Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?

Story

Story

దశాబ్ద కాలంగా క్యాష్ ఫ్రీ భారత్ విధానానికి ఊతమిచ్చిన యూపీఐ ఇక ఎంతమాత్రం ఫ్రీ కాదంటూ కేంద్రం చేసిన ప్రకటన.. వ్యాపారుల్లో గగ్గోలు రేపింది. అటు ఆర్థిక నిపుణులు కూడా ఎండీఆర్ ఛార్జీలతో ప్రజలు మళ్లీ నగదు ఎకానమీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఓవైపు అంతర్జాతీయంగా యూపీఐని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఎండీఆర్ ఛార్జీలతో.. యూపీఐ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ .. ఎండీఆర్ విధించడం పట్ల రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం దేశాన్ని మళ్లీ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన నిబంధనల ప్రకారం, రూ. 2,000 దాటిన వ్యాపార చెల్లింపులపై ఈ రుసుము వర్తిస్తుంది.

దశాబ్దాలుగా నగదు ఎకానమీకి అలవాటుపడ్డ దేశానికి.. పదేళ్ల క్రితం వచ్చిన యూపీఐ.. కొత్త చెల్లింపుల విధానాన్ని పరిచయం చేసింది. సెకన్ల వ్యవధిలో నగదు బదిలీ, సురక్షితంగా, వేగంగా జరుగుతున్న లావాదేవీలు, పైగా ఈ చెల్లింపులు ఉచితం కావడంతో.. యూపీఐ తక్కువ కాలంలోనే అటు వ్యాపారులు, ఇటు ప్రజల నమ్మకాన్ని పొందగలిగింది. దీనికి తోడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగిన యూపీఐ లావాదేవీల విలువ.. ఇప్పుడు ఏకంగా లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో టీ కొట్టు దగ్గర్నుంచీ బడా వ్యాపారుల వరకూ.. అందరూ యూపీఐని అక్కున చేర్చుకున్నారు. అటు సామాన్యులు కూడా డబ్బును క్యారీ చేసే బాధలు తప్పాయనే ఉద్దేశంతో.. రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల వరకూ యూపీఐలో నగదు బదిలీ చేయటానికి అలవాటుపడ్డారు. యూపీఐని దేశంలో ప్రవేశపెట్టి దశాబ్ద కాలమే అయినా.. ప్రస్తుతం యూపీఐ లేని దేశాన్ని ఊహించటమే కష్టంగా ఉందనే చర్చ జరుగుతోంది. ఆమాటకొస్తే దేశంలో స్మార్ట్ ఫోన్, ఆధార్ తీసుకొచ్చిన విప్లవాల కంటే.. యూపీఐ ప్రభావం చాలా పెద్దదని నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇక యూపీఐ ప్రవేశపెట్టిన ఉద్దేశం విషయానికొస్తే.. దేశాన్ని నగదు ఎకానమీ నుంచి నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మళ్లించటమే లక్ష్యమని గతంలో సర్కారే ప్రకటించింది. ప్రస్తుతం ఆ లక్ష్య సాధనకు చాలా చేరువలో మనం ఉన్నామని పెరుగుతున్న యూపీఐ గణాంకాల సంఖ్య, విలువే చాటుతున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా.. అంతర్జాతీయంగానూ యూపీఐని మెరుగైన చెల్లింపుల వ్వవస్థగా ప్రమోట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో.. ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డ ఎండీఆర్ ఛార్జీల ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. పైకి రూ.2 వేల రూపాయలకు మించిన లావాదేవీలపై నామమాత్రపు రుసుము అని చెబుతున్నా.. భవిష్యత్తులో ఈ నిర్ణయం మొత్తంగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించదన్న గ్యారంటీ ఏముందని ప్రతిపక్షాలు అప్పుడే ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నా.. ఎండీఆర్ ఛార్జీల చెల్లింపుకు చెబుతున్న కారణాలపై రకరకాల సందేహాలు వస్తున్నాయి. ఓ దశలో అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గారని, వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలకు లబ్ధి కోసమే ఛార్జీలని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. మిగతా ఆరోపణల సంగతి పక్కనపెడితే.. నగదు రహిత ఆర్థికవ్యవస్థకు ఉత్ర్పేరకంగా ప్రవేశపెట్టిన యూపీఐకి.. చేజేతులా ఎందుకు ఛార్జీల పేరుతో కళ్లెం వేస్తున్నారనే ప్రశ్నకు జవాబు అంత తేలిక కాదు. ప్రస్తుతానికి పెట్రోల్ డీలర్లు, రిటైలర్ల అసోసియేషన్ ఇప్పటికే ఎండీఆర్ ఛార్జీలపై తీవ్ర నిరసన తెలిపాయి. రేపు యూపీఐ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది కీలకంగా మారనుంది.

