OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?

Story

Story

ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ఎల్‌నినో…తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇటీవలి దశాబ్దాల్లో మరింత శక్తిమంతంగా మారుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య లక్షల మంది జనం ప్రాణాలు కోల్పోతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో…పంటలు ఆశించిన స్థాయిలో పండవని తేల్చారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఉండే రోజులు 44 శాతం పెరిగితే…పరిస్థితులు ఏలా ఉంటాయి ? వానకాలంలో ఎండలు మండిపోవడానికి కారణాలు ఏంటి ? వచ్చే ఆరు నెలల్లో వేల మంది ప్రాణాలు కోల్పోతారా ? భారత్‌లోనూ మరణమృదంగం కొనసాగుతుందా ? ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే…మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా ?

ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తోంది. వరణుడు వచ్చినట్లే వచ్చి…తెరమరుగయ్యాడు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక…సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు…వేసవిని తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. ఇంతలోనే శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఈ ఏడాది బలంగా మారిన సూపర్ ఎల్‌నినోపై తాజా నివేదిక అదే భయాన్ని కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు పెరగొచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. దీంతో వేడి తట్టుకోలేక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు సూపర్ ఎల్‌నినో ప్రభావంతో…ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల మంది వేడి కారణంగా చనిపోయే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇది కచ్చితమైన సంఖ్య కాదని, వాతావరణ పరిస్థితులు మారితే ఆ సంఖ్య కూడా మారొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2026 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు…అంటే అరు నెలల పాటు వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఆరు నెలల్లో వేడి వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.39 లక్షల మంది మరణించే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది వేసవి వరకు కొనసాగితే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

సాధారణ సంవత్సరాలతో పోలిస్తే…ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి ఉండే రోజులు 44 శాతం పెరగొచ్చని తెలిపింది. అంటే ఎండలు ఎక్కువ రోజులు మాత్రమే కాకుండా, మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సూపర్ ఎల్‌నినో…భారత్‌పై తీవ్రంగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు వార్నింగ్‌ ఇస్తున్నారు. మరణమృదంగం కొనసాగుతుందని…అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో సుమారు 15,800 మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఇందులో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యే సుమారు 7,400 మంది వేడి కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే భారత్‌లో అసలు ఎండాకాలం మార్చి తర్వాత మొదలవుతుంది. ఆ సమయంలో కూడా ఎల్‌నినో ప్రభావం కొనసాగితే వేడి వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

వేడి కారణంగా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉన్న దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేసియా, సూడాన్‌, భారత్‌, బ్రెజిల్‌ ఉన్నాయి. నైజీరియాలో 31,400 మంది, ఇండోనేసియాలో 19,300 మందికిపైగా, సూడాన్‌లో 17,500 వరకు, భారత్‌లో దాదాపు 16 వేల మంది వరకు, బ్రెజిల్‌లో 13,300 వరకు ప్రాణాలు కోల్పోతారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని నివేదిక తెలిపింది. నైజీరియా, సూడాన్‌, నైజర్‌, చాద్‌ ప్రాంతాల్లో కలిపి సుమారు 66,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎండలు మరింత పెరిగితే…మరణాలు అదే స్థాయిలో పెరుగుతాయని అంటున్నారు.

వేడి పెరిగే ప్రాంతాల్లో ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది ప్రాణాలను కాపాడొచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తెలిపింది. ప్రజలకు ముందుగానే ఎండలపై హెచ్చరికలు ఇవ్వడం, చల్లగా ఉండే కేంద్రాలను ఏర్పాటు చేయడం, తాగునీరు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు ఉపయోగపడతాయని తెలిపింది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు, ఎండలో పనిచేసే కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆసుపత్రుల్లో అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ప్రస్తుత పరిశోధకులు భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణానికి ఒక ముందస్తు హెచ్చరికగా చెప్పింది. ఎండలు మరింత తీవ్రంగా మారే పరిస్థితుల్లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారీ ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఐతే అక్కడితోనే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రాకపోవచ్చు. ఆ ప్రభావం వచ్చే ఏడాది చివరి వరకు ఉండే అవకాశాలు లేకపోలేవు అనేది పలువురి వాతావరణ నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విద్యుత్ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని చెబుతున్నారు. పవర్ డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా చేసేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఈ విపత్కర పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వృథాని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. వరదలు వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, తాగునీటి నిల్వలు, ఆహార భద్రత, విద్యుత్ బ్యాకప్‌ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దీర్ఘకాలిక వేడి, తేమ కారణంగా దోమలు పెరిగి వ్యాధులు విస్తరించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

కాంక్రీట్ భవనాలు, డాంబర్ రహదారులు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రి విడుదల చేయడం వల్ల నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్​లుగా మారుతున్నాయి. దీనికి పరిష్కారంగా నగరాల్లో పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్టులు అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మియావాకీ పద్ధతిలో వేగంగా పెరిగే చెట్లను నాటడం ద్వారా నగర ఉష్ణోగ్రతలను 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గించే అవకాశం ఉందన్నారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీట్ షోల్డర్లు, పేవర్లను తొలగించి వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. గ్రామస్థాయిలో సౌరశక్తితో నడిచే ఎయిర్ కండిషనింగ్ కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా కార్మికులు, పేద ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.