Site icon NTV Telugu

BCCI: మహ్మద్ షమీని అందుకే ప్రపంచకప్ తుదిజట్టులోకి తీసుకోలేదు

Shami

Shami

BCCI: వచ్చేనెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అయితే ప్రధాన బౌలర్ షమీని స్టాండ్ బైగా ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. షమీని ఎందుకు తుది జట్టులోకి తీసుకోలేదని విమర్శకులు బీసీసీఐపై దుమ్మెత్తిపోశారు. తాజాగా షమీని తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్టర్ వెల్లడించారు. మహమ్మద్ షమీ స్టాండ్‌బైగా ఉన్నా దాదాపు తుది జట్టులో ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో జట్టుకు దూరమై రీఎంట్రీ ఇస్తున్న హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు బ్యాకప్‌గా అతడిని తీసుకున్నామని.. సొంతగడ్డపై ఈనెలలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లలో ఈ ఇద్దరిలో ఎవరూ విఫలమైనా షమీ జట్టులోకి వస్తాడని బీసీసీఐ సెలక్టర్ తెలిపారు.

Read Also:Captain Miller: ధనుష్ సినిమాలో తెలుగు హీరో.. ఎవరో తెలుసా?

అయితే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న సిరీస్‌లలో షమీ తనను తాను నిరూపించుకోవాలని.. గత 10 నెలలుగా అతడు టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడని బీసీసీఐ సెలక్టర్ అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు నేరుగా షమీని ప్రపంచకప్ జట్టులోకి ఎలా తీసుకోగలమని ప్రశ్నించాడు. షమీ గైర్హాజరీలో హర్షల్ పటేల్ రాణించాడని.. అయితే అతడు గాయపడ్డాడని.. ఒకవేళ హర్షల్ పటేల్ వచ్చే సిరీస్‌లలో విఫలమైతే షమీ నేరుగా జట్టులోకి వస్తాడన్నారు. అటు షమీ సామర్థ్యాన్ని కూడా వచ్చే సిరీస్‌లలో పరీక్షిస్తామని బీసీసీఐ సెలక్టర్ చెప్పాడు. కాగా 15 మంది తుదిజట్టు ఎంపికలో కెప్టెన్ రోహిత్ కీలక పాత్ర పోషించాడని.. 14 మందిని ఎంపిక చేసిన సెలక్టర్లు 15వ ఆటగాడి ఎంపిక విషయాన్ని రోహిత్, ద్రవిడ్‌లకు అప్పగించారని.. షమీ లేదా అశ్విన్‌లలో ఒకరిని ఎంచుకోవాలని సూచించగా అశ్విన్ వైపు రోహిత్ మొగ్గు చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. అశ్విన్ ఉంటే జట్టులో వైవిధ్యం ఉంటుందని.. అతడు లెఫ్ట్ హ్యాండర్లను కట్టడి చేయగలడని రోహిత్ భావించినట్లు తెలుస్తోంది.

Exit mobile version