Story Board: బీహార్లో రెండు దశాబ్దాలుగా నితీష్ సీఎంగా ఉన్నారు. అందులోనూ ఎక్కువ కాలం ఎన్డీఏ సర్కారే రాజ్యం చేసింది. గత పదేళ్లుగా ఓ పద్ధతి ప్రకారం పని చేస్తున్న తేజస్వి.. ఈసారి ఓటర్లకు ఫస్ట్ ఛాయిస్ గా మారారానే చర్చ మొన్నటిదాకా నడిచింది. కానీ సీట్ల సర్దుబాటులోనే ఫెయిల్ కావటం ఇండియా కూటమికి.. ఆదిలోనే హంసపాదులా మారింది. కాంగ్రెస్ తో సర్దుబాటు చేసుకోలేని తేజస్వి.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని బీజేపీ దెప్పిపొడుపులు షురూ చేసింది.
Read Also: Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్.. 26 మార్కులు వస్తే పాస్
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ రాజకీయం ఎన్నికలకు ముందే చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల ముందు ఎన్డీఏకి, రెండు వారాల ముందు ఇండియా కూటమికి వాతావరణం అనుకూలంగా ఉందనే అంచనాలు వచ్చాయి. వీటిలో నిజానిజాలపై చర్చ తేలకముందే.. మళ్లీ రాజకీయ చదరంగంలో ఆట మారిపోయింది. ఏ కూటమిలో ఎవరుంటారో తేలకముందు. తేలిపోయిన తర్వాత చేసిన సర్వేలకు.. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన మార్పుల తర్వాత వచ్చే ఫలితాలకు పొంతన ఉంటుందో.. లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తుందనుకున్న మహాకూటమిలో ఐక్యత.. సీట్ల సర్దుబాటు దగ్గరే ఆవిరి కావడం రాజకీయాన్ని సమూలంగా మార్చేసే పరిణామంగా చూస్తున్నారు.
Read Also: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
బీహార్లో ఎన్నికల ప్రచారానికి ముందే బ్లేమ్‌గేమ్ మొదలైంది. రెండు కూటముల్లోనూ పొరపొచ్చాలున్నా.. ఇండియా కూటమి ఏకంగా సీట్ల సర్దుబాటు సమయంలోనే చేతులెత్తేయటం ఎన్డీఏకు అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఇండియా కూటమిలో అనైక్యతనే ఆయుధంగా చేసుకుని.. మరోసారి అధికారాన్ని గుప్పిటపట్టాలని ఎన్డీఏ ఎత్తులేస్తోంది. గతంలో హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ అనైక్యతతో దెబ్బతిన్న ఇండియా కూటమి.. మరోసారి బీహార్లోనూ సేమ్ సీన్‌ను రిపీట్ చేయటం.. ప్రతిపక్ష శిబిరంలో ఆందోళనను పెంచుతోంది. ప్రతిసారీ ఎన్డీఏకు చెక్ పెట్టే అవకాశం వస్తున్నా.. చేజేతులా జారవిడుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Read Also: Karthika Masam: నేడు కార్తీక మాసం ప్రారంభం.. గోదావరి నదికి పోటెత్తిన భక్తులు..
బీహార్‌లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థుల జాబితా విషయంలో పక్కాగా ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక లోక్ జనశక్తి పార్టీ 29 స్థానాల్లో బరిలోకి దిగనుంది. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా చెరో ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే విపక్ష ఇండియా కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుపై విభేదాలు నెలకొన్నాయి. పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. ఎవరికి వారే నామినేషన్లు వేసుకున్నారు. ఇప్పటికే తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే ఆర్జేడీ పలు స్థానాల్లో మిత్రపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌తో కూడా పోటీ పడనుంది. ఈ రెండు పార్టీలకు సీట్ల సర్ధుబాటు విషయంలో మనస్పర్థలు రావడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. గత కొన్ని వారాలుగా ఇండియా కూటమిలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఎంచుకోవడంలో విపక్ష పార్టీలు విఫలం అవుతున్నాయి.
