NTV Story board on IT Layoffs: ఐటీ రంగంలో ఇప్పుడంతా టెన్షన్ టెన్షన్.. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా? ఏ రోజు మెయిల్‌కి ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు. పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి? ఈఎమ్ఐలు ఎలా చెల్లించాలి? ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయి? ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల భయాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలు లే ఆఫ్స్ తో పాటు, రిక్రూట్ మెంట్లు కూడా నిలిపివేశాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. ఆర్థిక మాంద్యం సాధారణంగా 3-4 ఏళ్లు కొనసాగుతుంది. దీంతో ఓ దేశ జీడీపీ 10% కుంగుబాటుకు లోనవుతుంది. మాంద్యం నిరుద్యోగం, పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ప్రాంతానికో, ఒక నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండటం ఖాయం. ఈ లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల భారాన్ని, కంపెనీల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి.
ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. పెద్ద కంపెనీలు సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆఖరికి ప్రపంచం తలక్రిందులైనా తమ ఉద్యోగాలకు ఢోకా లేదని భావించే గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించటం, జీతాలను తగ్గించటం… పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది. ఈ ఏడాది కాలంలో ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థికవేత్తలు ఇప్పటికే అంచనా వేశారు. ఇప్పటికే లాభాలు తగ్గాయని అనేక కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌ను మొత్తానికి నిలిపివేసే దిశలో టెక్ కంపెనీలున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఐటీ ఉద్యోగులు ఫ్యూచర్‌పై ఆందోళనలో పడితే ఫ్రెషర్స్ కష్టాలు మరో రకంగా ఉన్నాయి. ఆఫర్ లెటర్ వచ్చిందని భరోసాతో ఉన్న వాళ్లంతా ఇప్పుడు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఆఫర్ లెటర్ ఇచ్చేదే.. అనేక రకాల వడపోతల తర్వాత. ఇన్నేళ్లలో ఒక్కసారి ఆఫర్ లెటర్ ఇచ్చి జాబ్ వెనక్కి తీసుకున్న సంస్థలు గతంలో ఎక్కడా కనిపించవు. కానీ, ఇప్పుడు అర్థం లేని కారణాలు చెప్పి, ఇచ్చిన ఆఫర్ ని వెనక్కు తీసుకుంటున్నాయి కంపెనీలు. ఒక్క కంపెనీ కాదు.. రెండు మూడు ఆఫర్లు వచ్చాయంటూ కాలర్ ఎగరేసిన ఫ్రెషర్లు కూడా చివరికి ఏ కంపెనీ పిలవక పోవటంతో ఆందోళనలో పడుతున్నారు.
కారణాలు ఏం చెప్పినా ..అసలు విషయం మాత్రం ఆర్థిక మాంద్యమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలగిస్తున్నపుడు, ఇతర కంపెనీల సంగతి చెప్పేదేముంది. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముడుతుందన్న వార్తల నేపథ్యంలోయాపిల్ లాంటి సంస్థ కూడా జాగ్రత్త పడుతోందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది. గతంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో కోటిపైగా ప్యాకేజ్ తో సెలక్టయితే ఇప్పుడు టాప్ కాలేజీల్లో కూడా 50లక్షలు దాటడం లేదు. నిజానికి కోవిడ్ టైమ్‌లోనూ ఐటీ రంగం దూసుకుపోయింది. కానీ, ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. భారత ఐటీ రంగం కరోనాను తట్టుకుని గట్టిగానే నిలబడింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణతో.. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులకు ఢోకా లేకుండా పోయింది. విపరీతంగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో కంపెనీలు తమ అవసరం కోసం వేలమందిని రిక్రూట్ చేసుకున్నాయి. హెడ్ కౌంట్‌ను పెంచుకున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ లో నే పనిచేశారు. అటు వ్యాపార లావాదేవీలు కూడా ఆన్‌లైన్‌లో పెరిగాయి. ఇదంతా గతం..
జులై 2020 నుంచి సెప్టెంబర్ 2022 మధ్య దేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్‌లో మూడోవంతు మందిని కొత్తగా నియమించుకున్నాయి. ఈ సంఖ్య సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. దానికి తగ్గట్టే చాలా కంపెనీల ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నికర లాభం కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. భారత ఐటీ రంగం వృద్ధిని చూసి అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. దాంతో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డాయి. ఆర్థిక మాంద్యం భయాల్లో ముప్పు నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాయి కంపెనీలు. ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉద్యోగుల తొలగింపే ఫస్ట్ ఆప్షన్‌గా పెట్టుకున్నాయి. ఒకేసారి వేల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. పింక్ స్లిప్పుల్ని యమ స్పీడ్‌గా పంపుతున్నాయి. ప్రసూతి సెలవుల్లో మహిళా ఉద్యోగుల్ని సైతం వదలడం లేదు. కొందరికి జాయిన్ అయిన 2 నెలలకే ఊస్టింగ్ ఆర్డర్స్ వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగుతుందని ఐటీ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..