Story Board: దేశంలో డీలిమిటేషన్ గురించిన చర్చ కొత్త పార్లమెంట్ భవనం కట్టిన దగ్గర్నుంచీ జరుగుతోంది. 888 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా పార్లమెంట్ భవన నిర్మాణం, అదే సమయంలో డీలిమిటేషన్ పై ఫ్రీజింగ్ గడువు ముగియడం.. రెండూ ఒకేసారి రావడం యాదృచ్ఛికం కాదనే వాదన అప్పట్లోనే వినిపించింది. దానికి తగ్గట్టుగానే కేంద్రం కూడా మొదట్నుంచీ డీలిమిటేషన్‌కు అనుకూల సంకేతాలే పంపుతూ వస్తోంది. స్వయంగా ప్రధాని కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారని కొందరు విపక్ష నేతలు కూడా వ్యాఖ్యానించడం.. డీలిమిటేషన్ ఖాయమనే అభిప్రాయం ముందే కలిగించింది. కాకపోతే ఉత్తరాది, దక్షిణాది మధ్య సీట్ల విషయంలో వివక్ష వస్తుందనే పాయింట్.. క్రమంగా బలపడటంతో.. డీలిమిటేషన్ అనుకూల వాదం కాస్త డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించింది. అయితే దానికి విరుగుడుగా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన తెరపైకి తెచ్చిన కేంద్రం.. ఆ అంశాన్ని బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టిన బిల్లులో పెట్టకపోవడంతో.. కావాల్సిన మద్దతు దొరకలేదు. జరిగిన పొరపాటు తెలుసుకున్న ప్రభుత్వం.. ఈసారి ఎక్కడా తేడా రాకుండా 50 శాతం సీట్ల పెంపుతో పాటు మరో పాతికేళ్ల దాకా డీలిమిటేషన్‌పై ఫ్రీజింగ్ ను కూడా బిల్లులో చేర్చుతూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లే ఈసారి పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో సభ ముందుకు రానుంది. గతంలో కొన్ని పార్టీలు యాభై శాతం సీట్ల పెంపు బిల్లులో ఎందుకు లేదని ప్రశ్నించిన సంగతిని దృష్టిలో పెట్టుకుని.. ఈశారి ఆ అంశానికి బిల్లులో చోటివ్వడంతో.. ఆమోదం ఖాయమేనని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కానీ ఇదంతా డీలిమిటేషన్ విషయంలో పైకి కనిపించే పరిస్థితి మాత్రమే. అసలు కథందా తెరవెనుకే జరుగుతోంది. బడ్జెట్ సెషన్లో తొలిసారి ఇండి కూటమి ఏకతాటిపైకి వచ్చి.. దానికి ప్రతిపక్షాలన్నీ మద్దతివ్వడాన్ని.. అధికార పక్షం ఊహించలేదనే వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం. అందుకే ఇప్పుడు ఎలాంటి తేడా రాకుండా కేంద్రం అన్నిరకాలుగా వ్యూహరచన చేసిందంటున్నారు. అది సరే ఇంతకూ కేంద్రం ఎలాంటి ప్లాన్లు వేసింది..? ఏఏ పార్టీలతో చర్చలు జరిపింది..? ఎవరెవరు బిల్లుకు మద్దతుపై హామీలిచ్చారు..? ఎవరి అండదండలు చూసుకుని ఇంత ధీమాగా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పిలిచారు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి.
ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పట్నుంచీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఊహించని పరిణామాలు జరగడం.. క్రమంగా ఎన్డీఏకు మద్దతు ప్రకటించే ఎంపీల సంఖ్య పెరుగుతూ వస్తుండటాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతీయ సమీకరణాలు, స్థానిక పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాజకీయ మార్పులు జరుగుతున్నాయనే భ్రమ కల్పిస్తూ.. అసలు విషయాన్ని గోప్యంగా ఉంచారనే అనుమానాలు ఇప్పుడు రేగుతున్నాయి. ఏదేమైనా రకరకాల ప్రయత్నాల ద్వారా తమ బలం పెంచుకన్న ఎన్డీఏ.. అప్పటికీ 2/3వ వంతు మెజార్టీని అయితే చేరలేకపోయింది. దీంతో అందుకోసం కూటమి బయటి నుంచి మద్దతును సమీకరించటానికి కొన్ని నెలలుగా హస్తిన వేదికగా ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా సీనియర్ మంత్రులే రంగంలోకి దిగి పార్టీలను దారికితెచ్చారనే వాదన కూడా లేకపోలేదు. అన్నింటికీ మించి గతంలో బిల్లు వీగిపోవటంతో.. ఈసారి బిల్లు ఆమోదాన్ని మోడీ, అమిత్ షా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్లో పార్టీల వైఖరి విషయంలో సాధ్యాసాధ్యాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే.. ఎలాంటి పరిస్థితి తలెత్తినా.. బిల్లు వీగిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు.
