Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board On Gold And Silver Prices Crash Reasons Behind The Fall And Future Outlook

Story Board: బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? భవిష్యత్తులో మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా..?

Published Date :February 3, 2026 , 8:50 am
By Sudhakar Ravula
Story Board: బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..? భవిష్యత్తులో మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన టారిఫ్స్, డాలర్ పతనం వంటి వివిధ కారణాలతో భారీగా పెరిగాయి బంగారం ధరలు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత మేర సర్దుమణగడంతో పాటు డాలర్ ఇండెక్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండడంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధర పతనం అవుతోంది. బంగారం, వెండి ధరలు ఎంత వేగంగా రికార్డులు సృష్టించాయో, అంతే వేగంగా పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పతనం కావడంతో ఆ ప్రభావం ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో కనిపిస్తోంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఢమాల్ అని పడిపోయాయి. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.9,050 పతనమైంది. రూ.1,60,580 నుంచి రూ.1,51,530కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.8,300 పతనమైంది. రూ.1,47,200 నుంచి రూ.1,38,900కి చేరుకుంది.

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 2.26 శాతం అంటే రూ.3,217 తగ్గి రూ.1,39,000 ధరలో ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 6.52 శాతం అంటే రూ.17,322 తగ్గి రూ.2,48,330 ధరలో ట్రేడ్ అవుతుంది. గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో 5500 డాలర్లు దాటిన ఔన్స్ బంగారం ధర ఇప్పుడు 4500 డాలర్ల దిశగా తగ్గుతోంది. ప్రస్తుతం 4675 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఔన్స్ వెండి ధర 79.45 డాలర్లుగా ఉంది. ఈ సమయంలో బంగారం, వెండి లోహాలను కొనుగోలు చేయడానికి ఇది అనువైన సమయమేనా..? అనే సందేహం వినియోగదారుల్లో నెలకొన్నది. ధరలు ఇంకా తగ్గుతాయా..? లేదంటే మళ్లీ పెరుగుతాయా అనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా రికార్డు స్థాయి ధరలతో బంగారం కొనడమెలాగా అని ఆందోళనపడ్డ మహిళలకు.. ధరల తగ్గుదలతో కొత్త ఉత్సాహం వచ్చింది. అయితే ధరలు మరింత తగ్గుతాయని కొందరు.. లేదు మళ్లీ పెరుగుతాయని మరికొందరు అంచనాలు వేస్తుండటం.. వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతోంది. దీంతో ఇప్పుడు కొంటే.. రేపు ధర తగ్గాక బాధపడాలేమో అనే ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో రేపు ధర పెరిగితే.. లాభపడతామనే యోచన వారిని కుదురుగా ఉండనీయడం లేదు. మొత్తం మీద ఇప్పుడు శుభకార్యాలు, పెళ్లిళ్లు పెట్టుకున్నవారికైతే బంగారం, వెండి ధరల తగ్గుదల శుభవార్తే అనే అభిప్రాయాలున్నాయి. కేవలం పెట్టుబడి కోణంలో కొనాలంటే మాత్రం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏదేమైనా బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు మధ్యతరగతి బలైందనే అభిప్రాయాలున్నాయి. బంగారం,వెండిపై వీరికి సాధారణంగానే ఉండే మోజుకి.. అనూహ్యంగా పెరిగిన ధరలు ఊతమిచ్చాయి. ధరలు పెరిగినప్పుడు పెట్టుబడి పెడితే లాభాలు కళ్లచూడొచ్చని ఆశపడ్డ మిడిల్ క్లాస్‌కు హఠాత్తుగా తగ్గిన ధరలు షాకిచ్చాయి. వీరికి సమాచారం ఆలస్యంగా తెలియడంతో.. మధ్యతరగతి మదుపర్లకు నష్టాలు తప్పలేదు. మామూలుగా ఇలాగే ఆశల నిచ్చెన వేసుకుని కొనుగోళ్లు చేసే రియల్ ఎస్టేట్‌లో కూడా మిడిల్ క్లాసే బాధితవర్గంగా ఉంటోంది. ఇప్పుడు దానికి బంగారం, వెండి మార్కెట్లు తోడయ్యాయనే అభిప్రాయాలున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త లాభాలపై ఆశలు పెట్టుకోవడం.. షరామామూలుగా నష్టపోవడం మధ్యతరగతికి తప్పని దుస్థితిలా మారింది. ఎప్పటిలాగే అగ్రరాజ్యాలు ఆడిన రాజకీయ క్రీడ, డాలర్ డ్రీమ్స్, పెద్ద స్థాయి మదుపర్లు సృష్టించిన కృత్రిమ డిమాండ్.. చివరకు మిడిల్‌క్లాస్ మదుపర్లను నిండా ముంచిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు బంగారం ధర ఇంకా తగ్గితే ఇక ఏం జరుగుతుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. ఇదే కోవలో జారుడుమెట్లపై ఉన్న బంగారం, వెండి ధరలు మరీ దిగువకు తగ్గితే.. ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందేమోననే ఆందోళన కూడా లేకపోలేదు.

