Story Board: దేశ రాజకీయాల్లో పుష్కర కాలంగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న బీజేపీ.. మోడీ హయాంలో మొదట్నుంచీ యువతను ఆకట్టుకోవడంలో మిగతా పార్టీల కంటే ముందే ఉంది. 2014 నుంచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకూ యువ ఓటర్ల ఓటింగ్ చూసినా కూడా మొగ్గు బీజేపీ వైపే ఉంది. కానీ ఇటీవల జంతర్ మంతర్ దగ్గర యువత ఆందోళనలు.. తర్వాతి పరిణామాలతో.. ఎక్కడో జెన్‌జీతో పార్టీకి గ్యాప్ వచ్చిందని బీజేపీ గ్రహించింది. దీంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ మాటకొస్తే బీజేపీ రాజకీయ ప్రస్థానంలో పొరపాట్ల నుంచి వేగంగా నేర్చుకునే సంస్కృతి ఇమిడి ఉంది. బీజేపీలో జాతీయ స్థాయి అగ్రనేతగా ఎవరున్నా.. ఏదో ఒక స్థాయిలో పార్టీపై ఏ వర్గంలో అసంతృప్తి ఉందో పసిగట్టి.. దానిని తగ్గించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతుంటాయి. ఎక్కడైనా పార్టీ విఫలమైనా ఆరెస్సెస్ అయినా అందిపుచ్చుకుని మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పుడు కూడా యువత విషయంలో అసంతృప్తిని గ్రహించిన బీజేపీ.. అత్యున్నత స్థాయి నుంచి కింది వరకు జెన్‌జీకి చేరువయ్యే మార్గాలు వెతికే పనిలో పడింది. ఓం ప్రథమంగా ప్రధాని మోడీ ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో.. యువ మంత్రం పఠించారు. జెన్‌జీని ఏ విధంగానూ నిరాశపరచబోమనే భరోసా ఇవ్వడంతో.. ఏకంగా కోటి మంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇస్తామని, అలాగే పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఇస్తామని ప్రకటించారు.
ఒక్క మోడీ ప్రసంగంతో బీజేపీ యువతను వదిలిపెట్టలేదు. దానికి కొనసాగింపుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో అడుగు ముందుకేశారు. యువతను బ్యాంకింగ్ రంగానికి మరింత దగ్గర చేయడానికి అక్టోబర్ 2 నుండి ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి ప్రత్యేకంగా బ్యాంకింగ్ ఫర్ యూత్ అనే ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 16 ఏళ్లు పైబడిన యువతకు చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడుల కోసం సులభంగా లోన్లు అందేలా చేయడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. దీంతో పాటు కాలేజీలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను నేరుగా సందర్శించి యువతకు ఆర్థిక అక్షరాస్యతను పెంచే ప్రయత్నం చేస్తారు. బ్యాంకు శాఖల్లో ప్రత్యేకంగా యువ కియోస్క్‌లు, యువ బ్యాంకింగ్ మిత్ర ఏర్పాటు చేసి సేవలు అందిస్తారు. ప్రభుత్వ రుణ పథకాలు, లోన్ ప్రాసెస్,మంచి క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యతను యువతకు వివరించడానికి కూడా చొరవ తీసుకుంటారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువతకు కేంద్రం సానుకూలంగా ఉందనే సంకేతాలు బలంగా అందుతాయనే ఉద్దేశం కనిపిస్తోంది.
ఇక చివరిగా జెన్‌జీ ఉద్యమం విషయంలో కూడా డ్యామేజ్ కంట్రోల్‌కు కేంద్రం నడుం బిగించింది. యువత కోరినట్టుగానే గతంలోనే మంత్రితో రాజీనామా చేయించడం, పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టం తెచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న అసాంఘిక శక్తులు మినహా మిగతా విద్యార్థులపై ఎలాంటి కేసులూ ఉండబోవని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. అటు బీహార్లో విద్యార్థి ఉద్యమంపై కఠినంగా చర్యలు తీసుకున్న భోజ్‌పూర్, సివాన్ జిల్లాల ఎస్పీలతో సహా మొత్తం 18 మంది ఐపీఎస్ అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సివాన్‌లో విద్యార్థి నిరసనల సమయంలో ఏకే-47 తుపాకీ ప్రయోగం వివాదం రేపింది. సివాన్ ఎస్పీగా ఉన్న పురన్ కుమార్ ఝాను ఆ బాధ్యతల నుంచి తప్పించి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అంతేకాదు నల్సార్ వర్సిటీ విద్యార్థుల లేఖపై కఠిన చర్యకు సిద్ధమైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడా ముందే నియంత్రించింది. ఈ విషయంలో సీజేఐ కూడా నేరుగా జోక్యం చేసుకున్నారు.
