Story Board: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్ట్ 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది. ఇప్పటికే ఏపీలో సర్ గడువును ఈనెల 24 వరకు పొడిగించింది ఈసీ.
పాత షెడ్యూల్ ప్రకారం బీఎల్‌ఓలు ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే చేయాల్సి ఉండగా ప్రస్తుతం కొత్త షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3 వరకు చేయనున్నారు. రాష్ట్ర సీఈవో ఈ నెల 15న పంపిన విజ్ఞప్తి మేరకు, అంతకుముందు మే 14న ఇచ్చిన పాత షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు ఈసీఐ స్పష్టం చేసింది. మార్పు చేసిన కొత్త షెడ్యూల్ వివరాలను సంబంధిత అధికారులందరికీ తక్షణమే చేరవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజలకు తెలిసేలా అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సైతం సవరించిన తేదీల సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది.
ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, కర్ణాటకల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ గడువును సైతం పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీలో ముసాయి ఓటరు జాబితాను వచ్చే నెల 5వ తేదీకి బదులుగా 17వ తేదీన ప్రచురించనుంది. ఇంటింటి సర్వే షెడ్యూల్‌ను ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీకి పొడిగించింది. పంజాబ్‌లో ఇంటింటి సర్వే వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక్కడ ముసాయి జాబితాను వచ్చే నెల 13న ప్రచురించనుంది. అదేవిధంగా, కర్ణాటకలో వచ్చే నెల 8వ తేదీ వరకు సర్వే చేపడతారు. ముసాయిదా జాబితా వచ్చే నెల 17వ తేదీన వెలువడనుంది. ఏపీ, తెలంగాణ ప్రజలకు మామూలుగానే అనేక సమస్యలు ఉంటున్నాయి. వాటికి అదనంగా సర్ తోడైంది. ఇది ఓటుతో లింక్ అయ్యి ఉండటం, దీన్ని లైట్ తీసుకుంటే, ఓటు కోల్పోయే ప్రమాదం ఉండటంతో.. దీన్ని టచ్ చెయ్యక తప్పట్లేదు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -2026 ప్రక్రియ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కీలక దశలో ఉంది. ఓటర్ల జాబితాను సరిచెయ్యడం, డూప్లికేట్లను తొలగించడం, అర్హులైనవారిని జారితాలో చేర్చడం ఈ ప్రక్రియ లక్ష్యం. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రీ-ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి, వాటిని నింపాక, సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా సమర్పించే వీలు ఉంది.
ఏపీలో సుమారు 4.16 కోట్ల ఓటర్లలో దాదాపు 39.81 లక్షల నుంచి 40.86 లక్షల ఫారాలు ఇంకా సేకరించలేకపోయారు. వీటిలో చాలా భాగం చనిపోయినవారు, వలస వెళ్లినవారు, చిరునామాలు లభించని వారికి సంబంధించినవి. తిరుపతి, పోలవరం, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కాకపోతే 80 నుంచి 90 శాతం దాకా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ అక్కడ పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ 25 శాతం డిజిటలైజేషన్ కూడా పూర్తి కాలేదు. దీంతో ఇదే తరహాలో సర్ జరిగితే.. తర్వాత భారీగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళించటానికి ఉద్దేశించిన సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుతెన్నులను చూస్తుంటే ప్రజల ప్రత్యక్ష అనుభవం చెబుతున్న పాఠాలు చాలా కఠోరంగా ఉంటున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకో రెండేళ్ల తర్వాతే జరుగుతాయి. బిహార్, బెంగాల్, తమిళనాడులో లాగా ఎన్నికల ముందు హడావుడిగా ఇక్కడ సర్ చేపట్టలేదు. అంతవరకూ కాస్త ఉపశమనమే. కానీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న దాన్ని, ఓటర్లలో నెలకొన్న అనేక సందేహాలను, వాళ్లు స్వయంగా సేకరించాల్సిన సమాచారాన్ని, వెలికితీయాల్సిన పత్రాలను దృష్టిలో పెట్టుకుంటే.