Site icon NTV Telugu

StoryBoard: కనకం కామ్ డౌన్..!! దూకుడుకు బ్రేక్ లేదా..?

Storyboard On Gold Prices

Storyboard On Gold Prices

StoryBoard: దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ…బంగారం…బంగారం. కొండెక్కుతున్న పసిడి ధరలను చూసి…మహిళామణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెరుగుతున్న పుత్తడి ధరలను చూసి…కొందరు షాక్‌ అవుతున్నారు. ఇంకొందరు…పండుగ చేసుకుంటున్నారు. ఏడాది క్రితం బంగారం కొన్న వారంతా…ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పుడు కొనలేని వారు…బాధలో మునిగిపోయారు. 2024 డిసెంబరులో పసిడి తీసుకునే ఉంటే…ఇవాళ తామంతా లక్షాధికారులు అయిపోయేవాళ్లమని లోలోపల తమను తాము తిట్టుకుంటున్నారు. కనకం కమ్‌ డౌన్‌ అంటున్న దిగిరావడం రాలేదు. రోజురోజుకు పెరగడమే తప్పా…తగ్గడం అన్నది లేకుండా చిరుతలా దూసుకెళ్తోంది.

గతేడాది డిసెంబరులో తులం బంగారం ధర…78వేలు పలికింది. పది నెలలు తిరిగేసరికి లక్షా 35వేల 250కి చేరింది. అంటే 10 నెలల్లోనే 57వేల రూపాయలు పెరిగింది. ఓ వ్యక్తి 2024 డిసెంబరులో 10 తులాల బంగారం…78వేలతో కొనుగోలు చేసి ఉంటే…అతడికి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు లాభం వచ్చినట్లు లెక్క. పసిడి ధరలు హైదరాబాద్‌లో భూముల ధరలతో పోటీ పడుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లు…రేసులో ఉసెన్‌ బోల్ట్‌లా పరుగులు పెడుతోంది. ఇవాళ ఒక్క రోజే…3వేల 250 పెరగడంతో కొనుగోలుదారులు ఖంగుతింటున్నారు. కనకం ధరలు ఆకాశామే హద్దుగా పెరుగుతున్నా…కొందరు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం పుత్తడికి…దూరం దూరం అంటున్నారు. సామాన్యులు, మధ్య తరగతి వారు దీన్ని కొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా పరుగులు పెడుతోంది.

తాజాగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధర చుక్కలను అంటుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, పండగల సీజన్‌ కలిసి రావడంతో…దూకుడు ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌లో 1లక్షా 35 లక్షలు దాటి పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,35,250కి చేరింది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల ధర రూ.1,21,725కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.1,81,000కి చేరింది. అమెరికా షట్‌డౌన్‌ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్‌-చైనా వాణిజ్య ఉద్రిక్తతలతో బంగారం ధరలు…అడ్డు అదుపు లేకుండా పెరుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు.

మరోవైపు ధనత్రయోదశి నాడు ప్రజలు బంగారం, వెండి, విలువైన ఇతర పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆ సెంటిమెంట్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది. దాంతోపాటు పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో పసిడికి మరింత డిమాండ్‌ ఉంటుందని బులియన్‌ వర్గాలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర 1.50 లక్షలకు చేరొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. చేతిలో నాలుగైదు లక్షలుంటే..వెంటనే బంగారం కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే….మున్ముందు మరింత పెరుగుతాయని…అప్పుడు ధరలను ఎవరు అంచనా వేయలేరని అంటున్నారు.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోంది. లాభాలు ఊహించని విధంగా వస్తుండటంతో…ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు 8 ఏళ్ల క్రితం పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారు మాత్రం దీపావళికి ముందే పండగ చేసుకుంటున్నారు. 2017-18 సిరీస్‌-III గోల్డ్‌ బాండ్లు కొనుగోలు చేసినవారు దీపావళి ముందు బంపర్‌ గిఫ్ట్‌ అందుకున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి ఫైనల్‌ రిడెంప్షన్‌ తేదీని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి 338 శాతం ప్రతిఫలం లభించింది.

2017-18 సిరీస్‌-IIIని 2017 అక్టోబర్‌ 16న ఆర్‌బీఐ…ఈ బాండ్ల కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అప్పట్లో గ్రాము బంగారం ధరను రూ.2,866గా నిర్ణయించారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధరను రూ.12,567గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రాముపై రూ.9,701 ప్రతిఫలం వచ్చినట్లు లెక్క. దీన్ని శాతాల్లో లెక్కిస్తే 338 శాతం అవుతుంది. దీనికి ఏటా చెల్లించే 2.5 శాతం వడ్డీ అదనం. అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి.

దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఆర్‌బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లుగా నిర్ణయించింది. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్‌కు ముందు వారం పరిగణలోకి తీసుకుంది. ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను రూ.12,567గా నిర్ణయించారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల సగటును ఆధారంగా చేసుకున్నారు. ఇటీవల బంగారం ధరలు చుక్కలు తాకుతున్న వేళ బాండ్లు రిడెంప్షన్‌కు రావడంతో మదుపర్ల పంట పండింది. పైగా వచ్చిన మొత్తానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించక్కర్లేదు. 2015-16 బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరఫున ఆర్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే, చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది.

డిసెంబరు నాటికి బంగారం ధరలు లక్షన్నర దాటినా…అశ్చర్యపోనక్కర్లేదని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలుకు ఇదే సరైనా సమయమని సూచిస్తున్నారు. ఎలాంటి టెన్షన్‌ లేకుండా నిశ్చింతగా పసిడిని నమ్ముకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ప్రపంచంలోనే టాప్‌ కంపెనీల షేర్లు కొనుగోలు చేసినా…ఏడాదిలో బంగారం మీద వచ్చినంత లాభాలు మాత్రం వచ్చే ఛాన్స్‌ లేదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినా…మరో దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినా…గోల్డ్‌కు సాటిలేదు…ఇప్పట్లో ఏది సాటి రాదు కూడా. పెద్దలను…ఓల్డ్‌ ఈజ్ గోల్డ్‌ అనడం కామన్‌. అదే పెద్దలు…గోల్డ్‌ కెనాట్‌ బీ ఓల్డ్‌ అని ఎప్పుడో చెప్పారు. బంగారం పాతబడే కొద్దీ…దాని వ్యాల్యూ పెరుగుతూనే ఉంటుంది తప్పా…తగ్గడం అన్నది చరిత్రలోనే లేదు. పసిడి ఇప్పుడైనా…ఎప్పుడైనా మెరుస్తూనే ఉంటుంది. దటీజ్‌ గోల్డ్‌.

 

Exit mobile version