యువతతో పార్టీకి వచ్చిన గ్యాప్‌ను అడ్వాంటేజ్ తీసుకుని ప్రతిపక్షాలు జెన్‌జీని తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీల ట్రాప్‌లో పడొద్దని యువతను ప్రధాని మోడీ హెచ్చరించారు. దీనికి తోడుగా పార్టీ తరపున వీలైనన్ని మార్గాల్లో యువతకు చేరువయ్యే కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బీజేపీ ఫిక్సైంది. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టిన కాషాయ పార్టీ.. భవిష్యత్తులోనూ సందర్భం కుదిరినప్పుడల్లా.. జెన్‌జీని అడ్రస్ చేయాలని భావిస్తోంది. భవిష్యత్తులో జరిగే కీలక ఎన్నికల్లో విజయానికి యువత ఓట్లు కీలకమని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టుగా రాజకీయ వ్యూహాల్లో మార్పులు చేసుకుంటోంది. బీజేపీ రాజకీయ చరిత్ర చూసుకుంటే.. అవసరమైనప్పుడల్లా వ్యూహాల్లో మార్పులు చేసుకునే అలవాటు ఆ పార్టీకి మొదట్నుంచీ ఉంది. కీలక పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, సమకాలీన రాజకీయ ఘటనల ఆధారంగా ఎప్పటికప్పుడు తనను తాను బీజేపీ కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తోంది. ఇప్పుడు పుష్కర కాలంగా అధికారం చెలాయిస్తున్నా.. అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవటానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇటీవలి జంతర్ మంతర్ పరిణామాలతో పునరాలోచనలో పడ్డ బీజేపీ.. మరోసారి రీసెట్ బటన్ నొక్కింది. చిన్న అవకాశం వచ్చినా ప్రతిపక్షాలు పూర్తిగా ఉపయోగించుకుని.. ఏకంగా తమ అజెండా అమలు చేయకుండా.. ఏకంగా పార్లమెంట్‌నే స్తంభింపజేయటాన్ని బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే.. యువతలో అసంతృప్తిని వీలైనంత త్వరగా చల్లార్చటమే మార్గమని యోచిస్తోంది. అందుకే ప్రధానితో మొదలుపెట్టి.. పార్టీ కార్యకర్త వరకు అన్ని స్థాయిల్లో యువతను అడ్రస్ చేయాల్సిందేనని, అందుకోసం ప్రతి స్థాయిలో కార్యక్రమాలు రూపకల్పన చేయాలని ఫిక్సైంది.
ప్రతి పార్టీకి కార్యవర్గం చాలా కీలకంగా పనిచేస్తుంది. సాధారణంగా కార్యవర్గం కూర్పులోనే.. ఆ పార్టీ ఉద్దేశాలేంటో ఓ క్లారిటీ వస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో.. కీలక రాజకీయ పరిణామాల తరుణంలో చేసే కార్యవర్గ కూర్పు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువత జాగృతమైన తరుణంలో.. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అందులో ట్రెండ్‌కు తగ్గట్టుగా యువతకు పెద్దపీట వేసింది. కొత్త బృందంలో ఆరుగురు 40 ఏళ్లలోపువారు కాగా.. 15మంది 40-49ఏళ్ల వారున్నారు. మన దేశ రాజకీయాల్లో 50 ఏళ్ల లోపు నేతల్ని యువతగా పరిగణించే సంప్రదాయంగా ఉంది. అలా చూసినప్పుడు బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో యాభై ఏళ్ల లోపు వారు ఏకంగా 21 మందికి అవకాశం కల్పించడం ద్వారా.. యువతకు తమ పార్టీలో ప్రాధాన్యత విషయంలో సందేహాలు అక్కర్లేదని బీజేపీ స్పష్టం చేసింది. అదే సమయంలో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని కూడా బీజేపీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. ఏకంగా గత పదకొండేళ్లుగా పార్టీ ఐటీ సెల్ చీఫ్‌గా కొనసాగుతున్న అమిత్ మాలవీయను.. తప్పించింది. ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ మాస్కేను సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమించింది. దీపక్ మాస్కేకు.. పార్టీ ఐటీ, సోషల్ మీడియా సెల్‌లో 15 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉంది. బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఇక పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా.. ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్‌భట్, అరుణ్‌యాదవ్ ఆయనకు సహకరించనున్నారు. దేశ రాజకీయాలపై జెన్ జీ ప్రభావం పెరుగుతున్న తరుణంలో.. పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకే ఈ మార్పు జరిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
మొదట్నుంచీ సోషల్ మీడియాలో మిగతా పార్టీల కంటే యాక్టివ్‌గా ఉండే బీజేపీ.. ఇటీవలి ఘటనల తర్వాత ఫేస్ బుక్, వాట్సాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ లాంటి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా యాక్టివ్ అయింది. ఇక ముందు కూడా సోషల్ మీడియా ద్వారా యువతకు పార్టీ రీచ్ అయ్యే విషయంలో ఎక్కడా గ్యాప్ రావద్దని సోషల్ మీడియా సెల్‌ను పటిష్ఠం చేసినట్టుగా కనిపిస్తోంది. ఆమాటకొస్తే.. అసలు సోషల్ మీడియా ద్వారా యువతకు నేరుగా రీచ్ అయ్యే పనిని ప్రధాని మోడీనే మొదలుపెట్టారు. విద్యార్థి ఉద్యమం సమయంలో మోడీ అర్థరాత్రి ఇన్‌స్టా వీడియోలు పోస్ట్ చేసి.. జెన్‌జీ దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు తన క్యాబినెట్ సహచరులు కూడా యువతతో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. తద్వారా యువత ఆలోచనల్ని ఎప్పటికప్పుడు పసిగట్టడంతో పాటు.. ప్రభుత్వ పనితీరు గురించి జెన్‌జీ ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. యువతలో అసంతృప్తి పెరగకముందే.. పసిగడితే.. దాన్ని సరైన రీతిలో అడ్రస్ చేసే వీలుంటుందని, అప్పుడు ప్రతిపక్షాలకు మొన్నటి ఘటనల మాదిరిగా అడ్వాంటేజ్ రాదనేది బీజేపీ వ్యూహంగా ఉంది. ఇప్పటికే జంతర్ మంతర్ పరిణామాలపై ఆత్మసమీక్ష చేసుకున్న బీజేపీ.. జరిగిన పొరపాట్లు, వాటికి కారణాలు.. పార్టీ పనితీరులో లోపాలు మొదలైన వాటి గురించి కూలంకషంగా అంతర్గత చర్చలు జరిపింది. ఆ చర్చల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు కార్యాచరణకు రూపకల్పన చేసి.. దాన్ని వేగంగా అమలు చేసే దిశగా ముందడుగు వేస్తోంది.

