Story Board: ఇరాన్ యుద్ధం ఎవ్వరి ఊహకూ అందకుండా సాగుతోంది. తొలిరోజే ఉధృతంగా మొదలైన యుద్ధం.. రోజులు గడిచేకొద్దీ మరింత తీవ్రరూపం తీసుకుంది. చివరకు యుద్ధం తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే.. భాగస్వామ్య పక్షాల కంటే మిగతా దేశాలకే ఎక్కువ నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా సుసంపన్న గల్ఫ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంతోనే కుదేలైన యూరప్ పరిస్థితి.. ఈ యుద్ధంతో మరింత విషమించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పెద్దగా పడని దేశాలను కూడా ఇరాన్ యుద్ధం వణికించింది. చివరకు ప్రపంచానికి ఇంధన సంక్షోభం వచ్చింది. ఇటీవలి దాడులతో.. ఇంధన ఉత్పత్తి సంక్షోభం కూడా వచ్చేలా ఉంది. పనిలోపనిగా అమెరికాపై ఒత్తిడి పెంచటానికి ఇరాన్ అమలుచేసిన ఆర్థికవ్యూహం.. హర్మూజ్ జలసంధిని గుప్పిట పట్టింది. దీంతో మొత్తం ప్రపంచానికి సరఫరా గొలుసులు తెగిపోయాయి. చివరకు అమెరికా కూడా ప్రపంచ దేశాల ఒత్తిడి తట్టుకోలేక.. అణ్వాయుధాల సంగతి వదిలేసి.. హర్మూజ్ తెరిస్తే చాలనే స్థితికి వచ్చింది. కానీ శత్రువు జుట్టు దొరికినప్పుడే మరింత బెట్టు చేయాలనుకుంటున్న ఇరాన్.. భవిష్యత్తులోనూ దాడులు జరగబోవనే హామీ ఇవ్వాలని భీష్మించింది. దీనికి తోడు శాంతి ప్రయత్నాల్లోనూ అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం.. ఇరాన్‌కు సుతరామూ నచ్చలేదు. దీంతో కిందపడ్డా పైచేయే అంటున్న అమెరికాకు తగిన బుద్ధి చెప్పాలనే ప్లానింగ్‌లో ఉంది.
ఇప్పటిదాకా యుద్ధం జరిగిన తీరు చూస్తే.. ఖర్చు విషయంలో అమెరికాకు తడిసి మోపెడైంది. అటు ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారైన డ్రోన్లతో కచ్చితమైన దాడులు చేస్తుంటే.. అమెరికా మాత్రం అతి ఖరీదైన క్షిపణుల్ని ఎడాపెడా వాడేసి.. చివరకు ఆయుధాల కొరత తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా విమానాలన్ని ఇరాన్ టార్గెట్ చేసుకోవడం.. అగ్రరాజ్యానికి మరింత నష్టంగా మారింది. దీంతో యుద్ధానికి బ్రేక్ అంటూ మొదట ట్రంప్ ఐదు రోజుల తొలి గడువు.. ఆ తర్వాత పది రోజుల రెండో గడువు ఇచ్చారు. మరీ ఏకపక్షంగా బ్రేక్ అంటే బాగోదని.. దానికి హర్మూజ్ తెరవాలనే లింక్ పెట్టారు. కానీ ఇరాన్ తొలి నుంచీ ఈ ప్రతిపాదనను కొట్టిపారేస్తూనే వచ్చింది. యుద్ధానికి శాశ్వత ముగింపుతోనే అది జరుగుతుందని తేల్చేసింది. ఇరాన్‌పై యుద్ధమైనా, శాంతి అయినా తనదే పైచేయి అవుతుందని లెక్కేసిన ట్రంప్.. ఈ ప్రతిస్పందనతో పచ్చివెలక్కాయ నోట్లో పడ్డట్టైంది. అప్పట్నుంచి యుద్ధాన్ని ఆపే మార్గం కోసం ట్రంప్ గింజుకుంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడికక్కడ ట్రంప్ ఎత్తులకు పైఎత్తులేస్తూ.. అమెరికాని మరింతగా ట్రాప్‌లో ఇరికించింది. ప్రస్తుతం యుద్ధం విరమించాలంటే.. హర్మూజ్‌పై తమకు పెత్తనం ఇవ్వాలనే కొత్త షరతు పెట్టిన ఇరాన్.. యుద్ధ నష్టానికి ప్రత్యక్ష పరిహారానికి బదులు.. నౌకల నుంచి రుసుము వసూలు చేసుకుంటామని ప్రతిపాదించటం.. ట్రంప్‌కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైంది. ఎందుకంటే ఈ షరతుకు ఒప్పుకోవటం అమెరికా ఒక్క దాని చేతిలో లేని విషయం. ఈ ప్రతిపాదన అమలుచేయక తప్పని స్థితి వస్తే.. మిగతా దేశాలన్నీ ట్రంప్‌పై విరుచుకుపడటం ఖాయమే. మీరు తొందరపాటుతో ఇరాన్‌పై దాడి చేసి.. హర్మూజ్‌పై కొత్త ఫిటింగ్ పెట్టారని విమర్శిస్తాయి. అందుకే ఆ ప్రతిపాదనను తెరమరుగు చేయటానికైనా ఇరాన్‌పై గెలుపు ట్రంప్‌కు తక్షణావసరం. అందుకోసం యుద్ధాన్ని అత్యంత తీవ్రస్థాయికి చేర్చక తప్పదు. అందుకే ట్రంప్ నోటి నుంచి కాళరాత్రి అనే మాటొచ్చిందని అంటున్నారు.
కానీ ఐదారు వారాల యుద్ధంలో ఇరాన్‌ను లొంగదీయలేకపోయిన అమెరికా.. కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని తుడిచిపెట్టేస్తుందంటే.. నమ్మడం కాస్త కష్టమే. కానీ అమెరికా సర్వశక్తులు ఒడ్డుతుందేమో.. ఎవరూ ఊహించని రీతిలో దాడి చేస్తుందేమో అనే అనుమానాలు లేకపోలేదు. అయితే యుద్ధంలో ఎప్పటికైనా ఈ దశ వస్తుందని ముందే ఊహించిన ఇరాన్.. అందుకు తగ్గ ఏర్పాట్లతో రెడీగా ఉంది. ఇప్పటికే ఖర్గ్ ద్వీపంలో ల్యాండ్‌మైన్లతో రెడీగా ఉన్న ఇరాన్.. తమకు మరిన్ని మిస్సైల్ నగరాలున్నాయని అమెరికాని భయపెడుతోంది. ప్రత్యర్థి ఊహించని అస్త్రాలు బయటకు తీస్తామని కూడా హెచ్చరిస్తోంది. దీంతో ఇరాన్ కూడా అంతిమ యుద్ధానికి సన్నద్ధమైనట్టే. ఇలా అన్నింటికీ తెగించిన అమెరికా, ఇరాన్ ఇక ఏదొకటి తేలేదాకా ఆగని యుద్ధం చేస్తాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ యుద్ధంలో ఒక దశ దాటాక ఇక ఎలాంటి యుద్ధ నియమాలు, నైతికతకు తావుండదు. ఇరు పక్షాలూ రాక్షసంగా పోరాటం చేస్తాయి. అప్పుడు జరిగేది మారణహోమమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా ఇక ఆ దశలో ప్రవేశించినట్టే. ఇటు ట్రంప్, అటు ఇరాన్ తీరు చూస్తుంటే.. ఏదో జరగరానిది జరుగుతుందనే భయం అందరికీ కలుగుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని దాడులు జరుగుతాయని రెండు పక్షాలూ ప్రపంచానికి హెచ్చరికలు పంపుతున్నాయి. ఐదారువారాలుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇప్పటికే లెక్కలేనంత ప్రాణనష్టం జరిగింది. అయినా సరే ఎవరూ వెనక్కితగ్గటానికి సిద్ధంగా లేకపోగా.. మరింత సమరోత్సాహంతో తొడ కొడుతుండటం.. ప్రపంచానికి చెడు సంకేతాలు పంపుతోంది.
