Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About Donald Trump Policies Impact Is The Us Losing Global Leadership And Stability

Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

Published Date :March 31, 2026 , 9:55 pm
By Sudhakar Ravula
Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Story Board: అమెరికా కేవలం ఆర్థిక శక్తి, సైనిక శక్తి కాబట్టి అగ్రరాజ్యం కాలేదు. ప్రపంచ పోలీసుగా తన వంతు పాత్ర నిర్వర్తిస్తోంది కాబట్టే.. అగ్రరాజ్యంగా చలామణి అవుతోంది. సరే అమెరికా ఏం చేసినా స్వార్థం కోసమే చేస్తుందనే ఆరోపణలు ఎన్ని ఉన్నా.. కీలక సమయాల్లో అమెరికా కలగజేసుకోకపోతే చాలా సమస్యలు సంక్షోభాలుగా మారి ఉండేవని మెజార్టీ దేశాలు ఒప్పుకుంటాయి. అందుకే ప్రపంచం అమెరికాను పెద్దన్నగా భావిస్తుంది. అలాంటి అమెరికాకు అధ్యక్షుడ్నీ కూడా అంతే గౌరవంతో చూస్తుంది. కానీ ఇదంతా గతం. నాలుగు వందల సంవత్సరాల అమెరికా చరిత్రకు నాలుగు నెలల్లోనే చెదలు పట్టించే అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఆయన గద్దెనెక్కాక.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి.. బాగా చిల్లరగా మారిపోయింది.

ప్రపంచం ఇప్పటిదాకా చాలా సమస్యల్ని చూసింది. కరోనా లాంటి సంక్షోభాల్ని, చివరకు యుద్ధాల్ని కూడా చూసింది. కానే సమస్యే మనిషి రూపం తీసుకున్న ట్రంప్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదు. ట్రంప్ ఉండగా ప్రపంచానికి వేరే సమస్య ఏదీ అక్కర్లేదనే జోకులు పేలుతున్నాయి. ఆ స్థాయిలో ట్రంప్ రోజురోజుకీ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రపంచ పటాన్ని మార్చేస్తానంటారు. వెనిజువెలా అధ్యక్షుడ్ని కిడ్నాప్ చేస్తారు. ఇరాన్‌పై సరైన కారణం లేకుండా యుద్ధానికి దిగుతారు. గ్రీన్ లాండ్ స్వాధీనం చేసుకుంటామంటారు. క్యూబాను బెదిరిస్తారు. కొలంబియా అధ్యక్షుడ్ని ఆడిపోసుకుంటారు. చివరకు మిత్రదేశాల్నీ వదలకుండా కుమ్మేస్తారు. నాటోను పనికిరానిదిగా తేల్చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ట్రంప్ లీలలు అన్నీ ఇన్నీ కాదు.

Also Read

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?
Add as a preferred
source on google

ప్రపంచంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా.. దానికి ఆహ్వానం పలికేలా రూపొందించిన అమెరికా వీసా విధానాన్ని ట్రంప్ సమూలంగా మార్చేయాలనుకుంటారు. ఇప్పటికే తలాతోకా లేని రూల్స్‌తో అమెరికా అంటేనే భయపడేలా చేశారు. ఇక సుంకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనికి ట్రంప్ చెప్పే లాజిక్ వింటే.. మైండ్ ఉన్నవాడు ఎవడికైనా మైండ్ పోతుంది. ఆ రేంజ్‌లో అడ్డగోలు వాదన వినిపిస్తున్న ట్రంప్.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లను ఊరేగుతున్నారు. చివరకు వైట్‌హౌస్‌ ఏకాకిని చేసినా.. కాంగ్రెస్ తిరస్కరిస్తున్నా.. ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పైగా దేశం బంగారు భవిష్యత్ కోసం తాను నిందలు మోస్తున్నానంటూ.. సిలువ మోసిన క్రీస్తు రేంజ్‌ లో బిల్డప్‌ ఇస్తున్నారు. ట్రంప్‌ ని చూసి నవ్వాలో.. ఏడవాలో తెలియక అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు.

