ప్రపంచానికి ట్రంప్ పెద్ద తలనొప్పిలా మారారు. అన్ని దేశాలకూ ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టిన ఇరాన్ యుద్ధంతో ఆయన చెలగాటం ఆడుతున్నారు. యుద్ధాన్ని ఎటూ తేల్చకుండా.. కొనసాగించడం.. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నా.. ట్రంప్‌కు చీమకుట్టినట్టైనా లేదు. అటు ప్రపంచాన్ని.. ఇటు అమెరికానీ జాయింట్‌గా ముంచేస్తున్న ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవి గౌరవాన్ని, హుందాతనాన్ని ఎప్పుడో గంగలో కలిపేశారు. ఈ రాత్రికి ఇరాన్ అవుట్ అంటారు. తెల్లారేసరికి యుద్ధవిరామం ఇస్తారు. ఏకపక్షంగా డీల్ కుదిరిందని ప్రకటిస్తారు. అట్నుంచి అదేం లేదనే ఖండన వచ్చినా పట్టించుకోరు. రోజుకో దేశం పేరు చెప్పి.. అక్కడ డీల్‌పై సంతకాలు చేస్తామని ఊరిస్తారు. కానీ కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ఇరాన్‌ను నాశనం చేస్తామంటారు. ఇదీ ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చి పెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే.. కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా.. వీలుకావడం లేదని ట్రంప్ సలహాదారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఇది నిజానికి ట్రంప్ తల తీసినంత దుస్థితి. కానీ ఆయన మాత్రం షరా మామూలుగా డాంబికం ప్రదర్శిస్తున్నారు. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టుగా.. ఇరాన్ యుద్ధంలో అమెరికానే గెలిచామని ప్రకటిస్తున్నారు. ట్రంప్ ప్రకటనలు చూసి.. ప్రపంచ దేశాల ప్రజలంతా అమెరికాను అపహాస్యం చేస్తున్నారు.
ఇక ఇరాన్ యుద్ధంలో ట్రంప్ లీలలు అన్నీ ఇన్నీ కాదు. కొద్దిరోజుల క్రితం ఇరాన్ నాగరికతను ఒక్కరాత్రిలో నాశనం చేస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్.. కొద్ది గంటల వ్యవధిలోనే తోక ముడిచారు. అదేమంటే ఇరాన్ దారికొచ్చేసిందని కాకమ్మ కథలు చెప్పారు. తీరా ఇరాన్ ప్రకటన చూస్తే.. ట్రంప్‌దంతా డ్రామానేనని తేలిపోయింది. ఆ డ్రామాను ప్రపంచం మర్చిపోకముందే.. ఇప్పుడు మరో డ్రామాకు తెరలేపిన ట్రంప్.. మళ్లీ పాత క్యాసెట్టే వేశారు. ఈ రాత్రికి ఇరాన్‌ను దారుణంగా దెబ్బతీస్తామని చెప్పి.. తెల్లారేసరికి యుద్ధం ఆపేశారు. మళ్లీ డీల్ కుదిరిందని పాత అబద్ధమే చెప్పారు. కానీ ఈసారీ ట్రంప్ తొండాటే ఆడారని ఇరాన్ తేల్చేసింది. అసలు యుద్ధం చేస్తున్నామనే సీరియస్‌నెస్ లేకుండా.. ట్రంప్ పేలుస్తున్న కుళ్లు జోకులు చూసి.. ప్రపంచానికి మతిపోతోంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. ఎవరో వచ్చి ఏదో అంటించుకున్నట్టుగా ఉంది ట్రంప్ తీరు.
ఓవైపు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం గురించి సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతోంది. అంతకుముందే అసలు నష్టం అంచనాల్ని పెంటగన్ తొక్కిపట్టింది. ఈ సంగతి తెలుసుకోవాలనే కనీస బాధ్యత లేని ట్రంప్.. ఇక్కడ ఇరాన్ యుద్ధం ముగించకుండానే.. క్యూబాను ఆక్రమిస్తాం అంటూ వెర్రికేకలు పెట్టడం చూసి.. ట్రంప్‌ను ఏమనాలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతవరకూ హర్మూజ్‌ను తెరిపించలేక.. తిప్పలు పడుతున్న ట్రంప్.. తగుదునమ్మా అని సంబంధం లేని నావికుల్ని మాత్రం బలితీసుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నాయి. చివరకు హర్మూజ్ దగ్గర ఇరాన్ సైన్యం కంటే.. యూఎస్ సృష్టిస్తున్న విధ్వంసమే ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ యుద్ధం పేరుతో ట్రంప్ చేస్తున్న పాతకాల్ని లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదని యుద్ధ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
ఎంత శక్తివంతమైన దేశం అయినా యుద్ధం చేసేటప్పుడు ముందూ వెనుకా చూసుకుంటుంది. కానీ ట్రంప్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని మరీ యుద్ధ రంగంలోకి దిగారు. నెతన్యాహు దారి చెబుతుంటే.. ముందుకెళ్లొచ్చనుకున్నారు. మధ్యలో నెతన్యాహు తప్పుకున్నా కూడా.. ట్రంప్ మాత్రం గంతలు కట్టుకునే యుద్ధం చేశారు. అలా గుడ్డి వ్యూహం పన్నిన ఫలితంగానే ఇరాన్ యుద్ధాన్ని తన నియంత్రణలోకి తీసుకుని.. అమెరికాను అదలించింది. అయినా సరే కళ్లు తెరవాలనే స్పృహ లేని ట్రంప్.. ఇప్పుడు ప్రపంచం కళ్లకు కూడా గంతలు కట్టాలని చూడటమే అసలైన చోద్యం.
