బ్యాంకులో అయితే సొమ్ము భద్రంగానే ఉంటుందనే నమ్మకంతో ఖాతాదారులు బిందాస్‌గా ఉంటారు. కానీ వారికి తెలియకుండానే.. ఏదో ఛార్జీల పేరుతో ఖాతాల్లో నగదు మెల్లగా ఖాళీ అవుతోందనే సంగతి కేంద్రం పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది. ఏకంగా వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులు చేస్తున్న దోపిడీ చూసి.. కస్టమర్లకు కళ్లు తిరుగుతున్నాయి. మినిమం బ్యాలెన్స్, ఏటీఎం లావాదేవీల పరిమితి.. ఎస్‌ఎంఎస్ లిమిట్.. ఇలా పేరేదైతేనేం.. కస్టమర్ల ఖాతాలు ఖాళీ చేయటానికి బ్యాంకులు ఒకదానితో మరోటి పోటీ పడుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు వసూలు చేసిన మొత్తం పాతిక వేల కోట్ల రూపాయల పైమాటే. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రెండూ పోటాపోటీగానే ఉన్నాయి. అదేమంటే ఖాతాలు నిర్వహించినందుకు.. ఏదో రూపంలో ముట్టజెప్పకపోతే ఎలాగనే వాదన ఉండనే ఉంది.
నాలుగేళ్లలో అక్షరాలా రూ. 26 వేల కోట్లు. ఒక్క ఏడాదిలోనే రూ. 7 వేల కోట్లు. ఇదేదో ఆషామాషీ కలెక్షన్ లెక్క మాత్రం కాదు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిసి.. కూడబలుక్కుని ఖాతాదారుల నుంచి వసూలు చేసిన భారీమొత్తాలు. ఇవేవో అల్లాటప్పా వ్యక్తి చెప్పిన లెక్కలు కూడా కాదు. ఏకంగా పార్లమెంట్‌లో కేంద్రమంత్రే స్వయంగా బ్యాంకుల బాదుడు గురించి చెప్పి.. మొత్తంగా దేశం కళ్లు తెరిపించారు. దీంతో మొన్నటిదాకా బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసినా.. అవేముంది.. చిన్న మొత్తమే కదా అని సరిపెట్టుకున్న ఖాతాదారులకు ఈ గణాంకాలు చూసి కళ్లు తిరిగినంత పనౌతోంది. ఈ లెక్కన బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము పెరగటం సంగతి అటుంచి.. తరిగిపోవడం మాత్రం ఖాయమేనని తేలిపోతోంది. ఓవైపు వడ్డీరేట్లు తగ్గి.. జనం బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిస్తోంటే.. అయినా సరే బ్యాంకులు మాత్రం ఉన్న ఖాతాదారుల నుంచి ఛార్జీల వసూలు చేయడంలో మాత్రం తగ్గేదే లేదని తేల్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆర్బీఐ ఖాతాదారులకు ఛార్జీలు విధించడం కంటే అవగాహన పెంచటానికే ప్రాధాన్యమివ్వాలని బ్యాంకులకు సూచిస్తోంది. కానీ ఆర్బీఐ మాటలు ఏ బ్యాంకూ పట్టించుకోవడం లేదన్న విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. మరి దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్‌ను బలోపేతం చేసే విధానం ఇదేనా అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారో బ్యాంకులకే తెలియాలి.
బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోవడం వల్ల కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో ఛార్జీలు వసూలయ్యాయి. కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని సేవింగ్స్, కరెంట్ ఖాతాలపై బ్యాంకులు విధించిన ఛార్జీల వివరాలను ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాను ప్రస్తావిస్తూ ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఖాతాదారుల నుంచి రూ.7,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు దాదాపు రూ.5,000 కోట్లు వసూలు చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ.1,798.14 కోట్లు వసూలు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాలపై రూ.4,948.71 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ.1,798.14 కోట్లు వసూలు చేయగా, యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు బ్యాంకులు కలిపి రూ.2,879.47 కోట్లను వసూలు చేశాయి. ఇది 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం ఛార్జీల్లో 58 శాతం.
గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.10,230.75 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,407.82 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,909.10 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,775.91 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,137.92 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు నాలుగేళ్లలో రూ.15,939.62 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,173.96 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3,623.77 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,431.97 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.4,709.92 కోట్లు వసూలు చేశాయి. గత నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై మొత్తం రూ.26,170.37 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తం వసూళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా సుమారు 61 శాతం కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 39 శాతంగా ఉంది.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలకు ఇలాంటి జరిమానా ఛార్జీలు వర్తించవని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. అయితే ఈ ఖాతాల లావాదేవీలపై బ్యాంకులు కఠిన ఆంక్షలు విధించడంతో.. వీటితో ప్రయోజనం లేదని సామాన్యులు భావిస్తున్నారు. దీంతో విధిలేక అందరూ ఛార్జీలు పడతాయని తెలిసినా.. మినిమం బ్యాలెన్స్ రూల్ ఉండే ఖాతాలకే మొగ్గుచూపుతున్నారు. ఏతావాతా బ్యాంకులు తెలివిగా కస్టమర్లను అట్నుంచి ఇటు మళ్లిస్తున్నాయనడంలో సందేహం లేదు. సర్కారు నిలదీస్తే.. మినిమం బ్యాలెన్స్ రూల్ లేని ఖాతాలు కూడా ఉన్నాయని బుకాయిస్తూ.. వాస్తవంలో అలాంటి ఖాతాల్ని నిష్ప్రయోజనమైనవిగా చిత్రీకరిస్తూ.. బ్యాంకులు ఖాతాదారులతో డబుల్ గేమ్ ఆడుతున్నాయి. ఈ విషయం గురించి ప్రభుత్వానికి చూచాయగా తెలిసినా.. ఏమీ తెలియనట్టే ఉంటోందనే ఆరోపణలూ లేకపోలేదు.