ట్రంప్ పాలన భరించలేక.. ఆయన అధ్యక్షుడైన కొన్ని నెలలకే నో కింగ్స్ పేరుతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. కానీ ఆ తర్వాత కూడా ట్రంప్ బుద్ధి మార్చుకోలేదు. అంతకంతకూ రెచ్చిపోయి.. మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. ఉరుము లేని పిడుగులు, పులి మీద పుట్రలూ చాలా సాధారణం అనేంతగా ట్రంప్ అరాచకం విజృంభిస్తూనే ఉంది. దీంతో ఇక లాభం లేదని అమెరికన్లు మరోసారి దేశవ్యాప్తంగా నో కింగ్స్ ఆందోళనలకు దిగారు. ఈసారి నిరసనలకు మిన్నెసోటా కేంద్రంగా నిలిచింది. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత ఉధృతమైన నిరసనలు జరుగుతున్నాయని రికార్డులు చెబుతున్నారు. అమెరికన్లతో పాటు అమెరికా మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాల్లోనూ ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కానీ ఎవరెన్ని నిరసనలు తెలిపినా నా పదవీకాలం ముగిసేవరకు నా ఇష్టం అంటున్నారు ట్రంప్. మొండివాడు రాజు కంటే బలవంతుడంటారు. ఇక్కడ రాజే మొండివాడైతే.. ఇక కొత్తగా చెప్పేదేముంటుంది. తాను చెప్పిందే వేదం అంటున్న ట్రంప్.. కాదని ఎవరైనా వేరే మాట్లాడితే.. వాళ్లు పిచ్చివాళ్లని, బుద్ధిలేదని.. నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. చివరకు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కంటే తన దగ్గరే ఎక్కువ సమాచారం ఉందనే ట్రంప్‌ని చూసి.. అమెరికన్లకు మతిపోతోంది.

పిచ్చి పైత్యంగా ముదిరి పరాకాష్ఠకు చేరితే.. అప్పడు తనవాడు, పరాయివాడు అనే తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు ట్రంప్ కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నారా.. అనే అనుమానాలు వస్తే.. అది వచ్చినవారి తప్పు కానే కాదు. ఎందుకంటే ట్రంప్ చేష్టలు అలా ఉన్నాయి. వీసా నిబంధనల దగ్గర్నుంచీ.. ఇరాన్ యుద్ధం దాకా ట్రంప్ తీసుకున్న ఏ నిర్ణయానికీ హేతుబద్ధత లేదు. తనకు తానుగా గాల్లో ఓ వాదనను జనం మందు పెట్టడం.. దానికి ఓ ఊహాజనితమైన సమర్థనను తయారుచేసుకోవడం.. చివరకు అదే నిజమని తాను భ్రమపడుతూ.. మీరూ నమ్మండని అమెరికన్లని బలవంతపెట్టడమే ట్రంప్ పాలనగా చలామణి అవుతోంది. ఎవరైనా ఇదేం పని అని నిలదీస్తే.. ఇక జాతీయవాదం పేరుతో బెదిరింపులకి దిగి.. వారిపై దేశద్రోహులనే ముద్ర వేయటానికీ ట్రంప్ వెనుకాడటం లేదు. ఏతావాతా తాను అత్యంత దేశభక్తుడ్నని, తనకు మద్దతిచ్చేవారికి దేశంపే ప్రేమ ఉన్నట్టు.. లేని వారికి లేనట్టే అంటున్నారు ట్రంప్. అంతటితో ఊరుకుంటారని కూడా గ్యారంటీ ఏం లేదు. అమెరికాపై ప్రేమ ఉన్నవారే ఇక్కడ ఉండాలనే కొత్త రూల్ తీసుకొస్తారేమోనని ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు.

