Yuvraj Sing Hails Sourav Ganguly: టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అసిస్టెంట్ కోచ్గా, బ్యాటింగ్ కోచ్గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2015లో ఢిల్లీ (ఢిల్లీ డేర్డెవిల్స్)కి యువీ ఆడాడు. అప్పుడు ఢిల్లీ ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే డీసీ ప్రధాన కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే. అయితే డీసీలో అసిస్టెంట్ కోచ్గా చేరేముందు గంగూలీతో తనకు జరిగిన సంభాషణను యువరాజ్ తాజాగా వెల్లడించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలో యువరాజ్ సింగ్ మాట్లాడదాడు. ‘సౌరవ్ గంగూలీ నన్ను పిలిచి.. నువ్వు నాకు అసిస్టెంట్గా ఉంటావా? అని అడిగాడు. దానికి నేను గత 25 ఏళ్లుగా నేను మీకు అసిస్టెంట్గానే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పని చేస్తానేమో అని సరదాగా సమాధానం ఇచ్చాను’ అని యువరాజ్ చెప్పాడు. గత కొన్నేళ్లుగా యువ క్రికెటర్లకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న యువరాజ్.. ఇప్పుడు జట్టు కోచింగ్ వ్యవస్థలో భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసిన యువీ.. ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవమని పేర్కొన్నాడు.
‘ఈ బాధ్యతను స్వీకరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా ఇలాంటి అవకాశం కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా పనిచేశాను. అయితే ఇప్పుడు మొత్తం జట్టుతో కలిసి పనిచేయడం భిన్నమైన అనుభవం. ఈ కొత్త ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని యువరాజ్ వెల్లడించాడు. తన క్రికెట్ కెరీర్లో సౌరవ్ గంగూలీ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని కూడా యువరాజ్ గుర్తుచేసుకున్నాడు. జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం, ఆటగాళ్లందరినీ కలిసికట్టుగా ఉంచడం గంగూలీ నుంచి నేర్చుకున్న గొప్ప విషయమని తెలిపాడు. ‘దాదా నుంచి నేను నేర్చుకున్న అత్యుత్తమ విషయం జట్టులో మంచి వాతావరణాన్ని ఎలా సృష్టించాలనేదే. నేను అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఆటగాళ్లందరినీ కలిసికట్టుగా ఉంచేవారు. మనం గొప్ప జట్టుగా ఎదగగలమని, విదేశాల్లోనూ టోర్నమెంట్లు గెలవగలమని మాలో నమ్మకం కలిగించారు’ అని యువీ చెప్పాడు.
2000లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ భారత జట్టు తరఫున ఎన్నో విజయాల్లో భాగమయ్యారు. తన కెరీర్లో గంగూలీ పాత్రను యువరాజ్ ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ‘గంగూలీ ఎప్పుడూ నాకు పెద్దన్న లాగే అండగా నిలిచారు. జట్టు ఎంపిక గురించి అర్థం చేసుకోవడంలో సహాయం చేయడం, మార్గనిర్దేశం చేయడం, మంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగడానికి ఏమి చేయాలో చెప్పడం.. ఇలా ఎన్నో విషయాల్లో ఆయన నాకు తోడుగా ఉన్నారు’ అని యువీ తెలిపాడు. ఐపీఎల్ 2027 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తన కోచింగ్ బృందంలో కీలక మార్పులు చేసింది. హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ, అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ వ్యవహరించనున్నారు. భారత క్రికెట్లో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేయడం జట్టుకు బలంగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికైనా ఢిల్లీ ఐపీఎల్ టైటిల్ను గెలుస్తుందేమో చూడాలి.