మొత్తం మీద ఎటుపోయి ఎటొచ్చినా.. మినిమం బ్యాలెన్స్ రూల్ ఉండే ఖాతాలే కస్టమర్లు తీసుకునేలా బ్యాంకులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాయి. అవసరమైతే ఆ రూల్ లేని ఖాతాలపై మరిన్ని కఠిన ఆంక్షలకూ వెనుకాడవు. అదేమంటే ఆ మాత్రం కనీస ఛార్జీలు కూడా లేకుండా తమకేం ఫాయిదా ఉంటుందని దబాయిస్తాయి. ప్రభుత్వం పైకి ఎన్ని కబుర్లు చెప్పినా.. అంతిమంగా బ్యాంకుల ఆర్థిక స్థితి చూస్తుందని, ఏమాత్రం తేడా వచ్చినా.. తమ మెడపై ప్రైవేటీకరణ, విలీనం కత్తి వేలాడుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకులు సాకులు చెబుతున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకుల్ని ఆ మాత్రం అడగటానికి కూడా దిక్కు లేదు. అసలే అవి ప్రైవేట్ బ్యాంకులు. మా రూల్స్ మా ఇష్టం అంటాయి. ఇష్టం లేకపోతే ఖాతాలు మూసేసుకోమని ఉచిత సలహా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులే తెగబడి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు.. ప్రైవేట్ బ్యాంకులు చేస్తే తప్పేంటనే లాజిక్‌లకు కొదవే ఉండదు.
నిజానికి గతంలో మాదిరిగా బ్యాంకులకు ఖాతాల నిర్వహణ విషయంలో రిస్క్ లేదు. భౌతిక రికార్డులు పోయి.. అంతా డిజిటలైజేషన్ ప్రక్రియ వచ్చింది. అన్ని ఖాతాలూ సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానమై ఉంటాయి. జస్ట్ ఖాతా నంబర్ కొడితే చాలు.. మొత్తం చరిత్ర అంతా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అలాగే సరికొత్త బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్లు వచ్చాయి. వీటి సహాయంతో బ్యాలెన్స్ షీట్లు, రోజువారీ లావాదేవీల నమోదు కూడా చాలా తేలికగా మారిపోయింది. అయినా సరే బ్యాంకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా పాత పని విధానాన్ని ప్రస్తావిస్తూ.. జబర్దస్తీగా ఛార్జీలు గుంజుతున్నాయని బ్యాంక్ వినియోగదారుల సంఘాలు మొత్తుకున్నా.. వినిపించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పటికీ ఆశ చావక అంబుడ్స్‌మన్ దగ్గరకు వెళ్లిన ఖాతాదారులకు.. బ్యాంకులు వినిపించే వాదన చూసి.. కళ్లు తిరిగినంత పనౌతోంది. ఏదేమైనా బ్యాంకులు ఛార్జీల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాయనే సంగతి బహిరంగ రహస్యం. అంబుడ్స్‌మన్ ఏం ఖర్మ.. స్వయంగా ఆర్బీఐ.. ఆ మాటకొస్తే కేంద్రం చెప్పినా.. బ్యాంకులు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఎక్కువ మాట్లాడితే.. మీరు చెప్పినట్టుగా బ్యాంక్ నడవదు. లాభం కావాలంటే.. ఇలాంటి చిలక్కొట్టుళ్లు తప్పవని సెలవిస్తున్నాయి. దీంతో చేసేదేం లేక.. అటు ఆర్బీఐ.. ఇటు సర్కారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. అప్పటికీ ప్రభుత్వ బలవంతం మీద బ్యాంకులు కొన్నాళ్లు మినిమం బ్యాలెన్స్ రూల్ ఎత్తేశాయి. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అలాగే ఉన్నాయి. కానీ మెజార్టీ బ్యాంకులు మాత్రం ఖాతాదారుల ముక్కు పిండి ఛార్జీలు దండుకోవటానికి అలవాటుపడ్డాయి. పైగా ఖాతాదారులకు నొప్పి తెలియకుండా.. ఛార్జీలు వసూలు చేసే ఈ పద్ధతిలో కావాల్సినంత కిక్ ఉందనే ధోరణితో ఉంటున్నాయి.