పోనీ ట్రంప్ పైత్యం అమెరికాకే పరిమితమైతే అదో రకం అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయన తన పైత్యాన్ని మొత్తం ప్రపంచానికి అన్వయిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి బాధ్యత లేదని, ప్రపంచం బాధ్యత తాను తీసుకుంటున్నానని ప్రకటించిన ట్రంప్ తెంపరితనానికి దేశాలన్నీ నివ్వెరపోతున్నాయి. భూమ్మీద ఎక్కడ ఎవరు యుద్ధం చేయాలనుకున్నా.. తన దగ్గరకు వస్తే మంచి డీల్ కుదురుస్తానని చెప్పిన ట్రంప్.. ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు మధ్య డీల్ కుదర్చకుండా.. యుద్ధానికి ఎందుకు దిగారో ఎవరూ అడగకూడదు. అదేమంటే ఇరాన్ ప్రపంచానికే పెనుముప్పు అంటూ ఏవేవో కబుర్లు చెబుతారు.

ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ పెనుముప్పుగా మారారు. దేశాల మధ్య ఉండాల్సిన దౌత్య సంబంధాలను, వ్యక్తుల మధ్య ఉండే గిల్లీకజ్జాల స్థాయికి తగ్గించి చూడటం ఆయన శైలి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిపై పెత్తనం చెలాయించే క్రమంలో అంతర్జాతీయ శాంతి పునాదులను కదిలిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడి విషయంలో అనుసరించిన బలప్రయోగ వ్యూహాన్నే ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంపై ప్రయోగించాలని చూసి, ఇప్పుడు అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కి తగ్గలేక ఒక రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎన్నో త్యాగాలు చేసి, చర్చల ద్వారా నిర్మించుకున్న అంతర్జాతీయ వ్యవస్థలను ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలతో కుప్పకూలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల ప్రాధాన్యతను తగ్గించడం, దశాబ్దాల నాటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టేస్తున్నాయి. ఒక వ్యవస్థను నిర్మించడానికి కొన్ని దశాబ్దాల సమయం పడితే, దానిని కూల్చేయడానికి ట్రంప్ వంటి ఒకే ఒక్క నాయకుడి అనాలోచిత నిర్ణయం సరిపోతుందని నేడు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. ఇరాన్ ఇచ్చిన చివరి వార్నింగ్ , ఆయిల్, గ్యాస్, ఐటీ వ్యవస్థలపై ప్రతీకార దాడుల హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం పొంచి ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ బెదిరింపుల దౌత్యం వల్ల అమెరికా తన మిత్ర దేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతోంది. యుద్ధం విస్తరిస్తే అది కేవలం ఇరాన్‌తోనే కాకుండా, మొత్తం పశ్చిమాసియా అట్టుడికిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వేసిన అడుగులు అమెరికా ప్రతిష్ఠను పెంచడం పక్కన పెడితే, ఆ దేశాన్నే ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతున్నాయి.

ట్రంప్ వ్యవహారశైలి వల్ల కేవలం రాజకీయ ఉద్రిక్తతలే కాకుండా, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సప్లయ్ చైన్స్ దెబ్బతినడం, వాణిజ్య యుద్ధాలు ముదరడం వల్ల సామాన్య ప్రజలు ధరల భారంతో అల్లాడిపోతున్నారు. నాయకుడు అనేవాడు క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయకర్తగా ఉండాలి కానీ, తానే సమస్యగా మారకూడదు. ట్రంప్ తీరు చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం నిర్మించుకున్న గ్లోబల్ ఆర్డర్‌ను ముక్కలు చేసి, ప్రపంచాన్ని మళ్ళీ అనిశ్చితిలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. నాయకత్వం అంటే కేవలం అధికారం చలాయించడం కాదు, బాధ్యతగా మెలగడం. ప్రపంచ దేశాల మధ్య పంచాయతీలను మనుషుల గొడవల తరహాలో తీర్చాలనుకోవడం ఒక చారిత్రక తప్పిదం. అదే నిస్సంకోచంగా చేస్తున్నారు. ప్రపంచానికి శాంతిని తెస్తా. యుద్ధాలు చేసినా.. ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకే.. అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ చెబుతున్నారు. కానీ.. మనం అసలు విషయం చూస్తే.. ఆయన ప్రతి చర్యా.. అందరికీ కీడు చేసేలా సాగుతోంది. వైట్ హౌస్‌లో మాట్లాడిన ట్రంప్ ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ఆపేసినా.. ఇరాన్ తిరిగి కోలుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. కానీ భవిష్యత్తులో మరో అమెరికా అధ్యక్షుడు ఇదే సమస్యను ఎదుర్కోకూడదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అంటే, ఈ యుద్ధం కేవలం తాత్కాలికం కాదు. దీని ప్రభావం దీర్ఘకాలం ఉండాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