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. సర్ నిబంధనల ప్రకారం బూత్ లెవల్ ఆఫీసర్లు మూడుసార్లు ఓటర్ల ఇళ్లకు వెళ్లాలి. ఇది ప్రాథమిక నియమం. నగరాలు, పట్టణాల్లో అది అమలవుతున్న ప్రాంతాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఒక్కసారి కూడా రాని ప్రాంతాలు వందల్లో ఉంటాయి. అయినా అంతా సజావుగా సాగుతోందని ఎన్నికల కమిషన్ గొప్పగా చెబుతోంది. ప్రజలందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉండి, సామాజిక మాధ్యమం నిఘా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బీఎల్‌ఓలు ఒక్కచోటే కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు వందలు కనపడుతున్నాయి. ఇది అంతవరకే అయిపోలేదు. పూర్తిచేసిన ఫారాలను కూడా ఓటర్లే మళ్లీ బీఎల్‌ఓల వద్దకు వెళ్లి సమర్పించుకునే పరిస్థితే చాలా చోట్ల ఉంది. సర్ ప్రక్రియలో ప్రాథమిక అడుగే సరిగా పడలేదని దీన్నిబట్టి తేలికగానే అర్థం అవుతుంది. అయినా మన యంత్రాంగం సమర్థత బ్రహ్మాండంగా ఉందని మనం సరిపెట్టుకోవాలి. అంతా సజావుగా నడుస్తోందని మనకుమనమే సర్దిచెప్పుకోవాలి. నియమాలు ఘనంగా, అమలు హీనంగా ఉండటం అనేది మన ప్రభుత్వాల సహజ లక్షణంగా భావిస్తేనే అలా చేయగలం. ముఖ్యంగా అట్టడుగు, మధ్యతరగతి వర్గాలకు వచ్చేసరికి ఎన్నో చట్టాలు, నియమాల పరిస్థితి ఇదే తీరులో ఉంటోంది. అందుకే ఏ ప్రక్షాళనలోనైనా నష్టపోయేది ఈ వర్గాలే.
కొత్తగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదుచేయటానికి ఎన్నో పత్రాలు చూడాలి. స్వయంగా బీఎల్‌ఓ ఆ వ్యక్తి నివసించే ఇంటిని సందర్శించాలి. ఆషామాషీగా ఒక వ్యక్తిని ఓటరుగా నమోదు చేయకూడదనేది నియమం. ఆ నియమాన్ని కచ్చితంగా పాటించే.. ఓటర్లుగా నమోదుచేశామని చెప్పే ఎలక్షన్ కమిషన్ తాను జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డులనే సర్‌లో ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది. అలాగే ఆధార్ కార్డూ అందుకు ఉపయోగపడదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టూ చివరకు ఎలక్షన్ కమిషన్ వాదననే పరిగణనలోకి తీసుకుంది. ఆధార్ కార్డుని విదేశీవ్యక్తులకు కూడా జారీచేస్తారని, అందుకే అది ప్రామాణికం కాదనే వాదన ఎంత లోపభూయిష్ఠమో మన ఇంగితజ్ఞానం చెబుతూనే ఉంటుంది. ఎంతమంది విదేశీయులకు అధికారికంగా ఆధార్ కార్డులు జారీ అయివుంటాయో లెక్కలుతీస్తే వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. వాళ్లు అయినా కొన్ని పత్రాలు సమర్పించకుండా కార్డులు పొందలేరు. అతి స్వల్పసంఖ్యలో విదేశీయులు ఆధార్ పొందుతుంటే మొత్తం ఆధార్ కార్డుల ప్రామాణికతనే శంకించటం సామాన్యుల తర్కానికి అందదు. పర్యాటకులుగానో, విద్యార్థులుగానో, ఉద్యోగులుగానో, పరిశోధకులుగానో వచ్చిన విదేశీ వ్యక్తులకు ఆధార్ ఇవ్వాలన్న నిబంధనను అధికారికంగానే పెట్టుకుని ఈ వాదనను చేయటం విడ్డూరంగానూ, వైపరీత్యంగానూ భావించాలి. ఇక ఇతర దేశాల సరిహద్దులను దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినవాళ్లు ఆధార్ కార్డులు పొందటం ఎక్కువగానే ఉందని అనుకుందాం. మరి అందుకు కారణం ఎవరు? అని ప్రశ్నించుకుంటే వేళ్లన్నీ అధికారయంత్రాంగం వైపే చూపుతాయి.
