Story Board: దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి చేరనున్నాయి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అనే ప్రశ్న కీలకంగా మారింది. 2014లో ఉమ్మడిగా ఉన్న ఏపీ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల్ని పెంచుతామని విభజన చట్టంలో స్పష్టం చేశారు. తాజాగా తెరమీదకు వచ్చిన నియోజకవర్గాల పునర్వభిజన చట్టం కారణంగా తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందా? విభజన చట్టాన్ని యథాతధంగా అమలు చేస్తే లాభం జరుగుతుందా? అన్నది సందేహంగా మారింది. అయితే.. నియోజకవర్గాల పెంపు యాభై శాతం గుండుగుత్తుగా అని స్పష్టత వచ్చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.
ఉమ్మడి ఏపీలో 2014 వరకు 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 175 స్థానాలు.. తెలంగాణకు 119 స్థానాలు వెళ్లాయి. అదే సమయంలో లోక్ సభ స్థానాల అంశాన్నే తీసుకుంటే.. ఏపీకి 25 స్థానాలు.. తెలంగాణకు 17 స్థానాలు కేటాయించారు. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 స్థానాలకు 225 స్థానాలు పెరగాలి. అదే ఇప్పుడు కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిన పునర్విభజన చట్టంలో చెప్పినట్లుగా 50 శాతం స్థానాల్ని పెంచేస్తే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263కు చేరుకుంటాయి. అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న దాని కంటే తాజా డీలిమిటేషన్ బిల్లుతోనే ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపుతో ఇది కాస్తా 179కు పెరుగుతంది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఏపీ రాష్ట్ర వాటా 4.08 శాతం. ఆ నిష్ఫత్తి ప్రకారం ఏపీకి వచ్చే లోక్ సభ స్థానాలు 33 మాత్రమే. ఇది ఉత్తరాదితో పోలిస్తే ఏపీకి నష్టం. అదే సమయంలో జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 50 శాతం సీట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకుంటే.. ఏపీలో లోక్ సభ సీట్లు ప్రస్తుతం ఉన్న 25 సీట్లు కాస్తా 37-38 అవుతాయి. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం లోక్ సభ స్థానాలు 17 ఉన్నాయి. జనాభా లెక్కలు కాకుండా.. 50 శాతం గుండుగుత్తుగా పెంచేస్తే తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య 17 కాస్తా 25-26 మధ్యలో పెరిగే వీలుంది. మొత్తంగా చూస్తే.. విభజన చట్టాన్ని అనుసరించే కన్నా.. 50 శాతం పెంచే బిల్లుతోనే తెలుగురాష్ట్రాలకు మేలు చేకూరుస్తుందని చెప్పక తప్పదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సీట్లు ఎక్కడ పెరుగుతాయి..? తగ్గే సీట్లు ఎక్కడ తగ్గుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. జనాభా ఎక్కువగా ఉన్న పెద్ద నగరాల్లో సీట్లు పెరిగి.. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గొచ్చనేది అంచనా. అలా జరిగితే.. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కలే ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ జనాభా 3.60 కోట్లు కాగా.. జీహెచ్ఎంసీ జనాభానే కోటి పైగా ఉంది. కాబట్టి ఇక్కడ సీట్లు పెంచక తప్పదు. గతంలో పునర్విభజన జరిగినప్పుడు కూడా హైదరాబాద్‌లో సీట్లు పెరిగిన సంగతిని సీనియర్లు గుర్తుచేసుకుంటున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే అక్కడ హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లేవు. కాకపోతే పాతిక లక్షల జనాభా ఉన్న విశాఖ, 16 లక్షల జనాభా ఉన్న విజయవాడే పెద్ద నగరాలుగా ఉన్నాయి. ఆ నగరాల్లో సీట్ల పెంపు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