అసలు యుద్ధమే వినాశకరం అని ప్రపంచమంతా మొత్తుకుంటుంటే.. ట్రంప్ మాత్రం యుద్ధంలో యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారు. చివరకు యుద్ధంలోనే డీల్స్ కుదుర్చుకోమంటున్నారు. మంచైనా.. చెడైనా ఏ పరిణామం జరగాలన్నీ అది యుద్ధంలో జరగాల్సిందే. అందుకోసం యుద్ధం ఆగకుండా కొనసాగాల్సిందే. ఇదే ట్రంప్ చెప్పే సైకాలజీ. దీని భావమేమి తిరుమలేశ అని దేశాలన్నీ జుట్టుపీక్కుంటుంటే.. ట్రంప్ మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ.. అసలు రహస్యం తనకు మాత్రమే తెలుసని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోవైపు ట్రంప్‌కు దగ్గరి వ్యక్తులు మాత్రం.. ఆయన్ను చాదస్తపు మొగుడితో పోలుస్తున్నారు. ట్రంప్‌కు ఏ విషయం గురించీ పూర్తిగా అవగాహన ఉండదు. ఎవరైనా చెబుతామన్నా వినిపించుకోరు. ఈ జగమొండి వైఖరితోనే యుద్ధంలోనూ అమెరికాకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని చివరకు అమెరికా సైన్యం కూడా మొత్తుకుంటోంది.

ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో.. గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు తీరని నష్టం జరిగింది. అత్యాధునిక అవాక్స్ విమానం ధ్వంసమైంది. అత్యంత ఖరీదైన క్షిపణులు చాలా వరకు ఖర్చైపోయాయి. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోకుండా.. ఇంకా భూతల యుద్ధానికి ఉబలాటపడుతున్న ట్రంప్‌ని చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటోంది. చివరకు అమెరికా ఆర్మీ కూడా భంగపడి.. ఇరాన్ చేతిలో చావుదెబ్బ తింటే కానీ.. ట్రంప్ అహం చల్లారదేమోననే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కానీ ఎవరేమనుకున్నా.. నా మాటే శాసనం అంటున్నారు ట్రంప్.

ఇరాన్ యుద్ధంలో వ్యూహం లేని ట్రంప్.. అర్ధంతరంగా దాడులకు విరామం ఇచ్చారు. ఈ గ్యాప్‌లో తర్వాతి టార్గెట్ క్యూబానే అంటూ అనవసరపు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో క్యూబా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్ కారణంగా అమెరికాకు దూరమైన యూరప్ దేశాలు.. మరిన్ని యుద్ధాలకు దిగితే.. అమెరికాను దేవుడు కూడా కాపాడలేడని డ్యామేజింగ్ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో నాటో దేశాలు పిరికిపందలంటూ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. అసలు ట్రంప్ ప్రకటనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా.. అనేది మరో సందేహం. ఎలాంటి పరిణతీ లేని ట్రంప్ వ్యాఖ్యలకు అర్థమే లేదనేది ప్రపంచం నిశ్చితాభిప్రాయం. ఆయన పదవీకాలం ముగిసేదాకా.. ట్రంప్ మాటలకు విలువ ఇవ్వకుండా ఉంటే.. ప్రపంచానికి ఆయన కారణంగా జరిగే నష్టం కొంతైనా తగ్గుతుందేమోనని మిగతా దేశాలు ఆశ పడుతున్నాయి. కానీ ట్రంప్ పోకడ చూస్తుంటే.. ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చే యోచన భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు.