కొత్త నిబంధనల మేరకు, వినియోగదారుల నుంచి వ్యాపారులకు జరిగే రూ. 2,000 పైబడిన చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి రంగాలకు ఫ్లాట్‌గా రూ. 5 రుసుము ఉంటుంది. అయితే, యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ. 1 లక్ష లోపు లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించారు. ఈ మార్పు కేవలం 4 శాతం లావాదేవీలపై మాత్రమే ప్రభావం చూపుతుందని, మిగిలిన 96 శాతం వ్యాపార లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కానీ ఈ నిర్ణయంపై రిటైలర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తక్కువ లాభాలతో పనిచేసే చిన్న వ్యాపారులు ఇకపై యూపీఐ కంటే నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు దీపావళి పండుగ సీజన్‌కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, ఇది వ్యాపారాలపై మరింత భారం మోపుతుందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. గతంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించిన వ్యాపారులే, ఇప్పుడు తిరిగి నగదును ప్రోత్సహించే పరిస్థితి నెలకొంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎండీఆర్ ఛార్జీలు ప్రభుత్వ పన్ను కాదని, యూపీఐ వ్యవస్థను నిర్వహించే బ్యాంకులకు, పేమెంట్ యాప్ సంస్థలకు వెళ్లే రుసుము అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ నిర్ణయాన్ని ఐదేళ్ల క్రితమే ప్రతిపాదించామని, దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం అంటోంది. వెరసి, ఈ మార్పుల ప్రభావం వ్యాపారులపైనే ఉంటుంది తప్ప, సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పదే పదే చెబుతోంది. అయితే ఇప్పిటకే ఎండీఆర్ ఛార్జీలు.. దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ రంగంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, రూ.2,000 దాటిన యూపీఐ వర్తక లావాదేవీలపై ఎండీఆర్‌ వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, రైల్వేలు, ఇన్సూరెన్స్ వంటి నిత్యవసర రంగాల్లోని రూ.2,000 పైబడిన చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్‌ విధించనున్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని, ఈ భారాన్ని కేవలం వ్యాపారులే భరించాలని ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన విక్రయ వ్యాపారం స్వల్ప లాభ శాతంతో నడుస్తుందని, 2017 తర్వాత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్జిన్ల పెంపు లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో నమోదయ్యే మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 20 శాతం వరకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైనవే. కొత్త ఎండీఆర్‌ నిబంధనల వల్ల రోజూ దేశంలోని పెట్రోల్ పంపు నిర్వాహకులపై రూ.2.4 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడుతుందని డీలర్లు అంచనా వేస్తున్నారు. ఈ అదనపు చార్జీని భరించడం సాధ్యం కాదని, తమకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ వినతిని పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2,000 దాటిన లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు ద్వారా మాత్రమే ఇంధన విక్రయాలు జరుపుతామని స్పష్టం చేస్తున్నారు. 2016 డీమోనిటైజేషన్ సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎండీఆర్‌ సబ్సిడీలను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

సాధారణ ప్రజలకు పీ2పీ లావాదేవీలు ఉచితమే అయినప్పటికీ బంకు నిర్వాహకులు నగదు విధానానికి మారితే సామాన్య వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చమురు సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని డీలర్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.

2016లో ప్రారంభమైన యూపీఐ భారత నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. 2026 ఆగస్టులో యూపీఐ ద్వారా 24.5 బిలియన్ లావాదేవీలు నమోదైనట్లు వివరించింది. యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సైబర్ సెక్యూరిటీని పెంచడం, గ్రామీణ ప్రాంతాలు, టైర్-3 నుంచి టైర్-6 పట్టణాల్లోని చిన్న వ్యాపారాలకు సహాయం చేయడం కోసం అధిక విలువ కలిగిన వ్యాపార లావాదేవీలపై స్వల్ప రుసుము విధించినట్లు కేంద్రం తెలిపింది. అయితే సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి వ్యక్తిగత లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొంది. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఛార్జీ మినహాయింపు ఉంటుందని తెలిపింది. రూ.2,000లోపు జరిగే వ్యాపార చెల్లింపులపై రుసుము ఉండదని, రూ.2,000కు మించిన లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని కేంద్రం వివరించింది. ఈ రుసుమును వ్యాపారులే భరించాలని, వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. రైల్వే, ఇంధనం, టెలికాం, బీమా, బిల్లు చెల్లింపుల వంటి విభాగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలకు రూ.5 ఫ్లాట్ ఫీజు, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ చెల్లింపులకు 0.02 శాతం రుసుము ఉంటుందని తెలిపింది. యూపీఐ యాప్‌లు అదనపు ప్లాట్‌ఫామ్ ఛార్జీలు విధించకుండా నిబంధనలు అమలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.