Site icon NTV Telugu

Storyboard: పంచాయితీ వ్యవస్థ ప్రాధాన్యత ఏంటి? కాంగ్రెస్ కు ఎలా కలిసొస్తుంది?

Storyboard

Storyboard

Storyboard: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. కాకపోతే గతంలో ఎన్నడూ లేనంత హడావుడి కనిపించింది. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. దీంతో ఓటర్లలోనూ ఎక్కడలేని ఆసక్తి కనిపించింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సహజంగా జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి పంచాయతీల్లో కూడా చర్చ జరుగుతుంది. కానీ ఈసారి పల్లె పోరు గురించి తెలంగాణతో పాటు ఏపీలో కూడా చర్చ జరగటం కొత్త పరిణామంగా చూస్తున్నారు. ఇంతగా పంచాయతీ ఎన్నికల్ని ఫాలో అయిన జనం.. ఇప్పుడు ఎన్నికలు ముగియటంతో.. ఇక గ్రామాల్లో పాలన ఎలా నడుస్తుందా అనే అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశంలో పంచాయతీ వ్యవస్థ ఆవిర్భావం, దానికి ఉన్న అధికారాలు, ప్రస్తుత తీరుతెన్నులపై చర్చ జరుగుతోంది. దేశంలో బ్రిటిషర్ల పాలనలో లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాల స్థాపనకు, అభివృద్ధికి కృషి చేశారు. అందుకే, ఆయనను దేశంలో స్థానిక సంస్థల పితామహుడుగా అభివర్ణిస్తారు. స్థానిక సమస్యలు ఒక ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. స్థానిక ప్రజల అవసరాలను తీర్చడంలో స్థానిక ప్రభుత్వాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ప్రజాస్వామ్య విజయం అధికార వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది. పైగా ఎక్కడో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక అవసరాలు చూడలేవు, తీర్చలేవు కాబట్టి.. అనివార్యంగా స్థానిక ప్రభుత్వాలు అవసరమయ్యాయి.

Read Also: Recharge Price Hike: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకు షాక్.. 20 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు..?

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మన దగ్గర స్థానిక ప్రభుత్వాల విధానం లేదు. 1952లో సామాజిక అభివృద్ధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వాటికి ఎన్నికలుండేవి కాదు. అధికారులే నడిపించేవారు. తరువాత బల్వంతరాయ్ మెహతా కమిటీ నివేదిక ఆధారంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ప్రారంభమైంది. ఈ సిఫార్సులను అనుసరించి రాజస్థాన్ ప్రభుత్వం 1957 అక్టోబర్ 2న మొట్టమొదటిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959లో అక్టోబర్ 11వ తేదీన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 గ్రామాలు స్వయంపాలన యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశిస్తుంది.

మూడంచెల వ్యవస్థ పెట్టడానికి కారణం విస్తీర్ణమే.. జిల్లా మరీ పెద్ద యూనిట్ అవుతుంది. గ్రామం మరీ చిన్న యూనిట్ అవుతోంది. అందుకనే, గ్రామ స్థాయిలో ఒకటి, జిల్లా స్థాయిలో ఒకటి.. ఈ రెండిటికీ మధ్యలో ఒకటి .. ఇలా మూడు స్థాయిల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను తెచ్చారు. అవే గ్రామ పంచాయతీ, సమితి, జిల్లా పరిషత్. ఈ వ్యవస్థ మొత్తం అప్పట్లో వేర్వేరు చట్టాల ఆధారంగా నడిచేదే తప్ప, దీనికి రాజ్యాంగ బద్ధత లేదు. వీటికి పరోక్ష ఎన్నికలు జరిగేవి. అంటే ప్రజలు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులను మాత్రమే ఎన్నుకునే వారు. ఒక గ్రామాన్ని వార్డులుగా విభజించేవారు. ఆ వార్డు మెంబర్ల నుంచి ఒకరు సర్పంచి అయ్యేవారు. ఆ సర్పంచులంతా కలసి తమలో ఒకడిని సమితి ప్రెసిడెంటుగా ఎన్నుకునేవారు. ఆ సమితి ప్రెసిడెంట్లంతా కలసి జిల్లా ఛైర్మన్‌ను ఎన్నుకునేవారు. 1964లో పంచాయతీలకు ఒక సమగ్ర చట్టం వచ్చింది. 1987లో ఎన్టీఆర్ హయాంలో మధ్య స్థాయిలో ఉన్న సమితులను మండలాలుగా మార్చారు. పెద్ద సమితులు చిన్న చిన్న మండలాలుగా ఏర్పడ్డాయి.

