Yuzvendra Chahal Opens Up About Alcohol Addiction: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన బౌలింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో తన జట్లకు విజయాలు అందించిన ఈ లెగ్ స్పిన్నర్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. విడాకులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, పానిక్ అటాక్స్ వంటి సమస్యలతో సతమతమైనట్లు తాజాగా వెల్లడించాడు. మాజీ భారత ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో తన జీవితంలోని కష్టకాలం గురించి చహల్ మనసు విప్పి మాట్లాడాడు.
ఐపీఎల్లో చహల్ ఇప్పటివరకు 188 మ్యాచ్‌ల్లో 233 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 72 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 80 మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు. ఇంతటి ఘనమైన క్రికెట్ కెరీర్ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు తన ఆటపైనా ప్రభావం చూపాయని తెలిపాడు. మద్యపానాన్ని ఎప్పుడు మానేయాలని నిర్ణయించుకున్నావని ఆకాశ్ చోప్రా ప్రశ్నించగా.. కౌంటీ క్రికెట్ ఆడిన తర్వాత పరిస్థితి తీవ్రంగా మారిందని చహల్ వెల్లడించాడు. ‘మద్యపానం హద్దులు దాటడంతో రిహాబిలిటేషన్ కేంద్రంలో చేరి 26 రోజుల పాటు ఉన్నా. ఆ నిర్ణయం నా వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం నా భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకున్నా. మానసికంగా మరింత పరిణతి సాధించా. గత ఐపీఎల్ సీజన్లో నా శరీరం మళ్లీ 30 ఏళ్ల వయసులో ఉన్నట్లుగా అనిపించింది. జిమ్, ఫీల్డింగ్ డ్రిల్స్, ప్రాక్టీస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలిగా’ అని యూజీ వివరించాడు.
‘మద్యపానం మొదట్లో స్నేహితులతో పార్టీల్లో భాగంగానే ప్రారంభమైంది. 2011లో నా తొలి ఐపీఎల్ ఆడిన సమయంలో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ చెప్పిన ఓ మాట ఇప్పటికీ గుర్తుంది. జీవితంలో సమతుల్యత చాలా ముఖ్యమని డివిలియర్స్ చెప్పాడు. అయితే విడాకుల తర్వాత పరిస్థితులు మరింత కష్టంగా మారాయి. ఆ సమయంలో నా మానసిక స్థితి బాగోలేదు. మద్యపానం కూడా మితిమీరింది. ఇలాగే కొనసాగితే నేను అత్యంత ఇష్టపడే క్రికెట్‌కే దూరమయ్యే ప్రమాదం ఉందని గ్రహించా. ఆ అలవాటుకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నేను మరింత సంతోషంగా, మెరుగైన స్థితిలో ఉన్నా’ అని చహల్ చెప్పుకొచ్చాడు.
ఒక ప్రముఖ క్రికెటర్‌గా తన వ్యక్తిగత జీవితంలోని విషయాలపై కూడా ప్రజలు వ్యాఖ్యలు చేయడం సహజమని చహల్ అన్నాడు. అయితే తన వ్యక్తిగత సమస్యలు బహిరంగ చర్చకు రావడం బాధ కలిగించిందని తెలిపాడు. ఆ పరిస్థితులు తన క్రికెట్‌పై కూడా ప్రభావం చూపాయని వెల్లడించాడు. ఆ సమయంలో తాను కేవలం రెండు వైట్‌బాల్ మ్యాచ్‌లే ఆడానని, మానసికంగా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో టీ20లకు దూరంగా ఉన్నానని చహల్ చెప్పాడు. తన కారణంగా జట్టు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. ఈ విషయంపై అనిరుధ్ సర్‌తో మాట్లాడగా.. ఆయన తనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు.
వ్యక్తిగత జీవితంలోని ఒత్తిడి పెరగడంతో తనకు ఆందోళన, పానిక్ అటాక్స్ మొదలయ్యాయని చహల్ వెల్లడించాడు. పానిక్ అటాక్ వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ముఖం మారిపోవడం, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించేవని చెప్పాడు. పెదవి ఒకవైపుకు లాగినట్లుగా మారడంతో తన పరిస్థితిని ఇతరులు కూడా గుర్తించేవారని వివరించాడు. ఆ అనుభవం ఆందోళన ఎంత తీవ్రంగా ఉంటుందో తనకు మొదటిసారి అర్థమయ్యేలా చేసిందని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో తన గురించి ఎవరెన్ని మాట్లాడినా అందరినీ మౌనంగా ఉంచడం సాధ్యం కాదని గ్రహించి, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఆ తర్వాత కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని చహల్ చెప్పాడు. పంజాబ్ కింగ్స్ తనను రూ.18 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడే పరిస్థితి ఎదురైనప్పుడు, తాను జట్టు కోసం ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని భావించినట్లు వివరించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో చహల్ 16 వికెట్లు పడగొట్టగా.. 2026 సీజన్లో 12 వికెట్లు తీశాడు. మైదానంలో తన నవ్వులతో సహచరులను, అభిమానులను అలరించే చహల్.. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తాజాగా బయటపెట్టాడు.

