Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?

Story Board About Is Gen Z

Story Board About Is Gen Z

Story Board: దేశంలో ఏ మార్పు అయినా యువతకే సాధ్యమౌతుంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచీ కాలానుగుణంగా యువత కదం తొక్కుతూనే ఉంది. తిరుగులేని పోరాటాలతో ఎప్పటికప్పుడు అనుకున్నది సాధించుకుంటూ వస్తోంది. కాకపోతే ప్రైవేటీకరణ తర్వాత కెరీర్‌పై ఫోకస్ పెట్టి.. ఉద్యమాలకు కాస్త విరామం ఇచ్చింది. దీంతో సంప్రదాయ పార్టీలన్నీ విద్యార్థి విభాగాలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అందుకే కొన్నాళ్లుగా ఎన్నికల మ్యానిఫెస్టోల్లోనూ యువతకు సంబంధించిన అంశాలు అలంకారప్రాయంగానే కనిపిస్తున్నాయి. వాటి అమలు గురించి నిలదీసేవారు లేకపోవడం లోటుగానే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో నీట్ లీకేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసన.. అన్ని పార్టీల్నీ అప్రమత్తం చేసింది. యువతలో ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉందని.. పోరాటాలకు గ్యాప్ వచ్చిందే కానీ.. పోరాటం చేసే స్వభావంలో ఎలాంటి తేడా లేదని రుజువు చేసింది. అంతేకాదు దేశంలో ఇకపై రాజకీయం ఎలా నడవాలో తామే నిర్దేశిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చింది.

ఇక్కడ విద్యార్థి ఉద్యమాన్ని చూసే కోణంలో క్లారిటీ చాలా అవసరం. ఇదేదో నీట్ లీకేజ్‌కు వ్యతిరేకంగా వచ్చిన నిరసనగా పైకి కనిపిస్తున్నా.. నిజానికి అంతకు మించిన కారణాలున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, వ్యవస్థల నిర్లక్ష్యం.. లాంటి సమస్యలతో యువత విసిగిపోయి ఉన్నారు. అలాగే సంప్రదాయ పార్టీలు హామీలివ్వడమే కానీ.. ఎలాంటి మార్పూ తేవడం లేదని కూడా ఫిక్స్ అయ్యారు. అంతేకాదు ఈ ఉద్యమానికి చాలా ముందే తమిళనాడులో జరిగిన ఎన్నికలు, అక్కడ విజయ్ గెలుపు జెన్‌జీ ఆలోచనావిధానాన్ని స్పష్టంగా ఆవిష్కరించాయి. అప్పటికీ మేధావులు, మీడియా మొత్తం విజయ్ అనుకూలతల గురించే ఎక్కువ ప్రచారం చేసింది. కానీ విజయ్ గెలుపుకు కీలకంగా మారిన ఏకీకృతమైన యువత ఓటుబ్యాంకు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడిప్పుడే ఢిల్లీ ఉద్యమ విజయం తర్వాత కొందరు తీరిగ్గా విజయ్ గెలుపును తాజాగా విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ పరిశీలనలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. తమిళనాడులో ఆరు దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయం, రెండు పార్టీల కాలం చెల్లిన విధానాలు చూసి విసిగిన అక్కడి యువత.. అధిక శాతం విజయ్‌కు ఓటేసింది. దీంతో టీవీకే విజయం సాధించగలిగింది. దళపతి సీఎం కాగలిగారు. కానీ ఆ విషయాన్ని సరైన సమయంలో గ్రహించడంలో పార్టీలు, విశ్లేషకులతో పాటు మీడియా కూడా విఫలమైందనేది నిజం.

