Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు

Story

Story

దేశ రాజధానిలో నీట్ లీకేజ్‌కు నిరసనగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆషామాషీగా చూసే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం దశాబ్దాలుగా నలుగుతున్న ఎన్నో ప్రశ్నలకు బలమైన సమాధానాలు చెప్పింది. జెన్‌జీకి దేశం గురించిన ఆలోచన లేదనే మాటను వమ్ముచేస్తూ.. యువత దండు కదిలింది. అలాగే విద్యార్థి ఉద్యమాలు కనుమరుగైపోయిన తరుణంలో.. వేలు, లక్షల సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఏతావాతా ఇకపై రాజకీయ పార్టీల ఆటలు సాగబోవని యువత తేల్చిచెప్పింది. సమస్యలకు ఇలాగే మసిపూసి మారేడుకాయ చేద్దామనుకుంటే.. ఉద్యమాన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తామనే హెచ్చరికలు.. మన పొరుగు దేశాల్లో జరిగిన విద్యార్థులు, యువత ఆందోళనల్ని గుర్తుచేస్తున్నాయి.

ఢిల్లీలో యువ జ్వాల రగులుతోంది. లాఠీ దెబ్బలకూ, టియర్ గ్యాస్‌కు భయపడే బ్లడ్ తమది కాదని నినదిస్తోంది. యువత తల్చుకుంటే దేశం భవిత మారుతుందనే నినాదాన్ని నిజం చేస్తామని గర్జిస్తోంది. ఏతావాతా ఆర్థిక సంస్కరణల తర్వాత కెరీర్‌పై ఫోకస్ చేసిన యువతలో.. ఇప్పుడు వెల్లువెత్తిన ఆగ్రహం ఎటు దారితీస్తుందో పార్టీలకు అంతుచిక్కడం లేదు. ఇట్‌ ఈజ్‌ రైట్ టు రెబెల్ అనే ఈ వాక్యానికి కాలం చెల్లిందనుకునే వాళ్లకు, ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి భారత పార్లమెంట్ మధ్య ఉన్న వీధులు గట్టి జవాబిచ్చాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ యువత గుమిగూడిన సందర్భం అది. ప్రశాంతంగా, ఏ రకమైన ఉద్రిక్తతలు లేకుండా మొదలైన ఈ ఆందోళన పార్లమెంట్ ముట్టడితో కొత్త మలుపు తిరిగింది. విద్యార్థి ఉద్యమానికి ఉన్న శక్తి ఏంటో చాలా కాలం తర్వాత మరోసారి ఎలుగెత్తి చాటింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నిరసనకారుల ఉధృతికి కౌంటర్‌గా పార్లమెంట్‌ గేట్లు మూసేయాల్సిన సందర్భం.. ఇప్పుడు కనిపించింది. చివరకు పోలీసులు కూడా పార్లమెంట్ లోపలి నుంచి బయట ఉన్న ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టాల్సి వచ్చిందంటే.. యువత ఆగ్రహం ఏ స్థాయిలో వెల్లువెత్తింతో అర్ధం చేసుకోవచ్చు.

అలాగని విద్యార్థులు పార్లమెంట్‌కు అలవోకగా ఏమీ చేరుకోలేదు. జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌ దిశగా వేసిన ఒక్కో అడుగుకూ.. నెత్తురు చిందించారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నా.. ఇంకా కొట్టండి అంటూ విద్యార్థినులు కూడా ఎదురెళ్లిన దృశ్యాలు చూసి దేశం నివ్వెరపోయింది. యువత ఉద్యమించిన తీరు చూస్తే.. అసలు ఇదంతా నీట్ లీకేజ్‌కు నిరసనేనా.. లేదంటే కొన్నేళ్లుగా వారి గుండెల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి.. నివురు గప్పిన నిప్పులా ఉండి.. ఇప్పుడు ఎగసిపడిందా అనే సందేహాలు వచ్చాయి. చివరకు యువత వీరోచిత పోరాటం చూశాక.. రెండోదే నిజమని నిర్ధారణ అయింది.

