బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఓ శకం ముగిసింది. బ్రిటన్ పైనే కాకుండా మొత్తం ప్రపంచం మీదే క్వీన్ ప్రత్యేకమైన ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాలించినా.. సంప్రదాయాల కట్టుబాట్లు దాటలేదు. సన్నిహితులు, తోబుట్టువులు, కుమారుల జీవితాల విషయంలో కూడా రాణి సంప్రదాయాలతో రాజీ పడలేదు. రాజ కుటుంబం మర్యాదను పాటించి తీరాల్సిందేనని చాలాసార్లు స్పష్టం చేశారు. మరి క్వీన్ తర్వాత బకింగ్ హామ్ ప్యాలెస్ వ్యవహారాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.
బ్రిటన్‌ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన క్వీన్ఎలిజబెత్-2 ఇకలేరు. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో ఉన్న రాణి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ధ్రువీకరించింది.
బ్రిటన్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 స్కాట్‌లాండ్ బల్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు. బ్రిటన్‌కు ఆమె ఏకంగా 70 ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. గురువారం ఉదయమే రాణి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్న తరుణంలో.. రాజ కుటుంబసభ్యులంతా స్కాటిష్ ఎస్టేట్ ఎబెర్డీన్‌షైర్‌కు చేరుకోవడం మొదలుపెట్టారు. ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్ ఛార్లెస్, ఆయన భార్య కెమిల్లా, మనవడు ప్రిన్స్ విలియమ్ బల్మోరల్ చేరుకున్నారు. వేసవి విడిది కోసం బల్మోరల్‌కు వచ్చిన ఎలిజబెత్-2.. అప్పట్నుంచి అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో రాణి వృద్ధాప్య సమస్యలతో ఎక్కువగా కదల్లేకపోతున్నారు. దీంతో ఆమె ప్రయాణాలను కూడా బాగా తగ్గించుకున్నారు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. రాజు, రాణి శుక్రవారం లండన్ చేరుకుంటారని బర్మింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది. రాణి మరణం దేశానికి, ప్రపంచానికి తీరనిలోటని ఛార్లెస్, ప్రధాని లిజ్ ట్రస్ అభివర్ణించారు. ఆమె మరణం పట్ల పలువురు దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎలిజబెత్-2 తన నాయకత్వంలో బ్రిటిష్ జాతికి స్ఫూర్తినందించారని ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో కొనియాడారు.
బ్రిటన్ రాజుగా ఇకపై ప్రిన్స్ ఛార్లెస్ వ్యవహరించనున్నారు. పట్టాభిషేకానికి మాత్రం కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడం ఒక కారణం. రాజు లేదా రాణి కన్నుమూత తర్వాత 24 గంటల్లో వారసుడిని ప్రకటించాల్సి ఉంటుంది. దీని నిమిత్తం సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమవుతారు. ఆ తర్వాత పార్లమెంటును సమావేశపరుస్తారు. శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరిస్తారు. అనువంశిక రాజరిక చట్ట నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
యావత్ ప్రపంచానికి, తరతరాలకూ సుపరిచితురాలు… క్వీన్ ఎలిజబెత్-2. ఆమె పూర్తిపేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. డ్యూక్ ఆఫ్ యార్క్ అయిన ప్రిన్స్ ఆల్బర్ట్, ఆయన భార్య లేడీ ఎలిజబెత్ బోవెస్-లియాన్‌ల పెద్ద కుమార్తె. 1926, ఏప్రిల్ 21న లండన్‌లో జన్మించారు. తండ్రి మరణంతో.. యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లండ్‌లకు 1952, ఫిబ్రవరి 6న మహారాణిగా లాంఛనప్రాయ బాధ్యతలు చేపట్టారు. ఏడు దశాబ్దాలకుపైగా పాలించారు. 21 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ దేశాల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకుముందు క్వీన్ విక్టోరియా పాలన.. 63 సంవత్సరాల 7 నెలల 2 రోజుల పాటు సాగింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ.. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్-2 రికార్డు సృష్టించారు. గురువారం నాటికి 70 ఏళ్ల 7 నెలల 3 రోజులు పాలించారు. తన హయాంలో 4 వేలకుపైగా చట్టాలకు ఆమె ఆమోదముద్ర వేశారు. మహారాణి హోదాలో వందకు పైగా దేశాల్లో ఎలిజబెత్-2 పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడాకు వెళ్లారు. భారత్‌లో మూడు సార్లు పర్యటించారు. ఇక్కడి ఆతిథ్యానికి ముగ్ధులయ్యారు. ఎలిజబెత్-2 నేతృత్వంలో మొత్తం 15మంది బ్రిటన్ ప్రధానులు సేవలు అందించారు. చైనాను సందర్శించిన, అమెరికాలో ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటిష్ మహారాణిగానూ చరిత్ర సృష్టించారు. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో 73ఏళ్లపాటు కలిసి జీవించి మరో రికార్డు సృష్టించారు. గత ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వయసులో ఆయన మృతిచెందారు. ఈ దంపతులకు నలుగురు సంతానం.
క్వీన్ ఎలిజబెత్ గత ఏడాది అక్టోబర్ నుంచే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడవడం, నిలబడటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అప్పట్నుంచి స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ క్యాజిల్‌లో ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బుధవారం సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వైద్యుల సూచన మేరకు అందుకు దూరంగా ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితమే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్ కి వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుసుకున్నారు. ప్రభుత్వ సీనియర్ సలహాదారులతో బుధవారం వర్చువల్‌గా రాణి పాల్గొనాల్సిన ప్రీవీ కౌన్సిల్ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడటంతో ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనుమానాలు మొదలయ్యాయి. రాణి ఆరోగ్యాన్ని వైద్యుల బృందం దగ్గరుండి పరిశీలిస్తోందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించడం ఇందుకు ఊతమిచ్చింది. దీంతో రాణి సన్నిహిత కుటుంబ సభ్యులు బల్మోరల్ కోటకు చేరుకున్నారు. కుమారుడు ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు, కూతురు ప్రిన్సెస్ అన్నె, మనవడు ప్రిన్స్ విలియమ్, యూకేలోనే ఉన్న ప్రిన్స్ హ్యారీ దంపతులు కూడా బల్మోరల్ వెళ్లారు. బీబీసీ ఇతర కార్యక్రమాలను రద్దు చేసి, రాణి గురించిన అప్‌డేట్స్‌ను అందించింది. రాణి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే.. పార్లమెంట్‌లో ఇంధన బిల్లులపై జరుగుతున్న చర్చను హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ నిలిపివేశారు. ఎలిజబెత్2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా, 14 కామన్వెల్త్ దేశాల అధినేతగా సంతాప కార్యక్రమాలను నిర్వహిస్తారు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో..ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట తదనంతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
నూతన రాజుగా ప్రిన్స్ చార్లెస్ బాధ్యతలు స్వీకరిస్తారు. యూకేలో జాతీయ పతాకాలను అవనతం చేశారు.
పార్లమెంట్ వ్యవహారాలను 10 రోజులపాటు రద్దు చేశారు. జాతీయ సంతాప దినాలను ప్రకటిస్తారు. రాణి భౌతికకాయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని థ్రోన్ రూమ్‌కు తరలిస్తారు. ఐదు రోజులపాటు అక్కడే ఉంచుతారు.
ఆ తర్వాత వెస్ట్‌మినిస్టర్ హాల్‌కు చేరుస్తారు. అక్కడ 3 రోజులపాటు ఉంచుతారు. రాణికి నివాళులర్పించడానికి రోజుకు 23 గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతిస్తారు. పదో రోజున లండన్ వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఒకవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటన్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు నుంచి ఆ హోదాలో ఉన్నారు.
70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో క్వీన్ ఎలిజబెత్-2.. ప్రపంచంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలకు మౌనసాక్షిగా మిగిలారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న చాలా దేశాలు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు క్వీన్ ఎలిజబెత్ కు ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు పెటాకులయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజ కుటుంబంలో ప్రేమ వివాహాలకు తావు లేదని మంకుపట్టు పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కూడా పెళ్లికి ఒప్పుకున్నా.. డయానాను అంతఃపురానికే పరిమితం చేయాలని చూడటం కూడా విమర్శలకు తావిచ్చింది. చివరకు రాజ కుటుంబ పెట్టిన క్షోభ అనుభవించలేక డయానా విడాకులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడ డయానాను వదలకుండా వేధించారనే అప్రతిష్ట మూటకట్టుకుంది రాజ కుటుంబం. అయినప్పటికీ క్వీన్ ఎలిజబెత్-2 ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు రాణికి మద్దతుగా నిలిచారు. రాజ కుటుంబంలోకి వచ్చేవాళ్లు, ఉండాలనుకునేవాళ్లు కచ్చితంగా సంప్రదాయాలు పాటించాలనే భావన ఉంది. గీత దాటినవాళ్లకు వారసత్వం నిరాకరించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటన్నింటికీ మొదట్లో విమర్శలు ఎదుర్కున్న క్వీన్.. ఆ తర్వాత తనను తాను సంప్రదాయవాదిగా సమర్థించుకున్నారు. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా.. రాణిగా సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పారు క్వీన్ ఎలిజబెత్-2. ఎలిజబెత్-2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్-3గా పదవిలో కొనసాగుతారు.
క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందారు.
ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో క్వీన్ ఎలిజబెత్-2ను వారసురాలిగా ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె కెన్యాలో రాయల్ టూర్‌లో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబే చర్చిలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెడాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 పాలనా కాలంలో బ్రిటన్ కు 15 మంది ప్రధానులు.. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.
2015 నాటికే ఎలిజబెత్-2 క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రాణి భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. అనారోగ్యంతో క్వీన్ మరణించిన తరుణంలో.. లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్.
బ్రిటన్ రాణికి చాలా ఆస్తులున్నాయి. తన ఆస్తులను క్వీన్ ఎలిజబెత్- 2 ఎవరికి అందజేయాలని నిర్ణయించుకున్నారనే ప్రశ్న చాలామంది మదిలో ఉంది. ఎవరికి ఎంత మొత్తం ఆస్తి చెందాలని ఆమె భావించారనే అంశంపై ఆసక్తి నెలకొంది. క్వీన్ కన్సార్ట్‌గా ఆమె ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన కెమిల్లా నుంచి ప్రిన్స్ ఆండ్రూ లేదా ప్రిన్స్ హ్యారీ వరకు ఎవరికి అర్హత ఉందనే చర్చ మొదలైంది. కింగ్ అయిన ప్రిన్స్ చార్లెస్‌కు అధికారికంగా పుష్కలంగా డబ్బు ఉంటుంది. కాబట్టి క్వీన్ ఎలిజబెత్ మిగతా పిల్లలు, వారి వారసులకు ప్రాధాన్యం ఇచ్చి ఉండే అవకాశం ఉంది. ఆండ్రూ అంటే క్వీన్ ఎలిజబెత్ -2కు చాలా ఇష్టం. ఆమె తన సంపదలో కొంత భాగాన్ని అతని కోసం కేటాయించి ఉండవచ్చని అంచనా. అయితే ఆండ్రూ తన ఇమేజ్‌ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నప్పటికీ, అది జరిగే అవకాశం లేదు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో అతని అనుబంధం, కొన్ని నేరాల గురించి తెలిసినప్పటికీ అతనితో సంబంధాలు తెంచుకోవడంలో వైఫల్యాలను ప్రజలు మర్చిపోలేదు.
రాజ భవనాలలో ఎవరు నివసించాలనే అంశంపై కింగ్ చార్లెస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చాలా మంది రాజ కుటుంబీకుల నివాస స్థలాలు ఇప్పుడు మారే అవకాశం ఉంది. మొదట ప్రాధాన్యతను చార్లెస్ తీసుకుని, ఆ తర్వాత స్థానాలను ప్రిన్స్ విలియం, అతని కుమారుడు ప్రిన్స్ జార్జ్‌కు ఇచ్చే అవకాశం ఉంది. లండన్ నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చార్లెస్ నివసిస్తారని, అయినా ప్రజల కోసం మరిన్ని గదులను అందుబాటులో ఉంచుతారని భావిస్తున్నారు.
ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ విండ్సర్ కోటలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ కోటలోనే నివసించాలని క్వీన్ ఎలిజబెత్- 2 శాశ్వతంగా మకాం మార్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద కోట. దీనికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనికి సమీపంలోన హీత్రూ విమానాశ్రయం ఉందని, శబ్దాలు ఎక్కువగా వస్తాయని, అందుకే చార్లెస్‌కు ఇది నచ్చదని చెబుతారు. విలియం, కేట్ మిడిల్టన్ జంట లండన్ నడిబొడ్డున ఉన్న కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌ను కూడా పొందనున్నారు. స్కాటిష్ హైలాండ్స్‌లోని బాల్మోరల్ కోటను మ్యూజియంగా మార్చే అవకాశం ఉంది.
చార్లెస్, కెమిల్లా తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా పొందిన బిర్‌ఖాల్‌ను ప్రేమిస్తారు, కాబట్టి వారికి స్కాట్లాండ్‌లో మరొక ఇల్లు అవసరం ఉండకపోవచ్చు. దీంతో నార్ఫోక్‌లోని సాండ్రింగ్‌హామ్‌లోని రాయల్ ఎస్టేట్, అలాగే గ్లౌసెస్టర్‌షైర్‌లోని చార్లెస్ ప్రైవేట్ హౌస్ హైగ్రోవ్ మిగులుతాయి. లండన్ స్థావరం క్లారెన్స్ హౌస్‌లోకి చార్లెస్, తన అమ్మమ్మ మరణానంతరం మారారు. క్లారెన్స్ హౌస్ ఒకప్పుడు ప్రిన్స్ హ్యారీ కోసం కేటాయించారు. ఇప్పుడు ప్రిన్స్ జార్జ్ యుక్తవయస్సుకు వస్తే ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే చార్లెస్ ఇప్పటికే సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన సాండ్రింగ్‌హామ్ అతని కంట్రీ ఎస్టేట్ కావచ్చు. హైగ్రోవ్ ఒక మ్యూజియంగా మారవచ్చు. ఈ మార్పుల వల్ల చార్లెస్ తోబుట్టువులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. ప్రిన్స్ ఆండ్రూ తన అమ్మమ్మ మరణించిన తర్వాత విండ్సర్‌లోని రాయల్ లాడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. బాగ్‌షాట్ పార్క్‌లోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఇల్లు క్రౌన్ ఎస్టేట్‌కు చెందినది. ప్రిన్సెస్ అన్నే గాట్‌కోంబ్ పార్క్‌ని క్వీన్ ఎలిజబెత్ ద్వారా పొందారు.
బ్రిటన్ లో రాజ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొత్త రాజు బాధ్యతలు తీసుకునేటప్పుడు.. అక్కడ చాలా మారతాయి. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఇన్నాళ్లూ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి కూడా నెలకొంది.
క్వీన్ ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలోని కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎవరికి వెళ్తుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.
రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరించనున్నారు. చార్లెస్ సతీమణి కెమిల్లాకి రాణి హోదా దక్కుతుంది. అప్పుడు కోహినూర్‌తో పొదిగి ఉన్న ఎలిజబెత్ కిరీటం కెమిల్లాకు వెళ్లనుంది. ఎలిజబెత్-2.. 70 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి రాణి ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే తదుపరి రాణి కావాలని ఆకాంక్షించారు. తదుపరి రాణికే ఈ కిరీటధారణ జరగనుంది.
1937లో కింగ్ జార్జ్-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ ఉంది. ఇది ఇప్పుడు ఎలిజబెత్-2 నుంచి కెమిల్లాకు చేరుతుంది. ఈ కోహినూర్.. 105.6 క్యారెట్ల వజ్రం. దీనిని 14వ శతాబ్దంలో భారత్‌లో గుర్తించారు. తర్వాత ఎన్నో చేతులు మారింది. 1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత విక్టోరియా రాణి చెంతకు చేరింది. అప్పటినుంచి ఆ వజ్రం రాజ కుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. అయితే భారత్‌తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది.
రాచరికంలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. అయితే కెమిల్లా విషయంలో కొంత అనిశ్చితి ఉంది. ప్రిన్స్ చార్లెస్‌కు ఆమె రెండో భార్య కావడం, కెమిల్లాకు కూడా ఇది రెండో వివాహం కావడం ఇందుకు కారణం. చార్లెస్ తొలుత ప్రిన్స్ డయానాను వివాహమాడారు. 1996లో వారు విడాకులు తీసుకున్నాక ఏడాదికే డయానా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆ తర్వాత 2005లో చార్లెస్, కెమిల్లాల వివాహమైంది. అందగత్తెగా విశేషాదరణ పొందిన డయానా స్థానంలోకి కెమిల్లా రావడంతో ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు గత సర్వేల్లో వెల్లడైంది. దీంతో కెమిల్లాకు రాణి హోదాపై అనుమానాలుండేవి. వీటన్నింటినీ పక్కనబెట్టి తన కోడలు కెమిల్లాకు రాణి హోదా రావాలని ఎలిజబెత్-2 అభిలషించారు.
బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం… రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసులుగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు లేదా రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్‌కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్‌పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలరు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్‌లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్‌గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్‌డోర్ పరేడ్స్(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్‌డేను కూడా వేసవి నెలలో రెండోసారి అధికారిక పుట్టినరోజుగా జరిపే అవకాశం ఉంది. ఈ బహిరంగ వేడుకల్లో 1400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్‌తో ఈ వేడుక ముగుస్తుంది.
బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్‌లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని ఒక రకం చేప, డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది. బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్- II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు.
చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్‌బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్‌లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి.
బ్రిటన్ జన జీవనంలో ఆ దేశ రాజ వంశం గుర్తులు అన్ని వేళలా కనిపిస్తాయి. కరెన్సీ, జాతీయ జెండా వంటి అనేక అంశాలు రాజ వంశంతోనే ముడిపడి ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్-2 మరణించడంతో ఛార్లెస్-3 కింగ్ అవుతారు.
క్వీన్ ఎలిజబెత్-2 కాలంలో రాజవంశ చిహ్నం జాతీయ జెండాలపై ఉండేది. ఈ జెండాలను అన్ని ప్రభుత్వ, పోలీస్ స్టేషన్ల భవనాలపైన ఎగురవేసేవారు. రాయల్ నేవీ నౌకలపై కొన్ని పరిస్థితుల్లో ఈ జెండాలను ఎగురవేసేవారు. నీలం, ఎరుపు, బంగారం రంగులను క్వీన్ కలర్స్ అంటారు. బ్రిటిష్ మిలిటరీ ఈ రంగుల జెండాలను ఎగురవేస్తూ ఉండేది. చాలా జెండాలపై EIIR అక్షరాలను బంగారం రంగులో రాసేవారు. బ్రిటిష్ నేషనల్ ఫైర్ సర్వీస్ పతాకంలో కూడా EIIR అని రాసి ఉండేది. క్వీన్ రాజ్యాధినేతగా ఉన్న కామన్వెల్త్ దేశాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాలు E Flagను ఉపయోగిస్తుండేవి. కింగ్ ఛార్లెస్-3 హయాంలో ఇవన్నీ మారుతాయి.
రాయల్ స్టాండర్డ్ ఫ్లాగ్‌లో నాలుగు భాగాలు ఉంటాయి. వీటిలో రెండు భాగాలు ఇంగ్లండ్‌ను, ఒక భాగం స్కాట్లాండ్‌ను, మరో భాగం ఐర్లాండ్‌ను సూచిస్తాయి. ఇది కూడా మారే అవకాశం ఉంది. వేల్స్‌కు కూడా స్థానం కల్పించే అవకాశం ఉంది.
దేవుడు మా రాణిని రక్షిస్తాడు అనే అర్థం వచ్చే మాటలు యునైటెడ్ కింగ్‌డమ్ జాతీయ గీతంలో ఉన్నాయి. ఈ మాటలను దేవుడు మా రాజును రక్షిస్తాడు అని అర్థం వచ్చే విధంగా మార్చుతారు. బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ముఖ చిత్రం ముద్రించి ఉంటుంది. కరెన్సీ నోట్లపై కింగ్ ఫొటోను ముద్రించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని కామన్వెల్త్ దేశాల కరెన్సీ నోట్లపై కూడా క్వీన్ బొమ్మ ముద్రించి ఉంటుంది. కొన్ని నాణేలపై కూడా ఆమె బొమ్మ ముద్రించి ఉంటుంది. నోట్లపై కింగ్ బొమ్మను ముద్రించడం కన్నా, నాణేలపై ఆయన బొమ్మను ముద్రించడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.
బ్రిటన్‌లోని రాయల్ మెయిల్ పోస్ట్ బాక్స్‌లపై క్వీన్ ఎలిజబెత్ చిహ్నం ER ఉంటుంది. వీటిని యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పోస్టల్ స్టాంపులపై కింగ్ ఛార్లెస్-3 బొమ్మను ముద్రించే అవకాశం ఉంది.
బ్రిటిష్ ఎంపీలంతా క్రౌన్‌కు విధేయతను ప్రకటించాలి. యునైటెడ్ కింగ్‌డమ్ పౌరసత్వం పొందేవారు, సాయుధ దళాల సిబ్బంది, కొన్ని ఇతర యూనిఫార్మ్‌డ్ దళాల సిబ్బంది కూడా కింగ్ ఛార్లెస్-3కు విధేయత చూపుతూ ప్రమాణం చేయవలసి ఉంటుంది.
బ్రిటన్ రాణి మరణం సందర్భంగా.. రాజ కుటుంబం చేసిన అరాచకాల మాటేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా దేశ వాసుల రక్తమాంసాలతో బ్రిటన్ అగ్రదేశంగా వెలిగిందని, వలస దేశాల్లో సాగించిన అకృత్యాలపై రాణి ఎప్పుడూ పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదనే ఫిర్యాదులున్నాయి. బ్రిటన్ ప్రజల మనసులో క్వీన్ కు మంచి స్థానం ఉందేమో కానీ.. కనీసం కామన్వెల్త్ దేశాల ప్రజల బాధలైనా ఆమె పట్టించుకున్నారా అనే అనుమానాలున్నాయి. రాజు స్థానంలో ఉన్నవాళ్లు కచ్చితంగా అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆధునిక యుగంలో తమను మించిన రాజవంశం లేదని గొప్పగా చెప్పుకునే బ్రిటన్ రాజ కుటుంబం.. అందుకు తగ్గట్టుగా వ్యవహరించిందా అంటా.. కచ్చితంగా ఔను అని చెప్పలేని పరిస్థితి.