నిజానికి ఇరాన్ యుద్దం పరిమిత లక్ష్యాలతో మొదలై.. అపరిమిత టార్గెట్లకు విస్తరించింది. ఈ కారణంగానే పోరు అంతం లేని యుద్ధంగా రూపాంతరం చెందింది. ఇక్కడ అమెరికా ప్రతిపాదించిన ఒప్పందం కానీ, ఇరాన్ విధిస్తున్న షరతులు కానీ ఏవీ పూర్తిగా ఆచరణయోగ్యంగా లేవు. అందుకే మధ్యవర్తులు ఎంత కష్టపడుతున్నా.. ఫలితం దక్కడం లేదు. రెండు దేశాలూ మిగతా ప్రపంచం గురించి వదిలేసి.. తమదే గెలుపు కావాలనే ఏకైక లక్ష్యంతో పోరాటానికి సై అంటున్నాయి. ఈ స్థితిలో మిగతా ప్రపంచాన్ని అంతం చేసైనా తాము బలంగా నిలబడాలనే గట్టి కాంక్షే కనిపిస్తోంది. ఇలాంటప్పుడు జరిగే యుద్ధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా వ్యూహాత్మకంగా దాచి ఉంచిన అస్త్రాలు, వ్యూహాలు ఇప్పుడు కలుగులోంచి వచ్చే ఎలుకల్లా బయటికొస్తాయి. ఇప్పటిదాకా తీవ్ర యుద్ధం, యుద్ధ బీభత్సం దశలే మనం చూశాం. కానీ ఇకపై చూడబోయే దశ మాత్రం ఇలాంటిది కానే కాదు. కచ్చితంగా జరిగేది భయానక యుద్ధమే. అందుకే మొత్తం ప్రపంచం మునివేళ్లపై నిలబడి మరికొన్ని గంటల్లో ఏం జరుగుతుందోనని భయంభయంగా నిమిషాలు లెక్కపెడుతోంది.
రెండో ప్రపంచ యుద్ధం ముగించటానికి అమెరికా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతూ అణుబాంబు వేసింది. అలా అణుబాంబు పడ్డ రోజు.. మొత్తం ప్రపంచగతినే మార్చేసింది. ప్రపంచాధిపత్యం బ్రిటన్ నుంచి అమెరికాకు చేతులు మారింది. ఏదో చేద్దామనుకున్న హిట్లర్ కల కల్లైంది. ఇప్పటికీ ప్రపంచం అణుబాంబు పడ్డ రోజును కీలక దినంగా పరిగణిస్తుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోనూ అలాంటి రాత్రి ఒకటి చూస్తారని ట్రంప్ బెదరగొడుతున్నారు. మొదట ఇరాన్‌కు కాళరాత్రిని మిగిలుస్తానన్న ట్రంప్.. తర్వాత మొత్తంగా ఇరాన్ నాగరికతే నాశనం అవుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికీ అమెరికా దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్న మాట నిజం. ఎవరేమైపోతే నాకేం అనుకుని ట్రంప్ తాను చెప్పినట్టుగా విధ్వంసానికి, వినాశనానికి దిగుతారా అనేది ప్రపంచ దేశాల్ని భయపెడుతున్న విషయం అనడంలో సందేహమే లేదు. అటు ఇరాన్ కూడా ఊహించని ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఇప్పటికే అమెరికా ఆయుధ బలంపై ఉన్న అంచనాతో మెరుగైన వ్యూహరచన చేస్తామని కూడా ధీమాగా చెబుతోంది. అమెరికా వేసే ప్రతి ఎత్తుకూ.. తమ దగ్గర పైఎత్తు రెడీగా ఉందని, తాము ట్రంప్ మాదిరిగా మాటలు చెప్పబోమని ఐఆర్జీసీ కమాండర్లు తొడ కొడుతున్నారు.