మోడీ పార్లమెంట్ ముందు నిలబడి దేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ఎక్కింది అని చెప్పి లోపలికి వెళ్లి వర్షాకాల సమావేశాలు మొదలుపెట్టగానే, విద్యార్థులు, యువత ఉద్యమాల ఎక్స్‌ప్రెస్ ఎక్కి పార్లమెంట్‌కు చేరుకున్నారు. బలమైన వాదనలు, బలమైన వాస్తవాలు ఉంటే పార్లమెంట్‌ చర్చల్లో తుపానులు అవసరం లేదని ప్రధాని చెప్పి వెళ్లగానే, విద్యార్థి యువత ప్రదర్శన తుపానులా విరుచుకుపడింది. ఏతావాతా ఈ దేశపు యువతలో ఎంత ఆగ్రహం గూడు కట్టుకుందో.. ఎంతటి లోతైన ఆలోచనలు రాజ్యం చేస్తున్నాయో మరోసారి దేశం కళ్లారా చూసింది. ఇక్కడ యువత కేవలం నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకే పరిమితం కావడం లేదు. ఒక్కొక్కరు సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చి.. ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం అంటే ఏమిటో.. రాజకీయ నేతలు ఎలా ఉండాలో.. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో.. తమ రాజీనామా డిమాండ్ ఎలా రాజ్యాంగ బద్ధమో.. సంబంధిత పాఠాలు చూపిస్తూ వివరిస్తున్న తీరు.. దేశ ప్రజలందర్నీ ఆలోచనలో పడేసిందనే చెప్పాలి.

మొన్నటిదాకా విద్యార్థులే దేశ భవిత అని ఉపన్యాసాలు దంచిన నేతలకు.. ఇప్పుడు యువత ఆగ్రహం చూసి నోట మాట రావడం లేదు. యువత నిలదీస్తే ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా అనుభవమయ్యేసరికి.. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కాక తెల్లముఖాలేస్తున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా విద్యార్థి లోకమే చెబుతోంది. తమ డిమాండ్ల చిట్టా చదివి వినిపిస్తూ.. వేటికి బేషరతుగా ఒప్పుకోవాలో.. వేటికి చర్చల ద్వారా పరిష్కారాలు వెతకాలో కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెడుతోంది. ఇప్పటి యువత ఉద్యమాన్ని చూస్తుంటే.. ఇనుప కండరాలు.. ఉక్కు నరాలు ఉన్న యువత కావాలన్న వివేకానందుడి మాటలు గుర్తొస్తున్నాయి. ఇక యువత మేలుకుంటే ఏం జరుగుతుందో చెప్పటానికి చరిత్రలో చాలా ఉదాహరణలున్నాయి. యువరక్తానికి.. విప్లవానికి, కవిత్వానికి.. గట్టి సంబంధం ఉంది. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటివారు యువకులుగా వున్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. 23 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని భగత్‌సింగ్‌ నినదించాడు. 24 ఏళ్ల వయస్సుకే అల్లూరి సీతారామరాజు వందేమాతరం అని విశాఖ మన్యాన్ని చైతన్యబాటలో కదిలించింది . శీతకాలం కోత పెట్టగ/ కొరడు కట్టీ/ ఆకలేసీ కేకలేశానే అనే కవితతో శ్రీశ్రీ 23 ఏళ్ల వయస్సులోనే జయభేరి మోగించారు. ‘పద్దెనిమిదేళ్లు దాటేస్తున్నా.. ఒక్క మంచి కవితా రాయలేదే’ అని మహాకవి జాన్‌మిల్టన్‌ మధనపడ్డాడు. టి.ఎస్‌. ఇలియట్‌ తన మాస్టర్‌ పీస్‌ అయిన ది వేస్ట్‌ ల్యాండ్‌ ను, జాన్‌కీట్స్‌ తన అత్యుత్తమమైన కవిత్వమంతా పాతికేళ్ల లోపే రాసేశారు. నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితినని శ్రీనాథుడే స్వయంగా రాసుకున్నాడు. ఇప్పుడు కూడా కదం తొక్కిన యువత ఉడుం పట్టు పట్టి.. పేపర్‌ లీకేజీలు లేని మరో ప్రపంచానికి.. జవాబుదారీతనంతో కూడిన విద్యావ్యవస్థ ఉండే నవ యుగానికి బాటలు వేసేలా కనిపిస్తోంది.

దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలపై నమ్మకం దెబ్బతింటే, అది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన సమస్యగా మిగలదు. ఆందోళన విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు, అక్కడి నుంచి సమాజానికి విస్తరిస్తుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలకు మూల కారణం కూడా అదే. NEET-UG 2026 పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, పరీక్షల విశ్వసనీయతపై తలెత్తిన సందేహాలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. తమ కష్టానికి తగిన న్యాయం జరగాలనే డిమాండ్‌తో విద్యార్థులు, యువత వీధుల్లోకి వచ్చారు. ప్రారంభంలో ఈ ఉద్యమం ఒక పరీక్షకు మాత్రమే పరిమితమైంది. కానీ క్రమంగా ఇది విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సమాన అవకాశాలపై దేశవ్యాప్త చర్చగా మారింది.

ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలి. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ డిమాండ్లతో ప్రారంభమైన నిరసనలు తర్వాత విస్తృత స్థాయిలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించే దిశగా సాగాయి. ఈ నేపథ్యంలో “చలో సంసద్” కార్యక్రమానికి పిలుపునివ్వడంతో వేలాది మంది ఢిల్లీలో నిరసనకు దిగారు. పార్లమెంట్ వైపు కదిలిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగించారని నిరసనకారులు ఆరోపించగా, పోలీసులు మాత్రం చట్టవ్యవస్థను కాపాడేందుకు అవసరమైన చర్యలే తీసుకున్నామని తెలిపారు.

ఇలాంటి సందర్భాల్లో నిజం ఏదో విచారణలు, అధికారిక వివరాలు చెబుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందిపోలీసు చర్యలే ఇప్పుడు మరో చర్చకు కారణమయ్యాయి. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన ప్రతి పౌరుడి హక్కు. అదే సమయంలో శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడమే ప్రజాస్వామ్య బలం. చట్టాన్ని అమలు చేయడం అవసరమే. అయితే బలప్రయోగం చివరి ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పుడూ చెబుతాయి. దక్షిణాసియాలో ఇటీవలి కాలంలో యువత ఆధ్వర్యంలో ప్రారంభమైన అనేక ఉద్యమాలు ఒక సమస్యతో మొదలై, తర్వాత విస్తృత ప్రజా ఉద్యమాలుగా మారిన ఉదాహరణలు ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ప్రజల అసంతృప్తి భారీ నిరసనలకు దారితీసి రాజకీయ మార్పులకు కారణమైంది.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం క్రమంగా విస్తృత ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా మారింది. నేపాల్‌లో కూడా యువత అవినీతి, సుపరిపాలన, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై పలుమార్లు వీధుల్లోకి వచ్చింది. ప్రతి దేశ పరిస్థితులు వేర్వేరు అయినప్పటికీ, యువత లేవనెత్తిన ఒక సమస్య పెద్ద సామాజిక చర్చగా మారిన సందర్భాలు దక్షిణాసియాలో కనిపించాయి. భారత్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉద్యమం ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రభుత్వం, ఉద్యమకారులు, న్యాయవ్యవస్థ తీసుకునే తదుపరి నిర్ణయాలపై దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పరీక్షపై ప్రారంభమైన అసంతృప్తి, ఇప్పుడు విద్యా వ్యవస్థపై యువతకు ఉన్న విశ్వాసం, పారదర్శకత, జవాబుదారీతనం గురించి దేశవ్యాప్త చర్చకు దారితీసింది. విద్యార్థులు కోరుకుంటున్నది కేవలం ఒక పరీక్షను మళ్లీ నిర్వహించడమే కాదు. తమ కష్టం, ప్రతిభ, భవిష్యత్తు న్యాయంగా అంచనా వేయబడే వ్యవస్థ. ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత పెద్ద బాధ్యత. అదే సమయంలో, ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి సంభాషణ, పారదర్శకత, జవాబుదారీతనమే శాశ్వత పరిష్కారం. లాఠీలు ఒక గుంపును చెదరగొట్టగలవు. కానీ యువత మనసులోని ప్రశ్నలను మాత్రం సమాధానాలే శాంతింపజేయగలవు.