Site icon NTV Telugu

Story Board: లక్షన్నరకు గోల్డ్.. 3 లక్షలు దాటిన సిల్వర్.. పాతికేళ్ల కింద తులం ఎంత వుందో తెలుసా..?

Story Board On Unstoppable

Story Board On Unstoppable

Story Board: బంగారం, వెండి…పరుగులు పెడుతున్నాయి. రేస్‌ ట్రాక్‌లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి, వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70వేలకుపైగా పెరిగితే…వెండి ధరలు మూడు నెలల్లోనే డబుల్ అయ్యాయి. తొలిసారిగా దేశీయ విపణిలో కిలో వెండి ధర రూ.3 లక్షలను మించింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ కాస్త బలహీనపడటం, గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సురక్షితమని భావిస్తున్నారు. బంగారం, వెండిపైకి అధికంగా పెట్టుబడులు రావడమే ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. కమొడిటీల ట్రేడింగ్‌ జరిగే ఎక్స్ఛేంజీలతో పాటు విక్రయశాలల్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నాయి.

నిన్నమొన్నటి వరకు పసిడి గురించి మాట్లాడుకున్నవారంతా…నేడు వెండి ధర గురించి చర్చించుకుంటున్నారు. బంగారంతో పాటు ఇన్నాళ్లు పెరిగిన వెండి.. ఇప్పుడు పసిడిని దాటేసి పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఔన్సు 95 డాలర్లు దాటేసింది. దీన్ని అనుసరించి దేశీయంగానూ వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి 3 లక్షలు దాటింది. ఏడాదిక్రితం తొలిసారి లక్ష మార్కును దాటిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్క్‌ను క్రాస్‌ చేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర లక్షన్నర దాటిపోయింది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర లక్షా 36వేలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు 4,735 డాలర్లకు చేరింది. వెండి ఔన్సు 95 డాలర్లు వద్ద కొనసాగుతోంది.

ఏడాదిలోనే బంగారం ధర 66% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే వెండి ధర దాదాపు 87%పైగా పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు లోహాలు మరింతగా పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సురక్షిత పెట్టుబడులు, వడ్డీ రేట్లు తగ్గడం, రూపాయి విలువ తగ్గడం, సెంట్రల్ బ్యాంక్ దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బంగారంలో పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 2 లక్షల దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. వెండి ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. వెండి సరఫరా లోటు వరుసగా ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. వెండి ధర 2026 చివరి నాటికి కిలోకు 5 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరగడం…వృద్ధి మందగించటం వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయడం ఉత్తమమని సామన్యులు భావిస్తున్నారు. వెండికి ఆభరణాల రంగాన్ని మించి, పారిశ్రామిక గిరాకీ అధికం ఉంది. ధర పెరుగుతున్నందున, ఎక్కువ మంది వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అవసరాలకు అనుగుణంగా వెండి ఉత్పత్తి పెరగకపోవడంతో ఈ లోహానికి డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే బంగారం ధర 59 శాతం మేర పెరగ్గా.. వెండి ధర ఏకంగా 107 శాతం మేర పైకెగిసింది.

ఏ వస్తువు ధరనైనా ప్రధానంగా నిర్ణయించేవి రెండే అంశాలు. అవే సప్లై, డిమాండ్. వెండి ముఖ్యమైన పారిశ్రామిక ముడి పదార్థం. దానికి మార్కెట్ నుంచి భారీ డిమాండ్ ఉంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ ప్యానల్స్, వైద్య పరికరాలు, వాహనాల వైర్లు, బ్యాటరీలు, పారిశ్రామిక ఉపకరణాలు, ఆభరణాలు, గృహోపకరణాలు, నాణేలు, కడ్డీలు, ఫోన్లలోని పలు భాగాల తయారీలోనూ సిల్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం వ్యాపిస్తోంది. చీకటి ఖండం అనే ముద్రను ఎదుర్కొన్న ఆఫ్రికాలోని దేశాల్లోనూ ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అంటే వెండి కోసం ప్రపంచంలో కొత్తకొత్త మార్కెట్లు ఏర్పడుతున్నాయి. అక్కడి నుంచి వెండి కోసం ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాల కంపెనీలు సిల్వర్ నిల్వల కోసం క్యూ కడుతున్నాయి. ఈ డిమాండే వెండి ధరలకు రెక్కలు తొడుగుతోంది. 2025 సంవత్సరం వెండికి ఒక మైలురాయి లాంటిది. రికార్డు స్థాయి గరిష్ఠ స్థాయులను బద్దలు కొట్టింది.

