్చితంగా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇక నుంచైనా
సర్ పేరుతో ఏం చేసినా అర్హులైన ఓటర్ల జాబితా కోసమేనని కేవలం మాటలు చెప్పడం కాకుండా.. ఆచరణలోనూ అదే ఉద్దేశం కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదరాబాదరాగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ కాకుండా.. తగినంత సమయం ఇవ్వాలి. బీఎల్వోలను మరింత మెరుగ్గా సన్నద్ధం చేయాలి. ఎన్యుమరేషన్ ఫారాల్లో భాష విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. చదువురానివారిని పక్కనపెడితే.. కనీసం చదువుకున్నవారికైనా తేలికగా అర్ధమయ్యేలా ఫారాల్లో భాష ఉండటం అత్యవసరం. రాజకీయ పార్టీల ప్రతి అభ్యంతరాన్నీ తోసేయకుండా.. ఓసారి ఓటర్ల అభిప్రాయం కూడా తీసుకుని.. వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇలా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటేనే.. సర్ ప్రక్రియపై ఓటర్లకైనా విశ్వాసం కలుగుతుంది. లేకపోతే వారు కూడా పార్టీల మాదిరిగానే రకరకాల అనుమానాలు పెంచుకునే అవకాశం చేజేతులా ఈసీనే ఇచ్చినట్టవుతుంది.

మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది. కాబట్టి సర్ ప్రక్రియ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, పారదర్శకంగా సాగితేనే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం సర్ విషయంలో భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తేటతెల్లమైంది. సర్ ప్రక్రియకు ఆయువుపట్టైన బీఎల్వోల ట్రైనింగ్ విషయంలో చాలా కసరత్తు చేయాల్సి ఉందని ప్రస్తుత సర్ స్పష్టం చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సర్‌ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సర్ పేరుతో నెలన్నర రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు.. ఓటర్లను బాగా భయపెట్టిన మాట వాస్తవం. అదే సమయంలో లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. కాకపోతే ఓటు ఉంటే సరిపోదు.. అది పదిలంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి వివరాలు గుర్తుంచుకోవాలని అనే విషయంలో ఓటర్లందరికీ పూర్తిస్థాయిలో అవగాహనకు వచ్చిందని చెప్పకతప్పదు. ఆ స్థాయిలో ఈసీ, అధికారులు నయానో, భయానో ఓటర్లకు అవగాహన కల్పించ ప్రయత్నం చేశారు. కాకపోతే ప్రయత్నలోపాలు చాలా ఉన్నాయి. అదేమంటే పెద్ద దేశం, జనాభా, భౌగోళిక సంక్లిష్టతలు లాంటి రెడీమేడ్ కారణాలు ఉండనే ఉన్నాయి. ఏతావాతా ఉత్తరాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో సర్ చాలా వరకు సజావుగా జరిగినట్టే అనే విశ్లేషణలున్నాయి. ముందే అనుకున్నట్టుగా హైదరాబాద్‌లో భారీగా ఓట్లు గల్లంతు కావటానికి కారణాలు అందరికీ తెలిసినవేనని చెబుతున్నారు. అలా చూసినప్పుడు.. సర్ మరీ విపరీతమైన షాక్‌ లేమీ ఇవ్వనట్టే. పనిలోపనిగా ఓటర్లందర్నీ ఓటు విషయంలో అప్రమత్తం చేసిందని చెబుతున్నారు. సర్ వివాదాస్పదంగా జరిగిందనే పేరొచ్చినా.. ఈ ప్రక్రియ కారణంగా ఇక ముందు ఓటర్లు ఓటుహక్కు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

మొన్నటిదాకా బీఎల్వోలు ఎవరో.. వారి విధులేమిటో చాలా మంది ఓటర్లకు అవగాహన లేదు. కానీ ఇప్పుడు మెజార్టీ ఓటర్లకు బీఎల్వోల పనేంటో తెలిసింది. భవిష్యత్తులో ఓటర్ల జాబితాలో ఏ తేడా వచ్చినా బీఎల్వోలను కలుస్తామని, అవసరమైతే తప్పులు దిద్దుకుంటామని కూడా ఓటర్లు చెబుతున్నారు. ఓటు విషయంలో అక్షరాస్యతతో సంబంధం లేకుండా చాలా మంది ఓటర్లకు అవగాహన లేని విషయాలు చాలా ఉన్నాయని సర్ కుండబద్దలు కొట్టింది. ఇప్పటి అనుభవాల ద్వారా.. ఓటర్లకు ఎలాంటి అవగాహన అవసరమో ఈసీకి కూడా ఓ ఐడియా వచ్చింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్యలు ఎదురుకావడం కూడా మంచిదేనని, తద్వారా ఈసారి సర్ నిర్వహణ సమయంలో రాష్ట్రాల వారీగా వ్యూహరచనకు వీలవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు గాడిదకూ, గుర్రానికీ ఒకే సూత్రం అన్వయించడం కూడా గందరగోళానికి, విమర్శలకు తావిచ్చిందని ఈసీ ఆలస్యంగా అర్థం చేసుకుంది. ఇక చివరిగా కేవలం సర్ సమయంలోనే ఓటర్ల జాబితా స్క్రుటినీ కాకుండా.. బీఎల్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాలో అవాంఛిత మార్పుల్ని గమనించి.. ఎప్పటికప్పుడు సరిచేస్తే.. సర్ ప్రక్రియ ఈ స్థాయిలో అయోమయానికి దారితీసే పరిస్థితి ఉండదనే సూచనలో వాస్తవం లేకపోలేదు. ఏతావాతా ఈసీ తన పని తాను సమర్థంగా చేయకుండా.. బీఎల్వోల తప్పులకు కూడా ఓటర్లను బాధ్యుల్ని చేసే కాలం చెల్లిన నిబంధనలకు నీళ్లొదిలేసి.. ఇప్పటికైనా ఎవరి స్థాయలో వారికి బాధ్యతలు నిర్దేశించే కొత్త రూల్స్‌కు రూపకల్పన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.