ఇరు పక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లను పక్కనపెడితే.. వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఇరాన్ నాగరికతకు ముప్పు అయితే పొంచి ఉన్నట్లే. దాన్ని ఇరాన్ కాచుకుంటుందా.. లేదంటే అమెరికా అన్నంత పనీ చేస్తుందా అనేది మాత్రమే తేలాల్సి ఉంది. అందుకోసం జరిగే యుద్ధంలో ఇంకేం వ్యూహాలు, అస్త్రాలు బయటికొస్తాయనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధానికీ, ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఇక్కడ ఇజ్రాయెల్ వ్యూహాలు కూడా కీలకమే. యుద్ధం తొలిరోజుల్లో అమెరికాతో కలిసి పనిచేసిన ఇజ్రాయెల్.. తర్వాత సొంత యుద్ధం చేస్తోంది. ఇప్పుడు కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్లానేంటనేది కీలకమే. మరోవైపు శత్రువులు విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా.. వారికి మిగిలేది బూడిదేనని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ కు మద్దతుగా ప్రాక్సీ గ్రూపులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే.. ఇప్పటిదాకా తెరవెనుక మద్దతిస్తున్న దేశాలు.. ప్రత్యక్షంగా చేయి కలిపితే.. అప్పుడేం జరుగుతుంది.. అమెరికా ఎలా రియాక్టవుతుంది.. ఇలాంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాలే.. యుద్ధం స్థితినీ, గతినీ నిర్ణయిస్తాయి.
యుద్ధంలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. కానీ అండర్‌డాగ్‌గా పోరు మొదలుపెట్టిన ఇరాన్.. అనూహ్యంగా అగ్రరాజ్యానికి షాకుల మీద షాకులిచ్చింది. తానూ తీవ్రంగా నష్టపోయినా.. అదరకుండా బెదరకుండా రంగంలో నిలబడింది. ఈ స్థితిలో ఇకపై జరిగే యుద్ధం హోరాహోరీగానే సాగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే ఈ హోరాహోరీలో అనూహ్య ఎత్తుగడులు, ఊహించని దాడులు, అనుకోని అస్త్రాలతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తి రేపుతున్న విషయం. నాలుగేళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని తీవ్రంగా భయపెట్టినా.. తర్వాత కాస్త కుదురుకుంది. కానీ ఇరాన్ యుద్ధం అలా కాదు. కొన్ని వారాలకే క్షణం క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తెరలేపి.. మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా టెన్షన్ పెడుతోంది. ఏం జరిగినా.. ప్రత్యర్థి పూర్తిస్థాయిలో నాశనం కావాలనే రెండు పక్షాలూ పట్టదలకు పోతున్నాయి. రెండు ఖండాల మధ్య పోరుగా మొదలైన ఉక్రెయిన్ యుద్ధం కంటే.. కేవలం పశ్చిమాసియాకే పరిమితమౌతుందనుకున్న ఇరాన్ యుద్ధమే.. చాలా త్వరగా తీవ్రరూపం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం.. అక్కడ లేని ఆర్థిక కోణం.. ఇక్కడ ఉండటమే. తనకు అందుబాటులో ఉన్న హర్మూజ్‌ను ఇరాన్ వినియోగించుకుంటున్న తీరు.. అన్ని దేశాలక పాఠమే అనడంలో సందేహం లేదు. ఓవైపు హర్మూజ్‌పై పట్టు కొనసాగిస్తూ.. మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరా కేంద్రంపై ఇరాన్ కొట్టిన దెబ్బకే అమెరికాకు దిమ్మ తిరిగింది. ఇరాన్ ఈ రేంజ్ దాడుల్ని తాము ఊహించలేదని ట్రంప్ స్వయంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధానికి కొన్ని నెలల ముందే వెనిజువెలా అధ్యక్షుడ్ని అపహరించి.. తిరుగులేని శక్తినని విర్రవీగిన అమెరికా అహంకారం.. ఇప్పుడు కొన్ని వారాల్లోనే మటుమాయమైంది. ఇరాన్ అమెరికా అహంకారాన్ని దాదాపుగా హరించిందనే చెప్పాలి. ఆ విషయం ఒప్పుకోవటానికి ట్రంప్‌కు అహం అడ్డొస్తోంది. చివరకు అదీ మిగలకుండా చేస్తామని ఇరాన్ ఇప్పటికే ఎద్దేవా చేస్తోంది.
ఇప్పటిదాకా తాము భయపెడితే.. భయపడిన ప్రపంచాన్నే చూసింది అమెరికా. కానీ ఇరాన్ లాంటి పెద్దగా శక్తి లేదని తాము అంచనా వేసిన దేశం.. ఇప్పుడు తమ ముందు నిలబడి తొడగొడటాన్ని సహించలేకపోతోంది. అందుకే మొత్తంగా ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. అటు ఇరాన్ కూడా ఖమేనీ పాలన అంతమొందిస్తామని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు తమ దేశాన్నే లేకుండా చేస్తామనటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తమ అస్తిత్వానికి ట్రంప్ పర్మిషన్ కావాలా అని బుస కొడుతోంది. ఆ ప్రతిస్పందన తీవ్రతకు అమెరికా చేష్టలుడిగింది. ఇప్పుడు మళ్లీ సర్వశక్తులు కూడదీసుకుని బలంగా ఇరాన్‌ను దెబ్బకొట్టాలని చూస్తోంది. ఆ దెబ్బే ఎలా ఉంటుందా అనేది ప్రపంచం ముందున్న సందిగ్ధం. ఇటు ఇరాన్ మాత్రం అమెరికా తన శక్తిని అతిగా ఊహించుకుంటుందని ఇప్పటికే రుజువు చేసింది. ఇక మీదట కూడా అమెరికాకు ఎదురుదెబ్బ తప్పదని ధీమాగా కనిపిస్తోంది. తమ దేశాన్ని కాపాడుకోవడం తమకు బాగా తెలుసని, దేశ ప్రజలందరూ ప్రాణార్పణకు సిద్ధమేనని అంతిమ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా తగ్గటం లేదు. ఇరాన్ బెదరటం లేదు. ఇజ్రాయెల్ అదరటం లేదు. ఇటు ప్రపంచానికి ఎంత ధైర్యం చెప్పుకున్నా భయం పోవడం లేదు. డెడ్‌లైన్ తర్వాత ఏం జరుగుతుంది.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఏమీ జరగదని ఎవరూ ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఏదో జరిగిపోతోందనే భయం.. కొత్త సంక్షోభం వస్తుందేమో అనే సందేహం ప్రపంచ దేశాల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. పోనీ ఏదోకొటి చేసి.. రెండు పక్షాలకు నచ్చజెబుదామనుకున్నా.. ఆ ప్రయత్నాలు ముందే విఫలమయ్యాయి. అలాగని ఏదో పక్షం వహించి.. యుద్ధానికి త్వరగా ముగింపు తేవాలనుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నాయి. ఏమీ చేయలేక, చూస్తూ ఉండలేక.. జరగరానిది జరుగుతుందేమోననే కలవరంతో ప్రపంచం ఊపిరి బిగబట్టింది.
యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా ఎయిర్‌ఫోర్స్‌దే ప్రధాన పాత్ర. నేవీ కాస్త సహకారం అందించింది అంతే. కానీ ఇంతవరకు ఆర్మీ రంగంలోకి దిగలేదు. మధ్యలో భూతల పోరుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించినా.. అది ఇప్పటిదాకా కార్యరూపం తీసుకోలేదు. కానీ ఇకపై గ్రౌండ్ వార్ జరగబోదనే సంకేతాలైతే ఎవరూ ఇవ్వట్లేదు. అందుకు తగ్గట్టే ఇరాన్ కూడా 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసింది. ఒకవేళ ఇరాన్‌లో భూతల యుద్ధం జరిగితే.. అది ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అమెరికా వైపు నుంచి చూస్తే.. ఇప్పటికే భారీ సంఖ్యలో సైనికులు పశ్చిమాసియాకు చేరుకున్నారు. కానీ ప్రస్తుతానికి వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. కానీ ఇరాన్ దగ్గర లక్షల మంది ఉన్నారు. ఈ స్థితిలో గ్రౌండ్ వార్ జరిగితే.. అమెరికా సైన్యంలో ఎవ్వరూ వెనుదిరిగి వెళ్లరన్న ఇరాన్ హెచ్చరికలు నిజమౌతాయా అనే సందేహాలు లేకపోలేదు. కానీ యుద్ధంలో అన్ని వ్యూహాలూ, కదలికలు కంటికి కనిపించాలని ఏమీ లేదు. అమెరికా కూడా గుట్టు చప్పుడు కాకుండా.. సడెన్‌గా భారీ సంఖ్యలో సైన్యాన్ని ఎక్కడ నుంచైనా దింపే అవకాశం ఉండనే ఉంది. ఇక స్థానబలిమితో మొసలిలా బలం పుంజుకుంటున్న ఇరాన్ అయితే అపరిమిత సైన్యాన్ని దించుతామనే హెచ్చరికలకు కట్టుబడ్డా వింతేమీ లేదు.
యుద్ధంలో ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసి భంగపడ్డ అమెరికా.. కనీసం గ్రౌండ్‌వార్ విషయంలో అయినా సరైన అంచనాలతో ఉందా.. లేదా అనే అనుమానం ఉండనే ఉంది. ఇక్కడ కూడా తప్పుడు అంచనాతో దిగితే మాత్రం దారుణ పరాభవం తప్పదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఇరాన్ భూభాగమే సంక్లిష్టం. అక్కడ అమెరికా సైన్యం అలవాటుపడటమే కష్టం. అలాంటిది ఇరాన్‌లో దిగి.. ఇరాన్ సైనికుల్ని ఎదిరించి పోరాడటం, ఆ పోరులో గెలవటం అంత తేలిక కాదు. అమెరికా ఇప్పటిదాకా చేసిన యుద్ధాల్లో కూడా ఎయిర్‌ఫోర్స్ రూట్ క్లియర్ చేసిన తర్వాతే ఆర్మీ రంగంలోకి దిగింది. కానీ ఇరాన్ లో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇరాన్ గగనతలం తమ నియంత్రణలో ఉందని అమెరికా చెప్పుకుంటున్నా.. వాస్తవం ఏంటో ప్రపంచం మొత్తానికీ తెలుసు. ఇక ఒక్క పైలట్ ప్రాణాలు కాపాడటం కోసం ఏకంగా 54 గంటల పాటు ఇరాన్ గడ్డపై అమెరికా చేసిన సాహసోపేతమైన ఆపరేషన్.. ఆ దేశానికి జరగబోయే యుద్ధం ఏ రేంజ్‌లో ఉంటుందో శాంపిల్ చూపించింది. ఈ ఆపరేషన్ తర్వాత ట్రంప్ భూతల దాడికి దిగబోరని ఇరాన్ కూడా భావిస్తోంది. అంతకుముందు ట్రంప్ కూడా గ్రౌండ్‌వార్ అంతిమ ఆప్షన్ మాత్రమే అని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగేది ఆఖరిపోరాటమే కాబట్టి.. ఆ పని కూడా చేసేస్తారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
