Site icon NTV Telugu

IPL: ఐపీఎల్‌లో కీలక పోరు.. ఫైనల్‌కు చేరేది ఎవరు..?

Gujarat Titans And Rajastha

Gujarat Titans And Rajastha

ఐపీఎల్‌-15 సీజన్‌ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌, రాజస్థాన్‌… తొలి క్వాలిఫయర్‌ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్‌ జట్టు లీగ్‌ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్‌ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Read Also: Rajya Sabha Elections: ఇవాళే నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్లు..

ఇక, గుజరాత్‌ లీగ్‌ దశలో సాధించిన 10 విజయాల్లో ఏడుసార్లు ఛేజింగ్‌లో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించడమే అందుకు కారణం. టాప్‌ఆర్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగడం గుజరాత్‌కు కలిసొచ్చింది. హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్… టాపార్టర్‌లో బ్యాటింగ్‌లో ఊపుమీద ఉన్నారు. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ హిట్టర్లు.. స్ట్రోక్‌ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌తో బౌలింగ్‌లోనూ పటిష్ఠంగా ఉంది.

మరోవైపు రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌లో మెరుగైన చోటు కోసం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌వరకూ పోరాడింది. సంజూ టీమ్‌.. లఖ్‌నవూ లాగే తొమ్మిది విజయాలతో నిలవగా.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కారణంగా రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలు చేసి… టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, సిమ్రన్‌ హెట్‌మెయర్‌, యశస్వి జైశ్వాల్‌, పడిక్కల్, రియాన్ పరాగ్‌ ఫర్వాలేదనిపిస్తున్నారు. రాజస్థాన్‌ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిధ్‌ కృష్ణ ఆరంభ ఓవర్లలో వికెట్లను తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

అయితే, గుజరాత్‌, రాజస్థాన్‌ మధ్య లీగ్‌ దశలో జరిగిన ఒక్క మ్యాచ్‌లో… గుజరాత్‌ విజయం సాధించింది. క్వాలియర్‌ ఫయర్‌ మ్యాచ్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో… మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుంది… ఓడిన జట్టు… ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో రెండో క్వాలిఫయర్‌లో తలపడాల్సి ఉంటుంది.. మరి ఇవాళే ఫైనల్‌కు చేరేది ఎవరు అనే ఆసక్తికరంగా మారింది.

Exit mobile version