Read Also: Astrology: అక్టోబర్ 22, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీఏ కంటే ముందే.. కలిసికట్టుగా ప్రారంభించిన ఇండియా కూటమి.. అసలైన సమయంలో పాత బలహీనతను బయటపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎప్పుడూ అంత త్వరగా ఏకాభిప్రాయం రాదు. కానీ నామినేషన్లు దగ్గరపడుతున్నా.. చివరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యాక కూడా ఇండియా కూటమి ఓ అండర్‌స్టాండింగ్‌కు రాలేకపోవడం పరిశీలకులకు కూడా షాకిచ్చింది. పార్టీల బలాబలాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ప్రస్తుతం మారుతున్న సమీకరణాల్ని బట్టి ఎక్కడైనా సీట్ల లెక్క తేలుతోంది. కానీ బీహార్లో మాత్రం ఈ ప్రాతిపదికలు దేనికీ ఇండియా కూటమి పక్షాలు ఒప్పుకోకపోవడంతో పాటు.. తెగేదాకా లాగి.. చివరకు ఎవరికి వారే యమునా తీరే అనే దుస్థితికి తెచ్చాయి.
ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు జరగలేదని కాదు. ఇందుకోసం తేజస్వి ఢిల్లీ వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఆ తర్వాత పట్నాలో తేజస్వి నివాసానికి వెళ్లి బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఇలా రెండు, మూడు దఫాలు సమావేశమైన తర్వాత కూడా.. ఏకాభిప్రాయం రాలేదు. మరోవైపు సీట్ల సర్దుబాటు ఎంతకూ తేలడం లేదనే కారణంతో.. తేజస్వి ఢిల్లీలో చర్చలు జరుపుతుండగానే.. లాలూ ప్రసాద్ పట్నాలో కొందరికి బీఫామ్‌లు ఇచ్చారు. ఈ సంగతిని కాంగ్రెస్ తేజస్వి దగ్గర ప్రస్తావించడంతో.. తేజస్వి హుటాహుటిన తండ్రికి ఫోన్ చేసి.. బీఫామ్ లు ఇవ్వొద్దని చెప్పారు. అప్పటికే కొందరికి బీఫామ్‌లు వెళ్లిపోవడంతో.. వారితో నామినేషన్ల ఉపసంహరణ చేయించాలనకున్నారు. కానీ కొందరు ఉపసంహరణకు ససేమిరా అనడం ఆర్జేడీకి తలబొప్పి కట్టించింది. ఈలోగా పట్నా వచ్చిన తేజస్వితో బీహార్ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ బలానికి మించి సీట్ల బేరం పెట్టడంతో.. తేజస్వి కూడా విసిగిపోయారు. చివరకు ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఆర్జేడీ నేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. తొలివిడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపుతోంది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే పెద్ద నిదర్శనం.
బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ఆర్జేడీ 145 సీట్లలో పోటీకి రెడీ అయింది. కాంగ్రెస్ 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో మిగతా పార్టీల్ని పక్కనపెట్టినా.. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు నెలలుగా కలిసికట్టుగా కనిపిస్తూ కూడా.. అసలు సమయంలో హ్యాండ్సప్ చెప్పటం.. ఇండియా కూటమి వ్యూహాత్మక వైఫల్యమే అని చెప్పాలి. విభేదాలు వస్తే.. ఎన్నికల్లో దెబ్బతిన్న పాత అనుభవాలు ఉన్నా కూడా.. ఇండియా కూటమి వాటిని ఖాతరు చేయకపోవడం.. ఐక్యంగా ప్రత్యర్థిని ఎదుర్కునే కంటే.. ఇగోలకే ప్రాధాన్యత ఇవ్వటం.. ఎన్డీఏ నెత్తిన పాలు పోసే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు వస్తున్నాయి.