సందేహాస్పద ఓటర్లందరినీ మనం అక్రమ వలసదారులుగా భావించలేం. బీఎల్‌ఓలకు సరైన పత్రాలను అందించలేని వాళ్లనూ ఆ జాబితాలో చేర్చుతారు. ఇక్కడే సర్ ఉద్దేశం నీరుగారుతోంది. ఉదాహరణకు తెలంగాణలో 2002లో చేపట్టిన సర్ తర్వాత ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటువేసిన వారందరూ కూడా ఇప్పుడు మళ్లీ తమని తామే నిఖార్సైన ఓటర్లుగా నిరూపించుకోవాలి. ఇంటర్‌నెట్‌ని ఉపయోగించగలిగినవాళ్లు కూడా 2002 నాటి సర్ జాబితాలో తమ పేర్లు వెతుక్కోటానికి కిందామీదా పడుతున్నారు. గంటలపాటు దానికోసం ప్రయత్నించి విఫలమై చివరకు 2002నాటి సర్‌లో తమపేరు లేదనే వెసులుబాటును ఉపయోగించుకుని ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లో పూర్తిచేస్తున్నారు. దీనికి ఫోన్‌నంబరు, ఆధార్ కార్డు వివరాలను సమర్పించి వాటి ఆధారంగా వచ్చే ఓటీపీలతో ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. 2002 నాటి సర్ జాబితాతో సంబంధం లేకుండానే ఓటర్లుగా కొనసాగే అవకాశం ఉంటే.. అసలు దాంతో మొత్తం ప్రక్రియను ఎందుకు ముడిపెట్టాల్సి వచ్చిందనే ప్రశ్నకు ఈసీ ఇప్పటికైనా సమాధానం చెప్పగలదా అంటే సందేహమే.
2002 నాటి సర్ ఎలా జరిగిందో చూస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు సర్‌కు సంబంధించి ప్రత్యేక హడావుడి కనపడలేదు. మామూలు ఓటర్ల జాబితా సవరణ లాగే అది జరిగిపోయింది. బహుశా అప్పుడు ఎన్నికలు లేకపోవటం కూడా అందుకు కారణమై ఉంటుంది. దీనికి భిన్నంగా ఇటీవల బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో తగిన సమయం ఓటర్లకు ఇవ్వకుండా హడావుడిగా సర్ చేపట్టటంతోనే తీవ్రస్థాయిలో వివాదాలు చెలరేగాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రచారాల్లో మునిగిపోయిన సందర్భంలో సర్ చేపట్టటం అనుచితంగానే కనపడుతుంది. ఆ అనుచిత చర్యలే ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించేలా ఆస్కారం కల్పించాయి. అధికార వ్యవస్థలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాల్సిన రీతిలో ఒరిగిపోతున్న నేపథ్యంలో ఎన్నికల ముందు చేపట్టిన సర్‌పై అనుమానాలు కలగకుండా ఉండవు. ఇప్పుడే బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే 2002లో సర్ అంతా సక్రమమని భావించి దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం ఏ మాత్రం సహేతుకంగా అనిపించదు. అప్పటికి మొబైల్ ఫోన్లు లేవు. ల్యాండ్‌లైను ఫోను ఉన్న వాళ్లూ తక్కువే. సోషల్ మీడియా లేదు. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ఇప్పటి స్థాయిలో విస్తృత ప్రజానిఘా లేని ఆనాటి పరిస్థితిలో 2002 నాటి సర్‌కు చాలా పరిమితులు ఉంటాయి. పేర్లలో, ఇంటిపేర్లలో, వయస్సుల నమోదులో ఎన్నో తప్పులు ఆనాటి జాబితాలో కనపడతాయి. వీటన్నిటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యతను ఇప్పుడు ఓటర్లపైనే పెట్టారు. అర్హులైన వారిని ఓటర్లుగా నమోదుచేయటం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ విధి. అలా నమోదుచేసిన వాళ్లను కొన్నేళ్ల తర్వాత .. మిమ్మల్ని మీరు ఓటర్లుగా నిరూపించుకోండి అని చివరికి అదే కమిషన్ ఆదేశించటం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పలుచన చేయటమేనని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి.