సిల్వర్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం మెక్సికో. అక్కడ పెద్దసంఖ్యలో భారీ సిల్వర్ గనులు ఉన్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే సిల్వర్‌లో 24 శాతం ఒక్క మెక్సికో నుంచే వస్తోంది. దీని తర్వాతి స్థానంలో మన పొరుగుదేశం చైనా ఉంది. వెండి రిఫైనింగ్, ప్రాసెసింగ్, పారిశ్రామిక వినియోగాల్లోనూ చైనా టాప్ ప్లేస్‌లో ఉంది. శుద్ధి చేసిన సిల్వర్‌కు సంబంధించిన ప్రపంచ మార్కెట్‌లో దాదాపు 70 శాతం వాటా చైనా చేతిలోనే ఉంది. రోజూ అంతర్జాతీయ స్థాయిలో జరిగే సిల్వర్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో అతిపెద్ద వాటా షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్, షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లకు ఉంది. వెండి ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానాల్లో పెరూ, చిలీ ఉన్నాయి. ఏటా ఉత్పత్తి అయ్యే మొత్తం సిల్వర్‌లో 50 శాతానికిపైగా ఈ నాలుగు దేశాల నుంచే ప్రపంచ దేశాలకు సప్లై అవుతోంది.

వెండి అనేది అన్ని లోహాల కంటే అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన పదార్థం. అంటే వెండి మీదుగా విద్యుత్‌ చాలా సమర్థవంతంగా ప్రసారం అవుతుంది. ఎందుకంటే దీనిలో ఫ్రీ ఎలక్ట్రాన్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. విద్యుత్ వాహకత విషయంలో రాగి కంటే సిల్వర్ బెటర్. కానీ వెండి ధర ఎక్కువ. సిల్వర్‌ను సులభంగా తీగలుగా మార్చడం కష్టం, అందుకే దీన్ని వైర్లలో వినియోగించరు. కానీ సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్ కాంటాక్ట్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, చిప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, టెలికాం నెట్‌వర్క్‌లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తుల తయారీలో వెండిని ఉపయోగిస్తారు. అంటే ఈ అన్ని రంగాల పరిశ్రమల నుంచి వెండి కోసం ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. 2016 సంవత్సరం నాటికి ప్రపంచ మార్కెట్‌‌కు 489.5 మిలియన్ ట్రాయ్ ఔన్సుల వెండి అవసరం. ఇది కాస్తా 2024 నాటికి 680.5 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు పెరిగింది. 2025లో భారత్ 6,000 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. గత 8 ఏళ్లలో వెండిపై ఆధారపడి పనిచేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగానే వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.

బంగారం, వెండి ధరల దూకుడు ఫలితంగా…అంతర్జాతీయంగా అత్యధిక మార్కెట్‌ విలువ పరంగా అగ్రగామి కంపెనీలు కూడా వెనుకబడ్డాయి. ప్రపంచ స్వర్ణమండలి అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా బంగారం నిల్వలు 2,16,225 టన్నులు, వెండి 17,51,000 టన్నులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ బంగారం మార్కెట్‌ విలువ 32.54 లక్షల కోట్లు ఉంటే…సిల్వర్‌ 5.28 లక్షల కోట్లుగా ఉంది. ఎన్‌విడియా విలువ 4.5 కోట్లు, యాపిల్‌ 3.95 కోట్లు, గూగుల్‌ విలువ 3.83 కోట్లుగా నిపుణులు విలువ కట్టారు. మొన్నటికి మొన్న వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్‌ చేసి ఆ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన ట్రంప్‌.. మరోవైపు ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అంతలోనే అమెరికా భద్రతను సాకుగా చూపుతూ గ్రీన్‌లాండ్‌పై మనసుపడిన ట్రంప్‌.. ఆ దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దూకుడుగా అడుగులు వేస్తున్నారు. తద్వారా ప్రపంచాన్ని మరోసారి అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి సురక్షితమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గణనీయంగా పెరగడానికి ఇదే కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతుండడంతో వైట్‌ గోల్డ్‌కు ఎప్పుడూలేనంత డిమాండ్‌ ఏర్పడింది.

