మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి… ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే… అది మానవ జాతి అంతానికే దారితీస్తుందని.. గతంలో స్టీఫెన్ హాకిన్స్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఏఐతో విధ్వంసం తప్పదని ఆ రంగానికి చెందిన నిపుణులే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి మరీ హెచ్చరిస్తున్నారు. చూస్తుంటే. ఏఐ అప్లికేషన్ల పేరుతో అసలు ఏఐ కంపెనీలు ఏం చేస్తున్నాయోననే కొత్త సందేహాలు వస్తున్నాయి. మొన్నటిదాకా గ్రహాంతరావాసులు వచ్చి భూమిని ఆక్రమించుకుంటారని హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. కానీ ఏఐ పుణ్యమా అని మనల్ని మనమే నాశనం చేసుకునే రోజులు ఎంతో దూరంలే లేవనిపిస్తోంది. ఏఐ ఏదో కొత్త సాంకేతికత మాత్రమే కాదు. అంతిమంగా మానవాళి మనుగడకే ముప్పు తెచ్చే మహమ్మారి అని కొందరు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏకంగా దశాబ్దం ముగిసేలా మనుషుల్ని చంపే శక్తి ఏఐకి వస్తుందన్న వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రముఖ సంస్థలు మన ప్రాణాలతో జూదం ఆడుతున్నాయని, ఈ దశాబ్దం ముగిసేలోగా మానవాళి వినాశనానికి దారితీయవచ్చని జాకబ్ కాక్సన్ అనే ఈ పరిశోధకుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ఏఐ , ఆంత్రోపిక్ వంటి సంస్థల్లో పనిచేసిన కాక్సన్.. కోట్ల రూపాయల విలువైన కంపెనీ ఈక్విటీని వదులుకుని మరీ తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ ఘటన, ఏఐ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలను మరింత తీవ్రతరం చేసింది. ఆయన పేర్కొన్నది ప్రకారం, స్వీయ-అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్‌ను సృష్టించేందుకు ఏఐ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ దశాబ్దం ముగిసేలోగా మనందరినీ చంపేసే శక్తి ఏఐకి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అతి త్వరలో ఏఐ వ్యవస్థలు మానవాతీత శక్తులుగా మారి, కీలకమైన సిస్టమ్స్‌ను హ్యాక్ చేయగలవని, రాత్రికి రాత్రే అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవనే అంశం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. అసలు యంత్రం మనిషికి సాయం చేయాలి… కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?
ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు… కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు… అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త ఒక మాట అన్నారు. ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు… కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు. ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం… ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను… అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను మంచి నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో స్టార్‌గేట్ అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్‌కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు… మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.
ఇలాగే అత్యంత కీలకమైన మానవ వనరులను విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు అసాధారణ వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో ఏఐ టూల్స్‌కు కూడా మానవుల మాదిరిగానే ప్రాథమిక హక్కులు కల్పించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఆలోచనను కొందరు ఏఐ నిపుణులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏఐకి హక్కుల ఇవ్వడమంటే.. భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులకు పౌరసత్వం ఇచ్చినట్టే అంటున్నారు. అప్పుడు మానవాళి పెనుముప్పుని కొనితెచ్చుకున్నట్టే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే ఏఐ మోడల్స్ మానవుల మాదిరిగానే ఆలోచిస్తాయి. వాటికి హక్కులు ఇస్తే.. అవి మానవుల మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తాయి. ఏఐ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, దానిని ఆపే అధికారం మానవులకు లేకపోతే అది విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. ఉదాహరణకు కంప్యూటర్ వాడకం తర్వాత దానిని ఆఫ్ చేసినప్పుడు అది ఆఫ్ అవ్వను అని మొండికేస్తే ఎంత ప్రమాదమో, ఏఐ విషయంలో కూడా అదే జరగవచ్చనేది నిపుణుల హెచ్చరిక.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయుధ వ్యవస్థలతో కలిసి పనిచేసినప్పుడు ప్రపంచానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హాలీవుడ్ డైరక్టర్ జేమ్స్ కామెరాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ను సైనిక వ్యవస్థలు, అణు రక్షణతో కలపడం వల్ల వినాశకరమైన పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. టెర్మినేటర్ తరహా ప్రపంచం వినాశనం చెందే ముప్పు ఏఐతో ఉందనేది కామెరాన్ అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం ఏఐ రంగంలో కంపెనీల అనైతిక ధోరణులపై సొంత ఉద్యోగులే చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే.. ఏఐతో వచ్చే సహజముప్పు కంటే.. ఈ అనైతిక ప్రమాణాలతో కంపెనీలు కొనితెచ్చే ముప్పు ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పక తప్పదు. మొత్తం మీద మనిషి తన వినాశనాన్ని తానే సృష్టించుకుంటాడనే మాట.. ఇప్పుడు ఏఐతో నిజమయ్యేలా ఉంది.