బంగారం, వెండి ధరల తగ్గుదల ప్రభావం కమోడిటీ మార్కెట్‌పైనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్‌లపై కూడా గట్టిగా పడింది. కొన్ని ఫండ్స్ ఏకంగా 20 శాతం వరకు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బంగారం, వెండి ధరల్లో ఇంతటి భారీ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను ముంచేయకుండా ఉండేందుకు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 1 నుంచి గోల్డ్ , సిల్వర్ ఈటీఎఫ్‌లపై 20% సర్క్యూట్ పరిమితిని విధించింది. అంటే ధరలు ఒకే రోజులో 20 శాతం కంటే ఎక్కువ పెరగడానికి లేదా తగ్గడానికి వీలుండదు. ఇది ఇన్వెస్టర్ల సొమ్మును రక్షించడానికి తీసుకున్న నిర్ణయం.

గత ఏడాది బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది. అయితే ప్రస్తుతం దిగుమతి సుంకం దాదాపు 6 శాతంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం దిగుమతులపై 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ,1 శాతం అగ్రికల్చర్ సెస్ కలిపి మొత్తం 6 శాతం టాక్స్ విధిస్తున్నారు. వెండి విషయంలోనూ అర్హులైన భారతీయ నివాసితులకు ఇదే 6 శాతం వర్తిస్తుండగా.. ఇతరులకు మాత్రం ఏకంగా 36 శాతం సుంకం విధిస్తున్నారు. వీటికి అదనంగా రెండు లోహాలపై 3 శాతం జీఎస్టీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 20 నుండి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి ప్రకటించినా.. అది బంగారం, వెండి ఆభరణాలకు వర్తించదని నిపుణులు స్పష్టం చేశారు.

బడ్జెట్ సమయంలోనే అంతర్జాతీయ పరిణామాలు తోడవడంతో గోల్డ్, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గరిష్ట స్థాయిల నుండి బంగారం ధర దాదాపు 20 శాతం మేర తగ్గుదలను చూసింది. వెండి ధరలో పతనం ఇంకా ఎక్కువగా ఉంది. ఏకంగా 36 శాతం క్షీణించింది వెండి. బంగారం, వెండి ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరడంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పతనం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తుండగా, కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరటనిస్తోంది.

ఇటీవల బంగారం, వెండి ధరల పతనాన్ని.. భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా నిపుణులు చెబుతున్నారు. ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉందంటున్నారు. భారీగా ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా, దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఊగిసలాట కొనసాగవచ్చని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో మళ్లీ బలపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ధరలు భారీగా తగ్గినప్పుడు కొనుగోలుదారులు మార్కెట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, ఈ స్థాయి పతనం ఒక రకమైన అనిశ్చితిని సృష్టించింది. మార్కెట్ మరిన్ని కనిష్టాలను తాకుతుందా లేక ఇక్కడి నుంచి పుంజుకుంటుందా అనే డైలమాలో ఇన్వెస్టర్లు ఉన్నారు. అయితే వివాహాలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ధరల పతనం కొనుగోలుదారులకు కొంత ఊరటగా మారుతోంది. అయితే మార్కెట్‌లో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద పతనం జరగడం బులియన్ ట్రేడర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

మొత్తం మీద ఉక్రెయిన్ యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ నిరాశావాదంలో కూరుకుపోయిన ప్రపంచాన్ని.. అంతకంతకూ పెరుగుతూ పోయిన బంగారం,వెండి ధరలు బాగా భయపెట్టేశాయి. చివరకు బంగారం కీలక పాత్ర పోషించే కొత్త మనీ మోడల్ వస్తుందనే వరకూ ఆందోళన పెరిగింది. కానీ హఠాత్తుగా ఆ ఆందోళనకు తెర దించుతూ విలువైన లోహాలు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ప్రపంచం త్వరలోనే కుదుటపడుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉందిలే మంచికాలం ముందుముందునా అనే ఆశావాదం మొగ్గతొడుగుతోంది. ఆ రకంగా చూస్తే.. బంగారం, వెండి ధరల పతనం.. ప్రపంచానికి సానుకూల సంకేతాలిచ్చిందనే చెప్పాలి.

నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు మారుతుండటంతో డాలర్ విలువ పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. దీనికి తోడు, ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చేయడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఛైర్మన్‌గా డొనాల్డ్‌ ట్రంప్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడం కూడా బంగారం, వెండి ధరల పతనానికి కారణమై ఉండవచ్చని మరికొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను ప్రతిపాదించిన వార్తే ఈ భారీ పతనానికి కారణమైందని, కానీ అంతకుముందే మార్కెట్ పడిపోవడానికి కావాల్సిన పరిస్థితి తయారై ఉందని, ఈ వార్త కేవలం ఓ సాకు మాత్రమేనంటూ విశ్లేషణలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కూడా ట్రంప్ ప్రకటనను స్వాగతించారు. ఈ క్లిష్ట సమయాల్లో ప్రపంచంలోని అత్యంత కీలకమైన సెంట్రల్ బ్యాంకును నడిపించడానికి కెవిన్ ఒక అద్భుతమైన ఎంపిక అని ఆయన అన్నారు. కెవిన్ వార్ష్ గతంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డు గవర్నర్‌గా సేవలందించారు. ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభ కాలంలో ఆయన పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను మార్కెట్లు ఒక హాక్‌గా చూస్తాయి. అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కఠిన వైఖరి అవలంబించే వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది.

వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో సడలింపుల కంటే కఠిన విధానాలకే మద్దతు ఇస్తారన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గాలంటే అవసరమైతే అధిక వడ్డీ రేట్లు కొనసాగించడంలో వెనకడుగు వేయరన్న అభిప్రాయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ఈ అంచనాలే మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీశాయి. కెవిన్ వార్ష్ నేతృత్వంలో ఫెడ్ పనిచేస్తే, అమెరికన్ డాలర్ మరింత బలపడుతుందన్న భావన మార్కెట్‌లో ఉంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే డాలర్‌లో ట్రేడ్ అయ్యే ఈ కమోడిటీల ధరలు, బలమైన డాలర్ నేపథ్యంలో ఖరీదైనవిగా మారుతాయి. ఫలితంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బంగారం నుంచి నిష్క్రమించడానికి మొగ్గు చూపుతారు. వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగా ఉంటాయన్న అంచనాలు, డాలర్ బలపడటం, బాండ్ యీల్డ్‌లు పెరగడం వంటి అంశాలు కలిసి సేఫ్ హెవెన్‌గా భావించే బంగారంపై కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ నియామకం ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా, మార్కెట్లు సాధారణంగా భవిష్యత్ అంచనాలకే ముందుగా స్పందిస్తాయి. కెవిన్ వార్ష్ పేరు బలంగా వినిపిస్తే, తాత్కాలికంగా బంగారం, వెండిపై ఒత్తిడి కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఫెడ్ అధికారిక విధాన ప్రకటనలే దిశానిర్దేశం చేయనున్నాయి.

అదే సమయంలో బంగారం, వెండి ధరల పతనానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న సంకేతాలు రావడం ప్రధాన కారణమని అంచనాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య ఫ్లోరిడాలో జరిగిన చర్చలు కొత్త ఆశలను చిగురింపజేశాయి. శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం అని వారు ప్రకటించడం పెట్టుబడిదారుల ఆలోచనా ధోరణిని మార్చేసింది. సాధారణంగా యుద్ధాలు లేదా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బు కోల్పోకుండా ఉండటానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెడతారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అందుకే ధరలు పెరిగాయి. ఇప్పుడు ట్రంప్-జెలెన్‌స్కీ శాంతి చర్చల వల్ల యుద్ధం ముగిసిపోతుందనే నమ్మకం పెరిగింది. దీనివల్ల భయం తగ్గి, పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బు తీసి ఇతర రంగాల్లో పెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది.

ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. శాంతి నెలకొన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య 90 శాతం శాంతి ఒప్పందం కుదిరిందనే వార్త రాగానే మార్కెట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్‌ తగ్గిపోయింది. రిస్క్ తగ్గితే సహజంగానే బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు వెళ్లే వారు తగ్గుతారు. తద్వారా ధరలు పడిపోతాయి. దీనికి తోడు రష్యా ప్రపంచంలో బంగారం, వెండిని ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో ఒకటి. యుద్ధం వల్ల రష్యాపై ఉన్న ఆంక్షలు సరఫరాను తగ్గించాయి. శాంతి చర్చలు సఫలమైతే, రష్యా నుంచి మెటల్స్ సరఫరా మళ్ళీ పుంజుకుంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి.

అమెరికా డాలర్‌ను బలహీనం చెయ్యడానికి చైనా చాలాకాలంగా భారీస్థాయిలో బంగారాన్ని కొనిపెట్టుకుంటోంది. రేట్లు పెరగడానికి అదీ కూడా ఒక కారణం. ఇప్పుడు చైనాకు కౌంటర్‌గా ఫెడరల్ రిజర్వ్‌ కు కెవిన్ వార్ష్‌ను నియమించి, డాలర్ బలోపేతానికి ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. కెవిన్ వార్ష్ ఫెడ్ రిజర్వ్ పగ్గాలు చేపట్టనున్నారు..ఇక డాలర్‌ రేటు డామినేషన్‌కు తిరుగుండదన్న వార్లు కూడా బంగారం రేట్లను పడేశాయి.కెవిన్ వార్ష్‌ రాకతో వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలపడుతుందని కొందరు అంచనా వేస్తుంటే, మరికొందరు అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని భావిస్తున్నారు. రెండింటిలో ఏది జరిగినా, డాలర్ బలపడటం ఖాయంగా భావిస్తున్నారు. దీంతో బంగారం అమ్మకాలపై ఒత్తిడి పెరిగింది. ఎలా చూసినా అమెరికా డాలర్ బలపడేకొద్దీ.. బంగారం ధర పతనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో డాలర్‌ ను బలహీనపరచటానికి ఇదే సమయం అని ప్రపంచ శక్తులు భావిస్తాయా.. లేదంటే కరెన్సీ పోరు తర్వాత మొదట ఆర్థికవ్యవస్థను కుదుటపరచాలనే ఆలోచనకు ఓటేస్తారా అనేది బంగారం, వెండి ధరల భవిష్యత్తును నిర్దేశిస్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతానికి డాలర్‌కు ఝలక్ ఇచ్చామని భావిస్తున్న ప్రపంచ శక్తులు.. కొంతకాలం వెనకడుగు వేసి.. మళ్లీ పరిస్థితులు కుదుటపడ్డాక.. అదను చూసి ముందుడగేస్తాయనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి నిజం కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపర్లు కోరుకుంటున్నారు. అసలు డాలర్ బలం జోలికి పోకుండానే.. అమెరికా ఆట కట్టించే మార్గాలు కూడా వెతకాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. మరోవైపు డాలర్‌ డామినేషన్‌ తగ్గించేందుకు చైనాతో సహా కొన్ని దేశాలు టన్నులకొద్దీ బంగారాన్ని పోగేసుకున్నాయి. ఇప్పుడు అమెరికా కౌంటర్‌ స్ట్రాటజీతో గోల్డ్ బబుల్ ఒక్కసారిగా పేలింది. మరి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంకా తగ్గుతాయా? కోలుకుంటాయా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

గత ఏడాది నుంచి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల డిమాండ్ పెరిగి రికార్డులమీద రికార్డులు సృష్టించింది. ఈ పెరుగుదల అనుభవజ్ఞులైన వ్యాపారులను కూడా ఆశ్చర్యపరిచింది. ధరలలో భారీ హెచ్చుతగ్గులకు కారణమైంది. కరెన్సీల విలువ బలహీనపడడం, ఫెడరల్ రిజర్వ్ స్వేచ్ఛపై ఆందోళనలు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో జనవరిలో హెచ్చుతగ్గులు తీవ్రమయ్యాయి. అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, సెనేట్ డెమోక్రాట్ల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ముప్పు నుంచి మరోసారి బయటపడింది. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ సంకేతాలివ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. భారత్‌లో భౌతిక బంగారం ప్రీమియంలు దశాబ్ద కాలంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. పన్ను పెంపు అంచనాల నేపథ్యంలో పెట్టుబడి డిమాండ్ బలంగా ఉంది. ఆభరణాల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. చైనాలో సైతం పెట్టుబడి ఆసక్తి కారణంగా ప్రీమియంలు పెరుగుతున్నట్లు మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్‌పై విశ్లేషకుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధరలు తాత్కాలికంగా ఇంకా దిగివచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే.. ధరలు మళ్లీ కోలుకుని ఈ ఏడాది సగటున ఔన్సుకు $5,375 స్థాయిలో ఉండవచ్చనేది మరికొందరి అంచనా.