ఏతావాతా చాన్నాళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తి, ఆగ్రహమే యువత తీవ్రంగా స్పందించటానికి దారితీశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికితోడు పార్టీలు కూడా యువత అంటే లెక్కలేకుండా వ్యవహరించడం కూడా వారిని ఆలోచనలో పడేసింది. దీనికి నీట్ లీకేజ్‌ రూపంలో సరైన ప్రాతిపదిక దొరకడంతో.. ఇక జెన్‌జీ వెల్లువను ఆపడం ఎవ్వరి తరం కాలేదు. హస్తినకు వచ్చిన యువత కేవలం నిరసనలకే పరిమితం కాలేదు. వారు తమ ఆలోచనల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. అసలు మన దేశంలో ఎలా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించిందో.. ప్రస్తుత వ్యవస్థను మార్చటానికి ఏం చేయాలో కూడా చెప్పేసింది. ఏకంగా పాఠ్యపుస్తకాల్లో ఉన్న వివరాలు చదివి వినిపిస్తూ.. యువత ఉదాహరణలతో సహా చెబుతుంటే.. దేశ ప్రజలంతా భావితరం ఆలోచనలకు తెగ ముచ్చట పడిపోయారు. ఈ పరిణామం సంప్రదాయ పార్టీలపై మరింత ఒత్తిడి పెంచింది. యువత చేసిన వీడియోలతో.. చాలా మంది ప్రజలకు రాజకీయ నేతలు చెప్పేవి అవాస్తవాలని, ఇప్పటికీ దేశాన్ని బాగుచేయడం సాధ్యమేనన్న వాదనలో బలం ఉందని తెలిసింది. దీంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనమంతా యువత వెనుక నిలకబడి.. వారి డిమాండ్లు తీర్చాలని గట్టిగా చెప్పారు. అందుకే వీరిని ఇలాగే వదిలేస్తే.. ఇంకా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాల్ని కూడా డిమాండ్ చేయొచ్చనే భయమే రాజకీయ వ్యవస్థలో కదలిక వచ్చేలా చేసింది. అలాగని ప్రతిపక్షాల్నీ యువత వదల్లేదు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన కర్తవ్యాన్ని విస్మరించినందుకు శిక్షగా తమ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన యువత.. తమ పోరాటం ఏ పార్టీకీ వ్యతిరేకం కాదని.. సరికొత్త రాజకీయం కోసమేనని ఎలుగెత్తి చాటింది. దీంతో కాస్త ఆలస్యమైనా.. జెన్‌జీ తమ పోరాట స్ఫూర్తితో.. నేతల కళ్లు తెరిపించారని దేశ ప్రజలందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నారు.