అమెరికా అధ్యక్షుడి ప్రతి క్షణం చాలా విలువైనది. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్ లో మరో దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారంటే.. ఏదో కొంపలు మునిగే వ్యవహారంపై చర్చిస్తున్నారని అర్థం. కానీ అలాంటి ఓవల్ ఆఫీస్ ను కూడా ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ పై ఆందోళన ఉన్న తరుణంలో.. ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే పని కట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం.. అదీ యుద్ధానికి సంబంధించి కూడా అబద్ధాలు, అర్ధసత్యాలకే ప్రాధాన్యత ఇవ్వడం.. ట్రంప్ పైత్య ప్రకోపానికి అద్దం పడుతోంది.
ట్రంప్ తీరు చూసిన ప్రపంచం జుట్టు పీక్కుంటోంది. ఇక వైట్ హౌస్ అధికారులకైతే మతిపోతోంది. ఇలాగైతే తమ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవచ్చని వారు మథనపడుతున్నారు. రేపొద్దున ట్రంప్ నిజం చెప్పినా కూడా.. ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కానీ ట్రంప్ కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడటం.. మనసుకు తోచిన పని చేయటానికి అలవాటుపడ్డారు. సమయం, సందర్భం కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కావడం లేదు. ఏకంగా వ్యాపారాల్లో వేలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తల్ని నేరుగా బెదిరిస్తున్నారు. గ్లోబలైజేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అమెరికా అయితే.. అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లోకల్ నినాదం ఎత్తుకున్నారు. ఏ వస్తువైనా అమెరికాలో తయారవ్వాల్సిందే. లేకపోతే భారీగా పన్నులేస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. ఏ వ్యాపారం అయినా అగ్రరాజ్యంలోనే చేయాలని కండిషన్లు పెడుతున్నారు.
అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాలో అరాచకం సృష్టిస్తున్నారు. అమెరికా మౌలిక విలువలపై దాడి చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు కష్టపడి నిర్మించిన అమెరికాను.. చేజేతులా నేలమట్టం చేసేలా ఉన్నారు. తా వలచింది రంభ అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. దశాబ్దాలుగా అమెరికా వినిపించిన వాదనలకు.. విరుద్ధమైన స్టాండ్ తీసుకుంటున్నారు. అదేమంటే గత అధ్యక్షులకు బుర్ర లేదు.. నేనే మేధావినని దబాయిస్తున్నారు. యుద్ధం, ఒప్పందం, రాజకీయం.. ఏదైనా బిజినెస్సే అంటున్నారు ట్రంప్. ఈ తీరుతో ఇతర దేశాలన్నీ బెంబేలెత్తుతున్నాయి. ట్రంప్ తో చర్చలు ఓ ఎత్తైతే.. ఆ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది మరో ఎత్తుగా మారింది. అసలు అజెండాలో లేని అంశాలు లేవనెత్తటం, అనూహ్యంగా వింతగా ప్రవర్తించటం, మిగతా దేశాధ్యక్షుల్ని చిన్నబుచ్చుతున్నారు. ట్రంప్ తీరు ఇలాగే ఉంటే.. అమెరికాతో ఎలాంటి చర్చలకైనా.. ఎవరూ ముందుకు రాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. చర్చలంటే ఎవరి వాదన వారు వినిపిస్తారు. అంతిమంగా డీల్ కుదరొచ్చు.. లేకపోవచ్చు. కానీ గౌరవానికి భంగం కలగకూడదనే షరతు కచ్చితంగా ఉంటుంది. కానీ ట్రంప్ తో మీటింగ్ అంటే మాత్రం .. మొదట గౌరవం వదిలేయాలనే సంకేతం వెళ్లిపోతోంది. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.. నిన్న సౌతాఫ్రికా అధ్యక్షుడికీ ట్రంప్ దగ్గర చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