అమెరికా చరిత్రలో ఎంతోమంది అధ్యక్షులు వచ్చారు. వెళ్లారు. చేయగలిగితే అమెరికా ప్రతిష్ఠ పెంచారు. లేకపోతే అగ్రరాజ్యం పరువు పోకుండా చూసుకున్నారు. అంతేకానీ ట్రంప్ లాగా ఏ అమెరికా అధ్యక్షుడు.. దేశానికి ప్రపంచంలో విలువ లేకుండా చేసిన పాపాన పోలేదు. ఒకప్పుడు అమెరికా పౌరులమని గర్వంగా చెప్పుకున్న అమెరికన్లకు.. ఇప్పుడు ట్రంప్ పాలనలో సొంత దేశం అమెరికా అని చెప్పటానికి కూడా సిగ్గేసేలా ట్రంప్ పాలన ఉంది. వీసాలపై ఆంక్షలు విధించటంతో మొదట సంతోషించిన అమెరికన్లు.. ఆ తర్వాత అనుకున్న విధంగా తమ జీవితాలు బాగుపడలేదని త్వరగానే గుర్తించారు. కొన్ని కంపెనీలు వలసదారులకు తక్కువ జీతమిచ్చి పని చేయించుకోవటానికి అలవాటుపడ్డాయి. అలాంటి కంపెనీలు ఇప్పటికిప్పుడు అమెరికన్లకు అక్కడి కార్మిక చట్టాల ప్రకారం జీతం ఇవ్వటానికి సిద్ధంగా లేవు. దీంతో ట్రంప్ చర్యలతో వలసదారుల ఉద్యోగాలు పోవటమే కానీ.. తమకు ఒరిగేదేం లేదని వారికి అర్థమైంది. టారిఫ్ ల విషయంలో కూడా తాత్కాలికంగా పైచేయి సాధించినా.. అంతిమ నష్టం అమెరికాకేనని వారెన్ బఫెట్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఇష్టారాజ్యంగా టారిఫ్ యుద్ధానికి తెరతీసి.. ప్రపంచ మార్కెట్లను కప్పుకూల్చిన ట్రంప్.. చివరకు సొంత మార్కెట్ ను కూడా పడేశారు. దీంతో అమెరికాలో కలవరం మొదలైంది. యుద్ధం మొదలుపెట్టినవారికి కూడా నష్టం తప్పదన్న ప్రాథమిక సూత్రం మర్చిపోయామని తీరిగ్గా ఆవేదన వ్యక్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏకంగా 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా చైనా, కెనడా దిగుమతులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు షాక్ తగిలింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ఇక ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా సర్వభ్రష్టత్వం చెందిందనడంలో సందేహమే అక్కర్లేదు.

