తెలుగు రాష్ట్రాల్ని కరవు కమ్మేస్తోంది. ఇప్పటికే విరుచుకుపడ్డ ఎల్‌నినో మరింత భయానకంగా మారుతోంది. మొదట సాగునీరు.. తర్వాత తాగునీటికీ కటకట తప్పేలా లేదు. ఈ దుస్థితి ఆహార సంక్షోభానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఏడాది జనం మర్చిపోయిన కరెంట్ కోతల కాలం కూడా వస్తుందనే హెచ్చరకలు వస్తున్నాయి. ఏతావాతా తెలుగు రాష్ట్రాలకు మున్ముందు కరవు కాలం కంటిన్యూ అయ్యేలా ఉంది. ఎల్‌నినో రోజురోజుకీ తీవ్రంగా బలపడుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం, వర్షాభావం పరిస్థితులు దాటి.. కరవు పరిస్థితులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి.. సాగునీటికే కాకుండా తాగునీటికీ కరవు వచ్చి పడింది. కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా నీటి పంపిణీ తగ్గగా.. రాబోయే రోజుల్లో భూగర్భజలం కూడా ఇంకిపోయే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా అవసరానికి మించిన వర్షమే పడుతూ వస్తోంది. చివరకు జూన్, జులైలో లోటు వర్షపాతం నమోదైనా.. ఆగస్ట్, సెప్టెంబర్‌లో కవరైపోయేలాగే వర్షం కురుస్తూ వచ్చింది. కొన్నిసార్లు కేవలం సెప్టెంబర్‌లో కురిన వానలే.. మొత్తం వర్షపాతం రికార్డుల్ని సరిచేసిన దాఖలాలున్నాయి. దీంతో ఈసారి కూడా ఎల్‌నినో ఎల్‌నినో అని ఎంత ఊదరగొట్టినా.. ఏదో నెలలో వర్షాలు పడి.. ప్రాజెక్టులు నిండుతాయనే ధైర్యం చాలా మంది అన్నదాతల్లో కనిపించింది. దీనికి తోడు ఎప్పుడూ అంచనాలు తప్పే మన వాతావరణ శాఖ.. ఈసారి మాత్రం కరెక్టుగా చెబుతుందా ఏంటి అనే ధీమా కూడా లేకపోలేదు. కానీ ఇవేవీ ఫలించలేదు. చివరకు ఎల్‌నినో రానే వచ్చింది. జూన్ లో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత జులైలోనూ వర్షాలు సరిగ్గా పడలేదు. అయినా రైతులకు అదే ధీమా. ఆగస్టులో చూసుకుందాం.. మహా అయితే విత్తనాలు ఓ నెల ఆలస్యంగా విత్తుదాం అనుకున్నారు. కానీ ఆగస్టు కూడా సారీ చెప్పేసింది. చివరకు ఆఖరాశగా సెప్టెంబర్ వైపు ఆశగా చూశారు. పేరుకి తుపాన్ వచ్చినా.. గట్టిగా పది రోజులు కూడా వానలు పడలేదు.
ఇప్పుడు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఇప్పుడు వర్షపాతం లెక్కలు చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావం ఉందని తేలింది. ఏపీలో ఏకంగా 45 శాతం లోటు ఉంటే.. తెలంగాణలో 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు నిండుకున్నాయి. సాగునీటి విషయంలో అధికారులు ముందే చేతులెత్తేశారు. అప్పుడు తాగునీటి కోసం నీటినిల్వలు పరిరక్షిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే.. తాగునీటికీ కటకట తప్పేలా లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాగునీరు ఇచ్చే వ్యవధితో పాటు నీటి పరిమాణం కూడా తగ్గిందనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని ఎవరూ అధికారికంగా నిర్థారించకపోయినా.. గట్టిగా కాదని చెప్పే సాహసం కూడా చేయలేకపోతున్నారు. పైగా అన్నింటికీ మించి ఇప్పుడు తెలంగాణ భూగర్భజలవనరుల శాఖ.. ప్రతి చుక్కనూ పొదుపుగా వాడుకోవాలని హెచ్చరిస్తూ.. ప్రకటన జారీ చేయడం రాబోయే గడ్డుకాలానికి అద్దం పట్టింది.
తెలంగాణలో ఏపీతో పోలిస్తే వానలు పర్వాలేదనిపించినా.. కురవాల్సినంత వర్షాలైతే పడలేదనే చెప్పాలి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు భూగర్భజలం కూడా అడుగంటడంతో.. తాగునీటికీ కొరత వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే 123 శుద్ధి కేంద్రాలకు రాష్ట్రంలోని 29 ప్రధాన జలాశయాలు ఆధారంగా ఉన్నాయి. ఈ 29 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 333.44 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయంలో 522.31 టీఎంసీల నిల్వలు ఉండగా.. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత దిగజారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి పైన వినియోగించదగిన నీరు కేవలం 3 టీఎంసీలే మిగిలి ఉండగా.. ప్రతి నెల తాగునీటి అవసరాలకు సుమారు అర టీఎంసీ అవసరం అవుతోంది. లోయర్ మానేరు, ఎల్లంపల్లి, కడెం, జూరాల, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూర్, కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి, వైరా, ఉదయసముద్రం, ధర్మసాగర్ వంటి జలాశయాల్లోనూ నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఈ జలాశయాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలతో మంజీరా, సింగూర్, గోదావరి వ్యవస్థల నుంచి ఈ నెలాఖరు వరకు మాత్రమే తాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ అవసరాల కోసం సింగూర్‌లో కనీసం 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు సూచనలు వెళ్లాయి.
ఇదిలా ఉండగా భూగర్భ జలాల పరిస్థితి కూడా దిగజారుతోంది. నిజానికి జూన్ లోనే రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బోర్లను మరింత లోతుగా తవ్వడం, అవసరమైన చోట కొత్త బోర్లు ఏర్పాటు చేయడం, వర్షపు నీటి సంరక్షణ చర్యలను వేగవంతం చేయడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోంది. దీనికి తోడు ఈశాన్య రుతుపవన కాలంలోనూ మంచి వర్షం పడే అవకాశం లేదనే సూచనలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుత దుస్థితి కొనసాగటమే గొప్ప అనుకునేలా ఉంది. ఇంతకు మించి పరిస్థితులు దిగజారకుండా ఉంటే అదే పదివేలు అని సరిపెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదని కూడా ప్రభుత్వాల చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా ఫలించని స్థాయిలో ప్రకృతి ప్రకోపం తలెత్తింది. ఇక ఇప్పుడు మానవ ప్రయత్నాలు ఫలించవని, చేయగలిగిందల్లా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం, త్వరగా వర్షాలు పడాలని కోరుకోవడమేననే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో రానున్న నెలల్లో తాగునీటి సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఏపీలో చూస్తే.. గతంలో ఎప్పుడూ నీటి కొరత అంటే తెలియని ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య వస్తోంది. తమకు తాగునీటి సరఫరా సమస్య తీర్చాలని కొన్ని ప్రాంతాల్లో జనం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారు. అధికారులు ఎక్కడికక్కడ పరిష్కారాలు చూపుతున్నా.. అవి తాత్కాలికమే కానీ.. ఇక సమస్య రాదనే గ్యారెంటీ ఎవ్వరూ ఇవ్వలేని దుస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో కరవు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చివరకు చుక్కు నీరు దొరక్క.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడే దుస్థితిని కూడా చూడాల్సి వచ్చేలా ఉందనే భయాలు వ్యక్తమౌతున్నాయి.

