Site icon NTV Telugu

Story Board: 75 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది..?

Story Board

Story Board

Story Board: దేశాన్ని పదకొండేళ్లుగా ఏలుతున్న పార్టీ బీజేపీ. ప్రధాని మోడీ. అదే బీజేపీని వెనకుండి నడిపిస్తున్న సైద్ధాంతిక మాతృ సంస్థ ఆరెస్సెస్. అలాంటి ఆరెస్సెస్ చీఫ్ పదవీ విరమణ గురించి చేసిన వ్యాఖ్యలు.. కీలక చర్చకు తెరతీశాయి. మోడీ హయాంలో బీజేపీలో 75 ఏళ్లు నిండిన నేతల్ని రిటైర్ చేసే సంస్కృతి మొగ్గ తొడిగింది. మరి ఇదే నిబంధన మోడీకి వర్తిస్తుందా.. లేదా అనే చర్చ కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈ ఏడాదే ఆయన 75 ఏళ్లు పూర్తిచేసుకోబోతున్నారు. ఇటువంటి సమయంలో నేరుగా మోడీ పేరు ప్రస్తావించకపోయినా.. 75 ఏళ్లకు పదవీ విరమణ గురించి మోహన్ భగవత్ మాట్లాడటం చిన్న విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. పైగా బీజేపీలో నాయకత్వ మార్పుకు ఈ వ్యాఖ్యలు శ్రీకారం కావచ్చని కూడా అభిప్రాయపడుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు అతిగా ఊహించుకుంటున్నాయని బీజేపీ కౌంటరిస్తోంది.

అసలు విషయానికొస్తే.. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలు 75 ఏళ్లకు రిటైర్‌ అవ్వాలని పేర్కొన్నారు. ఎవరికైనా 75 ఏళ్లు వస్తే.. ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోడీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నాగ్‌పూర్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త మోరోపంత్‌ పింగ్లీకి అంకితం చేసిన ఓ పుస్తకావిష్కరణలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మోరోపంత్ పింగ్లీ మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. 75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలని. పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అంటూ గతంలో ఓ సారి మోరోపంత్ పింగ్లీ చేసిన వ్యాఖ్యలను మోహన్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించే మోహన్‌ భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు దాటిన తర్వాత పదవీ విరమణ చేయమని మోడీ బలవంతం చేశారు. ఇప్పుడు ఆయనకూ అదే నిబంధనను వర్తింపజేస్తారో లేదో చూడాలన్నారు. కాంగ్రెస్ అయితే మరో అడుగు ముందుకేసి.. మోడీ కంటే వారం ముందే మోహన్ భగవత్ కూ 75 ఏళ్లు నిండుతాయని.. మరి ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయో.. లేదో చూద్దామని కామెంట్ చేసింది.

ఇక మోడీ ఈ ఏడాది మార్చిలో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం పదవీ విరమణపై చర్చించడానికే అని కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో మే 2023లో బిజెపి రాజ్యాంగంలో పదవీ విరమణ నిబంధన లేదని స్పష్టం చేశారు. మోడీ 2029 వరకు నాయకత్వం వహిస్తారని, పదవీ విరమణ పుకార్లలో నిజం లేదని తేల్చేశారు. ఇండియా కూటమి అబద్ధాలతో ఎన్నికల్లో గెలవలేదని కూడా అమిత్ షా అభిప్రాయపడ్డారు. అదే అమిత్ షా.. సరిగ్గా భగవత్ వ్యాఖ్యలు చేసిన రోజే.. మరో కార్యక్రమంలో తన పదవీ విరమణానంతర ఆకాంక్షల గురించి మాట్లాడారు. తన పదవీ విరమణ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, సేంద్రీయ వ్యవసాయానికి సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు పదవీ విరమణ చేయాలనుకుంటున్నారో ఆయన స్పష్టం చేయలేదు. అమిత్ షా మొన్న ఏప్రిల్‌లో 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

భగవత్ వ్యాఖ్యల సమయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన, ప్రధాని మోడీ ఇద్దరూ సెప్టెంబర్ 1950లో జన్మించారు. భగవత్ సెప్టెంబరు 11న, మోడీ ఆరు రోజుల తర్వాత సెప్టెంబరు 17న జన్మించారు. వాస్తవానికి ఆరెస్సెస్ అధిపతికి వయోపరిమితి లేదు. స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప ఆయనకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. కానీ మోడీ విషయంలో, పదవీ విరమణ నిబంధనను బిజెపి స్వయంగా నిర్ణయించుకుందని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అది కూడా మోడీ హయాంలోనే ఆ నిబంధన అధికారికంగా అమలైందని కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు నాయకుల్లో ఎవరూ పదవీ విరమణ చేసే అవకాశం లేదని కొందరు ఆరెస్సెస్ సీనియర్లు కొట్టిపారేస్తున్నారు. పైగా 75 ఏళ్ల నిబంధనకు మోడీ మినహాయింపు అవుతారని భగవత్ గతంలోనే చెప్పారని కూడా గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో భగవత్ ప్రస్తుత వ్యాఖ్యను ఆరెస్సెస్ బిజెపిపై తమ పట్టును మరింత బిగించే ప్రయత్నంగా కూడా చూడాలనే వాదన కూడా వినిపిస్తోంది.

సంఘ్ సంప్రదాయం ప్రకారం.. శారీరకంగా అనారోగ్యంగా ఉంటే తప్ప ఏ సర్ సంఘచాలక్ కూడా పదవీ విరమణ చేయలేదు. బాలసాహెబ్ దేవరస్, రజ్జూ భయ్యా, కె.ఎస్. సుదర్శన్, అందరూ తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా మాత్రమే పదవిని విడిచిపెట్టారు. రజ్జూ భయ్యా, సుదర్శన్ ఇద్దరూ 78 ఏళ్ల వయసులో తమ బలహీనమైన ఆరోగ్యం కారణంగా పదవీ విరమణ ప్రకటించగా, మూడవ సర్ సంఘచాలక్ బాలసాహెబ్ దేవరస్ 1994 వరకు 79 సంవత్సరాల వయస్సు వరకు ఆరెస్సెస్ అధిపతిగా ఉన్నారు. అప్పుడు ఆయన క్షీణించిన ఆరోగ్యం కారణంగా అధికారికంగా పదవీ విరమణ చేసి రజ్జూ భయ్యాను తన వారసుడిగా చేశారు. ఇక్కడ భగవత్, మోడీ ఇద్దరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు. సమర్థవంతంగా సేవ చేస్తున్నారని అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద భగవత్ వ్యాఖ్యలు ఆరెస్సెస్ అంతర్గత ఆలోచనలో మార్పును సూచిస్తున్నాయా.. లేదంటే మోరోపంత్ పింగ్లే వారసత్వానికి కేవలం నివాళి మాత్రమేనా అనేది వేచి చూడాలి. కానీ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై మళ్లీ ఆరెస్సెస్ నుంచి క్లారిటీ వచ్చేదాకా ఈ చర్చ జరుగుతూనే ఉంటుందని, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా పదే పదే ఈ విషయం ప్రస్తావిస్తాయని బీజేపీ కూడా అంచనా వేస్తోంది.

Exit mobile version