తరం మారుతున్నకొద్దీ ఆలోచనల్లో మార్పులు రావడం సహజం. అందుకే యువతే దేశ భవిత అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇందుకు అనుగుణంగా తొలినాళ్ల నుంచీ యువతను మచ్చిక చేసుకుంటూ వచ్చిన పార్టీలు.. అడపాదడపా వారి డిమాండ్లు కూడా నెరవేరుస్తూ వచ్చాయి. కానీ ఇటీవలి కాలంలో ఐటీ ఉద్యోగాల్ని యువతకు ఎరేసి.. వారిని సైలంట్ చేయగలిగామని సంతోషపడుతున్న సంప్రదాయ పార్టీల్ని ఢిల్లీ ఉద్యమం ఉలిక్కిపడేలా చేసింది. ఇకపై యువతను మభ్యపెట్టడం కుదిరే విషయం కాదని, ఇప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తు ఉండదనే ఎరుక దాదాపుగా ప్రతి పార్టీకీ వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకే ఎవరి శక్తి మేరకు వారు యువత కేంద్రంగా రాజకీయాలు చేయటానికి పూనుకుంటున్నారు. గతంలోనూ దేశంలో యువత ఉద్యమాలు చేశారు. డిమాండ్లు సాధించుకున్నారు. అప్పట్లో సమస్యలపై గళమెత్తినా.. పరిష్కారాలు ప్రభుత్వాలకే వదిలేసే పోకడ ఉండేది. కానీ జెన్‌జీ మాత్రం సర్కారుకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం వ్యవస్థలో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పడంతో పాటు.. ఏం చేస్తే సరైన ఫలితం వస్తుందో కూడా వివరిస్తోంది. తద్వారా జస్ట్ మేం చెప్పింది చేయండి చాలు.. మార్పు దానంతట అదే వస్తుందని పిలుపునిస్తోంది. మొన్నటికి మొన్న జంతర్‌ మంతర్‌ దగ్గర పోగైన యువత మొత్తం మేం పదవులు అడగటం లేదు.. అధికారంలో భాగస్వామ్యం అడగటం లేదు.. మా సమస్యలు పరిష్కరించండి.. వ్యవస్థల ప్రక్షాళన చేయండి అని గట్టిగా నినదించారు. నిస్వార్థమైన ఈ యువత కోరికే బలమైన ఆశయంగా మారి ప్రభుత్వాన్ని కదిలించింది. ఇది పైకి కనిపించిన పరిణామం. కానీ ఇదే ఆశయం తెరవెనుక మొత్తంగా దేశ రాజకీయ వ్యవస్థనే గట్టిగా కుదిపేసింది. సాధారణంగా భూమిలోపల ఫలకాల కదలికల్లో మార్పుల కారణంగా భూకంపం వస్తుంది. ఇప్పుడు యువత ఆలోచనల్లో వచ్చిన మార్పుల వేగం కారణంగా దేశంలో రాజకీయ భూకంపం వచ్చి.. సరికొత్త రాజకీయానికి బాటలు పడుతుందనే చర్చ జరుగుతోంది.

దేశ రాజకీయాల్లో వచ్చే మార్పుల్ని వేగంగా పసిగట్టడంలో.. తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ పార్టీలు ఆరితేరాయి. ఆ మాటకొస్తే ఎప్పటికప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపటం కూడా వీటికి అలవాటే. కాకపోతే మిగతా పార్టీలతో పాటే మన తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా కొన్నాళ్లుగా యువతలో గూడుకడుతున్న అసంతృప్తిని తెలుసుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ ఉద్యమం తర్వాత జెన్‌జీ ఆలోచనల గురించి చూచాయగా తెలియడంతో.. అర్జెంట్‌గా తమ రాజకీయ వ్యూహాలు పునఃసమీక్షించుకునే పనిలో పడ్డాయి. పనిలోపనిగా యువత కేంద్రంగా రాజకీయం చేస్తామని ప్రకటించాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అగ్రనేతలు తమ రోజువారీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి.. నీట్ మృతులకు నివాళిగా హైదరాబాద్‌ లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో యువతతో కలిసి పాలు పంచుకున్నారు. అలాగే జెన్‌జీలతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడటం, వాళ్లకు జర్మన్ భాష నేర్పటం, మెస్సిని హైదరాబాద్ తీసుకురావడం లాంటి పనులు చేశారు. చేస్తున్నారు. అంతేకాదు ప్రజాప్రతినిధుల కనీస అర్హత వయసును కూడా తగ్గించాలనే ప్రతిపాదన కూడా పెట్టారు. తద్వారా జెన్‌జీ రాజకీయంలో కాంగ్రెస్ ముందుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికొస్తే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్‌ లో నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వాలు యువత ఆకాంక్షలు గుర్తించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా జెన్‌జీలతో మీటింగులు, వాళ్లతో భోజనాలు, జిమ్ ప్రాక్టీస్‌లు కూడా చేస్తున్నారు కేటీఆర్. తద్వారా యువత కేంద్రంగా రాజకీయం చేయడంలో తామెక్కడా వెనకబడలేదని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అటు ఏపీలోనూ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ పోటాపోటీగా యువతతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి తానే అసలైన జెన్‌జీ అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగులు పెడుతూ.. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో పార్టీలోనూ యువతకు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు. జగన్ కూడా కొద్దిరోజుల క్రితమే డీఎస్సీ అభ్యర్థులతో సమావేశమై డీఎస్సీతో పాటు యువత సమస్యలపై చర్చించారు. తేడా వస్తే ఏపీలో కూడా కాక్రోచ్‌లు లేస్తాయని గతంలోనే హెచ్చరించారు. ఇక ముందు కూడా జెన్‌జీ కేంద్రంగా రాజకీయం చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇక్కడ ఏపీ అయినా.. తెలంగాణ అయినా ప్రధాన పార్టీల అజెండా ఒకటే. దేశవ్యాప్తంగా యువ రాజకీయం కదం తొక్కుతున్న తరుణంలో.. మార్పును తాము కూడా అందిపుచ్చుకోవాలన్నదే. అలాగే తమ విధానాలపై యువతలో అసంతృప్తి రాకుండా.. ముందే జెన్‌జీకి అనుకూలమైన విధానాలతో వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. అందుకే అగ్రనేతలు యువతపై ఫోకస్ పెట్టి.. తమ కార్యకలాపాలు మార్చుకుంటున్నారు. తద్వారా జెన్‌జీతో పాటు వారి తల్లిదండ్రుల ఓట్లనూ టార్గెట్ చేస్తున్నారు. ఇలా స్వామికార్యంతో పాటు స్వకార్యమూ నెరవేరేలా రాజకీయ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల చరిత్రలో యువతకు పెద్దపీట వేసిన సందర్భాలను జెన్‌జీకి గుర్తుచేస్తున్నారు. అవసరమైతే జెన్‌జీకి రాజకీయ ప్రోత్సాహం అందించడంలో మిగతా పార్టీలన్నింటికన్నా ఎక్కువ చొరవే తీసుకుంటామని హామీలిచ్చేస్తున్నారు. మరికొందరు నేతలైతే.. వచ్చే ఎన్నికలు యువత చుట్టే తిరుగుతాయని జోస్యాలు చెబుతున్నారు. ఇప్పట్నుంచీ ఎన్నికల వరకూ జెన్‌జీని అంటిపెట్టుకుని రాజకీయం చేయాలని క్యాడర్‌కు హితబోధ చేస్తున్నాయి. స్వయంగా ప్రధాని మోడీనే ఇన్‌స్టా వీడియోలతో యువతలో టచ్‌లో ఉండాలని కేంద్ర మంత్రులకు సూచించటాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాయి. ఆ మాటకొస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు యాక్టివ్ సోషల్ మీడియా వింగులున్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఆయా వింగులు రాజకీయ రొచ్చుకే ప్రాధాన్యమిచ్చాయని, ఇకపై వ్యూహం మార్చి.. యువతను సూదంటురాయిలా ఆకర్షించే ప్లాన్ రూపొందించాలని నేతలు సూచిస్తున్నారు. ఇందుకోసం సరికొత్త వ్యూహాలు, నినాదాలు కూడా అవసరమని చెబుతున్నారు. ఏం చేసైనా సరే.. యువత ఓట్లన్నీ తమ పార్టీకే పడేలా చూడాలని అగ్రనేతలంతా కాలికి బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. మొన్నటి బీహార్ ఎన్నికల దాకా మహిళా ఓట్లే ఎన్నికల్లో విజయానికి తురుపుముక్కగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఢిల్లీ ఉద్యమం తర్వాత కొన్నాళ్ల పాటు యువత ఓట్లే గెలుపుకు ఇంధనం అవుతాయని, దీనికి విజయ్ గెలుపుతోనే బీజం పడిందని సంప్రదాయ పార్టీలన్నీ ఆలస్యంగా గుర్తించాయి. అందుకే ఇక వ్యూహరచనలో వేగం పెంచి.. జెన్‌జీ స్పీడుకు తగ్గట్టుగా పనిచేయక తప్పదనే నిర్ధారణకు వచ్చాయి.