పంచాయతీ రాజ్ వ్యవస్థలో అతి పెద్ద మార్పు 1992లో జరిగింది. స్థానిక సంస్థలకు ఆ ఏడాది రాజ్యాంగంలో చోటు లభించింది. ఈ మార్పుతో స్థానిక సంస్థల హోదా, స్థాయి పెరిగింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రాక మొదలైంది. ఫైనాన్స్ కమిషన్ ఈ బాధ్యత చూస్తుంది. అంతేకాదు దేశమంతా స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందుకే ఇది అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ అంశం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలలోని అంశాలను ప్రభుత్వాలు విధిగా పాటించాలన్న నియమం లేదు. ఈ కారణంగా మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కొంత నిరాదరణకు గురైంది. 1992వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి జవసత్వాలనిచ్చింది. 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి ప్రతి గ్రామపంచాయతీలో అనివార్యంగా గ్రామసభ సమావేశాలను సంవత్సరంలో కనీసం రెండుసార్లు నిర్వహించాలి. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులు. గ్రామసభ గ్రామస్థాయి శాసనసభలాగే పనిచేయాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామసభ ప్రధాన పాత్రను పోషిస్తోంది. దురదృష్టవశాత్తు గ్రామసభ సమావేశాలు మొక్కుబడిగా మారాయన్న విమర్శ ఉంది. 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు నియమిత కాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ బాధ్యతలను నిర్వహించడం కోసం రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించాలి. 11వ షెడ్యూల్‌లో ఉన్న 29 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాలి. కానీ, కేవలం 20% కంటే తక్కువ రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థలకు 29 అంశాలను బదిలీ చేశాయి. ప్రస్తుతం దేశం మొత్తం మీద కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే గ్రామపాలన పంచాయతీరాజ్ చట్ట స్ఫూర్తికి అనుగుణంగా నడుస్తోంది.

పంచాయతీరాజ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధానమైనది ఆర్థిక వనరుల సమస్య. 73వ రాజ్యాంగ సవరణ అనుసరించి పంచాయతీ సంస్థలకు ఏ రకంగా ఎన్ని నిధులు ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలించి, అవసరమైన సిఫారసులను చేయడం కోసం రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ఆర్థికసంఘాన్ని ఏర్పాటు చేయాలి. చాలా రాష్ట్రాల్లో ఇది జరగడం లేదు. తగిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు అందక వాటికి అవసరమైన ఆర్థిక వనరులు లేక పంచాయతీరాజ్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం అనే సౌధానికి పంచాయతీరాజ్ సంస్థలు మూలస్తంభాలు. తెలంగాణలో చివరిసారిగా 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు జరిగాయి. ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మొదట్నుంచీ చాలా సందిగ్ధత ఉంది. బీసీ రిజర్వేషన్లపై న్యాయవిచారణతోనూ కొంత జాప్యం జరిగింది. చివరకు నిధులు మురిగిపోతాయనే అంచనాతో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిర్ణీత కాలవ్యవధిలో పంచాయతీలకు ఎన్నికలు జరపకపోతే.. అవి ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లిపోతాయి. అప్పుడు పల్లె ప్రజలకు ప్రాథమిక ప్రభుత్వ అవసరాలు కూడా తీరటం కష్టమౌతుంది. ఈ సంగతి గతంలో జరిగిన సంఘటనల తరుణంలో గ్రామీణులకు అనుభవంలో ఉన్నదే.

క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం లేకుండా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించలేదు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడం వలన గత 20 నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.3000 కోట్లు నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామీణ అభివృద్ధి నిధులు లేక సమస్యలు ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 32.29 లక్షల మంది పంచాయతీరాజ్ సంస్థలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరిలో 46.6 % మంది మహిళలు. వీరిలో స్వతంత్రంగా పనిచేస్తున్నవారు ఎందరు అన్నది ప్రధాన ప్రశ్న. మహిళా ప్రజాప్రతినిధుల పదవీ బాధ్యతలను అనధికారంగా కుటుంబ సభ్యులు నిర్వహించడం కొన్నిచోట్ల జరుగుతోంది. ఆ కోణంలో చూస్తే మహిళా సాధికారతకు పంచాయతీ స్థాయిలోనే సమాధి కట్టే పని చాలా విజయవంతంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇలాంటి చర్యలు కట్టడి చేయాలంటే.. కఠిన శిక్షలు అమలు చేయాలని కొన్ని కమిటీలు సిఫార్సు చేసినా.. అవి అరకొరగానే అమలౌతున్నాయి. ప్రస్తుతం నగరీకరణ పెరిగినప్పటికీ ఇంకా సుమారు 95 కోట్ల మంది భారతీయులు గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో సుమారు 45% మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రభుత్వాలైన పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాముఖ్యం ఉంది. ఏతావాతా ఐదేళ్లకోసారి ఎన్నికలు పెట్టడమే.. పంచాయతీలకు పట్టం కట్టడమనే గుడ్డి నమ్మకానికి వచ్చేసిన ప్రభుత్వాలు.. పల్లె ప్రజలకు అసలు పంచాయతీరాజ్ స్ఫూర్తి ఏమిటో తెలియకుండా కాలం గడిపేస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌…వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది. గ్రామాల్లో పూర్తిగా బలం పెంచుకున్న తర్వాత…జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులను హస్తం చేసుకోవాలని ఎత్తులు వేసింది. స్థానిక సంస్థల్లో..ఒక్కో దాంట్లో పట్టు సాధించిన తర్వాత…మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌ చుట్టూ పక్కల కాంగ్రెస్‌కు బలం వచ్చాక…గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించేలా రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది. ఇప్పుడు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఏకంగా 70 శాతం గ్రామాల్లో విజయం సాధించింది. గతంలో 2008-09లో వైఎస్ హయాంలో మాత్రమే కాంగ్రెస్ కు ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని నేతలు గుర్తుచేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. స్థానిక ఎన్నికలకు అంతే ప్రాధాన్యత ఉంది. ఇంకా చెప్పాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే.. ప్రజలకు దగ్గరగా ఉండేది స్థానిక ప్రజాప్రతినిధులే. అలాగే ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కరెక్టుగా పార్టీల అధినేతలకు చేరవేయడంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం. వీరి అండదండలు లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచే ప్రసక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తెలంగాణ పంచాయతీల్లో మెజార్టీ హస్తగతం కావడంతో.. కాంగ్రెస్ కు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ కు క్షేత్రస్థాయిలో క్యాడర్ బలోపేతం అవుతుందనే అంచనాలున్నాయి. అలా పెరిగిన క్యాడర్ బలం.. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మెరుగ్గా సన్నద్ధం కావటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో నేరుగా టచ్‌లో ఉంటారు. ఇప్పుడు ఎన్నికయ్యేవారు ఐదేళ్ల పాటు పదవుల్లో ఉంటారు. అంటే వీరి పదవీకాలంలోనే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి.. ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు బలపడతారు. అలా బలపడ్డ ప్రజాప్రతినిధులు.. ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికల్లో మరింత కీలకంగా మారతారనడంలో సందేహమే లేదు. ఒక్కసారి స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వస్తే.. ప్రజలు కూడా ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గరకు పరిగెత్తడం మానుకుంటారు. ఎక్కడి సమస్యల్నిఅక్కడి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారం కోసం వారిపైనే ఒత్తిడి పెంచుతారు. అలా గ్రామస్థాయిలో సర్పంచ్‌లు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు.. చక్రం తిప్పుతారు. వీళ్లలో ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నవారికి ఓటుబ్యాంకు కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ లెక్కలు వేసుకునే కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. అందుకే పంచాయతీ ఎన్నికల్ని కూడా కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుని పనిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీరియస్‌గా తీసుకోవాలని ముందే ఆదేశాలు వచ్చాయి. స్వయంగా సీఎం రోజువారీ పర్యవేక్షణ చేయడంతో.. పార్టీలో పైనుంచి కింది దాకా సీరియస్‌నెస్ వచ్చేసింది. అందుకు తగ్గట్టుగానే ప్రతిపక్షాలపై పైచేయి సాధించామనేది కాంగ్రెస్ నేతలు చెప్పే మాట. ఇక్కడ గెలుపుతో పాటు కొత్తగా వచ్చే క్యాడర్‌ను, స్థానికంగా తయారయ్యే కొత్త నాయకత్వాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో కూడా కార్యాచరణ సిద్ధమైందని అంటున్నారు. ఎంత పెద్ద భవనమైనా.. పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అంతే. ఆ పునాది కాంగ్రెస్‌కు గట్టిగా పడిందని హస్తం పార్టీ ఫుల్‌ జోష్‌లో కనిపిస్తోంది. తెలంగాణలో 61.3% జనాభా గ్రామాల్లోనే ఉంది.ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ద్వారా వారంతా కాంగ్రెస్ కు అండగా ఉన్నారని తేలిపోయిందనేది ఆ పార్టీ భావన. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. అదేం పెద్ద గెలుపు కాదన్నట్టుగా విపక్షాలు మాట్లాడాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టామంటున్నారు కాంగ్రెస్ నేతలు.

దేశంలోని మూడంచల ప్రభుత్వ వ్యవస్థలో కింది స్థాయిలో కీలకంగా పాలన సాగించే పంచాయతీరాజ్​ స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. స్థానిక పాలనను వారి కనుసన్నల్లో, చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఆర్థిక స్థితిపై, లావాదేవీలపై లేని పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఆర్థిక, పాలనా స్వేచ్ఛను కోల్పోతున్నాయి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రూపుదిద్దుకోవాలన్నా, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలన్నా 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలు స్వయం పాలన దిశగా ముందుకు సాగాలి. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ప్రతి ఐదేండ్లకు స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని, రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రోడ్లు లాంటి 29 అంశాల్లో గ్రామస్థాయిలో పంచాయతీలకు, మండల స్థాయిలో మండల పరిషత్ లకు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ లకు, మున్సిపల్, నగరపాలక సంస్థలకు బాధ్యతలు వచ్చాయి. కానీ ఆ సవరణలు తాలూకు ఫలితాలు ఆచరణలో నేటికీ అమలు కావడం లేదు. రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థను, స్థానిక సంస్థలను నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ.

1994లో ఏర్పడిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 2014లో రాష్ట్ర విభజన వరకు పంచాయతీరాజ్ పాలన కొనసాగింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొంత కాలంగా అధికారాలు, నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ఏర్పాటు అత్యంత నాటకీయంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020లో ఆర్డినెన్స్ ద్వారా తమకు అనుకూలంగా ప్రభుత్వం చట్ట సవరణ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను వారి కనుసన్నల్లో, చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అతిగా చేస్తున్న ప్రయత్నాలుగా ఈ చట్ట సవరణలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఆర్థిక స్థితిపై, లావాదేవీలపై ప్రభుత్వం తనకు లేని పెత్తనం చేస్తోంది. ఈ చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఆర్థిక స్వేచ్ఛతోపాటు, పాలనా సౌలభ్యాన్ని కోల్పోతున్నాయి. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణకు నమూనాలుగా, ప్రజలకు చేరువగా ఉండే, ప్రజా ప్రతినిధుల వ్యవస్థకు జీవం పోసే స్థానిక సంస్థలను రాజ్యాంగంలో చెప్పినట్లుగా స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతున్న అన్ని ప్రాధాన్యతలు, నిధుల వాటా లాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన బడ్జెట్ లో స్థానిక సంస్థలకు వాటా నిధులు కేటాయించాలన్న స్థానిక సంస్థల డిమాండ్ దశాబ్దాలు గడిచినా నెరవేరడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల పెత్తనంలో నలిగిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వం, అధికారులు నిరంతరం ప్రోత్సహిస్తున్నారు.

73, 74 రాజ్యాంగ సవరణలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలు జరగాలన్న విధి విధానాలు రావాలి. ఇందుకోసం అవసరమైతే మరో రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. తద్వారా జాతీయ పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు జరిగి దేశవ్యాప్తంగా ఒకే పంచాయతీ రాజ్ చట్టం అమలుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రాల స్వార్థపూరిత నిర్ణయాల ద్వారా స్థానిక సంస్థల సాధికారతకు జరుగుతున్న నష్టం పూడుతుంది. అప్పుడే గ్రామాల పురోభివృద్ధికి మార్గం ఏడ్పడుతుంది. రాజ్యాంగ సవరణలు అమలుకు నోచుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. స్థానిక సంస్థలకు కనీసం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. ఆఖరికి న్యాయస్థానాల్లో కేసుల వేసి ఎన్నికలు జరుపుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. అప్పటికీ ఎన్నికలకూ, నిధులకు లంకె పెట్టడం కారణంగానే ఈ మాత్రమైనా ఎన్నికలు జరుగుతున్నాయనే వాదన లేకపోలేదు. నిరంతర రాజకీయాలతో సతమతమయ్యే గ్రామాల్లో నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైన సర్పంచ్ అధికారాలకు కత్తెర వేస్తూ, ఉపసర్పంచ్ కు చెక్ పవర్ లో జాయింట్ సంతకం కల్పించి, రాజకీయ వివాదాలను సృష్టించి ప్రభుత్వం వినోదం చూస్తోంది. పంచాయతీలకు చెందిన సాధారణ నిధులను కూడా ప్రభుత్వాలు సి.ఎఫ్.ఎమ్.ఎస్ పేరుతో తన చేతుల్లోనే ఉంచుకుంటున్నాయి. గ్రామాల్లో అనేక అత్యవసర పనులు చేయడానికి కూడా నేడు సర్పంచులు.. పాలకవర్గం, అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక వాటా నిధులు ఆగిపోయాయి. గతంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇయ్యాల కనుమరుగైపోయాయి. ఇలా స్థానిక సంస్థల ద్వారా గ్రామాలకు జరగాల్సిన అభివృద్ధిని ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి.

అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది యువత ఉత్సాహంగా పోటీచేసి.. సర్పంచ్‌లుగా కూడా ఎన్నికయ్యారు. కొన్ని గ్రామాలు ఉద్దేశపూర్వకంగా చదువుకున్న యువతని ప్రోత్సహించాయి. మరి రాజకీయ అరంగేట్రం చేసిన కొత్త తరం ఏలుబడిలో అయినా.. పంచాయతీలకు పూర్వవైభవం వస్తుందేమో చూడాల్సి ఉంది. మొన్నటిదాకా పంచాతీయల అధికారాలు, నిధుల గురించి పుస్తకాల్లో చదువుకున్న యువత.. వాస్తవ పరిస్థితులు చూశాక ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది. ఇప్పటికైనా కొత్తతరం నడుం కడితే.. ప్రస్తుత వ్యవస్థలో ఎంతోకొంత మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తమౌతోంది. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు. పంచాయతీరాజ్ చట్ట స్ఫూర్తిని అందిపుచ్చుకుని యువత ముందడుగు వేస్తే.. పల్లెలన్నీ చైతన్యవంతమౌతాయనడంలో సందేహం లేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పద్ధతి మార్చుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మొదట కేంద్రం నేరుగా పంచాయతీలకు విడుదల చేసే నిధుల్ని సద్వినియోగం చేయగలిగితే.. కొంతవరకు గ్రామాల ముఖచిత్రం మారే అవకాశం ఉంది. అందుకు కొత్తతరమే ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి.

Exit mobile version