మొత్తం మీద ఢిల్లీలో ఏదో జరిగింది. కేంద్రం ఏదో మాయ చేస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చూడొచ్చని అంచనా. డీలిమిటేషన్ బిల్లు విషయంలో చర్చ, ఓటింగ్ సమయంలో ఎవరెలా మాట్లాడాలి.. బిల్లు ఆమోదం కోసం అనుకూల వాదనను ఎలా బలంగా వినిపించాలనే కసరత్తును కూడా వ్యూహాత్మకంగా పూర్తిచేశారని చెబుతున్నారు. అయితే అదేంటి అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్సే. అటు బీజేపీ వర్గాలు కూడా ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఊరిస్తున్నాయి. అనవసర లీకులతో మళ్లీ కొత్త చిక్కులు రాకుండా అసలు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకే విపక్ష శిబిరం నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నా.. అధికార పక్షం మాత్రం లైట్ తీస్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
నిజానికి గతంలోనూ బిల్లు ఆమోదం ఖాయమనే ధీమాతోనే కేంద్రం ముందడుగు వేసింది. కానీ అప్పుడు అనూహ్యంగా భంగపాటు ఎదురైంది. అందుకే ఈసారి మరింత పకడ్బందీగా వ్యూహరచన చేసింది. ఇప్పుడు బిల్లు ఖాయమేనంటున్నా.. గతంలో మాదిరిగా అనుమానాలు రాకపోవడానికి.. కావాల్సినన్ని పరిణామాలు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంగతి గ్రహించే రాజకీయ వర్గాల్లో కొంతకాలంగా పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌పై చర్చ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ కాకపోవడం.. ఈ చర్చను మరింత బలపరిచింది.
డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రానికి కొత్తగా కలిసొచ్చిన బలంపై కచ్చితమైన సమాచారం లేకపోయినా.. ఒక్కటి మాత్రం నిజం. ప్రస్తుతం కేంద్రం మూడ్ చూస్తుంటే.. అసలు బిల్లు వీగిపోయే ప్రశ్నకానీ, చర్చకానీ తలెత్తొద్దన్నంత పట్టుదల కనిపిస్తోంది. ఎలాగూ బిల్లు ఆమోదం పొందుతుందనే ఉద్దేశంతోనే.. తర్వాతి కార్యాచరణ కూడా ఖరారైపోయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. చివరకు బీజేపీలో కూడా అందరికీ విషయం తెలియకుండా.. కేవలం గుప్పెడు మంది అతిముఖ్యుల మధ్యే సమాచార మార్పిడి జరుగుతోందని అంటున్నారు. మెజార్టీ ఎంపీలకు పార్లమెంట్లో విప్‌లు చెప్పింది వినడం తప్ప.. ఇతర ముఖ్య విషయాలు తెలిసే అవకాశం తక్కువే అని చెబుతున్నారు. ఇదంతా సీక్రెసీలో భాగమేనని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నుంచి సంకేతాలున్నాయి. ఇంతవరకూ విపక్షాలకు కూడా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ అజెండా పంపలేదంటే.. ముందు నుంచీ ఉండే హడావుడికి కళ్లెం వేసే ఉద్దేశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు ఆమోదం సమయంలో జరిగిన కార్యాచరణ గుర్తుకొస్తున్నా.. ఆ బిల్లులకూ, దీనికీ సంబంధం లేదనడంలో సందేహం లేదు. అన్నింటికీ మించి డీలిమిటేషన్ బిల్లు మాదిరిగా గత బిల్లులేవీ దేశ రాజకీయ పటాన్ని మార్చేసేవి కానే కాదు. ఇప్పుడు విపక్షాల అభ్యంతరాలన్నింటికీ ప్రధాన కారణం.. బీజేపీ పాతికేళ్ల రాజకీయ భవిష్యత్తుకు రాచబాట వేసుకునేలా డీలిమిటేషన్ చేసుకుంటుందనే అనుమానమే. కానీ అదంతా వారి అపోహే అంటున్నాయి పాలక పక్ష వర్గాలు.
ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి వ్యూహం అయితే సిద్ధమైపోయింది.ఇక దాన్ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయడమే తరువాయి అంటున్నాయి బీజేపీ వర్గాలు. అందుకోసం ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయంతో పాటు.. బయటి నుంచి మద్దతిచ్చే పార్టీలతో కోఆర్డినేషన్ కూడా కీలకం కానుంది. కేవలం ముందస్త ప్లాన్ మాత్రమే కాకుండా.. సెషన్లో పరిస్థితికి తగ్గట్టుగా అప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పుకూ సిద్ధంగా ఉండాలని అమిత్ షా బీజేపీ నేతలకు చెప్పారనే చర్చ జరుగుతోంది. ఏతావాతా విపక్షాల ఊహకు అందని వ్యూహాలతో.. బిల్లును ఆమోదింపజేసుకోవాలనేది కేంద్రం సంకల్పంగా ఉంది.