మిడిల్ క్లాస్‌ మెంటాలిటీ మారిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫోకస్‌ చేస్తున్నారు. అయితే ఇందులో ఏది ఎక్కువ ఇన్‌కం ఇస్తుందని ఆరా తీస్తున్నారు. భూమి కొంటే బెటరా ? బంగారమా ? లేదంటే సిల్వరా ? అంటే…మూడు సేఫేనని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం, వెండి కంటే భూమి మీద ఎక్కువ లాభాలు వస్తాయని అంటున్నారు. నగరాల్లోనైనా, శివార్లలోనైనా, ఊళ్లల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లూ ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది. ఫ్లాటా… ప్లాటా? ఇల్లా… స్థలమా? కొనేటప్పుడు చాలా మందిని…ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాటో, ప్లాటో కొన్న తరువాత బాధ పడటమూ సహజం. అయ్యో.. ఇక్కడ ఫ్లాట్‌ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే… లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్‌ కొనుక్కుని ఉండాల్సిందే… అనుకుంటూ ఉంటారు.

దేశంలో భూములపై పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని రియల్ ఎస్టేట్ నిపుణుల సూచన. ప్రతీ కుటుంబం నివసించడానికి స్థలం అవసరం. అందువల్ల భవిష్యత్ లో భూమి డిమాండ్ పెరగడమే కానీ.. తగ్గవని అంటున్నారు. అత్యవసం లేదని అనుకుంటే భూమిపై పెట్టుబడి సురక్షితమైనదని భావిస్తున్నారు. వ్యవసాయం భూములపై పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి. అయితే భూములపై పెట్టుబడి పెట్టడం మంచిదే.. కానీ తక్షణ ఆదాయం కావాలంటే మాత్రం వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం స్థలం ధరలు, భవన నిర్మాణాల ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజలకు ఇది దూరంగా ఉంది. ఇందులోనూ కొన్ని వివాదాస్పద భూములు ఇబ్బంది పెడుతాయి. భవిష్యత్తులో అభివృద్ధి లేకపోతే లేదా ప్రాంతం ఆశించిన వేగంగా మారకపోతే అభివృద్ధి మందగించవచ్చు. ఒక్కోసారి కొనుగోలు చేసిన ధరకు భూమి విక్రయం కాకపోవచ్చు.

బంగారానికి ప్రస్తుతం ఆర్థిక అస్థిరత, ఊహిత వృద్ధి లోపం, ద్రవ్యోల్బణం వంటి కారకాలు సహకరిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధిస్తే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ స్థలం మాత్రం అందరికీ అవసరం ఉంటుంది. అయితే బంగారం అవసరం మేరకు కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే భూములపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అయితే అప్పులు చేసి స్థలాలు, భవనాలపై పెట్టుబడులు పెట్టొద్దు. కచ్చితంగా నివాసం కోసం ఇల్లు లేదా స్థలం కొనాలంటే మాత్రం 80 శాతం రుణం తీసుకోవచ్చు. ఈ రుణం తీర్చడానికి అవకాశాలు ఉండాలి. అప్పుడే భూమిపై పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది.

స్థలాలతో పోలిస్తే.. ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80-90 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తుంటాయి. రీపేమెంట్‌ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలూ ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్సు, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60-70 శాతమే రుణం ఇవ్వొచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిర్ణీత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి, రేటు రీజనబుల్‌గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్‌ ఉన్న ప్రాంతమైతే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే, సమయం వచ్చినప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి.

బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్‌ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. ఇది కాయిన్స్‌, బార్స్‌, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని భావించే వారు…బంగారాన్ని బిస్కెట్ల రూపంలో…వెండిని బ్రిక్స్‌ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారు ఆభరణాలు అంటే…భారతదేశంలో ఆశపడని మహిళ ఉండరు. ప్రతి మహిళకు తొలి బలహీనత బంగారమే. బంగారాన్ని అలంకరణ ఆభరణంగా మాత్రమే ఎక్కువ మంది ఆడవాళ్లు చూస్తారు. నిజానికి ఆభరణం అనే ఆలోచనే మగువలను ఊహించని దెబ్బ తీస్తోంది. బంగారం…24 క్యారెట్స్‌ కొని పెట్టుకొంటేనే లాభం. ఆర్నమెంట్‌ బంగారం కొన్నారో… మీ పని అయిపోయనట్లే. మీకు బంగారం ఉందనే ఫీలింగ్‌ ఉంటుంది తప్పా…దాన్ని వల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు. బంగారు ఆభరణాలను…22 క్యారెట్స్ రూపంలో అమ్ముతారు. ఆ ఆభరణాల్లో మళ్లీ రాళ్లు కలుపుతారు. రాగి కలుపుతారు..తరుగు తీస్తారు. దీంతో ఆ బంగారం తన సహజత్వాన్ని కోల్పోతుంది. 24 క్యారెట్స్‌ బంగారం కాస్త… 22 క్యారెట్స్‌ అయ్యాక…అది ఆభరణంగా మారిపోతుంది. దాని విలువ కూడా అదే స్థాయిలో పడిపోతుంది. బంగారం ఆర్నమెంట్‌గా మారిన తర్వాత…దాన్ని విలువ పడిపోతుంది. ఏ మహిళ ఆభరణాలు రోజు పెట్టుకోలేరు. ఏడాదిలో ఒక మహిళ…యావరేజ్‌ మీద 5 సార్లు పెద్ద ఆభరణాన్ని పెట్టుకుంటే మహా గొప్ప. అదే పెద్ద పెద్ద ఆభరణాలను కేవలం బీరువాల్లో పెట్టుకోవడానికి…లాకర్లలో దాచుకోవడానికే సరిపోతుంది.

గత రెండు నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకా పెరుగుతాయా ? లేక పడిపోతుందా అని ప్రజలే కాదు, వ్యాపారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఇంతకంటే పెరుగుతుందా…అనుకునే లోపే అంతకు మించి రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. లక్ష మార్కు టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే…ఇప్పుడు లక్షా 50వేలకి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో, లేక తగ్గుతుందో అస్సలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో 10గ్రాములు బంగారం 70వేలకుపైగా పెరిగింది. అంటే దాదాపు 54%పైగా పెరిగిందన్నమాట. ధరల పెరుగుదల అంశం సంబంధిత వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశాలు…మార్కెట్‌ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. బంగారం, వెండి ధరలు గతంలో తగ్గడానికి 40శాతం, పెరగడానికి 60శాతం అవకాశాలు ఉండేవి. కానీ ఇపుడు అది కాస్తా 20-80శాతంగా మారిపోయింది. దాదాపు ధరలు పెరగడానికే అవకాశాలున్నాయి. గతంలో ఎప్పుడైనా ధర వెయ్యి పెరిగితే 300-400 తగ్గి మళ్లీ వెయ్యి రూపాయలు పెరిగేది. కానీ ఇపుడు 100 రూపాయలు తగ్గితే 500 పెరుగుతోంది. గోల్డ్ మళ్లీ ఇంకా తగ్గిపోతుందని…70, 80వేలకు వస్తుందనే ఆశల్లేవు. ఐదారు వేలు తగ్గితే తగ్గొచ్చు. తగ్గుతుందనే ఆలోచనకంటే డబ్బులు ఉన్నపుడు బంగారం కొద్ది మొత్తంలో కొనిపెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గోల్డ్..లక్షన్నర దగ్గరకి వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. మీకు గుర్తుందో లేదో పాతికేళ్ల కింద తులం ఎంత వుందో తెలుసా ? జస్ట్ నాలుగు అంటే నాలుగువేలు..ఇప్పుడు లక్షా 50 వేలు పలుకుతోంది. అప్పుడు నాలుగుతులాలు కొని పెట్టుకున్నా…ఇప్పుడు 6 లక్షలు అయ్యేది. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా ? ఈ ఏడాది చివరి నాటికి లక్షణంగా 2 లక్షలు దాటేస్తుందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో రెండేళ్లలోనే 4 లక్షలు దాటేస్తుందని అంటున్నారు. 2020లో తులం 48 వేల 650 పలికింది. ఇప్పుడు లక్షన్నరకు దగ్గరలో ఉంది. అంటే 5 ఐదేళ్లలో ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇలా చూసినా అతి త్వరలోనే 2లక్షలు కావడం ఎంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధర ఎలా పెరిగిందనే విషయానికొస్తే…1975లో తులం బంగారం ధర 540, 1980లో 1,330, 1990లో 3,200గా ఉంది. 2000లో తులం 4,400 ఉంటే… 2005లో ఏడు వేలు అయింది. అంటే రెట్టింపుకు ఒక్క వెయ్యి తక్కువ. 2010 నాటికి 18వేల 5 వందలు అయింది.ఈ పదేళ్ల గ్యాప్‌లోలో తులంపై 14 వేలు పెరిగింది. 2015 వరకు పదిగ్రాములు 26 వేల 3 వందల 43 అయింది. ఈ ఐదేళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48 వేల 650కి చేరింది. యఈ ఐదేళ్ల లో దాదాపు డబుల్ అయింది. 2021లో 50 వేల 45 రూపాయలు, 2022లో 52 వేల 9వందల 50, 2023లో 60వేల 3వందలు, 2024లో 78 వేలు అయింది. జెట్ స్పీడ్‌తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 సెప్టెంబరు 23 నాటికి లక్షా 19వేలకు చేరింది. అక్టోబరులో దాని ధర…లక్షా 35వేల 250గా ఉంది. 25 ఏళ్లలోనే బంగారం ఎంత పెరిగిందో తెలుసా..లక్షా 21 వేలకు పైగా హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది. గోల్డ్ తప్ప ఏది కొన్నా..ఈ స్థాయిలో రాబడి వుండదు. అందుకే మీరూ ఇంకో ఆలోచన చేయకండి..చేతిలో డబ్బు ఉంటే వెంటనే గోల్డ్ కొనేయడం బెటర్.

గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు..ఎందులో పెట్టుబడి పెడితే బెటర్. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో..ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్ కే జైకొడుతున్నారు. పాతిక, ముప్పై ఏళ్ల కిందట కారు ధరతో కాంపేర్ చేయొచ్చు. 1990లో 1 కిలో బంగారంతో మారుతి 800 వచ్చేది. ఒక కిలో బంగారం కొనుగోలు చేస్తే…2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనే స్థాయికి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్స్న్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొని ఉంటే..ఇప్పుడు లక్షన్నరపైనే సంపాదించారన్న మాట. ఏ బ్యాంక్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసినా ఈ రేంజ్ లో రిటర్స్న్ ఉండవు.

చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలనిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తోంది. బయట అప్పుకు ఇచ్చినా..వడ్డీ సంగతేమోగానీ అసలైనా వస్తుందో రాదోననే టెన్షన్. డబ్బు విషయంలో ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. అందుకే ఎక్కువమంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతుంటారు. సో మీరు ఇప్పుడు తొందరపడకపోతే 2030 నాటికి 4 లక్షలు అవుతుంది. బ్యాంక్‌లో లక్ష డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ లక్ష రెట్టింపు కావాలంటే పదేళ్లకుపైగా పడుతోంది. అదే గోల్డ్ కొంటే నాలుగైదేళ్లలోనే డబుల్ ధమాకా అవుతోంది. లక్షకు రెండు లక్షలు ధగధగ చేతుల్లో మెరిసిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్‌ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి.

మనదేశంలో బంగారం ఎమోషన్.. నీ ఇల్లు బంగారం కాను.. ప్రతిదానికీ బంగారం లాంటి మనిషి, బంగారు కొండ.. ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో.. ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండటంతో.. గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారు నిల్వ చేయడం సంప్రదాయం. గోల్డ్‌ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. ధగధగలాడే బంగారు ఆభరణాలతో తళతళ మెరిసిపోవాలనుకుంటారు. అంతే కాదు ఎవరికి ఎంత బంగారముంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీల్ అవుతుంటారు మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలపుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్‌సు ప్రదర్శిస్తుంటారు.ఒంటిమీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లనే అని మన ఆడవాళ్ల నమ్మకం.

ఎలా చూసినా గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లలకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాలు దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమోగానీ.. కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికితోడు రిస్క్ లేని పెట్టుబడి.రిటర్స్న్ ఎక్స్ ఫెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడుల్ని మళ్లిస్తున్నారు.మొత్తానికి భవిష్యత్ లో బంగారం ఆశాశమే హద్దుగా రాకెట్ లా దూసుకుపోబోతున్నాయి. సో మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే గోల్డ్ కొనేయడం ఉత్తమం..లేదంటే అప్పుడు ఎందుకు కొనకపోతిమా అని బాధపడాల్సి వస్తోంది.

 

Exit mobile version