ఏతావాతా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నగర ప్రాంతాల్లో సీట్లు పెరిగి.. గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు తగ్గుతాయనేది ప్రముఖంగా వినిపిస్తున్న మాట. అలా జరిగితే అర్బన్ ప్రాంతాల్లో పట్టున్న పార్టీలకు, నేతలకు అడ్వాంటేజ్ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. తద్వారా గ్రామీణ ఓటర్ల కంటే అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు, నేతలు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం అక్కర్లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ పరిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ తమ బలాబలాలు, ట్రాక్ రికార్డ్, ఓట్ల శాతం, పట్టున్న ప్రాంతాల లెక్కలు తీసే పనిలో పడ్డాయి. దాన్ని బట్టి భవిష్యత్ రాజకీయ వ్యూహం ఖరారు చేసుకునే పనిలో పడొచ్చని నేతలు భావిస్తున్నారు. డీలిమిటేషన్‌కు ఓ రకమైన కసరత్తు చేయాల్సి ఉండగా.. మహిళా రిజర్వేషన్ సీట్ల విషయంలో మరో రకమైన కసరత్తు చేయక తప్పదని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. మహిళా రిజర్వేషన్లు ఎక్కడ ఖరారవుతాయో తెలియదు కాబట్టి.. ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో మహిళా నేతల్ని రెడీ చేసుకోవడం తొలి అడుగు. ఆ తర్వాత ఇప్పటికే పురుష అభ్యర్థులు పాతుకుపోయిన చోట సీట్లు మహిళలకు రిజర్వ్ అయితే.. అప్పుడు పాతకాపుల్ని కూడా మహిళలకు మద్దతిచ్చేలా సమన్వయం చేసుకోవడం రెండో అడుగు. ఆ తర్వాత మహిళలు పోటీచేసే నియోజకవర్గాల్లో సొంత పార్టీకి అనుకూలత ఉండేలా చూసుకుని.. ప్రత్యర్థులు బలపడకుండా చూసుకోవడం మూడో అడుగు. ఈ మూడు అడుగుల్లో ఎక్కడ తేడా వచ్చినా.. అసలుకే ఎసరు వస్తుందని అన్ని పార్టీలూ టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే ఓ మేరకైనా మహిళా నేతల్ని ఎంకరేజ్ చేస్తున్న పార్టీలు.. కొంత ధీమాగా ఉన్నా.. మహిళలకు పెద్దగా ప్రాతినిధ్యం ఇవ్వని, చెప్పుకోదగ్గ మహిళా నేతల్లేని పార్టీలకు గుబులు పట్టుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చినంత తేలికగా.. వారికి కేటాయించిన సీట్లు గెలవగలమా.. లేదా అని నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని పార్టీలకు మహిళల్లో సహజ అనుకూలత ఉంది. మరికొన్ని పార్టీలు మహిళలకు చేసిన పనుల కారణంగా ఆదరణ ఉంది.
ఇంకొన్ని పార్టీలకు మాత్రం స్వతహాగా మహిళల్లో అనుకూలత లేదు. కొన్నింటికైతే తమ తప్పు లేకుండానే ప్రత్యర్థుల చాతుర్యం కారణంగా మహిళా వ్యతిరేకులనే ముద్ర పడిపోయింది. ఇప్పటికిప్పుడు ఆ ముద్ర చెరిపేసుకోవడం కుదురుతుందా అనేది కొత్త టెన్షన్. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండానే.. ఎన్నికల్లో గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారుతున్నాయి. ఇటీవలే జరిగిన బీహార్ ఎన్నికల్లో నారీశక్తి ఘనంగా పనిచేసింది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక పరిస్థితి ఇంకా మారుతుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇకపై కచ్చితంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మ్యానిఫెస్టో, విధానాలు, రాజకీయ దృక్పథం ఉండక తప్పని స్థితి వస్తుందని అనుకుంటున్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్ కారణంగా కొన్ని సీట్లలో కొందరు నేతల రాజకీయం గల్లంతు కానుంది. నేతల కుటుంబాల్లో మహిళలు రాజకీయాలకు సిద్ధంగా ఉంటే.. వారి స్థానంలో వీరిని బరిలో దించి తృప్తి పడొచ్చు. కానీ అలాంటి అవకాశం లేని నేతలు మాత్రం పూర్తిగా ఆశలు వదులుకోక తప్పదని పార్టీలు ముందే చెప్పేస్తున్నాయి. ఇక్కడ మొహమాటాలకు, మరే సమీకరణాలకూ తావు లేదని కుండబద్దలు కొడుతున్నాయి. పైగా మిగతా నియోజకవర్గాల్లో చేసినట్టు.. మహిళలకు కేటాయించిన సీట్లలో అతి తెలివి చూపిస్తే.. ఆ ప్రభావం మిగతా సీట్లన్నింటిపైనా పడి.. మహిళలంతా గంపగుత్తగా రివర్స్ అయితే పుట్టి మునుగుతుందని నేతలు భయపడుతున్నారు. అలా చూసుకుంటే.. ఈసారి మహిళా రిజర్వేషన్లు అమలైతే.. తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలు కొత్త రూపు సంతరించుకుంటాయనండలో సందేహం లేదు. ఇప్పటికే కొందరు మహిళా నేతలు చట్టసభల్లో ఉన్నా.. రిజర్వేషన్ల తర్వాత కనిపించే ముఖచిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రక్రియ వల్ల తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కొత్త లెక్కల ప్రకారం ఇవి 26 లేదా 27కు పెరిగే అవకాశముంది. అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా.. అదనంగా 60 సీట్లతో 179కి చేరే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనాభా పరంగా దేశంలోనే 17వ స్థానంలో ఉంది. ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అదనంగా 3 నుంచి 4 కొత్త లోక్‌సభ స్థానాలు ఏర్పడనున్నాయి. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరితో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి స్థానాలను విభజించి కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలను విభజించి అదనంగా మరో రెండు స్థానాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న మెదక్, జహీరాబాద్‌లకు తోడు మరొక కొత్త స్థానం రానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ విభజన ద్వారా అదనంగా ఒక స్థానం ఏర్పడనుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒకటి లేదా రెండు కొత్త స్థానాలు వచ్చే సూచనలున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్‌సభలో ఇద్దరు మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. 2029 ఎన్నికల నాటికి ఈ సంఖ్య కనీసం 9కి చేరనుంది. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు తక్కువ టికెట్లు కేటాయించినప్పటికీ.. భవిష్యత్తులో ప్రతి పార్టీ కచ్చితంగా 9 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ మార్పులు మహిళల గొంతు పార్లమెంటులో మరింత బలంగా వినిపించడానికి దోహదపడతాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 అవుతాయని చెప్తున్నారు. ఆ లెక్కన 50 శాతం పెరిగినా.. జనాభా ప్రాతిపాదికన అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజిస్తే జిల్లాలోని జనాభాను అనుసరించి పునర్విభజన జరుగుతుంది. ఈ లెక్కన ఇప్పటికే పది అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో మరో ఐదు పెరగవు. సరపడా జనాభా ఉంటేనే పెంపు ఉంటుంది. లేకపోతే ఉండదు. ఇక మహిళలు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్నారు. దీంతో పెరిగే స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చు. ప్రస్తుతం ఎస్సీ ఉన్న నియోజకవర్గాల్లో పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో రిజర్వేషన్ మారే అవకాశాలున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల పెంపు ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల ఆధారంగా లోక్‌సభ స్థానాలను పునర్విభజించాలన్న నిబంధన పెట్టారు. ఈ లెక్కన ముందు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27,41,239 మంది జనాభా ఉన్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం మేరకు ప్రతి 2లక్షల జనాభాకు ఒక సీటు పెరిగే అవకాశం ఉంది. ఇక లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26 లేదా 27 అయ్యే అవకాశాలున్నాయి. జనాభా లెక్కల ఆధారంగా ఏర్పాటు చేస్తే అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ స్థానాలు, పునర్విభజన అనంతరం 14 లేదా 15 అయ్యే అకాశాలున్నాయి. వీటిలో 33 శాతం కనిష్ఠంగా 4 నుంచి గరిష్ఠంగా 5 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ స్థానాలను కలుపుకొనే మహిళల రిజర్వేషన్ కల్పిస్తారు. అంటే రిజర్వేషన్ పురుషులు, మహిళలు అని మారుతూ ఉంటుంది. దీంతో రాజకీయంగా కొత్త వారికి అవకాశాలు వస్తాయి. పురుషులతోపాటు మహిళలు అవకాశాలు అందిపుచ్చుకొనే వీలు ఉంటుంది.
తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 178కి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రోరేటా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టనున్నట్లు సంకేతాలిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం పెరిగి.. మొత్తం స్థానాలు 178 కానున్నాయి. ఈ ప్రాతిపదికన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఏకంగా 45 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉన్నందున.. రాజధానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం అధికంగా ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ స్థానాలు 20 కానుండగా.. అందులో 7 మహిళలకు, ఒకటి ఎస్సీలకు రిజర్వ్ అవుతాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలు, రంగారెడ్డి పరిధిలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సన్నాహాలు చేస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కొత్తగా పెరుగుతున్న నియోజకవర్గాల వల్ల ఎవరికి ప్రయోజనం? అన్న ప్రశ్న ఉత్కంఠకు గురిచేస్తోంది. సహజంగా నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని విశ్లేషిస్తుంటారు. అయితే తెలంగాణ వరకు వచ్చేసరికి ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎన్నికల కమిషన్ పరిధిలో జరిగే ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నియంత్రించే అవకాశం ఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతోంది. దీంతో తెలంగాణ డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్కంఠకు గురిచేస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో అదనంగా 50 శాతం సీట్లు పెరగనుండటం ఎవరికి అడ్వాంటేజ్ అన్న చర్చకు కారణమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి తన ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో కనిపిస్తోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి అధికారాన్ని అందుకోవాలని తెగతాపత్రయపడుతోంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గాల పునర్విభజనను అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. కానీ రాష్ట్రంలో తమకు ఉన్న సంస్థాగత బలం.. ఉపయోగపడుతుందనేది బీఆర్ఎస్ లెక్కగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, కాంగ్రెస్, బీజేపీ 2024 ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు చొప్పున గెలుచుకున్నాయి. ఇక వచ్చే ఎన్నికలు జమిలి విధానంలో జరిగే అవకాశం ఉండటంతో బీజేపీ తనకు అనుకూలంగా డీలిమిటేషన్ జరిగేలా చూసుకుంటుందని అంటున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ డీలిమిటేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సివుంటుందని, ఆ విధంగా కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా మార్చుకునే పరిస్థితి కూడా ఉందంటున్నారు. మొత్తం మీద ఎవరేం చేసినా.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం కచ్చితంగా మారుతుంది. అందుకు తగ్గట్టుగా అన్ని పార్టీలూ రాజకీయ వ్యూహాలు మార్చుకోక తప్పదు. ఇప్పటిదాకా పనిచేసిన సమీకరణాలు ఇకపై పనిచేయకపోవచ్చు. ఇప్పటిదాకా ప్రాధాన్యం దక్కని ప్రాంతాలు.. కొత్తగా కీలక పాత్ర పోషించవచ్చు. ఇక మహిళలకు రిజర్వయ్యే సీట్లు ఎక్కడ ఉంటాయి..? వాటిలో పాత సమీకరణాలు పనిచేస్తాయా..? కొత్త వ్యూహరచన చేయాలా..? అనే ప్రశ్నలు అన్ని పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
సాధారణంగా దేశంలో నియోజక వర్గాలను జనాభా ప్రాతిపదికనే ఏర్పాటు చేస్తుంటారు. చివరిసారిగా… 1971 జనాభా లెక్కల ప్రకారం 1972లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత… నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ… కొన్ని పరిధులు, పేర్ల మార్పుతో 2009లో ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఏపీలో 2014 వరకు 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 175 స్థానాలు, తెలంగాణకు 119 సీట్లు వెళ్లాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచుతామని రాష్ట్ర విభజన చట్టంలోనే పేర్కొన్నారు. ఈ లెక్కన ఏపీలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరగాలి. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచనుండటంతో ఏపీలో నియోజకవర్గాలు 175 నుంచి ఒకేసారి 263కు చేరుకుంటాయి. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 225 స్థానాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. వెరసి… అసెంబ్లీలో ప్రజా ప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో రాష్ట్ర వాటా 4.08 శాతం. ఆ నిష్పత్తి ప్రకారం ఏపీకి వచ్చే లోక్‌సభ స్థానాలు 33 మాత్రమే. ఉత్తరాదితో పోల్చితే మనకు అన్యాయం జరుగుతుంది. అయితే… జనాభా ప్రాతిపదికన కాకుండా, 50 శాతం సీట్లు పెంచాలన్న కేంద్ర నిర్ణయం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ మేలు చేసేదే. దీని ప్రకారం… రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇప్పుడున్న 25 నుంచి 37 లేదా 38కి చేరుతుంది. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పటికీ… ఇప్పటివరకు అమలుకాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చింది కానీ ఇప్పటి వరకు దాని ప్రస్తావన రాలేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే సీట్లు పెరగడంతో పాటు.. వీటిలో 87 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో ప్రస్తుతం కొన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ సమీకరణాలకు, ప్రస్తుత ఏపీ సమీకరణలకూ ఇప్పటికే తేడా వచ్చింది. విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆ తీరు స్పష్టమైంది. అలాంటిది ఇఫ్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఒకేసారి అమలు చేస్తే.. రాజకీయ ముఖచిత్రం సరికొత్తగా ఆవిష్కృతమౌతుందనడంలో సందేహం లేదు. అప్పుడు అన్ని పార్టీలూ ఎన్నికల కోసం కొత్తగా సిద్ధమవక తప్పదు. పాత బలాలు, బలహీనతలు పక్కనపెట్టి.. నేతలంతా కొత్త రాజకీయ స్థితిగతుల్ని అవగాహన చేసుకుంటూ.. తమ పార్టీలను ముందుకు నడపాల్సి ఉంటుంది. అందుకే డీలిమిటేషన్‌తో ఏం జరుగుతుంది..? ఎవరి అవకాశాలు ఎలా ప్రభావితం అవుతాయి..? వంటి ప్రశ్నలతో అన్ని పార్టీలూ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అటు నియోజకవర్గాల స్థాయిలో నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందా అని సరిచూసుకుంటున్నారు. పునర్విభజనలో పక్క నియోజకవర్గాల ప్రాంతాలు చేరితే ఏమౌతుంది..? ఉన్న ప్రాంతాలు కొన్ని పోతే విజయావకాశాల సంగతేంటి..? అనే ప్రశ్నలు వేసుకుని.. ప్రిపేర్ అయ్యే పనిలో ఉన్నారు. అంతటితో ఆగకుండా ఈ విషయంలో అనుచరులు, సహచరుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఏ ప్రతిపాదననూ కొట్టిపారేసే పరిస్థితి లేకపోవడంతో.. డీలిమిటేషన్ ఎలా జరిగినా.. తాము సంసిద్ధంగా ఉండాలనే కోణంలో రెడీ అవుతున్నారు. ఒకవేళ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు మహిళలకు రిజర్వ్ అయితే.. అందుకు తగ్గట్టుగా ఓ మహిళా నేతను కూడా సొంత కుటుంబం నుంచో.. లేదంటే తనకు నమ్మకమైన వారినో నిలబెట్టే దిశగానూ వ్యూహాలు రచిస్తున్నారు. మహిళా అభ్యర్థులు రెడీగా ఉన్న కొందరు నేతలు.. తనకు కాకపోతే కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలనే హామీ ముందే అధిష్ఠానాల దగ్గర నుంచి తీసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి నేతల విషయంలో పార్టీలు కూడా చాలా వరకు సానుకూలంగానే ఉంటున్నాయి. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే.. గెలుపు సంగతి వారే చూసుకుంటారనే లెక్కల్లో పార్టీలున్నాయి.
జనాభా గణన అనంతరం విధిగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అన్న సూత్రం ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగ నిబంధన పేర్కొంది. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం 2011లో చేసిన జనగణన ఆధారంగా డీలిమిటేషన్‌కు రెడీ అయింది. లోక్‌సభకు ఎన్నికయ్యే ప్రతి సభ్యుడు ప్రాతినిధ్యం వహించే ఓటర్ల సంఖ్య సమానంగా ఉండి తీరాలని ..ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అనే ప్రజాస్వామిక సూత్రం నిర్దేశిస్తుంది. ఈ సూత్రం ఉల్లంఘనకు గురైతే పెద్ద నియోజకవర్గాలలోని ఓటు విలువ చిన్న నియోజకవర్గాలలోని ఓటు విలువ కంటే తక్కువగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఏ మేరకు ఫాలో అవుతారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి 50 శాతం సీట్ల పెంపు అని చెబుతున్నా.. సమాన ఓటు విలువ విషయంలో తేడాలొస్తాయేమోననే సందేహాలు లేకపోలేదు. జనాభాకు, లోక్‌సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంతవరకు అన్ని రాష్ట్రాలకు ఒకేవిధంగా ఉండాలి. ఏతావాతా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా.. ప్రజా ప్రాతినిధ్యానికి ఇబ్బంది లేకుండా డీలిమిటేషన్ చేయాలనేదే రాజ్యాంగం సూత్రీకరణ. దేశంలో గతంలో జరిగిన పునర్విేభజన ప్రక్రియలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. మరి ఇప్పుడు జరిగే డీలిమిటేషన్ ఎలా జరుగుతుందోనని ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