ఇప్పుడు అమెరికా అవమానంతో రగిలిపోతోంది. తీవ్ర ప్రయత్నాల తర్వాత హర్మూజ్‌ను తెరవలేకపోయామనే కసితో ఉంది. అందుకే ఇరాన్ కు కీలకమైన ఖర్గ్‌ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. కానీ దానికి ఇరాన్ విరుగుడు వ్యూహం రెడీ చేయడంతో.. ఇకపై అమెరికా చెప్పని లక్ష్యాలపై అనూహ్య దాడులకు దిగుతుందనే వాదన లేకపోలేదు. దానికి తగ్గట్టుగానే గడువు ముగియటానికి ముందే దాడులు మొదలుపెట్టిన అమెరికా.. ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై గురిపెట్టింది. అటు ఇరాన్ కూడా ప్రపంచంలో ఎక్కడైనా దాడులు చేసే సత్తా తమకు ఉందని చెప్పటం.. ఊహించని లక్ష్యాలపై గురిపెట్టడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ఇప్పటిదాకా యుద్ధంలో అమెరికా పెద్దగా అనూహ్య దాడులకు దిగలేదు. కానీ ఇరాన్ మాత్రం ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేస్తూ దాడులకు దిగుతూనే ఉంది. గల్ఫ్‌పై తీవ్రదాడులు.. అమెరికాకు షాకిస్తే.. అనూహ్యంగా హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న డిగో గార్షియా స్థావరంపై దాడితో.. యూరప్ మొత్తం ఉలిక్కిపడింది. దీంతో యూరప్‌పైనా దాడులు చేసే సత్తా తమకు ఉందని ఇరాన్ చాటిచెప్పినట్లైంది. ఇప్పుడు ఏకంగా ప్రపంచమంతా తమ రాడార్లో ఉందని ఇరాన్ చెప్పడంతో.. అమెరికా మిత్రదేశాలన్నీ భయంతో వణికిపోతున్నాయి. ట్రంప్ ఇరాన్‌కు కాళరాత్రి మిగిల్చిటం సంగతి తర్వాత.. మొదట ఇరాన్ ఎవరికి కాళరాత్రి మిగిలిస్తుందోనని హడలిపోతున్నాయి. మొదట్నుంచీ అమెరికా చెలగాటం.. ప్రపంచానికి ప్రాణసంకటం అన్నట్టుగా సాగుతున్న ఇరాన్ యుద్ధం.. ఇప్పుడు అంతకుమించిన భవిష్యత్తును కళ్లకు కడుతోంది.
అంటే ఇకపై ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతుంది..? అసలు యుద్ధం ఇరాన్‌లోనే జరుగుతుందా..? లేదంటే సైన్యం ఇరాన్‌లో ఉంటే బాంబులు ఇతర దేశాలపై పడాతాయా..? లేకపోతే పనిలోపనిగా రెండు పక్షాలూ తమ పాత కక్షలు తీర్చుకుని.. పొరపాటుగా మిస్సైల్స్ వచ్చాయని కవర్ చేస్తాయా..? ఏమో ఓవైపు అన్నింటికీ తెగించిన అగ్రరాజ్యం.. మరోవైపు ఆత్మాహుతికి సిద్ధపడ్డ ఇరాన్.. అంతిమ యుద్ధం ఎలా చేస్తాయనేది ఎవ్వరి ఊహకూ అందటం లేదు. అలాగని ఆ ఆలోచన చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇరాన్ యుద్ధంలో అంతిమ గెలుపు ఎవరిదైనా కావచ్చు. లేకపోతే రెండు పక్షాలకూ కోలుకోలేని నష్టం జరగొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన అంతర్జాతీయ వ్యవస్థలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయి. ఇప్పటిదాకా మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూశామని గొప్పలు చెప్పుకుంటున్న ఐక్యరాజ్యసమితి.. ప్రాంతీయ యుద్ధం.. ప్రపంచ యుద్ధానికి మించిన నష్టం కలిగించిన పరిణామాలకు బాధ్యత వహించటానికి సిద్ధంగా లేకపోవడం అసలైన విషాదం. అత్యంత శక్తివంతమైన భద్రతామండలి కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఒకందుకు వాడాల్సిన వీటో అధికారాన్ని అగ్రరాజ్యాలు తమ స్వార్థం కోసం వాడుతూ.. ప్రపంచాన్ని వేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతం కావటానికి మూడో ప్రపంచ యుద్ధమే అక్కర్లేదు. ఏ చిన్నపాటి ఉద్రిక్తత అయినా.. అంతిమంగా అందరి పుట్టి ముంచుతుందనటానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.