బంగారం, వెండి ధరలు ఎక్కువగా పతనం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ విలువైన లోహాలు భారీ పతనాలు చూశాయి. ఒక్కోసారి ఒక్కో కారణంతో డౌన్‌ అయ్యాయి. 1980 నాటి భారీ పతనం మొన్నటి వరకు అతిపెద్దదిగా బలియన్ మార్కెట్ నిపుణులు చెబుతారు. 1980లో బంగారం ధర ఆల్-టైమ్ హైకి చేరింది. అయితే అమెరికా ప్రభుత్వం వడ్డీ రేట్లను 20 శాతానికి పెంచడంతో, రెండు సంవత్సరాల వ్యవధిలో బంగారం ధర 58 శాతం తగ్గింది. అలాగే 1980 మార్చిలో హంట్ బ్రదర్స్ ప్రపంచం వెండి మార్కెట్‌ను శాసించాలనుకున్నారు. వెండి మొత్తం కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించారు. కానీ మార్కెట్ రూల్స్ మారడంతో వెండిని విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల వెండి ధర ఒకే రోజులో 33 శాతం కుప్పకూలింది. 2013లోనూ అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది బులియన్ మార్కెట్. రెండు రోజుల్లోనే 13 శాతం ఆవిరైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, ఇకపై ఉద్దీపన పథకాలు అవసరంలేదని ప్రభుత్వం భావించడడమే 2013లో వెండి, బంగారం రేట్లు బాగా తగ్గడానికి కారణం. 2026 ప్రారంభానికి ముందు, బంగారం, వెండి ధరలు రాకెట్‌ స్పీడ్‌తో నింగిని తాకాయి. అయితే భారతీయ, చైనీస్ ఇన్వెస్టర్లు భారీగా లాభాలను వెనక్కి తీసుకోవడంతో రేట్లలో బిగ్ కరెక్షన్ కనిపించింది.

ప్రపంచ దేశాల లావాదేవీలకు ప్రధాన మారకం డాలరే. చమురు, బంగారం సహా అనేక దిగుమతులు, ఎగుమతులకు చాలా దేశాలు అనివార్యంగా డాలర్‌పైనే ఆధారపడ్డాయి. అయితే, చైనా చాలాకాలం నుంచి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. తన రిజర్వులలో డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. గతేడాదిలో సుమారు 25-30 టన్నుల వరకు అధికారికంగా కొనుగోలు చేసింది డ్రాగన్ కంట్రీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఇండియా దగ్గర దాదాపు 880 టన్నుల నిల్వలున్నాయని తెలుస్తోంది. అలాగే ఎక్కువగా బంగారాన్ని కొనే జనాభా కూడా మనదే. అటు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి టర్కీ సెంట్రల్ బ్యాంక్ సైతం ఎక్కువగా బంగారాన్ని కొంటోంది. 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశంగా పోలాండ్ రికార్డు సృష్టించింది. గత ఏడాదిలో బ్రెజిల్ అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో అంటే సుమారు 31 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి అన్ని దేశాలను సర్‌ప్రైజ్ చేసింది. అటు టర్కీ సెంట్రల్ బ్యాంక్ సుమారు 83 టన్నుల పసిడిని సేకరించింది. ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకుంటోంది. ఇలా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు రికార్డుస్థాయిలో బంగారం నిల్వలు పెంచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నింగిని తాకడానికి ఇవి కూడా ఒక కారణం.

వెండి కొనుగోళ్లలో భారతదేశం రికార్డు సృష్టించింది. 2025లో భారత్ సుమారు 9.2 బిలియన్లు అంటే 78,200 కోట్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. ఇది ప్రపంచ మొత్తం వాణిజ్యంలో 21% పైనే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి వినియోగంలో చైనాది రెండోస్థానం. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా ప్రపంచ కేంద్రంగా ఉండటంతో వెండి అవసరం ఎక్కువ అవుతోంది. యూరోపియన్ దేశాల్లో వెండిని అధికంగా కొంటున్న దేశం జర్మనీ. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో టాప్‌ దేశాల్లో ఒకటైన జపాన్‌ కూడా పెద్ద ఎత్తున సిల్వర్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇలా దేశాలు, సామాన్య జనాల కొనుగోళ్లతో వెండి రేట్లు అమాంతం పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల దగ్గర భారీ ఎత్తున బంగారం నిల్వలున్నాయి. 8,133 టన్నుల గోల్వ్ రిజర్వ్‌తో ప్రపంచంలోనే అత్యధిక నిల్వలున్న దేశం అమెరికా. 3,351 టన్నుల పసిడితో ఐరోపాలో ప్రథమ స్థానం జర్మనీదే. ఇటలీ దగ్గర 2,452 టన్నుల పసిడి రిజర్వ్‌లు వున్నాయి. ఫ్రాన్స్ 2,437 టన్నులు, చైనా 2,264 టన్నులు,ఇండియా దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. దేశాల బంగారం కొనుగోళ్లు, నిల్వలు వాటి ధరలపై చాలా ప్రభావం చూపిస్తాయి. గోల్డ్ రేట్లు తగ్గినప్పుడల్లా చైనా, భారత్ వంటి దేశాలు భారీగా కొంటాయి. దీంతో పసిడి ధర ఒకస్థాయి కంటే కిందకు పడిపోకుండా సపోర్ట్ లభిస్తుందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు అమెరికన్ డాలర్లకు బదులుగా బంగారాన్ని రిజర్వులుగా పెట్టుకుంటున్నాయి. దీంతో డాలర్ బలహీనపడినప్పుడల్లా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ పోతుంది. డాలర్ డామినేషన్‌ను తగ్గించడానికి చైనా, భారత్, రష్యా వంటి దేశాలు ప్రయత్నిస్తుంటే, డాలర్ బలోపేతానికి అటు ట్రంప్ కౌంటర్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. అందులో భాగమే ఇప్పుడు సిల్వర్, గోల్డ్ రేట్ల పతనం.

అసలు గత ఏడాది బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నప్పుడే నిపుణులు కృత్రిమ డిమాండ్ గురించి చర్చ లేవదీశారు. ఇక్కడ అంతర్జాతీయ అనిశ్చితులతో ఏర్పడిన భయాలు, ఇతర పెట్టుబడి మార్గాలపై ఉన్న అపనమ్మకం వల్లే.. బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని ముందే చెప్పారు. కానీ అప్పట్లో వారి వాదనను మెజార్టీ మదుపర్లు పెద్దగా పట్టించుకోలేదు. పైగా సురక్షిత పెట్టుబడులుగా పేరున్న బంగారం, వెండి ధరలు పెరగటం తమ మంచికేనని ఇబ్బడిముబ్బడిగా డబ్బు గుమ్మరించారు. దీంతో వాటి విలువ అందరూ అనుమానించేంతగా పెరిగిపోయింది. అప్పుడు కూడా కరెక్షన్ తప్పదని, అప్రమత్తంగా ఉండాలని చేసిన హెచ్చరికల్ని లైట్ తీస్కున్నారు. పైగా పెట్టుబడులు తగ్గించకపోగా.. మరింతగా పెంచారు. చివరకు కరెక్షన్ టైమ్ రానే వచ్చింది. దీంతో ఓవర్‌గా పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు రిస్క్‌లో పడ్డారు. ఇప్పుడు డాలర్ బలపడుతుందనే అంచనాలు రాగానే.. ఒక్కసారిగా బంగారం, వెండికి డిమాండ్ కుప్పకూలింది. తద్వారా వీటి ధరల స్థిరత్వం ఏంటో తేలిపోయింది. ఇప్పటికైనా మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో అయినా బంగారం, వెండికి కృత్రిమ డిమాండ్ పెంచి.. సాధారణ కొనుగోలుదార్లకు షాక్ ఇవ్వడం మానుకోవాలని నిపుణులు హితవు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bullion Market
  • Bullion market analysis
  • Commodity Market
  • Dollar index impact on gold
  • Fed policy impact on gold

తాజావార్తలు

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

  • CBSE Exams Cancelled: యుద్ధం ఎఫెక్ట్.. ఆ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు..

  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి..!

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions