NTV Telugu Site icon

Rajya Sabha :రాజ్యసభలో మేధావులు తగ్గిపోతున్నారా.. పెద్దల సభకు అర్హతలేంటి..?

Sb

Sb

తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్‌ రావులను వైసీపీ ఎంపిక చేసింది. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయి రెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

విజయసాయి రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు మరొక అవకాశం ఇచ్చారు. అటు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య చాలా కాలంగా బీసీ సంఘం తరపున ఉద్యమాలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడో అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, తెలంగాణకు చెందినవారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరారు. టీడీపీ తరపున 2004లో అల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో టీడీపీ నుంచి కావలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఈ ముగ్గురి ఎంపికపై వచ్చిన విమర్శలను వైసీపీ తిప్పికొడుతోంది. రాజ్యసభ ఎన్నికలు. దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి, ఏ వర్గానికి ఏ స్థానం ఇస్తున్నాం. ఏ విధంగా వారి స్ఫూర్తిని ఉపయోగించుకుంటున్నామనేదే ముఖ్యమని వైసీపీ అంటోంది. నిరంజన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు న్యాయవాది అని, బీసీల కోసం వేలాది ఉద్యమాలు చేసిన ఘనత ఆర్‌ కృష్ణయ్యకు ఉందని వైసీపీ సమర్థించుకుంటోంది.

ఇటు మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను టియ్యారెస్‌ పార్టీ ఎంపిక చేసింది. మొదటినుంచీ ప్రచారంలో ఉన్న నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావుతో పాటు హెటిరో డ్రగ్స్‌ అధినేత డా.బండి పార్థసారథిరెడ్డి, పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్రలను ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు సీఎం కెసీఆర్‌ రాజ్యసభ అభ్యర్థిత్వాల బీఫారాలను కూడా అందజేశారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై విమర్శలు కూడా వినిపించాయి. ఏపీలో 140 బిసి కులాల్లో ఎవరూ దొరకలేదా అని అక్కడి విపక్షం ప్రశ్నిస్తోంది. పైగా తెలంగాణకు చెందిన ఇద్దరికి రాజ్యసభ పదవులు ఇవ్వడం ఏపీలో వెనుకబడిన తరగతుల నేతలకు వెన్నుపోటు పొడవటమే అని విమర్శిస్తోంది.

ఇటు తెలంగాణలో ఉద్యమకారులను, పార్టీలోని ఆశావహులను కాదని ఈసారి ముగ్గురు వ్యాపారవేత్తలకే సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సామాజికవర్గాల వారీగా కూడా చాలామందినేతలు సీట్లు ఆశించినా.. ఎవరికీ చాన్స్ రాలేదు. చివరివరకు ప్రకాష్ రాజ్ పేరు వినిపించినా ఆయనకు కూడా అవకాశం దక్కలేదు. ఉద్యమంలో లేనివారికే కేసీఆర్ పెద్దపీట వేశారన్న విమర్శలు వినిపించాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎంపికపై సొంత పార్టీలో అసంతృప్తి, విపక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ సభ్యుల ఎంపికపై ఇలాంటి స్పందనలు రావటం కొత్త కాదు. చాలా ఏళ్లుగా మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో రాజ్యసభలో ఎంటరవుతున్న సభ్యుల నేపథ్యాలు మారుతూ వస్తున్నాయి. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు సభ్యుల ఎంపిక జరిగింది తప్ప, కొత్తగా జరిగిన పరిణామం మాత్రం లేదు. పైగా ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన విషయం కూడా కాదనే వాదనలు కూడా ఉన్నాయి.

అయితే వైసీపీ బీసీలకు చేరువయ్యే వ్యూహంలో ఉందని, బీసీల పార్టీగా టీడీపీకి ఉన్న గుర్తింపును చెరిపేసి, బీసీ వర్గాల్లో పూర్తి స్థాయిలో పట్టు పెంచుకునే పనిలో ఉందనే వాదనలున్నాయి. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఏపీ నుండి 11 సీట్లలో ఇప్పటికే ఐదుగురు ఎంపీలు వైసీపీకి ఉండగా.. తాజాగా మరో నాలుగు స్థానాలు దక్కనున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి నలుగురి ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ఇటు కొత్తగా రానున్న ముగ్గురితో కలిపి, తెలంగాణలో ఏడు రాజ్యసభ స్థానాలకు ఏడు టియ్యారెస్‌ ఎకౌంట్‌ లోనే ఉండనున్నాయి.

మరోపక్క ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులు సామాన్యులు కూడా కాదు. తమ తమ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నవారే. పారిశ్రామికవేత్తలుగా, పత్రికారంగ ప్రముఖులుగా, న్యాయవాదులుగా గుర్తింపు ఉన్న వ్యక్తులే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ, రాజ్యసభ ఏర్పాటు, దాని లక్ష్యం అనే కోణం నుండి చూస్తే మాత్రం కొన్ని ప్రశ్నలు వినిపించటం సహజమే. ఈ రకంగా చూస్తే కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎంపికవుతున్న రాజ్యసభ సభ్యుల నేపథ్యాలు కూడా మారుతూ వస్తున్నాయనేది వాస్తవం.

భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల రాజ్యాంగాల నుండి మంచి విషయాలను తీసుకుని తయారు చేసుకున్నాం. బ్రిటన్‌ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్న మనం అక్కడ ఎగువసభ, దిగువసభలాగే మన దేశంలోనూ లోక్‌సభ, రాజ్యసభలను ఏర్పాటు చేసుకున్నాం. జాతీయ స్థాయిలో ఈ రెండు సభలున్నట్లే రాష్ట్రాల పరిధిలో శాసనసభ, శాసనమండలి వున్నాయి. 543 మంది లోక్‌సభ సభ్యులు ప్రతి ఐదేళ్ళకోసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజల నుండి ఎన్నుకోబడుతుంటే, పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు మాత్రం 250 మంది సభ్యులు ఆయా రాష్ట్రాల వాటా ప్రకారం ఎంపికవుతూ వస్తున్నారు.

రాజ్యసభ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశ్యం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేని మేధావులను, ఆయా రంగాల నిపుణులను ఈ సభకు ఎంపిక చేయడం ద్వారా వారి సేవలను దేశ ప్రయోజ నాలకు వాడుకోవడం. చాలా నిర్మాణాత్మకమైన ఉద్దేశ్యమిది. ఎందుకంటే అనేక రంగాల్లో సమర్ధులైనా నిజాయితీపరులు, మేధావులు అయినప్పటికీ ఎన్నికల్లో గెలవటం అంత తేలిక కాదు.

నిజాయితీగా మాట్లాడాలంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే ఓ మేధావికి, ఓ ఆలోచనాపరుడికి సాధ్యమయ్యే పనేనా? ఎన్ని మేనేజ్‌ చేయాలి? ఎన్ని వ్యూహాలు పన్నాలి? ధనబలం, కులబలం లేకుండా ఎన్నికల్లో నెగ్గుకు రావటం అంత తేలికైన విషయం కాదు. నెత్తిమీద పుట్టెడు కేసులున్నవారు కూడా చట్టసభల్లోకి వెళ్తున్నారు కానీ, ఓ కవి, గాయకుడు, ఓ శాస్త్రవేత్త చట్టసభలోకి వెళ్లగలడా? ఇది అసాధ్యం అనే మాట అందరూ ఒప్పుకుంటారు.

కానీ, మేధావులు, అనుభవజ్ఞులు, దేశం పట్ల అంకితభావం కలవారు చట్టసభల్లో ఉంటే దేశానికి ఎంతో ప్రయోజనం అనేది దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే గుర్తించిన అంశం. రాజ్యసభ ఏర్పాటులో కీలక లక్ష్యం కూడా ఇదే. దూరదృష్టితో దేశం కోసం విధానపరమైన సూచనలు ఇవ్వగలిగి, ప్రభుత్వాల నిర్ణయాలను నిర్మాణాత్మకంగా విమర్శించే వ్యక్తులు, ప్రజా సమూహాన్ని ప్రేమించే వ్యక్తులు, తమ కలంతో ప్రభుత్వాలను నిలదీసే కవులు, ఆటపాటలతో ప్రజలను మేల్కొలిపే కళాకారులు, స్పూర్తినిచ్చే ఆటగాళ్లు రాజ్యసభలో ఉండటం దేశానికి ఎంతో మేలు చేస్తుంది.

రాజ్యసభ వుండబట్టే మన్మోహన్‌సింగ్‌ లాంటి ప్రజాక్షేత్రంలో గెలవలేని ఆర్ధిక మేధావి ఆర్ధిక మంత్రిగా, ప్రధానిగా ఈ దేశానికి సేవలందించగలిగారు. ఇలాంటి అవకాశమే లేకపోతే మన్మోహన్‌ సేవలు ఈ దేశానికి అందేవా? నాటి నెహ్రూ హయాం నుండి నేటి నరేంద్ర మోడీ దాకా ఆయా ప్రధానుల మంత్రి వర్గాలలో రాజ్యసభ నుండే ఎంతో మంది మేధావులు, రాజ్యసభ సభ్యులుగా కేంద్రమంత్రులుగా దేశానికి తమ అమూల్యమైన సేవలు అందించారు.

రాజ్యసభ 1952లో ఏర్పాటైంది. మేధావులు, ఆలోచనపరులు, అనుభవజ్ఞులతో ఈ సభ.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి ప్రయోజనాలను కాపాడే పనిలో ఉంది. ఆవేశకావేశాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో చట్టాలపై చర్చించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ప్రజల నుంచి ఎన్నికైన లోక్‌ సభ సభ్యుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎన్నికల దృష్టితో చట్టాలు చేసుకుంటూపోతారు. దానివల్ల ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే, చట్టాల దీర్ఘకాలిక ప్రభావాలను, మంచిచెడ్డల్ని రాజ్యసభ విశ్లేషించి మార్పులు చేర్పులు చేస్తుంది.

రాజ్యసభ స్వరూపం ఎలా ఉండాలో రాజ్యాంగ కమిటీ 1947 జులై 21న కొన్ని సూచనలు చేసింది. దిగువ సభకు లోక్‌సభ లేదా హౌస్‌ ఆఫ్‌ ద పీపుల్‌ అని, ఎగువ సభకు రాజ్యసభ లేదా కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అని పిలుచుకున్నారు. పది లక్షల నుంచి 50 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు చొప్పున ప్రాతినిధ్యం వహించాలని, ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య 20కి మించకూడదనే నిబంధనలున్నాయి. ఉప రాష్ట్రపతే ఎగువ సభకు అధ్యక్షుడిగా ఉండాలని, ఆయన అప్పటికే అదే సభలో సభ్యుడిగా ఉంటే మాత్రం తన సభ్యత్వాన్ని వదులుకోవాలని షరతు విధించింది. దీని ప్రకారమే ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆ పదవికి ఎంపికయ్యే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

రాజ్యసభకు ఆది తప్పితే అంతం లేదు. ప్రతి రెండేళ్లకు మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. అందుకే ప్రతి సమావేశానికి ఓ సంఖ్యను ఇస్తారు. అదే ఇప్పుడు 250కి చేరింది. మొత్తం 245 మందిలో గరిష్ఠంగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేసే వీలుంది.

రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజ్యసభకు ప్రత్యేక అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఏదైనా జాతీయ ప్రయోజనాల విషయంలో చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు నేరుగా రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఆర్టికల్‌ 249 దీనికి వీలు కల్పిస్తుంది. మూడింట రెండొంతుల ఆధిక్యంతో రాజ్యసభ తీర్మానం చేస్తే.. రాష్ట్రాల జాబితాలోని అంశాలపైనైనా పార్లమెంటు చట్టం చేయడానికి వీలవుతుంది. అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్‌ 352, రాష్ట్రపతి పాలనను నిర్దేశించే ఆర్టికల్‌ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితిని చెప్పే ఆర్టికల్‌ 360 ప్రకటించినప్పుడు వాటిని నిర్దిష్ట గడువులోగా పార్లమెంటు ఉభయ సభలు ఏకకాలంలో ఆమోదించాలి. లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదం సరిపోతుంది.

రాజ్యసభ చరిత్రలో ఎందరో మేధావులు సభ్యులుగా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నుంచి, పుచ్చలపల్లి సుందరయ్య, మన్మొహన్‌ సింగ్‌ జైపాల్‌ రెడ్డి, పి శివశంకర్‌ లాంటి కీలక వ్యక్తులు, సినారె, నార్ల వంటి తెలుగు ప్రముఖులు, లత మంగేష్కర్‌, రేఖ, జయాబచ్చన్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు, సచిన్‌ టెండూల్కర్‌ లాంటి స్టార్‌ ఆటగాడు, మలయాళ స్టార్‌ నటుడు సురేష్‌ గోపి లాంటి వ్యక్తులు చట్టసభలో అడుగుపెట్టారంటే దానికి రాజ్యసభ ఏర్పాటు వెనకున్న లక్ష్యమే కారణం.

మరోపక్క రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం అంతగా లేదనే అభిప్రాయాలున్నా, ఏటా కొంతశాతం పెరుగుతూ వస్తోంది. 1952లో 15 మంది మహిళా సభ్యులుంటే 2014 నాటికి ఈ సంఖ్య 31కి చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో 10.33శాతం మహిళలున్నారు.

ప్రజాస్వామ్యంలో చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌ చాలా అవసరం. అంటే అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసేతప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు ఉండాలి. మన పార్లమెంటరీ వ్యవస్తలో రాజ్యసభ ఇదే పని చేస్తుంది. భారతసమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది.
రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అంటారు. అయితే ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదనే వాదనలు చాలా కాలంగా ఉన్నాయి. గత ఏడు దశాబ్దాల్లో దేశం సామాజికంగా, ఆర్థికంగా రూపాంతరం చెందడంలో ఎగువ సభ ప్రధాన పాత్ర పోషించినా, అందులో సభ్యులు ప్రజల అంచనాలను అందుకోలేదనే వాదనలున్నాయి

రాజ్యసభ ఏర్పాటులో ఎంత ఉదాత్తమైన లక్ష్యాలున్నా, అమలులోకి వచ్చేసరికి అవి మారిపోతున్నాయి. మేధావులు, నిపుణులు, విద్యావంతులతో వుండాల్సిన రాజ్యసభ రాజకీయ పార్టీలు కులం, డబ్బు ప్రాతిపదికన సభ్యులను పంపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనివారిని రాజ్యసభకు పంపుతున్నాయి పార్టీలు. దీనికి ఏ పార్టీ అతీతం కాదు.

అనేక ఆరోపణలు వున్న వారికి చట్టసభలు అడ్డాగా మారుతున్నాయి. లోక్‌ సభలో ఈ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తే, రాజ్యసభ కూడా దీనికి అతీతం కాదనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిణామాలు చూసినపుడు పెద్దల సభ ఏర్పాటు లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. రాజ్యసభలోకి కోట్లు కుమ్మరించగలిగిన వ్యక్తులు దొడ్డిదారిన ప్రవేశిస్తే, మేధావులు, విద్యావంతులకు చోటెలా ఉంటుందనే ప్రశ్నలు పెరుగుతున్నాయి.

ఇటీవల కాలంలో పెద్దలసభపై ప్రజల్లో ఉన్న గౌరవం, నమ్మకం పోతోంది. ఒకప్పుడు పెద్దరికంతో వుండే వాళ్ళే రాజ్యసభలో వుండేవాళ్ళు. కాని, ఇప్పుడు రాజ్యసభ అంటే ఆర్ధిక నేరగాళ్ళకు, బ్యాంకులను వేలకోట్లకు ముంచినవాళ్ళకు, అక్రమ వ్యాపారాలు చేసి కోట్లు గడించిన వారికి అడ్డాగా మారుతోంది. చాలా రాజకీయ పార్టీలు రాజ్యసభను ఒక ఆర్ధిక కేంద్రంగా వాడుకుంటున్నాయి. పార్టీకి వెన్నుదన్నుగా ఉండే బడాబాబులను రాజ్యసభకు పంపిస్తున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

మేధావులు, సైంటిస్టులు, కళాకారుల దృష్టి రాజకీయనాయకులకు భిన్నంగా ఉంటుంది. సమాజ క్షేమాన్ని కాంక్షించే వ్యక్తులకు చట్టసభల్లో స్థానం ఉండటం దేశానికి మేలు చేస్తుంది. అందుకే క‌వులు, ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, మేధావులు రాజ్యస‌భ‌లో వుంటే చ‌ట్టాల‌పై మ‌రింత చ‌ర్చ జ‌రిగి దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. కానీ చివరికది రాజ‌కీయ, వ్యాపార, ఆశ్రితుల‌తో నిండిపోతూ వుంది.

ఈ కోణం నుండి చూసినపుడు రాజ్యసభ సభ్యుల ఎంపికపై అనేక ప్రశ్నలు వినిపిస్తాయి.
అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన రాజ్యసభ సభ్యులు చిన్నా చితకా వ్యక్తులు కారు. అయారంగాల్లో ప్రముఖులే. తమ కెరీర్‌ లో ఎంతో సాధించిన వారనటంలో సందేహం లేదు. అవసరమైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉన్న వ్యక్తులే. కానీ, రాజ్యసభ ఏర్పాటు లక్ష్యం నుండి చూసినపుడు మాత్రం ఈ ఎంపికపై ప్రశ్నలు ఎదుర్కోక తప్పదు. ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు.. రాజ్యసభలోని 250మంది సభ్యుల్లో ఎంతమంది మేధావులు, ఆర్థికవేత్తలు, కళాకారులు, సైంటిస్టులు ఉన్నారనే లెక్క చూస్తే అర్థమవుతుంది. పొలిటికల్‌ ఈక్వేషన్లలో భాగంగా ఏదోఒక పదవిని ఇవ్వాల్సిన నేతలు, పార్టీకి అండదండగా ఉండే వ్యక్తులు, కులాల కోణంలో రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ ఎంపికైన వ్యక్తులు మెజారిటీగా కనిపిస్తున్నారు.

దేశం అనేక సమస్యల్లో ఉంది. ఆర్థికంగా, సామాజికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగంతో పాటు మతపరమైన అసహనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశానికి నాలుగు మంచి మాటలు చెప్పే పెద్ద మనుషుల అవసరం ఉంది. చట్టసభలో దేశానికి చురుకు తగిలేలా మెదళ్లను కదిల్చే ప్రసంగాల అవసరం ఉంది. కానీ, జరుగుతున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. అయితే కులం లేదంటే డబ్బు ఈ రెండు మాత్రమే పెద్దల ఎంపికకు కొలమానంగా మారుతోంది. అంటే, పెద్దల సభలను దొడ్డిదారిగా ఎంచుకుంటుంటే, మేధావులు, విద్యావంతులకు వాటిలో ప్రవేశం లేకుండా చేస్తే వాటి లక్ష్యం ఎలా నెరవేరుతుంది?

రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఓ సినారె లాంటి కవి రాజ్యసభకు వెళ్లి ఎంత కాలమైంది?సుందరయ్య లాంటి దూరదృష్టి ఉన్న నేత చట్టసభలో అడుగుపెట్టి ఎంత కాలమైంది?ఇవన్నీ రాజకీయ పార్టీలు వాటికవి వేసుకోవలసిన ప్రశ్నలు.
రాజకీయ పార్టీలకు వ్యూహాలు తప్పదు. ఎన్నికల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం తప్పనిసరి.
ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెక్‌ పెట్టే ఎత్తుగడలు అవసరమే. ఇవన్నీ కాదనలేని పరిస్థితిలోకి రాజకీయాలు వచ్చాయి.
కానీ, దానికి కొన్ని స్వీయ పరిమితులు పెట్టుకుని చట్టసభల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత కూడా రాజకీయపార్టీలపైనే ఉంటుంది.ఓ సైంటిస్టుని, సామాజిక పరిశీలకుణ్ని, ఓ ప్రజాకవిని రాజ్యసభకు పంపిస్తే అది ఆ రాష్ట్రానికి, ఆ రాజకీయ పార్టీకి ఎంత గౌరవం.

ఇవన్నీ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రజాకోణంలో,
దేశానికి మేలు చేసేలా అభ్యర్థులను ఎగువ సభలోకి పంపాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని గుర్తించాల్సిన తరుణం వచ్చింది.