గ్రామాల్లో చనిపోయిన వారి సమాచారం స్థానిక పంచాయతీ సిబ్బంది దగ్గర ఉంటుంది. కనీసం దాని ఆధారంగా ప్రతిఏటా జరిగే ఓటర్ల సవరణ ప్రక్రియలో వాళ్ల పేర్లను తేలికగానే తొలగించవచ్చు. అది కూడా చేయలేని అసమర్థతను ఎన్నికల కమిషన్ యంత్రాంగం ప్రదర్శించింది. ఇటీవల సర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఒక్క బెంగాల్ మినహా మిగతాచోట్ల ఎంతమంది చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారో స్పష్టంగా పేర్కొనలేదు. బెంగాల్‌లో 91 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. అందులో మరణించిన వారి పేర్లు 58.08 లక్షలు ఉన్నాయి. ఏటా ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా జరిగితే ఒక్కసారిగా ఇన్నిపేర్లను తొలగించాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో సర్ పూర్తయితే ఎంతమంది ఓటర్ల జాబితా నుంచి తొలగిపోతారన్నది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా ఈ సంఖ్య 10 కోట్లు దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. సర్ పూర్తయిన చోట ఇప్పటివరకూ 5 కోట్లకు పైబడి పేర్లను జాబితాల నుంచి తొలగించారు. తుది లెక్కలు తేలేసరికి దాదాపుగా 10శాతానికి పైగా ఓటర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతస్థాయిలో ఇలా తొలగింపులు జరగలేదన్న విమర్శను తేలికగా కొట్టేయలేం. చనిపోయిన వాళ్లను, ఒకటికి మించి పలుచోట్ల ఓటర్లుగా ఉన్న వాళ్లను జాబితా నుంచి తొలగించటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే వెసులుబాట్లను కనుక్కోకుండా మీరు పౌరులో కాదో నిరూపించుకోండని అందరినీ కోరటమే హాస్యాస్పదం.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సర్‌తో ఓట్లు తొలగిన తర్వాతా మళ్లీ జాబితాలో కొత్త ఓటరుగా నమోదుకావటానికి అవకాశం ఉంటుందని అధికారులు ఒకటికి పదిసార్లు చెప్పారు. నిబంధనలు అందుకు అనుకూలంగా ఉన్నాయనీ స్పష్టంచేశారు. కానీ, రోజులు గడవకుండానే మెలికపెట్టారు. దీనినీ సర్‌తో ముడిపెట్టారు. మొత్తంగా సర్‌తో ఎవరు అసలైన ఓటరో తేల్చటం కుదురుతుందా.. లేదా అనేది పెద్ద క్వశ్చన్‌మార్క్‌గా మిగిలిపోతోంది. మొత్తం మీద దేశంలో సర్ ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచో దశల వారీగా ఈసీ నుంచి వస్తున్న ప్రకటనలు.. వాటికి ఎక్కడికక్కడ అధికారులు ఇస్తున్న వివరణలతో.. ఓటర్లు మరింత గందరగోళంలో కూరుకుపోతున్నారనడంలో సందేహం లేదు.