ట్రంప్ వస్తే దేశాన్ని తలెత్తుకునేలా చేస్తాడనుకున్న అమెరికన్లకు.. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ జరుగుతున్న పరిణామాలేవీ జీర్ణం కాలేదు. ప్రపంచాన్ని అమెరికా కంట్రోల్ లోకి తెస్తానని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు అమెరికా కంట్రోల్‌ను పూర్తిగా తప్పించేలా కనిపిస్తున్నారు. ఏకధృవ ప్రపంచాన్ని.. ట్రంపే పనిగట్టుకుని బహుళ ధృవ ప్రపంచం దిశగా నడిపించడం అమెరికన్లకు మింగుడు పడటం లేదు. కొత్తగా ఆధిపత్యం సంగతి దేవుడెరుగు.. ఉన్న అడ్వాంటేజీని ఎందుకు పోగొడుతున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలకు అవకాశం ఇచ్చేలా మాట్లాడిన ట్రంప్.. చివరకు తొలి విడత పాలననే కాస్త మార్పులతో అమలు చేస్తున్నారని అమెరికన్లకు అర్థమైంది. ఎవరేమైపోయినా పర్లేదు.. కనీసం అమెరికా బాగుంటే అంతే చాలు అనుకున్నవారికి.. ఆ కాస్త తృప్తి కూడా ట్రంప్ దక్కనివ్వట్లేదు. అమెరికన్ల సగటు జీవన ప్రమాణాలు పెరగలేదు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. అనుకున్నట్టుగా ఉద్యోగాలు రాలేదు. చిరకాల మిత్రులు శత్రువులయ్యారు. కొత్త కొత్త ఆంక్షలతో ప్రజా జీవనం దుర్భరమౌతోంది. ఇవన్నీ చూస్తే.. అసలు బైడెన్ పాలనకూ, ట్రంప్ పాలనకూ ఏం తేడా ఉందని బేరీజు వేసుకున్న అమెరికన్లు.. ట్రంప్ కంటే బైడెన్ బెటరనే అభిప్రాయానికి వచ్చి.. ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఇంటా బయటా ఈగల మోతను ఎదుర్కుంటున్న ట్రంప్.. ఏ అంశంలోనూ అమెరికన్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోలేదు. పైగా దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే కొత్త ప్రశ్నలు వచ్చేలా చేశారు. సహజంగా కొత్త సర్కారు వచ్చిన ఏడాది వరకు ఎక్కడా అంత త్వరగా వ్యతిరేకత రాదు. కానీ ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ అయి 2 నెలలు గడవక ముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అప్పుడే ట్రంప్ కొత్తగా చేసేదేమీ లేదని ఫిక్సయ్యేలా చేసుకున్నారు. అటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై దిగులుగా ఉన్నారు. ఏదో చేస్తాడనుకుంటే.. ఇంకేదో అవుతుందని నిట్టూరుస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ప్రపంచ దేశాలతో కొత్త పేచీలు పెట్టుకోవటానికి ట్రంప్ మొగ్గుచూపారు

అటు ట్రంప్ ఆరోగ్యంపై కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఫ్లోరిడా చేరుకున్న ఆయన.. మెట్లు దిగుతూ తడబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 78 ఏళ్ల ట్రంప్, విమానం మెట్లు దిగుతున్నప్పుడు రెయిలింగ్ గట్టిగా పట్టుకుని చాలా నెమ్మదిగా, అతి జాగ్రత్తగా అడుగులు వేయడం ఆ వీడియోలో కనిపించింది. ఆయన చాలా అలసిపోయినట్లుగా ఉన్నారని, వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల భారమే ఇలా కుంగదీస్తోందని విమర్శిస్తుండగా, మరికొందరు వయసు పైబడినా చురుగ్గా ఉండే బైడెన్‌ను ఉదాహరణగా చూపుతూ ట్రంప్‌ను ఎద్దేవా చేస్తున్నారు.

అలాగే ఒక కార్యక్రమంలో కూడా, టేబుల్ పట్టుకుని కుర్చీలో కూర్చోవడానికి ట్రంప్ ఇబ్బంది పడినట్లు మరో వీడియోలో వెల్లడైంది. ఇటీవల ఆయన చేతుల రంగు మారడం, చీలమండలు వాచడం వంటి పరిణామాలు ఆయన అనారోగ్య వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే, వైట్ హౌస్ వైద్యుడి నివేదికను ఉటంకిస్తూ.. తానే అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుడిని అని ట్రంప్ తనను తాను సమర్థించుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏతావాతా ప్రపంచ సమస్యగా మారిన ట్రంప్.. అమెరికాకూ వదిలించుకోలేని పీడలా తయారయ్యారు. ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తికాకుండానే ఈ రేంజ్‌లో రెచ్చిపోతున్నా.. పదవీకాలం పూర్తయ్యేసరికి ఇంకేం అరాచకాలు చేస్తారోనని అమెరికన్లతో పాటు ప్రపంచ దేశాల పౌరులూ హడలిపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • America political analysis
  • Donald Trump policies
  • global politics news
  • Iran US tensions
  • NATO relations USA

తాజావార్తలు

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

  • Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?

  • PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions